5, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 11 వ శ్లోకం

కర్తుం యచ్చ ప్రభవతి మహీముచ్ఛిలీన్ధ్రా మవంధ్యాం 
తచ్ఛృత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః 
ఆకైలాసా ద్బిసకిసలయచ్ఛేదపాథేయవంతః 
 సంపత్స్యంతే నభసి భవతో రాజహంసాః సహాయాః


అవతారిక : నీకు, దారిలో సహాయం చేసేవారున్నారంటున్నాడు.

భావం :

మేఘుడా! నీ ఉఱుము, శిలీంధ్రాలను పుట్టిస్తుంది. 
అలా భూమిని ఫలవంతంగా చేస్తుంది. 
అపుడు భూమి అవంధ్య అవుతుంది. ( అవంధ్య = సంతానం కలది )  
ఇంకా వినడానికి కూడా నీ ఉఱుము సొంపుగా ఉంటుంది. 
అటువంటి నీ ఉఱుమును విని,  
మానస సరోవరానికి ఎప్పుడెప్పుడు పోదామా? 
అని ఆత్రపడే రాజహంసలు, 
లేత తామరతూండ్లముక్కల్ని, దారిబత్తెంగా చేసుకొని, 
కైలాసపర్వతం దాకా ఆకాశంలో, 
నీకు, (సహాయంగా) కూడా రాగలవు.





విశేషాలు :



ఉఱుముకి శిలీంధ్రాలకు సంబంధం ఉందా? 
సైన్స్ పండితులు తేల్చాలి. 
కేవలం ,పదాలను అనుసరిస్తే 
ఉఱుముకి, శిలీంధ్రాలను పుట్టించే శక్తి ఉంది.  
ఉఱిమిన మేఘం ఆ వెనుక వర్షిస్తుంది 
కాబట్టి శిలీంధ్రాలు పుడతాయి. 
ఆ విధంగా ఉఱుము పంటలకు కారణమౌతుంది.

ఉఱుము వినడానికి సొంపుగా ఉంటుందంటారా?
వర్షాలకోసం ఎదురు చూచేవారికి వినసొంపే మఱి.

ఇక రాజహంసలు : పక్షుల్లోనే శ్రేష్ఠమైనవి. అందమైనవి.
వాటి ముక్కు, కాళ్లు ఎఱ్ఱగా ఉంటాయి. శరీరం అంతా తెలుపు.

లేత తామరతూండ్లు వాటికి ఆహారం . అటువంటివి కూడా వస్తాయి.

వాటితో కలసి ప్రయాణం.

మేఘునకు ఉత్సాహం కల్గిస్తున్నాడు.

ఒక్కరూ ప్రయాణించేకంటే , నలుగురు కలసి ప్రయాణిస్తే, అలసట తెలియదు కదా!



ఇక్కడ రాజహంసల గుఱించి వివరణ

రాజహంసలకు, మంచు ( యొక్క దుష్టత్వం ) రోగాలను కలుగజేస్తుంది. ఆ కారణంగా అవి, ఇతరప్రాంతాలకు

పోయి, మరల వర్షాలు పడే సమయానికి మానససరోవరానికి ప్రయాణం కడతాయి.

ఆ ప్రయాణం ఎపుడెపుడా అని ఎదురు చూస్తాయి.

మఱి, వాటికి మేఘగర్జన వినసొంపే కదా!



దారిబత్తెం అంటే దారిలో (తినడానికి తెచ్చుకొన్న) భోజనం.

ముందుజాగ్రత్త కల ప్రయాణికులు, దొరుకుతుందో దొరకదో అనే సందేహంతో ఆహారాన్ని కూడా తెచ్చుకొంటారు.

అలా హంసలకు తామరతూండ్లు - దారిబత్తెం.



రామగిరి నుండి కైలాస మానససరోవరం వఱకు ప్రయాణం అని ప్రస్తుతానికి తెలిసింది.

మంగళం మహత్

సాహిత్యం బాగా చదివిన వాళ్లు కవిత్వాన్ని బాగ వ్రాస్తారు.





1 కామెంట్‌:

  1. IT IS BETTER TO WRITE MEANNING OF EACH SANSKRIT WORD WITH ITS INNNER MEANING AND DEEP COMMENTARY WITH THE HEAR OF KALIDASA THEN ONLY IT WILL REACH THE OBJECTIVE OF THE BLOG

    రిప్లయితొలగించండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...