18, డిసెంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 63 వ శ్లోకం

తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం
నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం ,
తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య న స్యాత్
క్రీడాలోలాః శ్రవణపరుషైర్గర్జితైర్భాయయేస్తాః .భావం :


ఓ మిత్రుడా!

ఆ కైలాసమందు, వేల్పుటింతులు ( సురయువతులు )

నిన్ను తమ కంకణాల అంచులతో ఒత్తి, నిశ్చయంగా నీ నీటిని పిండుతారు.

ఈ ఎండాకాలంలో వారికి నీవు దొరికినందువల్ల

( నీ నీటి ఆటల్ని మరిగి )

వారు నిన్ను విడువరు.

అప్పుడు క్రీడాలోలురైన ఆ వేల్పుచేడియలను

వినడానికి కఠినాలైన నీ ఉఱుములతో భయపెట్టి, తప్పించుకొనిపో.
వివరణ :చాల మనోహరమైన భావం కదూ!

మేఘానికి సంబంధించి ఎన్ని ఆలోచనలు చేయాలో అన్నీ చేశాడు కాళిదాసు.


యువతులు కాబట్టి కొంటెపనులు.


ఎండాకాలంలో నీటి ఆటలు అందరికీ ఇష్టమేగా!


కృత్రిమంగా నీటిధారల్ని సృష్టించి ఆనందించడం ఆ కాలంలో ఉందని తెలుస్తుంది.

చిన్న మనవి :

మేఘసందేశాన్ని
తెలుగులో అందించే గొప్ప సాహసాన్ని చేస్తున్నాను.
ఏవైనా తప్పులుంటే పండితులు తెలుప ప్రార్థన.
నేను, కాళిదాసును అర్థం చేసుకోవడంలో లోపాలేవైనా ఉంటే
నాకు తెలియజేస్తే దిద్దుకోగలవాడను.మంగళం మహత్

10, డిసెంబర్ 2011, శనివారం

మేఘసందేశం 61 , 62 శ్లోకాలు

ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాంజనాభే
సద్యః కృత్తద్విరదరదనచ్ఛేదగౌరస్య తస్య ,
శోభా మద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీ
మంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ .
భావం :


ఏనుగుదంతంలా తెల్లగా ఉన్న ఆ కైలాసపర్వతసానువు మీద

నున్నగా నూఱబడిన కాటుకకాంతి లాంటి కాంతి కలిగిన నీవు నిలిచితివేని

బలరాముడు తన భుజం మీద నల్లని పట్టువస్త్రం ధరిస్తే, ఎలా ఉంటుందో

అలా చూసేవారికి కన్నుల పండువులా ఉంటావు.హిత్వా తస్మి౯ భుజగవలయం శంభునా దత్తహస్తా
క్రీడాశైలే యది చ విహరేత్పాదచారేణ గౌరీ ,
భంగీ భక్త్యా విరచితవపుః స్తంభితాంతర్జలౌఘః
సోపానత్వం కురు మణితటారోహణాయాగ్రయాయీ .భావం:


ఆ కైలాసాన

శివుడు పార్వతీదేవితో కలసి కాలినడకన విహరిస్తూంటే,

అప్పుడు ముందుగా పోయి,

నీ శరీరాన్ని స్తంభింపచేసుకొని, ( ఘనీభవించి )

ఆ జగన్మాత రత్నాలగట్లను ఎక్కబోయేటప్పుడు

మెట్లవరుసగా ఏర్పడు.

ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవై కృతార్థుడవగుదువు.
వివరణ : విశేషాలు :శివుడు నాగకంకణాన్ని విడచి, గౌరీదేవి చేయి పట్టుకొంటాడని

కవి వర్ణన.

దానికి కారణం పామును చూసి, ఆవిడ భయపడుతుందని

వ్యాఖ్యాత వివరణ.మేఘుని శరీరంలో నీటిప్రవాహాన్ని ఘనీభవింపచేసుకోమంటున్నాడు.తల్లిదండ్రుల విహారాన్ని చూడడం దోషం.

అందువల్ల వారు విహరిస్తున్నారు అని

తెలియగానే అక్కడే నిలబడక

ముందుగా పోయి,

వినమ్రుడవై మెట్లవరుసగా మారితే

నేల మీద మాత్రమే చూపు ఉంటుంది (క్రింది చూపు)

కాన దోషప్రాప్తి ఉండదని,

పైగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని సూచన.ఇక్కడో విశేషం ఉంది.

మనస్తత్త్వం ప్రకారం

స్త్రీ తన భర్తతో ఉన్నప్పుడు పూర్తి ఏకాంతాన్ని కోరుకొంటుంది.

అందుకు విరుద్ధమైతే ఆగ్రహిస్తుంది.

ఇంతకుముందు శివపార్వతుల ఏకాంత సమయంలోనే

( ఇంద్రుడు పంపగా ) అగ్ని వస్తాడు.

అప్పుడు పార్వతి శివుని నుండి దూరమయ్యి, దుఃఖించి, కోపించి,

క్రిందపడ్డ శివుని వీర్యాన్ని భరించమని శపిస్తుంది.

ఆ వీర్యాన్ని గర్భంలో ధరించిన అగ్ని దాన్ని భరించలేక

గంగకు ఇస్తాడు. ఆవిడ కూడా భరించలేక రెల్లుగడ్డి మీదకు త్రోయగా

శరవణభవుడు జన్మిస్తాడు.

అందువల్ల ఎందుకొచ్చిన గొడవని

మేఘుని యక్షుడు వినమ్రుడవై ఉండమన్నాడు.

అందువల్ల తల్లికి కోపం రాదని, అనుగ్రహిస్తుందని సెలవిస్తున్నాడు.
మంగళం మహత్

21, నవంబర్ 2011, సోమవారం

మేఘసందేశం 60 వ శ్లోకం


గత్వా చోర్ధ్వం దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసంధేః

కైలాసస్య త్రిదశవనితాదర్పణస్యాతిథిః స్యాః ,

శృంగోచ్ఛ్రాయైః కుముదవిశదైర్యో వితత్య స్థితః ఖం

రాశీభూతః ప్రతిదినమివ త్ర్యంబకస్యాట్టహాసః .

భావం :


క్రౌంచపర్వతాన్ని దాటి వెళ్తే, కైలాస పర్వతం కనబడుతుంది.

అది దశముఖుని (రావణుని) చేత పూర్వం ఒకసారి ఎత్తబడింది.

అందువల్ల దాని సంధులు వదలి ఉన్నాయి.

దేవతాస్త్రీలకు అద్దంలాంటిదైన ఆ కైలాసపర్వతానికి అతిథివి కా.

తెల్లకలువల్లాంటి శుభ్రములైన ఎత్తైన శిఖరాలతో

ఆకాశం అంతా వ్యాపించి

ప్రతిరోజూ శివుడు నవ్విన నవ్వు ప్రోగు పెట్టి ఉంచారా అన్నట్లుంటుంది.
వివరణ :ఇక్కడ కైలాసపర్వతం వర్ణించబడుతోంది.

ఒకసారి దశకంఠుడు, కుబేరుని ఓడించి,

అతని పుష్పకవిమానాన్ని గ్రహించి,

వస్తూండగా అది కైలాసపర్వతసమీపంలో ఆగిపోయింది.

కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తూండగా నంది వచ్చి,

శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుంది కాన వెళ్లవలదని చెప్పాడు.

అప్పుడు దశగ్రీవుడు, నందిని చూచి, వానర(కోతి)ముఖుడవంటూ నవ్వాడు.

నందికి కోపం వచ్చి, ఆ వానరులచేతిలోనే నీవు దెబ్బతింటావని శాపమిచ్చాడు.

దాంతో దశముఖుడు, కోపించి, తరువాత జరిగిన వాదోపవాదాల్లో

నీవెంత? నీ కైలాసపర్వతమెంత? అని

ఆ పర్వతాన్ని ఎత్తాడు. అది చూచి, శివుడు దాన్ని అదిమాడు.

దాని క్రింద అతని చేతులు పడి నలిగిపోయాయి.

ఆ బాధతో లోకాలన్నీ భయపడేటట్లు పెద్ద రావం చేశాడు.

అప్పటినుంచి దశకంఠునికి రావణుడు అనే పేరు వచ్చింది.

ఆ తర్వాత కైలాసపర్వతంనుండి శివానుగ్రహంతో బయటపడ్డాడు.

రావణుడు ఎత్తడం వల్ల ఆ పర్వతసానువుల్లో పగుళ్ళు ఏర్పడ్డాయి.

అందువల్ల ఆ పర్వతం అతుకులు పెట్టినట్లుందని కాళిదాసు వర్ణిస్తున్నాడు.
అది వెండికొండ కాబట్టి,

దేవతావనితలు తమ ప్రతిబింబాలు చూసుకోవడానికి

దాన్ని అద్దంలా ఉపయోగించుకొంటారని కవి మనోహరమైన ఊహ.

ప్రతిరోజూ శివుడు నవ్వే స్వచ్ఛమైన నవ్వు ప్రోగుపడి,

కైలాసపర్వతమైందని మరొక మనోజ్ఞమైన వర్ణన.

తెలుపును మంచివాని మనసుతోనూ,

స్వచ్ఛమైన నవ్వుతోనూ పోలుస్తారు.

ఇది కవిసమయం.
"ఓ మేఘుడా! అటువంటి కైలాసపర్వతం

నీకు వేడుక కలిగిస్తుంది. పుణ్యాన్నీ ప్రసాదిస్తుంది."

అని యక్షుడంటున్నాడు.


మంగళం మహత్

20, నవంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 59 వ శ్లోకం

ప్రాలేయాద్రే రుపతట మతిక్రమ్య తాంస్తా న్విశేషాన్

హంసద్వారం భృగుపతి యశోవర్త్మ యత్క్రౌంచ రంధ్రమ్,

తేనోదీచీం దిశ మనుసరే స్తిర్యగాయామశోభీ

శ్యామః పాదో బలినియమనాభ్యుద్యతస్యేవ విష్ణోః

భావం :


హిమవత్పర్వతతటాల్లో ( హిమపర్వత ప్రదేశాల్లో / మంచుకొండ చఱియల్లో )

ఆ యా విశేషాలను అతిక్రమించి, ( దాటిపోయి )

హంసలదారి మరియు పరశురాముని కీర్తిమార్గం అయిన క్రౌంచ పర్వతబిలంనుండి,

బలిని బంధించటానికి పూనుకొన్న విష్ణువు నల్లని పాదంలా

అడ్డంగానూ పొడవుగానూ ప్రకాశిస్తూ ఉత్తరదిశగా వెళ్లు.
వివరణ :

హిమాద్రి యందు చూడదగిన ఎన్నో వింతలున్నాయి.

అవన్నీ చూడాలంటే ఆలస్యమవుతుంది.

కాబట్టి నీ దారిన పో.

పోతూంటే క్రౌంచం అనే పేరుగల మహాపర్వతం అడ్డు వస్తుంది.

ఆ పర్వతానికి ఒక రంధ్రం ఉంది.

అది పూర్వం పరశురాముడు చేసినది.

పరశురాముడు కుమారస్వామితో కలసి,

శివునివద్ద అస్త్రవిద్య నేర్చుకొంటూ, స్కందునితో పోటీపడి,

వాడి బాణాలతో ఈ క్రౌంచపర్వతాన్ని భేదించి, ప్రసిద్ధికెక్కాడు.

అప్పటినుండి వర్షాకాలం రాగానే హంసలు,

ఈ రంధ్రంనుండి వెడలి, మానససరోవరానికి చేరతాయి.

నీవు ఈ దారిగుండా వెళ్లు.

అప్పుడు నీవు, బలిని అణచదలచి, ఎత్తిన విష్ణువు పాదంలా శోభిల్లుతూంటావు.

మంగళం మహత్

9, జూన్ 2011, గురువారం

మేఘసందేశం 57, 58 శ్లోకాలు

తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేందుమౌళేః

శశ్వ త్సిద్ధై రుపచితబలిం భక్తినమ్రః పరీయాః,

యస్మి౯ దృష్టే కరణవిగమాదూర్ధ్వ ముద్ధూతపాపాః

కల్పిష్యంతే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానా:భావం:


ఆ హిమవత్పర్వతమందు,

పూర్వం, శివుడు, ఒక రాతిమీద తన పాదాన్ని ఉంచాడు.

(అప్పుడు పాదచిహ్నం ఏర్పడింది.)

ఆ పాద చిహ్నాన్ని, సిద్ధులు ఎన్నోసార్లు పూజించారు.

అటువంటి శివపాదానికి నమ్రుడవై భక్తితో ప్రదక్షిణం చెయ్యి.

అలా చేసినవారి పాపాలు నశిస్తాయి.

అంత్యకాలంలో ప్రమథగణస్థానాన్ని పొందుతారు.

శ్రేయస్సు కలుగుతుంది. శివ సాలోక్యం సిద్ధిస్తుందని భావం.

శబ్దాయంతే మధురమనిలై: కీచకా: పూర్యమాణా:

సంసక్తాభి స్త్రిపురవిజయో గీయతే కిన్నరీభి:,

నిర్హ్రాదస్తే మురజ ఇవ చేత్కందరేషు ధ్వని: స్యాత్

సంగీతార్థో నను పశుపతే స్తత్ర భావీ సమగ్ర:.
భావం:బొంగువెదుళ్లు, గాలిచే నింపబడి, మ్రోగుతున్నాయి.

( వెదుళ్లు మ్రోగాలంటే రంధ్రాలుండాలి కదా! ఉన్నాయి.

ఆ రంధ్రాలను ఎవరు చేశారు? తుమ్మెదలు చేశాయి.)

కిన్నరస్త్రీలు, గుంపులు గూడి,

శివుడు, త్రిపురాసురలను జయించిన కథను పాడుతున్నారు.

నీవు ఉరిమినచో, ఆ ధ్వని, కొండగుహలలో చేరి, వెలువడునప్పుడు,

మద్దెలమ్రోతలా ఉంటుంది.

అప్పుడు శివసంగీతం, సంపూర్ణం అవుతుంది.
మంగళం మహత్

19, మే 2011, గురువారం

మేఘసందేశం 56 వ శ్లోకం

యే సంరంభోత్పతనరభసాః స్వాంగభంగాయ తస్మి౯ ( ౯ గుర్తును న్ అని చదవాలి )

ముక్తాధ్వానం సపది శరభా లంఘయేయుర్భవంతం,

తాన్కుర్వీథాస్తుములకరకావృష్టిపాతావకీర్ణా౯

కే వా న స్యుః పరిభవపదం నిష్ఫలారంభయత్నాః.
భావం:ఆ హిమాద్రిమీద,

నిన్ను చూసి, ఏనుగు అని భ్రమసి, తొందరపాటుతో

శరభ మృగాలు ( ఇవి ఒక రకమైన గిరిమృగాలు )

నీమీద అతివేగంగా దూకుతాయి.

నీ మీద పడకుండా , తటాలున తప్పుకో.

అప్పుడు అవి ఒళ్లు విరిగేటట్లు క్రింద పడతాయి.

ఆ తర్వాత నీవు, వాటిపై దట్టంగా వడగండ్ల వాన కురిపించు.

పనికిమాలినపని చేసేవారెవరైనా తిరస్కారానికి గురి అవుతారు.

గౌరవింపబడరు. అవమానింపబడతారని భావం.
మంగళం మహత్

17, మే 2011, మంగళవారం

మేఘసందేశం 55 వ శ్లోకం

తం చేద్వాయౌ సరతి సరళస్కంధసంఘట్టజన్మా
బాధేతోల్కాక్షపితచమరీవాలభారో దవాగ్నిః,
అర్హస్యేనం శమయితుమలం వారిధారాసహస్రైః
రాపన్నార్తిప్రశమనఫలాః సంపదో హ్యుత్తమానాం.


భావం:


గాలివల్ల దేవదారువృక్షాల బోదెలు ఒరుసుకొని దావాగ్ని పుట్టి,

దాని నిప్పురవ్వలు చమరీమృగాల తోకవెంట్రుకలను కాల్చి,

హిమవత్పర్వతాన్ని బాధించెనేని,

వేలజలధారలతో ఆ దావాగ్నిని, చల్లార్చు.

ఆపన్నుల ( ఆపదనొందినవారి ) కష్టాన్ని తీర్చడమే కదా!

ఉత్తముల సంపదలకు ఉన్న ఫలం.వివరణ :


ఉత్తములు, ఉపకర్తలు, సజ్జనులు, పరోపకారులు, మహాత్ములు, బుధులు

వీరివద్ద సంపద ఉంటే దాన్ని తిరిగి

అవసరమై, అడిగినవారికోసమే ఉపయోగిస్తారు.

తమకోసం దాచుకోరు.

అర్థించకపోయినా అవసరం తెలుసుకొని మరీ సహాయం చేస్తారు."కమలాలు అడిగాయనే సూర్యుడు వాటిని వికసింపజేస్తున్నాడా!

కలువలు ప్రార్థించాకే చంద్రుడు వాటికి సంతోషం కలిగిస్తున్నాడా!" అంటాడు భర్తృహరి.పరోపకారాయ ఫలంతి వృక్షాః

పరోపకారాయ వహంతి నద్యః,

పరోపకారాయ చరంతి గావః

పరోపకారార్థ మిదం శరీరం.మంగళం మహత్

15, మే 2011, ఆదివారం

మేఘసందేశం 54 వ శ్లోకం

ఆసీనానాం సురభితశిలం నాభిగంధైర్మృగాణాం
తస్యాః ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః,
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృంగే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపంకోపమేయాం.భావం :ఆ గంగానది హిమవంతం దగ్గరే ఉంటుంది.

ఆ హిమవత్పర్వత శిలలపై కస్తూరిమృగాలు కూర్చొంటాయి కాబట్టి

వాటి బొడ్డుల్లోని కస్తూరిగంధంతో ఆ అద్రి శిలలు పరిమళాలు క్రమ్ముతూంటాయి.

ఆ గంగానది పుట్టుకకే కారణమైన ఎక్కువ మంచుతో

ఆ గిరి, తెల్లగా కనబడుతూంటుంది.

అటువంటి పవిత్రమైన ఆ హిమవత్పర్వతశిఖరమందు కూర్చొంటే,

నీకు మార్గాయాసం తీరుతుంది.

తెల్లని ఆ కొండమీద కూర్చొన్న నల్లని నీవు,

శివుని వృషభం కుమ్మితే కొమ్మున అంటుకొన్న బురదమట్టిలా

బాగుంటావు.మంగళం మహత్

14, మే 2011, శనివారం

మేఘసందేశం 53 వ శ్లోకం

తస్యాః పాతుం సురగజ ఇవ వ్యోమ్ని పశ్చార్ధలంబీ
త్వం చేదచ్ఛస్ఫటికవిశదం తర్కయేస్తిర్యగంభః,
సంసర్పంత్యా సపది భవతః స్రోతసి చ్ఛాయయా౭సౌ
స్యాదస్థానోపగతయమునాసంగమేవాభిరామా.
భావం:


స్వచ్ఛమైన స్ఫటికంలా శుభ్రమైన

ఆ గంగానది నీటిని త్రాగడానికి,

నీవు, సగం శరీరం వంచినపుడు,

చూడడానికి దిగ్గజంలా ఉంటావు.

నీ నీడ ఆ గంగాప్రవాహమందు వ్యాపించి,

చోటు గాని చోట ( అంటే ప్రయాగలోనే కాక ఇక్కడ కూడా )

యమునానది ఈ నదితో కూడినదా అన్నట్లు

చూడ సుందరంగా ఉంటుంది.
మంగళం మహత్

10, మే 2011, మంగళవారం

మేఘసందేశం 52 వ శ్లోకం

తస్మాద్గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం
జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిం,
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః
శంభోః కేశగ్రహణమకరోదిందులగ్నోర్మిహస్తాః.భావం:ఆ కురుక్షేత్రంనుండి, బయలుదేరితే

కనఖలం అనే పర్వతం కనబడుతుంది.

హిమవంతంనుండి, దాని సమీపంలో గంగానది దిగింది.

తరువాత జహ్నుకన్య అయింది.

సగరచక్రవర్తిపుత్రులు స్వర్గానికి పోవడానికి మెట్లవరుసలా మారిన

పుణ్యరాశి అయిన అటువంటి గంగానదిని సేవించు.

శివుని శిరసున ఉన్న ఆ గంగ ( తన సవతి ) పార్వతిని పరిహాసం చేసినట్లుంటుంది.

హిమవంతంలో పుట్టి,

తనలో మునిగిన వారికి పుణ్యాన్ని ఇచ్చి,

సవతిని తలదన్ని, భర్త తలమీద ఉండే సౌభాగ్యాన్ని పొందిన

గంగను సేవిస్తే, నీకు మంచిది.


మంగళం మహత్

9, మే 2011, సోమవారం

మేఘసందేశం 50, 51 శ్లోకాలు.

బ్రహ్మావర్తం జనపదమథ చ్ఛాయయా గాహమానః
క్షేత్రం క్షత్రప్రథనపిశునం కౌరవం తద్భజేథాః,
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాండీవధన్వా
ధారాపాతైస్త్వమివ కమలాన్యభ్యవర్ష న్ముఖాని.భావం:అనంతరం,

బ్రహ్మావర్తం అనే జనపదం ( దేశం ) మీదుగా,

క్షత్రియుల ( ధార్తరాష్ట్ర పాండవ ) యుద్ధానికి సూచకమైన,

కురుక్షేత్రాన్ని చేరు.

ఆ కురుక్షేత్రంలో అర్జునుడు,

వందలకొలది వాడివాజులతో ( పదునైన బాణాలతో )

జలధారలను పద్మాలపై నీవు, ఎలా వర్షిస్తావో

అలా రాజుల ముఖాలపై వర్షించాడు. ( కురిపించాడు.)
హిత్వా హాలామభిమతరసాం రేవతీలోచనాంకాం
బంధుప్రీత్యా సమరవిముఖో లాంగలీ యాః సిషేవే,
కృత్వా తాసామభిగమమపాం సౌమ్య సారస్వతీనా
మంతఃశుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః.భావం :


బంధుప్రేమతో,

యుద్ధవిముఖుడైన బలరాముడు,

సురను ( మద్యం ) విడిచి,

సరస్వతీనదీజలాలను సేవించి, పరిశుద్ధుడయ్యాడు.

ఓ సౌమ్యుడా!

నీవూ, ఆ సరస్వతీనదీ ఉదకాలను సేవిస్తే,

నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

( అప్పుడు ) వర్ణంచేత మాత్రమే నల్లనివాడవు అవుతావు.విశేషాలు:పూర్వం, బలరాముడు, ఇరుపక్షాలూ బంధువులే కాబట్టి,

కురు పాండవ యుద్ధంలో ఎవరి పక్షాన చేరడానికీ ఇష్టపడక,

తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.

అప్పుడు తనకత్యంత ప్రియమైన సురను విడిచి,

(అసలు మద్యానికి హలిప్రియ అనే పేరు బలరామునివల్లే వచ్చింది.
హలి అంటే బలరాముడు. హలాన్ని (ఆయుధంగా) ధరించినవాడు = హలి
హలికి ఇష్టమైనది అనే అర్థంలో కల్లుకు హలిప్రియ అనే పేరు వచ్చింది.)

పరమపావనమైన సరస్వతీ జలాలను గ్రోలి, శుద్ధుడయ్యాడు.

ఈ కథను గుర్తుచేస్తున్నాడు.

ఓ మేఘుడా! ఆ ప్రాంతంలో సరస్వతీనది ఉంది. ఆ నదిని నీవు సేవిస్తే,

నీ శరీరవర్ణం అలాగే ఉన్నా, ఆ నదీజలప్రభావంతో నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది.

అంటున్నాడు.

శరీరపురంగును కాదు పట్టించుకోవలసింది.

ఉన్న నలుపు ఎంతమంది బ్యూటీషియన్స్ ను ఆశ్రయించినా,

ఎంత డబ్బు తగలేసినా పోదు.

కావలసినది , చేయవలసినది

నల్లగా ఉన్న మనసును తెల్లగా చేసుకోవడమే.

అదే అంతఃశుద్ధి.మంగళం మహత్

8, మే 2011, ఆదివారం

మేఘసందేశం 48 , 49 శ్లోకాలు

త్వయ్యాదాతుం జలమవనతే శార్ఙ్గిణో వర్ణచౌరే
తస్యాః సింధో పృథుమపి తనుం దూరభావాత్ప్రవాహం,
ప్రేక్షిష్యంతే గగనగతయో నూనమావర్జ్య దృష్టీ
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేంద్రనీలం.


భావం:


శ్రీకృష్ణుని వర్ణాన్ని ( కాంతిని,రంగును ) దొంగిలించిన

( అంటే కృష్ణుని కాంతి వంటి కాంతి గల ) నీవు,

ఆ చర్మణ్వతి నదిఒద్దకు పోయి,

నీటిని తీసుకోవడానికి,

వంగి, ఉన్నపుడు,

పెద్దదైనా దూరంగా ఉండటంవల్ల చిన్నదిగా ఉన్న ఆ నదీ ప్రవాహాన్ని,

పైన ఆకాశంలో పోయేవారు చూసి,

ఆ నదిని భూమి ధరించిన ఒంటిపేట ముత్యాలహారంగాను,

నిన్ను, ఆ ముత్యాలహారం నడుమ ( మధ్య ) కూర్చిన

ఇంద్రనీలమణిగాను భావిస్తారు.విశేషాలు :- శ్రీకృష్ణుడు ఇంద్రనీలమణిలా ఉంటాడు.

మేఘుని కూడా అలా వర్ణించడానికి

కృష్ణునికి మేఘునికి ఒక్క శరీరవర్ణంలో తప్ప పోలికలు లేకపోవడంతో,

కవి, మొదటే మేఘుని " శార్ఙ్గిణో వర్ణచౌరే త్వయి " = శ్రీకృష్ణుని వర్ణాన్ని దొంగిలించిన నీవు,

అని వర్ణించి, ( ఏదో ఒకటి ) కృష్ణునినుండి గ్రహించినందువల్ల,

కృష్ణభావం కలిగినవాడయ్యాడు కాబట్టి, అప్పుడు కవి,

మేఘుని ఇంద్రనీలమణిలా ఉన్నావన్నాడు.


ఇక్కడో ఆధ్యాత్మిక రహస్యం ఉంది.

విష్ణువు ఇరవైఒక్క అవతారాల్లో పది అవతారాలు ముఖ్యమైనవి.

అందులోనూ రామకృష్ణావతారాలు ప్రజలమధ్య గడిపి,

ప్రజలతో మమేకమైన అవతారాలు.

వీరిద్దరూ ఆచరించి చూపించిన ధర్మప్రతిపాదితమైన ఏ ఒక్క అంశాన్నైనా, లేక

వారిలో ఏ ఒక్క వర్ణాన్నైనా ( వర్ణం అనే పదానికి గుణం అని కూడా అర్థం ఉంది.)

మనం గ్రహిస్తే, మనం దైవభావాన్ని పొందినట్లే.

అలా గ్రహించడం చెప్పినంత అనుకొన్నంత సులువు కాదు.

అలా గ్రహించే క్రియనే మనవాళ్లు తపస్సు అన్నారు.

భగవంతుడు అని అనకుండా రామకృష్ణులు అని

ఎందుకు అనడమంటే వారూ మానవులవలె జీవితం గడిపారు కాబట్టి.

ఇక్కడ రాముడంటే సాకేతరాముడు.- ఏరియల్ వ్యూ లో, మనకు నది తెల్లగా కనిపిస్తుంది.

కవికి ముత్యాలహారంలా కనబడుతుంది.

కవి దర్శనానికి మన ( కవులుకానివారి ) చూపులకు అదే తేడా.తాముత్తీర్య వ్రజ పరిచితభ్రూలతావిభ్రమాణాం
పక్ష్మోత్క్షేపాదుపరివిలసత్కృష్ణశారప్రభాణాం,
కుందక్షేపానుగమధుకరశ్రీముషామాత్మబింబం
పాత్రీకుర్వందశపురవధూనేత్రకౌతూహలానాం.భావం:


ఆ చర్మణ్వతీనదిని దాటి, వెళ్తూంటే,

దశపురస్త్రీలు నిన్ను కుతూహలంతో చూస్తారు.

ఇలా నిన్ను చూడడం వారికి వేడుక అవుతుంది.

వారి తీగల్లాంటి కనుబొమల విలాసాల్ని,

కొంచెం ధవళకాంతితో కూడిన నల్లనికాంతులుగలవి కావడంతో

మొల్లపూలవెంట కదిలే తుమ్మెదలకాంతిని అపహరించినవైన ( పోలిన )

వారి కనుఱెప్పల్ని,

నయనకాంతుల్ని చూడడం నీకు వేడుక అవుతుంది.మంగళం మహత్

7, మే 2011, శనివారం

మేఘసందేశం 47 వ శ్లోకం

ఆరాధ్యైనం శరవణభవం దేవముల్లంఘితాధ్వా
సిద్ధద్వంద్వై ర్జలకణభయాద్వీణిభిర్ముక్తమార్గః ,
వ్యాలంబేథాః సురభితనయాలంభజాం మానయిష్య౯
స్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం.భావం :శరవనం ( ఱెల్లుగంట ) లో పుట్టిన

ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధించి,(న తర్వాత)

వీణల్ని వాయిస్తున్న సిద్ధమిథునాలు ( మిథునం అంటే జంట )

వానచినుకులు తమ మీద పడతాయన్న భయంతో నీకు దారి ఇస్తారు కాబట్టి,

అక్కడినుండి బయలుదేరు. దారిలో ఒక నది కనిపిస్తుంది.

ఆ నది,

గోవులవధవల్ల పుట్టి,

భూమిమీద నదిలా మారిన రంతిదేవుని కీర్తి.

అటువంటి ఆయన కీర్తిని అనగా ఆ నదిని

సత్కరించడంకోసం వంగి, దిగు. ( లేక నిలు.)


విశేషాలు:


- శరం అంటే ఱెల్లు అని కూడా అర్థం. శరం అంటే బాణం అని తెలుసుగా. బాణాల్లా ఉన్న గడ్డే ఱెల్లు.

ఱెల్లుగడ్డి దుబ్బును శరవణం అంటారు. అందులో పుట్టిన వాడు శరవణభవుడు.

ఈయన కథ ముందు చెప్పుకొన్నాం.

శరవనం లో న మీద ణ ప్రత్యయం వస్తుంది.


- భగవంతునికి చేసే పూజలో ఎన్నో ఉపచారాలున్నాయి.

ఆయన సన్నిధిలో సంగీతం , నృత్యం మొదలైన లలితకలల ప్రదర్శన కూడా

ఉపచారమే.

అందుకే నిత్యోత్సవవైభవోపేతుడైన తిరుమల వేంకటపతికి నిత్యనాదనీరాజనం

సమర్పించబడుతోంది.

అలాగే సిద్ధమిథునాలు కుమారస్వామి ఎదుట వీణలు వాయించి,

ఆయనను ఆనందింపచేస్తున్నారు.

సిద్ధులు దేవజాతిలో ఒకరని చెప్పుకొన్నాం.


- "వాళ్లు దారి ఇవ్వరనుకొంటావేమో ?

వారికీ నీ చినుకులంటే భయమే.

శరాల్లాంటి నీ వనం అంటే భయం.

వనం అంటే నీరు అని కూడా అర్థం.

కాబట్టి శరవణభవుని కన్నా నీ శరవనం అంటే భయం." అని యక్షుని చమత్కారంగా భావించవచ్చు.- ఇక నది కథ.

ఆ నది పేరే చర్మణ్వతీ నది. (ఇది, దశార్ణదేశంలో ఉంది. )

పూర్వం రంతిదేవుడనే మహారాజు యాగం చేయబోతూండగా,

సురభి సంతానమైన గోవులు ఆయన వద్దకు వచ్చి, మనుష్యభాషణాలతో,

తమను యాగంలో వ్రేల్చమని కోరాయి.

వాటిని వధించడానికి రంతిదేవుడు సంకోచిస్తూంటే,

తప్పు కాదని పుణ్యమే వస్తుందని ప్రోత్సహించాయి.

సరే. ఈ పనికి ఏ ఒక్క గోవు ఇష్టపడకపోయినా

యాగం మానేస్తానని రంతిదేవుడు అన్నాడు.

యాగంలో వధింపబడిన గోవులు గోలోకాన్ని చేరాయి.

ఆ గోవుల చర్మాలే ఒడ్లుగా వాటి రక్తం ప్రవహించి, నది అయ్యింది. (నదిగా మారింది.)

దానినే చర్మణ్వతీ నది అంటారు.

అంతటి మహాయాగం చేసినందుకు ఆ రంతిదేవుని కీర్తికి తార్కాణంగా,

ఈ నది ఉద్భవించింది.మంగళం మహత్

6, మే 2011, శుక్రవారం

మేఘసందేశం 46 వ శ్లోకం

జ్యోతిర్లేఖావలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళప్రాపి కర్ణే కరోతి,
ధౌతాపాంగం హరశశిరుచా పావకేస్తం మయూరం
పశ్చాదద్రిగ్రహణగురుభి ర్గర్జితై ర్నర్తయేథాః .


భావం:కాంతిపంక్తులమండలం కలది, ( జ్యోతిర్లేఖలచేత చుట్టుకొనబడినది )

తనంతట తాను జారింది ( బలవంతంగా వేరుచేసినది కాదు )

అయిన ఏ మయూరపింఛాన్ని, ( నెమిలిపింఛాన్ని )

భవాని ( పార్వతి ),

కుమారుని మీది ప్రేమతో,

కలువఱేకుకు బదులుగా చెవికొనయందు ధరిస్తున్నదో,

( అసలే తెల్లనివైన ) ఏ మయూరనేత్రాలు,

శివుడు ధరించిన చంద్రునికాంతితో ( మఱింత ) శుభ్రమైనవో,

ఆ నెమిలిని,

( పుష్పవర్షం కురిసిన ) తర్వాత

అద్రిగ్రహణంతో గొప్పవైన ( కొండల్ని పట్టుకోవడంచేత గొప్పవైన )
అంటే కొండగుహల్లో ప్రతిధ్వనించడంచేత గొప్పవైన )

ఉఱుములతో ఆడించు.తాత్పర్యం :కుమారస్వామి మయూరవాహనుడు కదా!

ఆయన నెమెలిని ఆనందింపజేసి, తద్ద్వారా స్వామి అనుగ్రహం పొందమని

మేఘునితో యక్షుడు అంటున్నాడు.

తన కుమారుని వాహనమైన నెమిలిపింఛాన్నే , పార్వతి కర్ణాభరణంగా ధరిస్తుంది.

కుమారసంభవాద్పూర్వం భవాని, కలువదళాన్ని ధరించేది.

ఇప్పుడు తన ప్రియపుత్రునిమీద తనకు గల ప్రేమను సూచించడానికి,

బర్హిపింఛాన్ని ధరిస్తోంది. జగన్మాత అనుగ్రహం ఆ విధంగా పొందిన నెమిలి అది.

ఆ పింఛం కాంతులవరుసలతో చుట్టుకొనబడింది + తనంతట తానే జారినది

( పురి నుండి తనంతట తాను వెలువడిన నెమిలిపింఛాన్ని గ్రహించాలి కాని

మనం నెమిలినుండి బలవంతంగా తీసుకోకూడదు. )

అని పింఛాన్ని, వర్ణించాడు.

తెల్లనైన కేకినేత్రాలు హరుడు ధరించిన శశికాంతితో ఇంకా శుభ్రం అయ్యాయని,

నెమెలికండ్లను వర్ణించాడు.

శివానుగ్రహం కూడా కల నెమిలి.

ఇక మేఘుని ఉఱుములు కొండగుహల్లో ప్రతిధ్వనించాకే వాటి గొప్పతనం తెలుస్తుంది.

ఆ ఉఱుములకు నెమిళ్లు ఆనందించి, నాట్యం మొదలుపెడతాయి.

అదే చేయించమంటున్నాడు. ఉఱుములతో ఆడించమంటున్నాడు.

తన వాహనాన్ని ఆనందింపజేస్తే, కుమారుడు అనుగ్రహిస్తాడు కదా!మంగళం మహత్

5, మే 2011, గురువారం

మేఘసందేశం 45 వ శ్లోకం

తత్ర స్కందం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా
పుష్పాసారైః స్నపయతు భవా న్వ్యోమగంగాజలార్ద్రైః,
రక్షాహేతో ర్నవశశిభృతా వాసవీనాం చమూనా
మత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజఃక్షమించండి. మధ్యలో అడ్డు వచ్చినందుకు.
తెలుసు కదా! శ్లోకం మొదట ప్రకాశంగా అంటే బయటకు చదవండి.
ఎన్నిసార్లు? భయపడకండి. తప్పులు రాకుండా చదువగలిగేవరకు.
ఎందుకు? భావం బాగా అర్థమవుతుంది.
ఇంకా? సంస్కృతం అందం తెలుస్తుంది.
తెలుగువారికి సంస్కృతం ఎందుకంటారా ?
అన్నన్నా. అలా అనకండి.
ఇంగ్లీషు కంటే భారతీయభాష , దేవభాష, వేదభాష అయిన
సంస్కృతం తీసిపోయిందంటారా ?
పరాయి భాషలపై ఉన్న మోజులో కొంత శాతం
సంస్కృతంకోసం కేటాయించండి.
దాని కోసమే శ్లోకం. అయితే ఈ శ్లోకాలతోనే సంస్కృతం రాదు.
అభిరుచి కలుగవచ్చు కదా!
అలా అని ఇప్పటికే రకరకాలుగా పలుచన అయిపోయిన మన
మాతృభాషను నిర్లక్ష్యం చేయకండి.
దాని కోసమే భావం.
ఇక చిత్తగించండి.


భావం:ఓ మేఘుడా!

దేవగిరిని చేరబోతున్నావు కదా!

అది కుమారస్వామి నిత్యనివాసస్థానం.

ఆ కుమారస్వామిని,

నీవు,

పుష్పమేఘుడవై ( పూలను వర్షించే మేఘంగా చేయబడిన దేహం కలవాడవై )

ఆకాశగంగాజలాలతో తడిసిన పుష్పాల ధారావర్షంచేత

అభిషేకం చెయ్యి.

ఆ కుమారస్వామి,

ఇంద్రుని సైన్యాన్ని రక్షించడంకోసం

నవశశిభృతుడు ( బాలచంద్రశేఖరుడు ) ( శివుడు ),

అగ్నిముఖమందు ఉంచిన

సూర్యుని అతిక్రమించిన తేజస్సుకదా!విశేషాలు:తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడంకోసం,

బ్రహ్మాదిదేవతలు ప్రార్థించిన మీదట శివుడు, బ్రహ్మచర్యాన్ని వీడి,

పార్వతిని పరిణయమాడి, కొన్ని కారణాంతరాలచేత,

తన తేజోవంతమైన వీర్యాన్ని, జగన్మాతయందు కాక,

అగ్నియందు ఉంచాడు.

అంతటి అగ్ని కూడా ఆ తేజస్సును భరించలేక,

గంగయందు ఉంచాడు.

గంగ కూడా భరించలేక రెల్లుగడ్డిమీదకు తోయగా తోయజాక్షుడైన

కుమారుడు జన్మించాడు.

కృత్తికలచేత పెంచబడిన ఆ కార్తికేయుడు,

పార్వతి ప్రసాదంతో వేలాయుధుడై,

తారకాసురుని సంహరించాడు.

ఆ తరువాత దేవతల ప్రార్థనచే

పైన పేర్కొన్న దేవగిరిమీద నిత్యనివాసానికి అంగీకరించాడు.

అంటే సతతం, సదా, ఎల్లప్పుడు, ఆ దేవగిరిమీద కొలువై ఉంటాడు.- కుమారస్వామి వృత్తాంతాన్ని కాళిదాసు "కుమారసంభవం" అనే

మహాకావ్యంగా రచించాడు.- " దేవతల రక్షణ కోసం ఉద్భవించిన కుమారుని

నీవు పూజిస్తే సకలదేవతలు ఇంద్రునితో సహా నీకు అనుకూలురే అవుతారు.

అది నీకు రక్షణ హేతువు." అని మేఘునికి యక్షుడు సూచించినట్లు భావించవచ్చు.- వర్షమేఘాన్ని పుష్పమేఘం అవ్వమంటున్నాడు. ఎంత అందమైన భావనో చూశారా!
మంగళం మహత్ప్రతి భారతీయుడు, తన మాతృభాషను, సంస్కృతాన్ని
రెండు కళ్లుగా భావించాలి. అప్పుడు జ్ఞానం + విజ్ఞానం లభిస్తాయి.

4, మే 2011, బుధవారం

మేఘసందేశం 44 వ శ్లోకం

త్వ న్నిష్యందోచ్ఛ్వసిత వసుధా గంధసంపర్క రమ్యః
స్రోతోరంధ్రధ్వనితసుభగం దంతిభిః పీయమానః,
నీచై ర్వాస్య త్యుపజిగమిషో ర్దేవపూర్వం గిరిం తే
శీతో వాతః పరిణమయితా కాననోదుంబరాణాం.భావం:నీ వర్షంతో భూమి ఊరట

చెందుతుంది.

సువాసనలు వెదజల్లుతుంది.

గాలి ఆ పరిమళాన్ని ధరిస్తుంది.

ఏనుగులు ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూంటాయి.

అప్పుడు వాని తొండాలనుండి

వినుటకు ఇంపైన ధ్వని వెలువడుతుంది.

అడవి మేడికాయలు పండి, ( అత్తిపండ్లు )

ఆ వాసనలు వస్తూంటాయి.

వీటన్నిటితో కూడిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు అనుకూలంగా మెల్లగా వీయగలదు.


ఉన్నదున్నట్లుగా అంటే ఇలా చెప్పాలి.


నీ వర్షంచేత తడిసిన భూమి వెదజల్లిన సువాసనను ధరించినది,


ఏనుగులచేత ఆఘ్రాణింపబడి, ధ్వనులు చేయించేది,

మేడికాయలను పండించేది,

అయిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు మెల్లగా వీయగలదు.


మంగళం మహత్

3, మే 2011, మంగళవారం

మేఘసందేశం 41 , 42 , 43 శ్లోకాలు

తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం
శాంతిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు,
ప్రాలేయాస్రం కమలవదనాత్సో౭పి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః.భావం:ఆ సూర్యోదయసమయం

( కొందఱు ) భర్తలు తమ సతుల కన్నీళ్లు తుడిచే సమయం.

( సతులెందుకు ఏడుస్తారంటే, మఱి రాత్రంతా తిరిగి తెల్లవారాక వస్తే ఏడవరా ? )
రాత్రంతా ఎక్కడ తిరిగారో తెలివైన మీకు తెలుపక్కరలేదు కదా!
అటువంటి సతులను ఖండితలు అంటారు. )

అలాగే సూర్యుడు ఉదయాన రాగానే,

ఖండిత లాంటి పద్మిని ( తామరపువ్వు )

మంచు అనే కన్నీటిని నింపుకొంటే,

ఆ కన్నీటిని తుడువడానికి సూర్యుడు,

కిరణాలు అనే కరాల్ని ( చేతుల్ని ) చాపుతూంటాడు.

అప్పుడు నీవు అడ్డం పోకు.

కోపం వస్తుంది.

అది నీకు మంచిది కాదు.గంభీరాయాః పయసి సరిత శ్చేతసీవ ప్రసన్నే
ఛాయాత్మాపి ప్రకృతిసుభగో లప్స్యతే తే ప్రవేశం,
తస్మా దస్యాః కుముదవిశదా న్యర్హసి త్వం న ధైర్యా
న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని.భావం:తర్వాత మనస్సులా నిర్మలమైన

గంభీర అనే నది కనబడుతుంది.

నీవు ఆ నదిని ఇష్టపడకపోయినా,

ఆ నది నీటిలో నీ ఛాయాశరీరమైనా ఉంది కాబట్టి,

ఆ నది నిన్ను మనసులో తలుస్తూనే ఉంటుంది.

అలా ఇష్టపడి, చేపల పొర్లిగింతలనే చూపులతో నిన్ను చూస్తుంది.

ఆ చూపులను నీ ధూర్తత్వంతో వ్యర్థం చేయకు.తస్యాః కించి త్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం
హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితంబం,
ప్రస్థానం తే కథమపి సఖే లంబమానస్య భావి
జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః.
భావం:నీవు ఆ గంభీరానదీజలాలను గ్రోలితే,

నీకు మధురమైన అనుభవం కలుగుతుంది.

వెళ్లడానికి నీకు మనసు రాదు.


మంగళం మహత్

2, మే 2011, సోమవారం

మేఘసందేశం 40 వ శ్లోకం

తాం కస్యాంచిద్భవనవలభౌ సుప్తపారావతాయాం
నీత్వా రాత్రిం చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కళత్రః,
సూర్యే దృష్టే పునరపి భవాన్వాహయేదధ్వశేషం
మందాయంతే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః.భావం:నీ భార్య అయిన సౌదామని ( మెఱపు )

మెఱసి మెఱసి అలసి సొలసి ఉంటుంది.

అంత ఆమెతో కూడి, నీవు,

పావురాలు నిద్రిస్తున్న ఏదైనా ఒక భవనంమీద ఆ రాత్రి గడపి,

మరల తెల్లవారగానే,

ప్రయాణం చెయ్యి.

మిత్రులకు ఉపకారం చేయడానికి,

అంగీకరించి, అందుకు పూనుకొన్న నీలాంటివారు,

ఆలస్యం చేయరు కదా!మంగళం మహత్

1, మే 2011, ఆదివారం

మేఘసందేశం 39 వ శ్లోకం

గచ్ఛంతీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః,
సౌదామిన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గ స్తనితముఖరో మాస్మభూర్విక్లబా స్తాః.భావం:


( మహాకాళేశ్వరుని సేవ పూర్తి అయిన తర్వాత తిరిగి నగరసంచారం.)ఆ ఉజ్జయినిలో కటికచీకట్లో

రమణుల ఇంటికి పోతున్న స్త్రీలకు, ( అభిసారికలకు )

నీ మెఱపులతో దారి చూపు.

ఉఱమవద్దు.

వర్షింపనూ వద్దు.

ఉఱిమినా వర్షించినా

పాపం ఆ యువతులు భయపడతారు.


మంగళం మహత్

30, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 38 వ శ్లోకం

పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః
సాంధ్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః,
నృత్యారంభే హర పశుపతేరార్ద్రనాగాజినేచ్ఛాం
శాంతోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా.


భావం:సాయంకాలపూజ తర్వాత

శివుడు, నృత్యానికి పూనుకొన్నప్పుడు ( శివుని నృత్యాన్ని తాండవం అంటారు.)

ఎత్తిన ఆయన చేతులమీద,

క్రొత్తదాసానిపువ్వులా ఎఱ్ఱనైన సంధ్యాకాంతి గల నీవు, వ్రాలి

రక్తంచేత తడిసిన గజచర్మంమీద

ఆయనకు గల కోరికను పోగొట్టు.

అప్పుడు అమ్మవారి నయనాలు

భయంపోయి, స్తిమితపడతాయి.

( నీవల్ల ఆవిడకు గజచర్మభయం పోతుంది. కాన )

అప్పుడు నిన్ను వేడుకగా చూస్తారు.

ఇలా వారి అనుగ్రహానికి పాత్రుడవు కావచ్చు.మంగళం మహత్

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 37 వ శ్లోకం

పాదన్యాసక్వణితరశనాస్తత్ర లీలావధూతై:
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాంతహస్తాః,
వేశ్యా స్త్వత్తో నఖపదసుఖాన్ప్రాప్య వర్షాగ్రబిందూ
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్కటాక్షాన్.భావం:ఆ సంధ్యాపూజలో

పణ్యస్త్రీలు, నాట్యం చేస్తూ,

చామరాలతో మహాకాళేశ్వరస్వామికి వీచుతూంటారు.

నీవు వారిమీద పడేటట్లు

చల్లగా నీటిబిందువుల్ని వర్షిస్తే,

నిన్ను, తుమ్మెదబారుల్లాంటి కడగంటిచూపులతో చూస్తారు.

వారి చూపులు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి.మంగళం మహత్

28, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 36 వ శ్లోకం

అప్యన్యస్మింజలధర మహాకాళమాసాద్య కాలే
స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః,
కుర్వన్సంధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయా
మామంద్రాణాం ఫలమవికలం లప్స్యసే గర్జితానాం.భావం:ఓ మేఘుడా!

నీవు, ఆ మహాకాళక్షేత్రంలో

సాయంకాలం వరకు ఉండు.

ఆ సాయంసంధ్యాకాలంలో కొనియాడతగిన*

ఈశ్వరునికి చేసే పూజలో / ఈశ్వరుని పూజ జరుగుతూండగా,

( శివునికి సాయంసంధ్యాకాలం పరమప్రీతికరం. )

నీవు కొంచెం కొంచెంగా ఉఱిమితే,

పటహములు ( తప్పెటలు ) వాయించినట్లుంటుంది.

నీకు కొంచెం గంభీరాలైన ఉఱుములు ఉన్నందుకు,

భగవత్సన్నిధిలో ఉపయోగించడంవల్ల ,

ప్రయోజనం కలుగుతుంది.


విశేషాలు:భగవంతుడు, అపారకరుణతో మనకు దేహంతోపాటు అనేక శక్తులుఇచ్చాడు.

ఇది మనం గుర్తించి, ఈ దేహాన్ని, ఆ శక్తులను
భగవత్సేవకు, భాగవతసేవకు, మరియు
(శరీరావయవలోపంచేత సహాయం కోరేవారు,
ధనజనలేమిచేత నిస్సహాయులైన వారు, ఈ రెండురకాల)

దీనజనసేవకు ఉపయోగిస్తే, పరమశ్రేయోలాభం కలుగుతుంది.

అంటే భగవంతునికి మనమంటే ఇష్టం కలుగుతుంది.

ఈ జన్మకు సాఫల్యం - ఈశ్వరుడు మనల్ని ఇష్టపడటమే.* "కొనియాడతగిన" అనే ఈ విశేషణం ఈశ్వరునికీ అన్వయించుకోవచ్చు.
పూజకును అన్వయించుకోవచ్చు.
మంగళం మహత్

27, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 35 వ శ్లోకం

భర్తుః కంఠచ్ఛవిరితి గణైః సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా స్త్రిభువనగురోర్ధామ చండీశ్వరస్య,
ధూతోద్యానం కువలయరజోగంధిభిర్గంధవత్యా
స్తోయ క్రీడానిరతయువతిస్నానతిక్తైర్మరుద్భిః.భావం:నీకు అలౌకికానందం, లౌకికానందం ఒకేసారి కలుగుతాయి.

( తమ ) స్వామి యొక్క

కంఠం కాంతి వంటి కాంతి గలవాడవనే కారణంచేత

( అనగా శివునికంఠంలా నల్లగా ఉంటావు కనుక )

ప్రమథగణాలు (నిన్ను) ఆదరణతో చూస్తారు.

వారి ఆదరణ పొందినవాడవై,

త్రిభువనగురుడు,

చండికాపతి అయిన శివునియొక్క

పవిత్రధామాన్ని పొందు.

ఈ క్షేత్రప్రవేశంతో అలౌకికానందం.

( ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రం. ఈశ్వరుడు, మహాకాలుడనే పేరుతో
కొలువై ఉన్నాడక్కడ. ద్వాదశజ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి.)

( పుణ్యక్షేత్రమే కాదు భోగక్షేత్రం కూడా అంటున్నాడు. ఎలా అంటే )

అక్కడ గంధవతి అనే నది ఉంది.

దాని నిండా పరిమళాలు వెదజల్లే కలువపూలు ఉన్నాయి.

ఆ గంధవతీనది మీదినుంచి,

ఈ కలువపూల పరిమళాన్ని,

అందులో స్నానం చేసే యువతుల

స్నాన ( చందనం మొదలైన ) వస్తువుల పరిమళాన్ని మోసుకొని వస్తూ,

వీచే గాలులు, ఉద్యానవనాల్ని కదిలిస్తూంటాయి.

అలా ఉద్యానపుష్పపరిమళాలు కూడా

గంధవతీ నదీ వాయువులు మోసుకొచ్చే పరిమళాలతో కలుస్తాయి.

ఈ మూడువిధాలైన గంధాలతో చల్లగాలి మెల్లగా వీస్తూంటుంది.

కాబట్టి చాల సుఖం కలుగుతుంది.

ఇది లౌకికానందం.

ఈ రెండు రకాల ఆనందాలతో నీకు విశేషలాభం కలుగుతుంది.మంగళం మహత్

26, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 34 వ శ్లోకం

జాలోద్గీర్ణై రుపచితవపుః కేశసంస్కారధూపై
ర్బంధుప్రీత్యా భవనశిఖిభిర్దత్తనృత్యోపహారః
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథాః
పశ్య౯ లక్ష్మీం లలితవనితాపాదరాగాంకితేషు.భావం:ఉజ్జయినీ స్త్రీలు,

తమ కేశాలు సువాసనలను వెదజల్లడానికై

చేసుకొన్న, వేసుకొన్న ధూపాలు,

గవాక్షాల (windows) నుండి వెలువడి,

నీలో కలుస్తాయి.

అపుడు నీ దేహానికి వృద్ధి, (పుష్టి) కలుగుతుంది.

( ధూమం మేఘమవుతుందని, ఇంతకుముందు చెప్పబడింది కదా! )

అది నీకొక ఆతిథ్యం.

ఇంకా,

(తమ) బంధువనే ప్రేమచేత,

అక్కడి పెంపుడునెమళ్లు,

నీ ఎదుట నాట్యం చేసి, నీకు ఆనందం కలిగిస్తాయి.

( చంద్రదర్శనంతోనే సముద్రుడుప్పొంగినట్లు,
సూర్యసమీక్షణంతోనే కమలాలు వికసించినట్లు,
మేఘసందర్శనంతోనే నెమళ్లు పురివిప్పుతాయి, ఆడతాయి.
కాన మేఘుడు బంధువు.)

పూలచేత పరిమళిస్తున్నవై,

అందమైన ఆడువారి పాదాల లత్తుక గుర్తులున్న మేడలపై కూర్చుని,

ఉజ్జయినీలక్ష్మిని ( సంపదను , సౌభాగ్యాన్ని )

చూస్తూ, మార్గాయాసాన్ని పోగొట్టుకో.మంగళం మహత్

25, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 33 వ శ్లోకం

హారాంస్తారాం స్తరళగుటికా న్కోటిశః శంఖశుక్తీః
ఘాసశ్యామాన్మరకతమణీనున్మయూఖప్రరోహా౯,
దృష్ట్వా యస్యాం విపణిరచితాన్విద్రుమాణాం చ భంగా౯
సంలక్ష్యంతే సలిలనిధయ స్తోయమాత్రావశేషాః.భావం:ఆ విశాలాపట్టణంలోని అంగడివీథుల్లో,

కోట్లకొలది శుద్ధములైన నాయకరత్నాలను,

ముత్యాలహారాలను,

శంఖాలను,

ముత్యపుచిప్పలను,

పచ్చికలా ఆకుపచ్చవర్ణం కల్గిన మరకతమణులను,

పగడపుఖండాలను, చూచి, ప్రజలు,

"సముద్రాలలో ఇక నీరుమాత్రమే మిగిలింది.

రత్నాలు లేవు.

ఎందుకంటే అన్ని సముద్రాల్లోని రత్నాలు

ఇక్కడ చేరాయి కదా!." ~ అని భావిస్తారు.

విశాలాపట్టణం రత్నసంపదకు ఆలవాలం అని భావం.మంగళం మహత్
ప్రేమావతారుడైన భగవాన్ శ్రీసత్యసాయిబాబావారి
దివ్యచరణారవిందాలకు సజల నయనాలతో నమస్సులు.మంగళం మహత్

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 32 వ శ్లోకం

దీర్ఘీ కుర్వ౯ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోదమైత్రీకషాయః,
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమంగానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః.


భావం:ఆ విశాలాపట్టణం దగ్గరలో శిప్రానది ఉంది.

ఆ శిప్రానది గాలి,

అంటే ఆ నదిమీదినుండి వీచే ( చల్లని ) గాలి,

బెగ్గురుపక్షుల చక్కని కూజితాలను, దీర్ఘం చేసేది.

అంటే వాటి ధ్వనులను ఎడతెగకుండా చేసేది.

వికసించిన ( శిప్రానదిలోని ) పద్మాల పరిమళంతో కూడినది.

ఇంకా ఆ శిప్రానది గాలి తిన్నగా వీచి, శరీరానికి సుఖంగా సోకేది.

ఈ విధంగా శైత్యం, ( శీతలం )

సౌరభం, ( పరిమళం )

మాంద్యం ( నెమ్మది )

మొదలైన గుణాలతో కూడిన సామర్థ్యంతో

శిప్రానది గాలి,

స్త్రీల రతిశ్రమను పోగొడుతుంది.

తిరిగి అభిలాషను పుట్టిస్తుంది.
అని, శిప్రానది గాలిని యక్షుడు మేఘునికి వర్ణించిచెప్పాడు.మంగళం మహత్

23, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 31 వ శ్లోకం

ప్రాప్యావంతీనుదయనకథాకోవిదగ్రామవృద్ధా౯
పూర్వోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలాం,
స్వల్పీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం
శేషైః పుణ్యై ర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం.
భావం:అవంతి, ప్రసిద్ధమైన దేశం.

ఆ దేశంలోని గ్రామాల్లో ఉండే పెద్దవారు,

ఉదయనమహారాజు కథలను బాగా తెలిసినవారు.

ఆ దేశంలోనే ముందు నేను చెప్పిన విశాలాపట్టణం ఉంది.

( దీన్నే ఉజ్జయిని అంటారు. ఇది అవంతికి రాజధాని.)

సంపన్నమైన నగరం.

ఇంకా ఆ నగరం ఎలా ఉంటుందంటే,

కొంచెం పుణ్యం ఉండగానే,

స్వర్గసుఖం అనుభవిస్తున్నవారు,

భూమిమీద జన్మిస్తే,

ఆ మిగిలిన పుణ్యఫలాన్ని అనుభవించడానికి

తెచ్చిన స్వర్గఖండమో అన్నట్లు ఉంటుంది.

అంటే స్వర్గతుల్యంగా ఉంటుంది. స్వర్గసుఖాలన్నీ ఇక్కడ ఉంటాయి. అని భావం.

ఓ మేఘుడా! అటువంటి ఉజ్జయినిని పొందు.మంగళం మహత్

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 30 వ శ్లోకం

వేణీభూతప్రతనుసలిలా సా త్వతీతస్య సింధుః
పాండుచ్ఛాయా తటరుహతరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః
సౌభాగ్యం తే సుభగ విరహావస్థయా వ్యంజయంతీ
కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః


భావం:


సుందరుడా!

అందగాడవైన నిన్ను, ఎడబాయడంతో,

ఆ నిర్వింధ్యానది,

సన్నని జాలుగా ప్రవహిస్తున్న

జలమనే జడ వేసుకొని,

ఒడ్డులందు మొలచిన చెట్లనుండి

జాఱిపడిన ఎండుటాకులతో,

తెల్లబాఱినదై ఉండి,

ఇలాంటి విరహావస్థచేత,

చూసేవారికి, ( ఈ నిర్వింధ్య ప్రియుడెంతో అందగాడు కాబట్టే అతని విరహంతో
ఈమె ఇంతలా చిక్కిపోయింది అనుకొనేట్లు )

నీ సౌందర్యాన్ని ప్రకటిస్తున్న,

ఆ నిర్వింధ్యకు,

సంతోషం కలిగించు.
మంగళం మహత్

21, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 29 వ శ్లోకం

వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః,
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.
భావం:నీవు ఉజ్జయినీ పట్టణానికి పోతున్నప్పుడు,

మార్గమధ్యంలో,

"నిర్వింధ్య " అనే నదిని కలుసుకోగలవు.

( ఈ నది, వింధ్య పర్వతానికి ఉత్తరంగా ప్రవహించే నది. )

ఆ నది అలల కదలికలకు,

( హంసాది ) పక్షులు, ధ్వనులు చేస్తూంటాయి.

ఆ పక్షుల పంక్తులు కనులకింపుగా ఉంటాయి.

ఆ నది తొట్రుపాటు పడుతూ,

సుందరంగా ప్రవహిస్తూ పోతూంటుంది.

సుడులు తిరుగుతూ ఉంటుంది.

ఆ నదిని కలిసి, ( ఆ నదీజలాలను తీసుకొని, )

రసాంతరంగుడివి కా. ( రసాంతరంగుడు = జలము లోపల కలవాడు. )

విశేషాలు:పై భావం శ్లోకంలోని మూడు పాదాలకు.

దీనిలో ఒక అంతరార్థం ఉంది.

అది వివరించాక, నాలుగవ పాదభావం తెలుసుకొందాం.
నిర్వింధ్యను స్త్రీతో పోలిస్తే,

పైన పేర్కొన్న పక్షుల వరుసలు ఆమె మొలనూలు.

సుడి ఆమె నాభి.

తొట్రుపాటు ప్రవాహం , స్త్రీ సహజసుందరగమనం.

ఆమె నుండి మేఘుడు గ్రహించే రసం శృంగార రసం.

రసం అనే పదానికి ఉన్న అనేక అర్థాల్లో

జలం అనే అర్థాన్ని,

శృంగారరసార్థాన్ని,

కాళిదాసు ఇలా అందంగా ఉపయోగించుకొన్నాడు.ఇక నాల్గవపాదానికి భావం:స్త్రీలకు ప్రియులయందు, విలాసమే మొదటి ప్రణయవచనం అవుతోంది.

అంటే,

ఆడువారు, తమ విలాసాలచేతనే,

తమ మనోభిప్రాయాలను ప్రియులకు తెలుపుతారు.

గ్రహించినవాడు శ్రీనాథుడవుతాడు. - శృంగారి.

గ్రహించనివాడు వేమన అవుతాడు. - విరాగి.మంగళం మహత్

20, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 28 వ శ్లోకం

వక్రః పంథా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం
సౌధోత్సంగప్రణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః,
విద్యుద్దామస్ఫురితచకితైర్యత్ర పౌరాంగనానాం
లోలాపాంగైర్యది న రమసే లోచనై ర్వంచితః స్యాః.భావం:ఉత్తరదిక్కుగా పోతున్న నీకు,

ఉజ్జయినీ మార్గం వంకరైనదైనా,

ఉజ్జయినీ మేడల పైభాగాలను చూడడానికి,

విముఖుడవు ( ఇష్టం లేనివాడవు ) కావద్దు.

( ఎందుకంటే )

అక్కడి స్త్రీలు నీ మెఱుపులను చూచి, భయపడతారు.

అప్పుడు వారి బెదరుచూపులు చాల అందంగా ఉంటాయి.

ఆ సౌందర్యాన్ని చూడకపోతే,

మోసపోయినవాడవవుతావు.

నీ జన్మ నిష్ప్రయోజనం.
మంగళం మహత్

19, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 27 వ శ్లోకం

విశ్రాంతః సన్వ్రజ వననదీతీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణై ర్యూథికాజాలకాని,
గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం
ఛాయాదానాత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం.భావం:
నీవు,

ఆ నీచైర్గిరియందు శ్రమదీర్చుకొంటూ,

వననదీతీర ఉద్యానవనాల్లో,

( అక్కడి అడవులందలి నదుల ఒడ్డుల్లో ఉన్న తోటల్లో ),

పూచిన మొల్లమొగ్గలను,

క్రొత్త నీటిచుక్కలచేత తడుపు.

చెక్కిళ్ల మీద చెమటను,

పోగొట్టి, ఆ బాధతో వాడిన నల్లకలువలు చెవికొనల్లో గల,

పువ్వులు కోస్తున్న స్త్రీల ముఖాలకు,

ఛాయను ఇచ్చి,

కాసేపు పరిచయం గలవాడవై,

పొమ్ము.

అంటే,

అక్కడ పువ్వులు కోస్తున్న స్త్రీలు ఉంటారు.

వారికి ఎండచేత చెమట పట్టకుండా ఛాయను దానం చేయి.

ఇక్కడ ఛాయ అంటే "నీడ" అని "కాంతి" అని రెండు అర్థాలు చెప్పవచ్చు.

నీడను ఇస్తే సంతోషిస్తారు.

మరి కాంతి?

వారి ముఖాలు సహజకాంతివంతాలు.

సూర్యకాంతివల్ల వారి ముఖాల్లోని కాంతి అదృశ్యమైంది.

ఇపుడు మేఘుని నీడ వల్ల సూర్యకాంతి పడకపోవడంతో,

వారి ముఖకాంతి మరల వారి ముఖాలను చేరుతుంది.

అది వారికీ నీకూ సంతోషం కలిగిస్తుంది.

ఆ ఉపకారంచేత వారికీ నీకూ పరిచయం కూడా కలుగుతుంది.

ఇది నీకు ఇంకా సంతోషం కలిగిస్తుంది.

నిజమే కదా!

మగవారికి స్త్రీల పరిచయాన్నిమించిన ఆనందం ఏముంది?

కాని, దురుద్దేశంతో చేసుకొనే పరిచయాలు

పాములై కాటేస్తాయి అంటాడీ రావెమెస్సారెల్.మంగళం మహత్

18, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 24 , 25 , 26 శ్లోకాలు

పాండుచ్ఛా యోపవనవృతయః కేతకై స్సూచిభిన్నై
ర్నీ డారంభైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః,
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూవనాంతాః
సంపత్స్యంతే కతిపయదినస్థాయిహంసా దశార్ణాః


భావం:


నీవు దశార్ణదేశాల్ని చేరేటప్పటికి,

అ దేశాల తోటలు,

పూచిన మొగలిపువ్వులకాంతులతో,

తెల్లగా ఉంటాయి.

గ్రామాల్లోని రచ్చచెట్లు,

కాకులు మొదలైన పక్షులు,

గూండ్లు కట్టుకోవడంవల్ల,

కదులుతూంటాయి.

నేరేడుచెట్లు, ఫలాలతో నీలంగా ఉంటాయి.

హంసలు, ఇక కొన్నిరోజులే అక్కడ ఉంటాయి.తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం
గత్వా సద్యః ఫల మవికలం కాముకత్వస్య లబ్ధా,
తీరోపాంత స్తనితసుభగం పాస్యసి స్వాదు యత్త
త్సభౄభంగం ముఖమివ పయో వేత్రవత్యా శ్చలోర్మి.భావం:ఆ దశార్ణదేశాలకు రాజధానియైన, విదిశాపట్టణం

అన్ని దిక్కుల్లో ప్రసిద్ధిచెందినది.

అక్కడికి నీవు పోయినప్పుడు,

కాముకునికి కలుగు ఫలమంతా కలుగుతుంది.

ఏ విధంగా అంటే,

ఆ పట్టణ సమీపంలో, వేత్రవతి అనే నది ప్రవహిస్తోంది.

మధురమైన తరంగాలతో కదులుతూంటుంది.

దాని నీటిని,

బొమముడితో కూడుకొన్న ( ప్రియురాలి )

అధరంవలె తిన్నగా ఉఱుముతూ పానం చెయ్యి.

( అలా చేసినప్పుడే, కాముకఫలం కలుగుతుంది.)
నీచై రాఖ్యం గిరిమధివసే స్తత్ర విశ్రామహేతో
స్త్వత్సంపర్కాత్పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః
యః పణ్యస్త్రీ రతిపరిమళో ద్గారిభిర్నాగరాణా
ముద్దామాని ప్రథయతి శిలావేశ్మభిర్యౌవనాని.భావం:ఆ విదిశాపట్టణ సమీపంలో,

" నీచైర్గిరి " అనే పేరు గల కొండ ఉంది.

ఆ కొండమీద,

చక్కగా వికసించిన పూలు గల కడిమిచెట్లున్నాయి.

ఆ చెట్లతో ఆ కొండ,

నీ సంపర్కంవల్ల గగుర్పాటు చెందినట్లుంటుంది.

ఆ కొండమీద కాసేపు విశ్రమించు.

పణ్యస్త్రీల రతిపరిమళాల్ని వెడలగ్రక్కుతున్న,

ఆ గిరి గుహలు,

విదిశాపురజనుల అధిక యౌవనాలను ప్రకటిస్తూంటాయి.మంగళం మహత్

17, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 23 వ శ్లోకం

ఉత్పశ్యామి ద్రుతమపి సఖే మత్ప్రియార్ధం యియాసో:
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వతే తే
శుక్లాపాంగై: సజలనయనై: స్వాగతీకృత్య కేకా:
ప్రత్యుద్యాత: కథమపి భవాంగంతుమాశు వ్యవస్యేత్భావం:


స్నేహితుడా!

నా ప్రీతి కోసం,

శీఘ్రంగా పోదలచినవాడవైనా,

నీకు కొడిసె పూలచేత పరిమళిస్తున్న ప్రతి పర్వతమందు,

కాలక్షేపం అవుతుందని ఊహిస్తున్నాను.

నిన్ను చూసిన ఆనందంతో,

కనుల నీరు క్రమ్మినవైన, ( ఆనందబాష్పాలతో కూడిన నేత్రాలుగల)

నెమళ్లు , తమ కేకలచేత నిన్ను,

స్వాగతం స్వాగతం అని ఎదురుసన్నాహం చేసి,

పూజిస్తాయి.

వాటిని అందుకొంటూ అక్కడే ఉండిపోక,

శీఘ్రంగా వెళ్లడానికి ప్రయత్నించు.


మంగళం మహత్

16, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 20 , 21 , 22 శ్లోకాలు

తస్యాస్తిక్తై ర్వనగజమదైర్వాసితం వాంతవృష్టి
ర్జంబూకుంజప్రతిహతరయం తోయమాదాయగచ్ఛేః
అంత:సారం ఘన తులయితుం నానిల: శక్ష్యతి త్వాం
రిక్త: సర్వో భవతి హి లఘు: పూర్ణతా గౌరవాయ.


భావం:


మేఘుడా!,

నీవు అక్కడ వర్షించిన తర్వాత,

సుగంధములైన,

అడవి ఏనుగుల మదంచేత పరిమళింపచేయబడిన,

నేరేడుపొదలచేత ఆపబడిన వేగంగల, {నేరేడుపొదలు, నర్మద వేగాన్ని ఆపుతున్నాయి.}

ఆ నర్మదానది నీటిని తీసుకొని పో.

( ఆ నీటిని గ్రహించడం వల్ల )

లోపల బలం గల నిన్ను, ( బరువుగా ఉన్న నిన్ను,)

వాయువు, కదిలించలేదు. ( చెదరగొట్టలేదు.)

రిక్తుడు ( బలం లేనివాడు ) అందఱికీ చులకన అవుతున్నాడు.

లోపల సారం ఉన్నవాడు గౌరవం పొందుతున్నాడు.
నీపం దృష్ట్వా హరితకపిశం కేసరై రర్ధరూఢై
రావిర్భూతప్రథమముకుళా: కందళీ శ్చానుకచ్ఛం
జగ్ధ్వారణ్యే ష్వధికసురభిం గంధ మాఘ్రాయ చోర్వ్యా:
సారంగాస్తే జలలవముచ: సూచయిష్యంతి మార్గం.


భావం:


సారంగాలు ( జింకలు, ఏనుగులు, తుమ్మెదలు )

సగం మొలిచిన కేసరాలతో,

కపిశవర్ణంగల ( ఆకుపచ్చ నలుపు ఎఱుపు రంగుల మిశ్రమం )

నేలకడిమి పువ్వు (ల) ను చూసి,

అలాగే,

పచ్చికపట్టుల్లో మొలిచిన తొలిమొగ్గలుగల

నేలఅరటిచెట్లను, తిని,

అడవుల్లో మిక్కిలి సువాసన గల

భూమి యొక్క గంధాన్ని మూర్కొని, ( ఆఘ్రాణించి )

ఉదక బిందువులు కురుస్తున్న నీ మార్గాన్ని సూచిస్తాయి.
అంభోబిన్దుగ్రహణచతురాం శ్చాతకా౯ వీక్షమాణా:
శ్రేణీభూతా: పరిగణనయా నిర్దిశన్తో బలాకా:
త్వామాసాద్య స్తనితసమయే మానయిష్యంతి సిధ్ధా:
సోత్కంఠాని ప్రియసహచరీ సంభ్రమాలింగితాని.


భావం:


నీవు వర్షించేటప్పుడు,

చినుకుల్ని పట్టుకోవడంలోనేర్పుగల

చాతకపక్షుల్ని చూస్తున్నవారైన,

బారులు తీరిన కొంగలను లెక్కపెడుతూ,

చేతుల్తో చూపుతున్న వారైన,

సిద్ధపురుషులు,

నీవు ఉఱిమినప్పుడు,

ఉత్కంఠతో కూడుకొన్న

ప్రియురాండ్ర సంభ్రమ ఆలింగనాలను (కౌగిలింతల్ని) పొంది,

నిన్ను పూజించగలరు.

(అడక్కుండానే స్త్రీలు వచ్చి కౌగిలించుకొంటే,

మగవాళ్లకు విశేషమైన ఆనందం కదా!

అంతకంటే కావలసినదేమున్నది?

అందువల్ల దానికి కారణమైన నిన్ను,

విశేషించి పూజిస్తారు.మంగళం మహత్

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 18 , 19 శ్లోకాలు

ఛన్నోపాంతః పరిణతఫలద్యోతిభిః కాననామ్రై
స్త్వయ్యారూఢే శిఖరమచలః స్నిగ్ధవేణీసవర్ణే
నూనం యాస్యత్యమరమిథునప్రేక్షణీయా మవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాండుః


భావం:


అడవిమామిళ్లు పండి,

ఆ ఆమ్రకూటం చుట్టూ క్రమ్ముకొని,

తెల్లగా కనిపిస్తున్నాయి.

నున్ననైన జడతో సమానమైన వర్ణంగల నీవు,

దాని శిఖరంమీద వ్రాలినట్టైతే,

చుట్టూ తెల్లగ,

మధ్యలో నల్లగా, ఉన్నట్టి,

భూమియొక్క స్తనమో

అన్నట్లుండి,

దేవమిథునాలకు చూడ్డానికి వేడుక కలిగిస్తుంది.
స్థిత్వా తస్మి న్వనచరవధూభుక్తకుంజే ముహూర్తం
తోయోత్సర్గ ద్రుతతరగతి స్తత్పరం వర్త్మ తీర్ణః
రేవాం ద్రక్ష్యస్యుపలవిషమే వింధ్యపాదే విశీర్ణాం
భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతిమంగే గజస్య.భావం:ఆ ఆమ్రకూటపర్వతమందు,

కిరాతస్త్రీలు, పొదరిండ్లలో విహరిస్తూంటారు.

( వారి విహారాలు చూడ్డం ఒక లాభం )

అక్కడ కొంచెంసేపు వర్షించు.

దాంతో తేలికపడి, శీఘ్రంగా పోవచ్చు.

అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత,

రాళ్లతో ఎచ్చుతగ్గయిన,

వింధ్యపర్వతపాదమందు వ్యాపించి ఉన్న,

నర్మదానది,

ఏనుగు దేహమందు చేసిన సింగారంలా, కనిపిస్తుంది.

దాన్ని చూడవచ్చు.

(అది చూడ్డం మరొక లాభం.)మంగళం మహత్

14, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 17 వ శ్లోకం

త్వామాసార ప్రశమిత వనోపప్లవం సాధు మూర్ధ్నా
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమా నామ్రకూట:
న క్షుద్రో౭పి ప్రథమ సుకృతాపేక్షయాసంశ్రయాయ
ప్రాప్తే మిత్రే భవతి విముఖ: కింపునర్యస్తథోచ్చై:


భావం :నీవు, ఆమ్రకూటపర్వతంమీద ఏర్పడిన దావాగ్నిని,

నీ ధారావర్షంచేత చల్లార్చి, ఆమ్రకూటానికి మేలు చేశావు.

కాబట్టి, మార్గాయాసంతో నీవు పోయినప్పుడు,

అతడు, నిన్ను బాగా పూజిస్తాడు. ఆదరిస్తాడు.

లోకంలో అల్పుడైనా తనకు ఉపకారం చేసిన మిత్రుడు వచ్చినపుడు,

పూజించకుండా ఉండడు.

ఇక అంతటివాడు పూజించకుండా, గౌరవించకుండా ఉంటాడా?విశేషాలు:ఆమ్రకూటపర్వతం మీదుగా దారి అని అర్థం చేసుకోవాలి.


మంగళం మహత్

13, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 16 వ శ్లోకం

అక్కిరెడ్డి రాజాచంద్ర గారు ఇచ్చిన ప్రోత్సాహంతో
తిరిగి మేఘసందేశం మొదలుపెట్టాను.

"మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ఉత్తమం అనిపించుకొంటుంది".
అని సూక్తిరత్నాకరం ఘోషిస్తోంది.
కనుక పూర్తిచేస్తాను.

రాజాచంద్ర, ch.వెంకటేశ్వరరావు (విశాఖపట్టణం)
ఇటువంటివారల కోసమైనా.త్వ య్యాయత్తం కృషిఫల మితి భ్రూవికారా నభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపదవధూలోచనైః పీయమానః
సద్యః సీరోత్కషణసురభి క్షేత్ర మారుహ్య మాలం
కించి త్పశ్చా ద్వ్రజ లఘుగతి ర్భూయ ఏవోత్తరేణ


తాత్పర్యం :


"మేఘుడా!
వ్యవసాయఫలితం నీ అధీనంలో ఉన్న కారణంచేత,
కనుబొమల వికారాలు ( విలాసాలు ) తెలియని,
పల్లెలలోని వధువులు ( స్త్రీలు )
నిన్ను, ప్రీతిచేత చల్లనైన చూపులతో చూస్తారు.
అప్పుడే, నాగళ్లచేత దున్నిన కొండభూములపై
సువాసన కల్గునట్లుగా వర్షించి,
కొంచెం పశ్చిమంగా పోయి, శీఘ్రగమనంతో తిరిగి,
ఉత్తరమార్గంలో వెళ్లు.


భావం:


నీ వల్లే పైర్లు పండుతాయి.
అందువల్ల పల్లెపడుచులు,నిన్ను ప్రేమగా చూస్తారు.
భ్రూవిలాసాలు తెలియని వారి చూపులు నీకు తెలుస్తాయి.
దున్నిన కొండభూములపై నీవు వర్షిస్తే, పరిమళం కల్గుతుంది.
కొంచెం పడమరగా పోయి, తిరిగి ఉత్తరంవైపు వేగంగా వెళ్లు.


విశేషాలు:


ప్రియమిత్రులకు
గమనిక:


ఈ మేఘసందేశం చదివేటప్పుడు,
శ్లోకాన్ని+ భావాన్ని,
మౌనపఠనం కాక
బాహ్యపఠనం చేయండి.
శ్లోకం చదవడానికి భయపడకండి. (అందర్నీ ఉద్దేశించికాదు).
కూడబలుక్కుంటూనైనా పైకి చదవండి.
అపుడే దాని అందం తెలుస్తుంది.
అలాగే భావం కూడా.
విశేషాలు అక్కరలేదు. మనసులో చదువుకోవచ్చు.


---- కృషి అంటే వ్యవసాయం. ఈ రోజుల్లో దీని అర్థం మారింది.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అని వేటూరి గారు వ్రాశారుగా!
"కృషితో నాస్తి దుర్భిక్షం" అని చెప్తూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చంటారు.
అసలు దాని అర్థం = వ్యవసాయం వల్ల కరవు ఉండదు. అని.

ఇది ఒక శ్లోకం మొదటిపాదం.

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రతో భయం. అనేది పూర్తి శ్లోకం.


---- సరే . ఇక్కడ వ్యవసాయఫలం మేఘుని అధీనంలో ఉందంటున్నాడు.
నిజమే కదా! ఎక్కువశాతం భూములకు వర్షపునీరే గతి.
తమ పంటలు పండించే వాడిని మరి ప్రీతితో చూడరా?
ఇక్కడో ఆలోచన స్ఫురిస్తోంది.

తన కడుపు పండించిన భర్తను కూడా స్త్రీ అలాగే ప్రేమతో చల్లగా చూస్తుంది.

ఇక్కడ "వధువులు" అనే పదం వాడాడు. స్త్రీలు అని అర్థం వచ్చేలా.
పెండ్లికూతుళ్లు అనే అర్థం కూడా ఉందిగా!

అలాగే " ప్రీతిస్నిగ్ధైః లోచనైః" అన్నాడు.
అంటే ఏమాత్రం కృత్రిమం లేని ప్రేమతో తడిసిన కళ్లని అర్థం.
ఎంత అందంగా అన్నాడో చూశారా!


---- భ్రూవిలాసాలు అంటే కనుబొమలను రకరకాలుగా త్రిప్పడం.
మన హీరోయిన్స్ , హీరో కనబడగానే కళ్లతో చేసే వెకిలి వేషాలన్నమాట.
ANR ఆరాధనలో ఆరుద్ర " ఆడదాని ఓరచూపుతో జగాన
ఓడిపోని ధీరుడెవ్వడు? అన్నారు.

ఆ ఓరచూపులే భ్రూవిలాసాలు.
కృత్రిమప్రేమతో తడిలేని చూపులు.
పల్లెవనితల్లో అవి ఉండవంటున్నాడు.
అంటే అవి నాగరకస్త్రీలల్లో ఎక్కువన్నమాట.


---- ఇక మాలం అనే పదం ఉపయోగించాడు.
అంటే కొండభూమి. దున్నిన కొండభూములపై,
వర్షిస్తే సువాసన వస్తుందంటున్నాడు.
వానచినుకులు పడ్డాక తడిసిన మట్టివాసన మీరెరుగుదురుగా!
బాగుంటుంది కదా!
అయితే అది మట్టివాసన కాదుట.
భూమిపై ఉన్న అనేక పదార్థాల, బ్యాక్టీరియా, రసాయనాల
కలగలపు కంపుట. కంపు అంటే మళ్లీ చెడ్డవాసన అనుకొనేరు.
మంచి పదాన్ని కంపు కొట్టించారు.
కంపు అంటే పరిమళం/సువాసన అని అర్థం.

---- నాగళ్లచేత దున్నబడిన భూమిలో పండిన ధాన్యం , i mean బియ్యం,
రోట్లో రుబ్బిన పచ్చడిలా కమ్మగా ఉంటుంది.
ట్రాక్టరు = మిక్సీ

---- అందమైన దృశ్యాలుండే దారిని యక్షుడు
సూచిస్తున్నాడు.


---- మేఘుడు, వెళ్లేదారి.
మొదట ఉత్తరదిక్కుగా ప్రయాణం.

---- ఇపుడు కొంచెం పడమరగా తిరిగి,
మరల ఉత్తరంగా తిరగమంటున్నాడు.


గుర్తుపెట్టుకోండి.
మంగళం మహత్


ప్రజ్ఞ అంటే జరుగబోయే సంగతులను
ముందుగానే ఊహించగలిగే శక్తి.

10, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 16 వ శ్లోకం

క్షమించండి.

ఇక మేఘసందేశం గుఱించి వ్రాయబోవటం లేదు.ఇది బాధ అనుకోండి. వేదన అనుకోండి.

కావ్యాలకు విలువ లేదని,
ఏ స్పందనకూ నోచుకోని
నా మేఘసందేశాన్ని చూసి ,
నాకే జాలేసి, ఇక ఆపుచేసేద్దామని
ఒక నిర్ణయానికి వచ్చాను.


రేపటినుంచి,
నేను కూడా గుంపులో గోవిందా అని
నలుగురితో నారాయణా అని అంటాను.

ఉంటాను.

రావెమ్మెస్సారెల్.

9, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 15 వ శ్లోకం

రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్య మేత త్పురస్తా
ద్వల్మీ కాగ్రా త్ప్రభవతి ధనుఃఖండ మాఖండలస్య
యేన శ్యామం వపు రతితరాం కాంతి మాపత్స్యతే తే
బర్హే ణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః


భావం :


మేఘునితో యక్షుడు, ఇలా అంటున్నాడు.

( పద్మరాగం మొదలైన )
"రత్నాలయొక్క నానావిధాలైన కాంతులు కలసి ఉన్నట్లు,
ఎదుట ఉన్న పుట్టయొక్క కొన ( పైభాగం ) నుండి,
ఇంద్రధనుస్సు పుడుతోంది.
ఆ ఇంద్రచాపంచేత నీ దేహం,
గోపవేషం ధరించి, పింఛంతో ప్రకాశించే,
శ్రీకృష్ణుని శరీరంలా ప్రకాశిస్తుంది."


విశేషాలు :


"ఉత్తరదిక్కుగా ఎగురు" అని,
యక్షుడు, మేఘునితో చెప్తూ,

ఎదురుగా ఉన్న ఒక పుట్టకొన వివరంనుండి ( పుట్ట పైభాగంలో ఉన్న కన్నం నుండి )
ఒక ఇంద్రధనుస్సు పుట్టడం చూశాడు.
వెంటనే అందిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని,
మేఘుని, ఏకంగా శ్రీకృష్ణునితో పోల్చి, పొగుడుతున్నాడు.
తెలివైనవాడు.

పని అప్పజెప్పడానికి ముందు ఒకసారి పొగిడితే చాలదన్నమాట.


యక్షుడు, వర్ణించే సమయానికి
ఇంద్రధనుస్సు ఇంకా పూర్తిగా పుట్టలేదు.
దాన్ని కాళిదాసు " ఆఖండలస్య ధనుఃఖండం " అన్నాడు.
ఆఖండలుని ధనుస్సు యొక్క ముక్క. అని అర్థం.
ఆఖండలుడు అంటే ఇంద్రుడు. శత్రువులను ఖండించువాడు అనే అర్థంలో
ఆయనకు ఆ పేరు వచ్చింది.
అందువల్ల ఇంద్రునికి విశేషణంగా ఆఖండల శబ్దాన్ని వాడి,
ధనుశ్శబ్దంతో కలిపాడు.
ఇలాంటి వాటిని ఇంతకుముందు కూడా పేర్కొన్నాను.
వీటిని సాభిప్రాయవిశేషణాలు అంటారు.


అయినా అది పూర్తి ధనుస్సు కాదు, ఖండమే.
ఇంద్రుని ప్రతాపం సగమే. ఆయనకు పూర్తి బలం ఉపేంద్రుడు. ( శ్రీకృష్ణుడు )
ఇంద్రచాపం కంటే ఉపేంద్రుని పింఛం గొప్పది.
కృష్ణపింఛం అంటే ఒక పాట గుర్తుకొస్తోంది.

ప్రక్కదారి పడుతున్నందుకు, ప్రియమైన
పాఠకులు ఏమనుకోకండి.

1943 లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాలో, బలిజేపల్లి లక్ష్మీకాంతం,

"జేజేలయ్యా జోహారు కృష్ణ జేజేలయ్యా జోహారు,
కొంచెము తలపై పింఛము కదలినా ,
పంచభూతములు ప్రపంచమంతా
సంచలించునని సజ్జను లందురు.
పింఛమునకిదే ఆ పింఛమునకిదే
జే జే జే జే జేజేలయ్యా జోహారు,
కృష్ణ జేజేలయ్యా జోహారు"

అని గాలిపెంచల వారి స్వరసహాయంతో,
టంగుటూరి సూర్యకుమారిగారితో పాడించారు.


అలా సగం పుట్టిన ఆ హరివిల్లు, పింఛంలా ఉంది.
ఈ తమాషా పింఛంతో ( మేఘుని నెత్తిమీద ఉన్నట్లుంది )
నల్లని శరీరం గల మేఘుడు,
అసలు పింఛంతో ప్రకాశించే కృష్ణునిలా ( ఈయనా నలుపే )
( కృష్ణునికి మేఘునికి ఈ రెండే సామ్యాలు )
ఉన్నాడని మేఘుడు ఉబ్బేస్తున్నాడు.


మధ్యలో ఈ పొగడ్త లేంది? అని చిరాకుపడకండి.
మధ్యలో కూడా అలా కీర్తిస్తూండాలి.
ఉల్లాసం ఉత్సాహం కలిగిస్తూండాలి.


కృష్ణుని సూచించడానికి, గోపవేషం ధరించిన విష్ణువు అన్నాడు.
ఇదో చమత్కారం.
విష్ణువు అవతారాలు అన్నీ లీలలు అని సూచించడానికి కావచ్చు.
పరిశీలన జరగాలి.


అలాగే శ్లోకాన్ని పరిశీలిస్తే, కృష్ణుని శరీర వర్ణంలో
అతితరకాంతి అంటే మిక్కిలి కాంతి ఉందట.
దాన్ని మామూలు నలుపనుకోరాదు.


ఇక ఇంద్రధనుస్సు , పద్మరాగాది రత్నకాంతులతో ఉందన్నాడు కదా!

రత్నాలు 9.
మరకతం, పద్మరాగం, ముత్యం,
పగడం, నీలం, పుష్యరాగం,
వజ్రం, గోమేధికం, వైఢూర్యం.
వీటిలోని రంగులతో ఇంద్రధనుస్సును, పింఛాన్ని సరిపోల్చండి.


మంగళం మహత్


మతి అంటే వర్తమానకాలంలో
జరిగే విషయాలను
గ్రహించగల శక్తి.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 14 వ శ్లోకం


అద్రేః శృంగం హరతి పవనః కిం స్విదిత్యున్ముఖీభి
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధ సిద్ధాంగనాభి:
స్థానాదస్మాత్సరసనిచులా దుత్పతోదఙ్ముఖ: ఖం
దిఙ్నాగానాం పథి పరిహర౯ స్థూలహస్తావలేపాన్


భావం :

మేఘుడా!
నీవు ( ప్రయాణానికి ) లేచినపుడు,
ముగ్ధులైన ( తెలియనివారు, అమాయకులైన )
సిద్ధవనితలు ( సిద్ధ జాతికి చెందిన స్త్రీలు ),
గాలి, కొండ శిఖరాన్ని తీసుకొని పోతున్నాడేమో?
(గాలిలో కొండ కొట్టుకొని వస్తోందేమో)
అని భయపడి చూస్తారు.
అపుడు వారి బెదరు చూపులు నీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
తడిసిన అనగా చల్లని ప్రబ్బలి చెట్లుగల ఇక్కడినుండి లేచి,
దిగ్గజాలు, తొండాలు విసురుతూంటే, త్రోస్తూ,
ఉత్తరదిక్కుగా ఎగురు.


విశేషాలు:

సిద్ధులు అనబడే వారు దేవతల్లో ఒక జాతివారు.

విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు,
కింనరులు (కింపురుషులు), పిశాచాలు, గుహ్యకులు, సిద్ధులు, భూతాలు
వీరు దేవజాతివిశేషాలు. వీరి పేరును బట్టే వీరి విశేషం తెలుస్తుంది.

వీరిలో , అణిమాది సిద్ధిగలవారిని సిద్ధులు అంటారు.

అణిమాదులు మొత్తం 8 రకాల ఐశ్వర్యాలు. అవి, వరుసగా,
అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.

వీటిని సాధిస్తే మనం కూడా సిద్ధులమవుతాం.

మేఘం కొండంత ఉందని ఇంకో చమత్కారం.

అయినా బెదరు చూపులు ఉత్సాహాన్ని ఇవ్వడం ఏమిటి?
ఒకరి బెదరు ఒకరికి వేడుకా? అంతే

మఱి, మర్యాదరామన్నలో సునీల్ ఎంతలా "భయపడితే" ఆడియన్స్ అంతలా
"ఎంజాయ్" చేశారు కదా!

నిచులవృక్షాలనే ప్రబ్బలి అని, వేతసాలని, ఎఱ్ఱగన్నేరని, నీటిగన్నేరని అంటారు.
వీటిలో మిగతా చెట్లకంటే నీటి శాతం బాగా ఎక్కువగా ఉంటుంది.


మేఘుడు దిగ్గజంలా ఉన్నాడని, ( కవి చమత్కారం )
దాన్నిచూసి, మరో ఏనుగేమో అని
దిక్కుల్ని మోసే ఏనుగులు తమ తొండాలను విసిరితే,
వాటిని త్రోస్తూ, పొమ్మంటున్నాడు.

మనకు ప్రధాన దిక్కులు 4.విదిక్కులు 4. వీటి వరుసను , వీటిని మోసే ఏనుగుల వరుసను చెప్తే,
వాటిని ఇలా చెప్పాలి.

తూర్పు        ఐరావతం
ఆగ్నేయం    పుండరీకం
దక్షిణం        వామనం
నిరృతి         కుముదం
పడమర      అంజనం
వాయువ్యం పుష్పదంతం
ఉత్తరం        సార్వభౌమం
ఈశాన్యం     సుప్రతీకం


"దిగ్గజాల (తొండాల)నే త్రోసిరాజనేవాడవు నీవు" అని
నర్మగర్భంగా మేఘుని పొగుడుతున్నాడు.


పండితులు ఈ శ్లోకంలో ఇంకో విశేషం ఉందంటారు.
తగ్గించి చెప్తాను.


కాళిదాసుకు ఒక శత్రువు ఉన్నాడు. అతని పేరు దిఙ్నాగుడు.
అతడు కాళిదాసు రచనల్లో దోషాలు ఎత్తి చూపిస్తూండేవాడు ఆ రోజుల్లో.

అయితే కాళిదాసుకు,
నన్నయకు నారాయణభట్టు లాగ, కె.వి.మహదేవన్ కు పుహళేంది లాగ,
ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిగారికి సహ గాయని రాధ గారిలాగ,
ఒక చక్కని పండిత మిత్రుడూ ఉన్నాడు.

అతడి పేరు నిచుళుడు. ఇద్దరూ కలిసి చదువుకొన్నారు.
కాళిదాసు రచనల్లో ఇతరులు ఆరోపించే దోషాలను ఇతడు త్రిప్పికొడుతూండేవాడు.

ఇది దృష్టిలో పెట్టుకొని, కాళిదాసు తనలో తాను అనుకొన్నట్లుగా,
శ్లోకభావాన్ని చూస్తే,

" నిచుళుడు ఉండగా దోషాలను ఆరోపించేవారెవరు? కాబట్టి ధైర్యంగా నామార్గంలో నేను మేఘసందేశాన్ని రచిస్తా.
లావైన చేతులు త్రిప్పుతూ, దిఙ్నాగుడు చేసే దూషణాలను నివారిస్తూ,
కొండలాంటి అతని ప్రాధాన్యాన్ని పోగొట్టడంతో,
సుందరులైన సాహిత్య సిద్ధులును, స్త్రీలును నీ ఉత్సాహం చూసేటట్లుగా
ప్రసిద్ధి పొంది ఉండు."


మంగళం మహత్


స్మృతి అంటే జరిగిన విషయాలను
గుర్తుకుతెచ్చుకొనగలిగే శక్తి.

7, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 13 వ శ్లోకం


మార్గం తావచ్ఛృణు కథయత స్త్వత్ప్రయాణానురూపం
సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం
ఖిన్నఃఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య

భావం :
 మేఘుడా ! ఇప్పుడు, నీ ప్రయాణానికి అనుకూలమైన మార్గాన్ని చెప్తాను.

"
ఆ తరువాత వినడానికి ఇంపైన సందేశాన్ని చెప్తాను.
నేను చెప్పబోయే మార్గంలో, నీకు శ్రమ కలిగినప్పుడు,
పర్వతాలమీద నిలిచి, విశ్రాంతి తీసుకొనివెళ్లవచ్చు.
క్షీణించిపోతే ( చిక్కిపోతే ) నదుల్లో మిక్కిలి తేలికైన నీరు త్రాగి, వెళ్లవచ్చు.
కాబట్టి, ఈ మార్గం నీకు హితంగా ఉంటుంది

విశేషాలు:
ప్రయాణం చేయదలచుకొన్నవారు,
మొదట ఒక ప్రణాళిక ( plan ) వేసుకోవాలి.
ఒక గమ్యానికి ఉన్న అనేకానేక మార్గాల్లో
అనుకూలమైన దాన్ని ఎంచుకోవాలి.లేడికి లేచిందే పరుగన్నట్టు,
గుడ్డెద్దుచేలో పడ్డట్టు పడి పోకూడదు.
 అపుడే క్షేమంగా ప్రయాణం జరుగుతుంది.
ఇప్పటి సౌకర్యాలు లేని పుర్వకాలం ప్రయాణాల్లో,
తాగునీరు లభ్యమయ్యే దారిని,
అలాగే ఆశ్రయమిచ్చేవారు,/సత్రాలున్న దారిని
ఎంచుకొనేవారని అర్థమవుతుంది.

చిక్కిపోతే, తేలికైన నీరు తాగమంటున్నాడు.
తేలికైన అనే అర్థంలో "పరిలఘు" అనే పదాన్ని కవి ప్రయోగించాడు.
నీరు తేలిక ఎప్పుడవుతుంది? ఆవిరైనపుడే కదా ?
ఆ ఆవిరే కదా మేఘం.సూక్ష్మవిషయాలను కూడా పరిగణన లోకి తీసుకొని , కాళిదాసు వ్రాస్తున్నాడు.నీరు తగ్గిపోతే మేఘం చిక్కిపోతుంది.
మరల ఆవిరితో రూపు కడుతుంది.


ఇక యక్షుడు, తన సందేశం వింటే,
అమృతం త్రాగినట్లు ఆనందం కలుగుతుందంటున్నాడు.
ఎందుకంటే అంతదూరం కష్టపడి వెళ్ళాక,
"ఆమెకు అందించడానికి తగిన విధంగా సందేశం ఉంటుందా ?"
అని మేఘుడు సందేహ పడకుండా.

ఇప్పటికే పాఠకుల్లో కొంతమందికి,
యక్షుడు ఇంత హడావిడి చేస్తున్నాడు.
అంతా అయ్యాక "నేను కులాసా ,
ఆవిడ కులాసా కనుక్కో" అంటాడేమో అనిపించిఉంటుంది.
అఫ్ కోర్స్ అదీ సందేశమే, కానీ చప్పగా ఉంటుంది కదా!
ఆ భయం అక్కరలేదు.

రెండవ సర్గలో 40 వ శ్లోకం నుంచి 52 వ శ్లొకం వరకు 13 శ్లోకాల్లో
యక్షుని సందేశాన్ని కాళిదాసు పొందుపరిచాడు.
అది బాగుందో బాగులేదో మీరే చెప్దురుగాని.
మఱి, మీరు మరికొంత కాలం ఆగాలి.

మంగళం మహత్

స్మృతి, మతి ప్రజ్ఞ అనే మూడుశక్తుల కలయికే బుద్ధి.
రచనకు ఇవి గొప్పగా ఉపకరిస్తాయి.


6, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 12 వ శ్లోకం

ఆపృచ్ఛస్వ ప్రియసఖ మముం తుంగ మాలింగ్య శైలం
వంద్యైః పుంసాం రఘుపతిపదైః రంకితం మేఖలాసు
కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య
స్నేహ వ్యక్తి శ్చిర విరహజం ముంచతో బాష్ప ముష్ణం.

భావం :

ఓ మేఘుడా!
ఈ చిత్రకూట పర్వతం,
నీకు ప్రియ సఖుడు,
ఉన్నతుడు,
( అందరిచేత నమస్కరింపదగిన ) శ్రీరాముని పాదస్పర్శచేత, పవిత్రుడు,
నీవు వచ్చినపుడు ఆనందించేవాడు,
కాబట్టి ఇతని ఆలింగనం చేసుకొని,
పోయి వస్తానని వీడుకొను.

విశేషాలు :

యక్షునికి, మేఘునికి ఇరువురికి ప్రస్తుతం ఆశ్రయమిస్తున్నవాడు చిత్రకూటం.
కాబట్టి, తనకూ ప్రియసఖుడే.
మేఘునికీ ప్రియసఖుడే. ( పర్వతాలను తాకుతూ తిరుగుతాయి కదా! మేఘాలు. అలా మిత్రత్వం.)
అలాగే రామునికీ ఆశ్రయం ఇచ్చినవాడు కాన, రామునికీ ప్రియసఖుడే.

ఇక ఉన్నతుడు.
అంటే ఆకారం చేత ఎత్తైనవాడు అని,
తన గుణాలచేత గొప్పవాడైనవాడు అని చెప్పుకోవచ్చు.
అన్నింటికంటే రాముని పాదాలను శిరస్సున ధరించి ,
ఇంకా ఉన్నతుడయ్యాడు.

రామపాదస్పర్శచేత పవిత్రుడు అయ్యాడు.
మిత్రత్వం , మహత్త్వం , పవిత్రత్వం ఉన్నవారు సంభావనార్హులు. గౌరవించదగినవాళ్లు.

" ఈ చిత్రకూటం, ప్రతి వర్షాకాలంలోను నీతో కలిసి ఉంటాడు.
వర్షాకాలం పూర్తి అయ్యాక , చాలకాలం నిన్ను, ఎడబాసి ఉంటాడు.
అందువలన పుట్టిన వేడైన కన్నీటిని ( ఆవిరిని )
(ఇపుడు మరల నీ స్నేహం లభించడంతో ) విడిచిపెడుతూ , ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు.
" ( ఇదంతా భావంలో వ్రాయక " నీవు వచ్చినపుడు, ఆనందించేవాడు." అని పేర్కొనడం జరిగింది.)

అటువంటి చిత్రకూటాన్ని కౌగలించుకొని వీడ్కొల్పు, అంటున్నాడు.

ప్రయాణసమయాల్లోని మర్యాదలను తెలియజేస్తున్నాడు.

ఇంతకుముందు శకునాలు, ఇపుడు వీడ్కొల్పులు.

మంగళం మహత్

ప్రతిభ , వ్యుత్పత్తి , అభ్యాసం - వీటి గొప్పతనాన్ని బట్టి రచన గొప్పతనం ఆధారపడిఉంటుంది.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 11 వ శ్లోకం

కర్తుం యచ్చ ప్రభవతి మహీముచ్ఛిలీన్ధ్రా మవంధ్యాం 
తచ్ఛృత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః 
ఆకైలాసా ద్బిసకిసలయచ్ఛేదపాథేయవంతః 
 సంపత్స్యంతే నభసి భవతో రాజహంసాః సహాయాః


అవతారిక : నీకు, దారిలో సహాయం చేసేవారున్నారంటున్నాడు.

భావం :

మేఘుడా! నీ ఉఱుము, శిలీంధ్రాలను పుట్టిస్తుంది. 
అలా భూమిని ఫలవంతంగా చేస్తుంది. 
అపుడు భూమి అవంధ్య అవుతుంది. ( అవంధ్య = సంతానం కలది )  
ఇంకా వినడానికి కూడా నీ ఉఱుము సొంపుగా ఉంటుంది. 
అటువంటి నీ ఉఱుమును విని,  
మానస సరోవరానికి ఎప్పుడెప్పుడు పోదామా? 
అని ఆత్రపడే రాజహంసలు, 
లేత తామరతూండ్లముక్కల్ని, దారిబత్తెంగా చేసుకొని, 
కైలాసపర్వతం దాకా ఆకాశంలో, 
నీకు, (సహాయంగా) కూడా రాగలవు.

విశేషాలు :ఉఱుముకి శిలీంధ్రాలకు సంబంధం ఉందా? 
సైన్స్ పండితులు తేల్చాలి. 
కేవలం ,పదాలను అనుసరిస్తే 
ఉఱుముకి, శిలీంధ్రాలను పుట్టించే శక్తి ఉంది.  
ఉఱిమిన మేఘం ఆ వెనుక వర్షిస్తుంది 
కాబట్టి శిలీంధ్రాలు పుడతాయి. 
ఆ విధంగా ఉఱుము పంటలకు కారణమౌతుంది.

ఉఱుము వినడానికి సొంపుగా ఉంటుందంటారా?
వర్షాలకోసం ఎదురు చూచేవారికి వినసొంపే మఱి.

ఇక రాజహంసలు : పక్షుల్లోనే శ్రేష్ఠమైనవి. అందమైనవి.
వాటి ముక్కు, కాళ్లు ఎఱ్ఱగా ఉంటాయి. శరీరం అంతా తెలుపు.

లేత తామరతూండ్లు వాటికి ఆహారం . అటువంటివి కూడా వస్తాయి.

వాటితో కలసి ప్రయాణం.

మేఘునకు ఉత్సాహం కల్గిస్తున్నాడు.

ఒక్కరూ ప్రయాణించేకంటే , నలుగురు కలసి ప్రయాణిస్తే, అలసట తెలియదు కదా!ఇక్కడ రాజహంసల గుఱించి వివరణ

రాజహంసలకు, మంచు ( యొక్క దుష్టత్వం ) రోగాలను కలుగజేస్తుంది. ఆ కారణంగా అవి, ఇతరప్రాంతాలకు

పోయి, మరల వర్షాలు పడే సమయానికి మానససరోవరానికి ప్రయాణం కడతాయి.

ఆ ప్రయాణం ఎపుడెపుడా అని ఎదురు చూస్తాయి.

మఱి, వాటికి మేఘగర్జన వినసొంపే కదా!దారిబత్తెం అంటే దారిలో (తినడానికి తెచ్చుకొన్న) భోజనం.

ముందుజాగ్రత్త కల ప్రయాణికులు, దొరుకుతుందో దొరకదో అనే సందేహంతో ఆహారాన్ని కూడా తెచ్చుకొంటారు.

అలా హంసలకు తామరతూండ్లు - దారిబత్తెం.రామగిరి నుండి కైలాస మానససరోవరం వఱకు ప్రయాణం అని ప్రస్తుతానికి తెలిసింది.

మంగళం మహత్

సాహిత్యం బాగా చదివిన వాళ్లు కవిత్వాన్ని బాగ వ్రాస్తారు.

4, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 10 వ శ్లోకం

తాం చావశ్యం దివసగణనాతత్పరా మేకపత్నీ
మవ్యాపన్నా మవిహతగతి ర్ద్రక్ష్యసి భ్రాతృజాయాం
ఆశాబంధః కుసుమసదృశం ప్రాయశో హ్యంగనానాం
సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి.

భావం : ప్రేమ కలిగిన స్త్రీల బ్రతుకు, పుష్పంతో సమానమైనది.
భర్తలతో వియోగం ఏర్పడినపుడు,
వారి బతుకుపుష్పం రాలిపోతుంది.
అయితే తొడిమ, పువ్వును రాలిపోకుండా పట్టి, ఉంచుతూంటుంది.
ఆ తొడిమే ( భర్త తప్పక తిరిగి వస్తాడు అనే ) ఆశ.
అలాగే - పతివ్రత, నీకు వదినె అయిన, నా భార్య కూడా
నేను రావడానికింకా ఎన్ని రోజులున్నాయో అని లెక్కిస్తూ,
ప్రాణం ధరించి ఉంటుంది.
అటువంటి ఆమెను నీవు తప్పక చూడగలవు.


విశేషాలు : - (99%) ఎక్కువ శాతం మగవాళ్ళకు తమ భార్యలమీద నమ్మకం ఉండదు.
పతివ్రతలు ఎవరు అని చెప్పమంటే
అరుంధతి, అనసూయ అంటారే గాని
"నా భార్య " అని మొదటగా చెప్పగలడా? ఏ మగాడైనా!
అదే మగవారి స్వభావం.
మరి ఎంత నమ్మకం!
యక్షునికి తన భార్య మీద.


- పతివ్రతల దర్శనం పరమ పవిత్రమైనది.
పుణ్యప్రదమైనది.

- ఇక్కడ మేఘునితో యక్షుడు, బంధుత్వం కలిపాడు.
"నేను నీ సోదరుడిని" అంటున్నాడు.
కాబట్టి యక్షునిభార్య , మేఘునికి వదినె అయింది.
వరుస కలుపడం ఎందుకంటే ,
పరాయి స్తీని చూడవచ్చా? అన్న సందేహాన్ని మేఘునకే కాదు.
మనకూ తీరుస్తున్నాడు.
వదినె, తల్లితో సమానం.
( గురువుగారి భార్య, భార్య యొక్క తల్లి, అన్నగారి భార్య, రక్షించిన వాని భార్య, పితృపత్ని అనగా కన్నతల్లి
- వీరు పంచమాతలు.)

తల్లి అని భావన చేస్తూ, వీరిని చూసినా , వీరితో మాట్లాడినా దోషం లేదు.
కాబట్టి శంక లేక చూడవచ్చు.


- భర్త అనే చెట్టుకు, భార్య, పూచిన పువ్వు.
చెట్టుకు పువ్వుకు మధ్య తొడిమ ( బంధం ) - ఆశ ( ప్రేమ ).


- మొదట మిత్రత్వం, తరువాత బంధుత్వం
క్రమంగా సూచింపబడింది.


మంగళం మహత్

పాలసముద్రాన్ని మథిస్తేనే కదా! అమృతం పుట్టింది.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 9 వ శ్లోకం

మందం మందం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగంధః
గర్భాధానక్షణపరిచయా న్నూనమాబద్ధమాలాః
సేవిష్యంతే నయనసుభగం ఖే భవంతం బలాకాః

ముందుమాట : శుభశకునాలు కనబడుతున్నాయి.
పని, పూర్తి అవుతుందంటున్నాడు.

భావం : మేఘుడా! నీకు అనుకూలంగా గాలి వీస్తోంది.
అంటే ముందుకు వెళ్ళేలా త్రోస్తోంది.
చాతకపక్షి, మధురంగా కూస్తోంది. ( ఈ రెండు శుభశకునాలు అయ్యాయి.
ఇంకో సుశకునం అవుతుందంటున్నాడు.)
ఆడుకొంగలు, కన్నులకు ఇంపైన నిన్ను, తప్పక సేవిస్తాయి.

విశేషాలు : - ప్రయాణసమయం కాబట్టి, శకునాల గుఱించి, ప్రస్తావిస్తున్నాడు.
శకునశాస్త్రం ప్రకారం
అనుకూలమైన గాలి, చాతకపక్షి కూత, కొంగలు కనబడ్డం, శుభశకునాలు.
( శకునాల గుఱించి తరువాత చర్చిద్దాం )

- శ్లోకం చూడండి.
నుదతి = త్రోస్తోంది
పవనః = గాలి
మందం = మెల్లగా
నదతి = పలుకుతోంది
చాతకః = చాతకపక్షి
మధురం = మధురంగా
" అక్షరరమ్యత " అనవచ్చు.
ఇది సంస్కృతంలో మాత్రమే ఉన్న సౌలభ్యం.

- గాలినిబట్టే కదా! మేఘం నడక.

- చాతకపక్షిని వానకోయిల అంటారు.
ఈ పక్షి, వాన పడుతున్నప్పుడు మాత్రమే నోరు తెరచి, ఆ వాన నీటిని త్రాగుతుంది.
ఈ విధంగా మేఘానికి చాతకానికి సంబంధం ఉంది.
అందువల్ల " సగంధః " ( సంబంధం ) పదం వాడాడు.

- ఇక కొంగలకు మేఘం కన్నులకు ఇంపు (అందం) అన్నాడు
కాని , నల్లని మేఘాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, తెల్లనికొంగలబారు మన కన్నులకు ఇంపు కదా!
" నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు "
అని దేవులపల్లి వారు "మల్లీశ్వరి "చేత అనిపించింది, మేఘసందేశ ప్రభావంతోనే.
గగనసీమల తేలు ఓ మేఘమాలా! అని పంపించుకొన్న
మల్లీశ్వరి నాగరాజుల పరస్పరసందేశాలకు ఆధారం మేఘ(సందేశ ప్రభావ) మే .


మంగళం మహత్


పిండి కొద్దీ రొట్టె - యోచన కొద్దీ భావం.

2, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 8 వ శ్లోకం

త్వామారూఢం పవనపదవీముద్గృహీతాలకాంతాః

ప్రేక్షిష్యంతే పథికవనితాః ప్రత్యయాదాశ్వసన్త్యః

కః సన్నద్ధే విరహవిధురాం త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యో౭ప్యహమివ జనో యః పరాధీనవృత్తిఃతొలిపలుకు : "నా పని గుఱించి వెళ్తున్నపుడు నీకొక లాభం కలుగుతుం"దంటున్నాడు.


భావం : నీవు నాపని మీద ఆకాశంలో పోతూండగా,
బాటసారుల స్త్రీలు
( అనగా తమ పురుషులు దూరదేశాలకు పోయినందువల్ల ఇంట ఉండి, విరహాన్ని అనుభవిస్తున్నవారు ),
(నిన్ను చూడగానే తమ ప్రియులు వస్తారు అనే )
నమ్మకం వల్ల ఊఱడిల్లుతున్నవారై,
ముంగురుల కొనలు ఎత్తి పట్టుకొని, (నిన్ను) చూడగలరు.
నీవు వ్యాపిస్తూండగా,
విరహంతో బాధపడుతున్న ప్రియురాలిని ఎవడు ఉపేక్షిస్తాడు?
ఎవడు కూడా నాలా పరాధీనవృత్తి గలవాడు ( స్వాతంత్ర్యం లేనివాడు ) ఉండడు.

విశేషాలు. - ఇక్కడ మేఘునికి ఏమి లాభమయ్యా అంటే,
విరహంలో ఉన్న స్త్రీలకు తన దర్శనంతోనే విరహతాపం కొంత తగ్గుతుంది.
మఱి ఆ పుణ్యం తనదే కదా!
- మేఘునికి ఒక తాయిలం. పుణ్యం దక్కడం అన్నది.

- " పవనపదవీం ఆరూఢం త్వాం " = ఆకాశాన్ని ఎక్కిన నిన్ను ( శ్లోకం చూడండి )
యక్షుడు, మేఘుని, పదవికి ఎక్కిస్తున్నట్టు,
అదికూడా రాయబారపదవి (అనవచ్చా?) అని తోస్తోంది కదా!

- విరహంలో ఉన్న స్త్రీలే అని ఎందుకనాలి?
పురుషులు అనలేదేమి? మేఘుడు పురుషుడేగా!
ఆడవారు నిన్ను ముంగురులు ( ముంగురులు అంటే ముందుకురులు / నుదిటిమీద పడే వెంట్రుకలు. వాటిని) వెనక్కి తోసుకొంటూ చూస్తారంటే
( ఎంత అందం ? మీకు రాజ్ కపూర్, డింపుల్ ల బాబీ గుర్తుకొచ్చిందా! డింపుల్ పరిచయదృశ్యం.
తలుపు తీసి, రిషిని అలాగే చూస్తుంది.) ఆనందించడా?

- బాటసారుల స్త్రీలు అని అర్థం వచ్చేలా " పథికవనితలు" అన్నాడు కాళిదాసు.
చక్కగా వాడాడు.
తమ ఆడవారిని విడిచివెళ్ళిన వారనే కాదు.
తమవారి వద్దకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో ( బాటనడిమిని ) ఉన్నవారు కూడా బాటసారులే కదా!

- పరాధీనవృత్తి ఎంత అసహ్యమో, (అసహ్యం అంటే సహించలేనిది)
స్వాధీనవృత్తి ఎంత హాయో, తెలియజేస్తున్నాడు.

- తన పొందు కోసం అపేక్ష పడుతున్న భార్యను,
వివేకవంతుడు, ఉపేక్షింపడు.
ఉపేక్షిస్తే, అది అధర్మం.
( అనర్థాలు జరిగే అవకాశాలనూ కాదనలేం. )

మంగళం మహత్

విశ్వానికి శ్రేయస్సును కలిగించేదే కావ్యం.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 7 వ శ్లోకం

మేఘసందేశం 7 వ శ్లోకం

సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయా
స్సందేశం మే హర ధనపతి క్రోధవిశ్లేషితస్య
గంతవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం  
బాహ్యోద్యానస్థితహరశిరశ్చంద్రికాధౌతహర్మ్యా

భావం :

మేఘుడా!
( ఎండ/విరహంచేత ) తపించినవారికి, ( తాపం పొందిన వారికి ) శరణం అవుతున్నావు.
ఆ కారణంవల్ల,
ధనపతి ( కుబేరుని ) కోపంచేత ఎడమైన నా సందేశాన్ని, ప్రియురాలికి అందించు.
( పట్టణానికి ) వెలుపల ఉన్న తోటలో ఉన్న శివుని శిరస్సునందలి వెన్నెలచేత, శుభ్రములైన మేడలుగల, యక్షేశ్వరులకు స్థానమైన,
అలకా అని పేరు గల పట్టణం నీకు పోతగినది.

వ్యాఖ్యావిశేషాలు :

- ఎండబాధకు నీరు, విరహబాధకు చల్లదనం, ఇస్తున్నాడు. దగ్గరకు చేరుస్తున్నాడు.
( పయోద అంటే నీటిని ఇచ్చునది = మేఘం )

- ఇక్కడ కుబేరుని కోపమే యక్షుని తపింపచేసిన ఎండగాను,
విరహబాధను కలుగచేసిన కారణంగాను భావించవచ్చు.

- "శరణం" తిరుగులేని అస్త్రం.
సంతప్తులకు నీవు శరణం అన్నా,
తాను సంతప్తుడే కనుక ఆ శరణం తనకే ఇమ్మని.

- 1 నుండి ఈ 7 శ్లోకాలలో ఇంతవరకు కుబేరుని, 3 సార్లు కాళిదాసు,
అర్థవంతమైన విశేషణాలతో సంబోధించాడు.
మొదటి శ్లోకంలో "భర్త" అని సంబోధించాడు. అనగా యజమాని.
యజమానికి కోపంవస్తే, శిక్ష విధిస్తాడు. అంతవరకే.
మొదటి శ్లోకంలో కూడా భర్తృశాపం అన్నాడు.
3 వ శ్లోకంలో కుబేరుని "రాజరాజు" అని అంటాడు.
రాజుకు కోపంవస్తే, దేశబహిష్కారశిక్ష కూడా విధించే అధికారం గలవాడు.
కాన ఇప్పుడు యక్షుడు "దూరసంస్థే" అని ( ప్రియురాలు దూరప్రదేశంలో ఉంది) మేఘునితో చెప్పాడు.
ఈ 7 వ శ్లోకంలో "అలకాపురి" వెళ్ళాలని చెప్తున్నాడు.
మఱి ఆ పురి కుబేరునిది
కాన ఆయనను " ధనపతి " అని సంబోధించాడు.
దేవతలలో ధనానికి అధిష్ఠానదేవత కుబేరుడు.
కాబట్టి ఆ పట్టణం గొప్పతనం "ధనపతి" పదంతో చెప్పకనే చెప్పాడు.

- కుబేరుడు శివభక్తుడు. ఆ విషయం ఇక్కడ తెలుస్తుంది.

- అలకాపురి ఉద్యానంలో శివుడున్నాడని,
ఆయన ధరించిన చంద్రుని వెన్నెలతో అక్కడి మేడలు, కడుగబడినవి ( ధౌత ) అని వర్ణించడం ద్వారా,
అసలైన కవిత్వంలోకి, వర్ణనలలోకి తాను ప్రవేశిస్తున్నానని ,
ఇకనుంచి చెప్పబోయే శ్లోకాలు ,
వెన్నెలచేత కడుగబడిన అలకాపురి మేడల్లాంటివని కాళిదాసు సూచిస్తున్నాడు.

భావనాశక్తిని బట్టి భావం అర్థమవుతుందని ఆర్యులంటారు.

మంగళం మహత్

31, మార్చి 2011, గురువారం

సద్గుణాభిరాముడు - రాముడు

ప్రశ్న :


శ్రీరాముని మంథర, కైక,వాలి,మొదలైనవారు నిందించినట్లు ,
రాముడు, శంబూకుని వధించడం అన్యాయమని,
ఇలా ఆధునికులు, రాముని రకరకాలుగా నిందిస్తున్నారు. భావ్యమా?


దీనికి "శ్వేతద్వీపం" అనే ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి పత్రిక ఇచ్చిన


సమాధానం :


నారదునిచేత, వాల్మీకిచేత, ప్రజలచేత, తల్లులచేత, తమ్ములచేత,
గుహుడు,శబరి మొదలైన గిరిజనులచేత,
 హనుమదాదివానరులచేత,
ఋషులచేత,
విభీషణాది రాక్షసులచేత,
ఇందరిచేత పొగడబడిన సద్గుణాభిరాముడు రాముడు.
( పైన పేర్కొన్నవారు ఎవరికివారే విభిన్నులు. రకరకాల సామాజికవర్గాలు.
ఒకరిచేత (నిజంగా) స్తుతింపబడటమే కష్టం.
మరి ఇన్ని విభిన్నవర్గాలవారి చేత స్తుతింపబడటం, ఎంత అసాధారణం? ఈ ఒక్కటి చాలు)

ఇతరులు పొగిడినా - లేని సద్గుణాలు రావు. నిందించినా - ఉన్నసద్గుణాలు పోవు.

పురుషోత్తమునకు రామునకు ఈ నిందాస్తుతులు సమానం.

ఎవరో నిందిస్తే, రాముని శీలం కళంకితమైందనుకోవడం భావనపుంసకత్వానికి నిదర్శనం.
ఇలాంటి రచనలు చేసేవారు తన అంతరాత్మమీద నమ్మకం లేనివాడు.
తన ప్రవర్తనమీద (తన) కన్న, తనగుఱించి ఇతరులు పలికిన మాటలపై నమ్మకం గలవాడు,
ఆత్మవంచకుడు అవుతాడు.

స్వాతంత్ర్యానంతరమే భారతీయులకు మానసికస్వాతంత్ర్యం సన్నగిల్లింది.
బానిసబుద్ధిపెరిగింది.

భారతీయసంస్కృతికి మూలపురుషులైన మహాపురుషులలో లోపాలను ఎత్తి చూపడం సరదా అయింది. గొప్పతనంగా లెక్కించబడుతోంది.

రామాయణాన్ని విమర్శించడానికి రామాయణాన్ని చదవకపోవడమే మొదటి అర్హతగాగల ఇటువంటివారికి
కొందరు పాశ్చాత్యులు, పాశ్చాత్య మానసపుత్రులు, దేశవిచ్ఛిన్నకారుల మాటలు ప్రమాణాలు.

చిత్రమేమంటే వేలాది పాశ్చాత్యులు,
ఇపుడు రామాయణాదులను చదివి, విని, స్ఫూర్తిపొంది, ఆనందిస్తున్నారు.
తమ తమ భాషలలో రచనలుగా ప్రచురిస్తున్నారు.
నాటకాలుగా ప్రదర్శిస్తున్నారు.
కొందరు గీతాలుగా ఆలపిస్తున్నారు.

భవిష్యత్తులో ఇటువంటి పాశ్చాత్యులు భారతీయులకు గురువులు కావచ్చుకూడా.

పండితులు విషయాలను ముందు తాము సరిగా అవగాహన చేసుకోకుండా చెప్పడం కూడా ఒక కారణం కావచ్చు.

మంథర ఒకే తప్పుమాట అన్నది రాముని గుఱించి,
- "రాముడు రాజైతే నీ కుమారుని తక్కువగా చూస్తాడు."
అది కూడా భరతుని రాజును చేయాలనే దురాశతో.
ఆమె అభిప్రాయం తప్పని తేలింది తరువాత.
రాముడు భరతుని యువరాజు చేశాడు.
ఇది ఎవరూ పట్టించుకోరు.

కైక కూడా రాముని సద్గుణాలు కీర్తించింది. చెడుగా అనలేదెక్కడా.

సినిమాల్లో మాత్రమే పరశురాముడు రాముని "గర్వి" అంటాడు. రామాయణంలో కాదు.
"శివునివిల్లు ఎక్కుపెట్టావు కదా! ఈ విష్ణువువిల్లు కూడా ఎక్కుపెట్టు " అన్నాడు. అంతే.

వాలి కూడా నిందించలేదు.
తనను చంపడానికి కారణం అడిగాడు.
సమాధానం విన్నాక తన కుమారుని అంగదుని రాముని రక్షణకు అప్పజెప్పాడు.
తనను చంపినవారికి తన కుమారుని ఎవరైనా అప్పజెప్తారా?

చివరకు రావణుడు కూడా
" భార్యకు ఐహికసుఖాలు అందించలేని అసమర్థుడు"
అన్న ఒక్కమాట కూడా సీతకు రాజభోగాలను ఎరగా చూపడం కోసమే.
దీనిని సీత తిప్పికొట్టింది.

ఇక రామాయణంలో శంబూకుడే లేడు. ఎవరో కల్పించారు.
వాల్మీకి పేరున ఉత్తరరామాయణంలో.

బాల్యచేష్టకైనా కుశలవులు రాముని నిందింపలేదు.
సినిమాలో చూపినది అధర్మం, అనుచితం.

రావణుడు యుద్ధంలో రాముని మొదటిసారి దర్శించి,
ఆ జానకిరాముని పరాక్రమానికి, దివ్య సౌందర్యానికి నిశ్చేష్టుడయ్యాడు.

సద్గుణాలే సౌందర్యంగా వ్యక్తమవుతాయి.
రాముడు సద్గుణ సౌందర్యవంతుడు.

కాని మురారి అనే సంస్కృతకవీంద్రుడు చెప్పినట్లు
రామునిలో ఒకే దుర్గుణం ఉంది.

అది ఏమిటంటే, ఎందరు ఎంతగా ఎన్నిసార్లు వర్ణించినా తనివి తీరకపోవడం.

మంగళం మహత్

మేఘసందేశం 6 వ శ్లోకం

మేఘసందేశం 6 వ శ్లోకం


జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్థిత్వం త్వయి విధివశాద్దూరబంధుర్గతో౭హం
యాంచా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా   6

భావం :

నిన్ను, భువనాల్లో ప్రసిద్ధమైన పుష్కలావర్తకాలనే మేఘాలయొక్క వంశంలో పుట్టినవానిగాను,
ఇచ్చ వచ్చిన రూపం (ధరింప) గలవానిగాను,
ఇంద్రునకు ప్రధానపురుషునిగాను, ఎఱుగుదును.
విధివశంవల్ల దూరప్రదేశంలో బంధువులు గల నేను,
ఆ కారణంచేత, నిన్ను, యాచిస్తున్నాను.
గుణాలు అధికంగా గలవానిని యాచించిన యాచన,
వ్యర్థమైనా, ఇంచుక ప్రియమైనది.
అధములను ఆశ్రయించి, పొందిన కోరిక,
ఫలించినదైనా (అనగా అధముల ద్వారా ఫలితాన్ని పొందినా)
ప్రియమైనది కాదు. ఉత్తమమైంది కాదు.

విశేషాలు :

- మేఘుని వంశాన్ని , సామర్థ్యాన్ని , పలుకుబడిని పొగుడుతున్నాడు.
సహజమే కదా!
ఈ మూడింటిని ప్రశంసిస్తే, పడనివాడెవ్వడు?
ప్రసన్నుడు కానివాడెవ్వడు ?
అప్పుడేకాదు.
ఇప్పుడుకూడా ఈ "మూడింటి "ద్వారానే కదా! చక్రం తిప్పుతున్నారు.
పని చేసిపెట్టేవారిని ఈ విషయాల్లో పొగిడితే పనైపోతుందనే లోకరీతిని, కాళిదాసు వర్ణిస్తున్నాడు.

- "కొంచెం చేసిపెట్టు" "ఈ పని చేయాలి " ఇలా అడిగే కంటే "యాచిస్తున్నాను" అంటే,
అవతలివాడు, తాను ఉన్నతుడైనట్లు భావిస్తాడు.
అసలు యాచన నీచం అంటారా!
నిజమే, ధనం లేనివాడు కాదట దరిద్రుడు.
యాచించినవాడే అసలైన దరిద్రుడు.
సరే మఱి " కొంచెం చేసిపెట్టు" అనడం యాచనేగా !
తేడా ఏముంది ?
ఎలాగా అడుక్కోవాల్సి వచ్చినప్పుడు,
యాచిస్తున్నాను అంటే పోయేదేముంది?

- కామరూపంవల్ల మేఘుడు మానవరూపం కూడా ధరించగలడని విశదమవుతున్నది.
5 వ శ్లోకంలో ఇంకా సందేహం ఉన్నవారికి, ఇపుడు నిస్సందేహమవుతుంది.

- అలాగే, వంశం భువనప్రసిద్ధం ఎప్పుడవుతుంది?
ఆ వంశసంజాతులందఱూ, సజ్జనులైనప్పుడు, పరోపకారులైనప్పుడు. రఘువంశం లాగ.

- "నాకు సహాయం చేస్తే, నీ వంశం భువనప్రసిద్ధమవుతుంది" అని కూడా యక్షుడు,
నర్మగర్భంగా సూచించినట్లు భావించవచ్చు.

సాహిత్యం ఆలోచనామృతం.

మంగళం మహత్

30, మార్చి 2011, బుధవారం

మేఘసందేశం 5 వ శ్లోకం

ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః 
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః 
ఇత్యౌత్సుక్యాదపరిగణయ౯ గుహ్యకస్తం యయాచే 
కామార్తా హి ప్రకృతికృపణా శ్చేతనాచేతనేషు

భావం : ధూమం, జ్యోతి, సలిలం మరుత్తుల కలయిక అయిన మేఘం ఎక్కడ? 
సమర్థాలైన ఇంద్రియాలు గల ప్రాణులచేత పంపదగిన వార్తావిషయాలు ఎక్కడ? 
ఉత్సుకతచేత ( ప్రియురాలిని ఎప్పుడు కలిసికొందునా అని తహతహచేత ) ఇది పరిగణించక, 
యక్షుడు, ఆ మేఘాన్ని ( తన క్షేమవార్తను ప్రియురాలికి చెప్పమని ) యాచించాడు. 
( అవును ) అంతే కదా! కామార్తులు, చేతనాచేతన విషయాల్లో స్వభావంచేత దీనులు. 
అనగా తెలివిమాలినవారు. 
యుక్తాయుక్త విచారం లేనివారని అర్థం.

విశేషాలు : ~ 4 వ శ్లోకం చదువుతూనే, ఆవేశపరులైన పాఠకులు కొందఱు, 
మేఘం చేత సందేశం పంపడమేమిటి? నాన్సెన్స్. అనేస్తారని 
కవికులగురువు కాళిదాసు, తానే ప్రశ్న వేసుకొని, వెంటనే సమాధానం చెప్పేశాడు.

నిజమైన గురువులు శిష్యుల ప్రశ్నలను తామే వేసుకొని, 
జవాబులతో పాఠ్యబోధనకు సిద్ధమవుతారు. 
ఇక శిష్యుల సందేహాలకు తావెక్కడ? 
అటువంటి గురువులుంటే శిష్యులు సిద్ధులవుతారు. 
తమ గురువులను ప్రసిద్ధులను చేస్తారు.

~ ధూమం = పొగ జ్యోతి = వెలుగు, అగ్ని సలిలం = నీరు మరుత్తు = గాలి వీటి కలయికట మేఘం. 
సైన్స్ ఇంత అందంగా చెప్పలేదోమో గదా!

~ ఇక్కడ వార్తాహరుల లక్షణాలను కాళిదాసు చెప్తున్నాడు. 
" పుల్లయ్య -వేమవరం " లాగ కాకుండా, 
వారు పటుకరణులై ఉండాలిట. 
అంటే తగిన సమర్థులై ఉండాలి. 
ఒకరు పంపిన వార్తను దూరంగా ఉన్నవారికి చేరవేసేటప్పుడు, 
అవతలివారి అనుబంధ సందేహాలను కూడా తీర్చగలిగిన నేర్పరులై ఉండటమే కాదు. 
ప్రయాణశ్రమను కూడా తట్టుకోగలిగి ఉండాలి. 
అది పటుకరణులు అంటే. 
ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు ఆనాడు లేవుగా! 
ప్రతి చిన్న విషయానికి వెనక్కి తిరిగి రాలేరుగా!

~ " యాచన " అనే పదం యక్షుని దీనస్థితిని తెలియజేస్తుంది. 
కామవిషయంలో దిగజారాడు కాబట్టి యాచించాడు. 
సహాయం చేసిపెట్టమని. 
నిజానికి ఈ యాచన భగవంతుని అనుగ్రహం పట్ల ఉండాలి.

~ కామార్తులకు చేతనాచేతనాల్లో జడత్వాన్ని ఇచ్చి, ప్రకృతి కృపణ చూపిస్తుంది. 
భగవదార్తులకు చేతనాచేతనాల్లో చైతన్యాన్ని ( భగవద్దర్శనం ) ఇచ్చి, ప్రకృతి కృప చూపిస్తుంది. 
( ఇది ఆయా పదాల ఆధారంగా నాకు తోచిన ఆలోచన. 
పొరపాట్లను పండితులు పరిగణించవలదని, 
మన్నించమని ప్రార్థన.)


27, మార్చి 2011, ఆదివారం

మేఘసందేశం 4 వ శ్లోకం

మేఘసందేశం 4 వ శ్లోకం

ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలంబనార్థీ
జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్ప్రవృత్తిమ్
స ప్రత్యగ్రైః కుటజకుసుమైః కల్పితార్ఘాయ తస్మై
ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార 4

భావం : ఆ యక్షుడు, శ్రావణమాసం సమీపిస్తూండగా,
భార్య జీవితాలంబనాన్ని ఆశించి,
తన క్షేమవృత్తాంతాన్ని, ఆమెకు పంపగోరినవాడై,
క్రొత్తవైన (అనగా స్వభావసిద్ధంగా ఆషాఢమాసంలో పూచునట్టి)
కొండమల్లె పూవులచేత మేఘుని పూజించి,
ప్రీతి కలిగేటట్లుగా స్వాగతం పలికాడు.
అనగా కుశలాన్ని, కుశలాగమనాన్ని అడిగాడు.

విశేషాలు : ~ విరహార్తులకు, వర్షర్తువు (వర్ష+ఋతువు) మిక్కిలి ఉద్దీపకం.
ఆ ఋతువులో విరహబాధ ఎక్కువ అవుతుంది.

~ ఋతుసంబంధం వచ్చింది కాబట్టి, యువతకు కొన్ని విషయాలు
~ చైత్రం , వైశాఖం = వసంతర్తువు  (వసంతఋతువు అనకూడదు)
జేష్ఠం , ఆషాఢం = గ్రీష్మర్తువు  (గ్రీష్మఋతువు అనరాదు)
శ్రావణం , భాద్రపదం = వర్షర్తువు - మిగిలినవి పైలాగే
ఆశ్వియుజం , కార్తికం = హేమంతర్తువు
మార్గశిరం , పుష్యం = శరదృతువు
మాఘం , ఫాల్గుణం = శిశిరర్తువు అనేవి తెలుగు మాసాలు, ఋతువులు 
రెండు మాసాలు ఒక ఋతువు.
పైన చూడండి. ~ అలాగే పూజాదులలో కాలసంకీర్తనంలో "వసంతర్తౌ - చైత్రమాసే" - అని చదవాలి కాని వసంతఋతౌ అనరాదు.
మిగిలినవి అలాగే.

~ మేఘానికి ఉన్న పర్యాయ పదాల్లోంచి జీమూతమనే పదాన్ని తీసుకొని,
చాల అర్థవంతంగా కాళిదాసు వాడాడు.
ఆ పదానికి అర్థం జీవనానికి మూట.
జీవనం అంటే బ్రతుకు అని నీరు అని అర్థాలుండటంవల్ల
నాయకుని కుశలాన్ని నాయికకు తెలిపి,
ఆమెకు బ్రతుకునివ్వబోతున్నాడు అని ముందే మనకు స్ఫురిస్తుంది.

~ పని అప్పజెప్పాలనుకొన్నప్పుడు,
కేవలం దాన్నే ప్రస్తావించక,
తగిన మంచిమాటలాడి,
కుశలాదులడిగి, ప్రసన్నం చేసుకొన్న తరువాత ,
పని పురమాయిస్తే ,
జరగకపోవడం ఉండదన్న చక్కని లోకవ్యవహారాన్ని కాళిదాసు ఇక్కడ బోధిస్తున్నాడు.

~ కొండమీద కూడా మల్లెలు పూయించే భగవంతుని సున్నితహృదయాన్ని ఎంతని ఏమని పొగడవచ్చు?

~ ప్రీతి అనే పదం తోనే తీపి గుర్తుకొస్తుంది.
ప్రీతిగా మట్లాడే మాటలు నోరు తీపి అయితే కలిగే ఆనందాన్ని కలిగిస్తాయి.

~ "కుశలం" అన్న పదం ఆలోచిస్తే,
రామాయణం గుర్తుకొస్తుంది.
సీతారాముల మధ్య హనుమంతుడు నిర్వహించినది ఉభయకుశలోపరేకదా!
సీతను చూసి వచ్చిన తరువాత రామునితో ఆంజనేయుడు,
"కుశలం సీత" అని మొదట చెప్పి,
మిగిలిన విషయాలు తరువాత చెప్పాడు.

~ మిగిలిన విశేషసుమనస్సులు, సుమనస్సులు ఆలోచించిన కొద్దీ, పరిమళిస్తాయి.

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...