21, నవంబర్ 2011, సోమవారం

మేఘసందేశం 60 వ శ్లోకం


గత్వా చోర్ధ్వం దశముఖభుజోచ్ఛ్వాసితప్రస్థసంధేః

కైలాసస్య త్రిదశవనితాదర్పణస్యాతిథిః స్యాః ,

శృంగోచ్ఛ్రాయైః కుముదవిశదైర్యో వితత్య స్థితః ఖం

రాశీభూతః ప్రతిదినమివ త్ర్యంబకస్యాట్టహాసః .

భావం :


క్రౌంచపర్వతాన్ని దాటి వెళ్తే, కైలాస పర్వతం కనబడుతుంది.

అది దశముఖుని (రావణుని) చేత పూర్వం ఒకసారి ఎత్తబడింది.

అందువల్ల దాని సంధులు వదలి ఉన్నాయి.

దేవతాస్త్రీలకు అద్దంలాంటిదైన ఆ కైలాసపర్వతానికి అతిథివి కా.

తెల్లకలువల్లాంటి శుభ్రములైన ఎత్తైన శిఖరాలతో

ఆకాశం అంతా వ్యాపించి

ప్రతిరోజూ శివుడు నవ్విన నవ్వు ప్రోగు పెట్టి ఉంచారా అన్నట్లుంటుంది.
వివరణ :ఇక్కడ కైలాసపర్వతం వర్ణించబడుతోంది.

ఒకసారి దశకంఠుడు, కుబేరుని ఓడించి,

అతని పుష్పకవిమానాన్ని గ్రహించి,

వస్తూండగా అది కైలాసపర్వతసమీపంలో ఆగిపోయింది.

కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తూండగా నంది వచ్చి,

శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుంది కాన వెళ్లవలదని చెప్పాడు.

అప్పుడు దశగ్రీవుడు, నందిని చూచి, వానర(కోతి)ముఖుడవంటూ నవ్వాడు.

నందికి కోపం వచ్చి, ఆ వానరులచేతిలోనే నీవు దెబ్బతింటావని శాపమిచ్చాడు.

దాంతో దశముఖుడు, కోపించి, తరువాత జరిగిన వాదోపవాదాల్లో

నీవెంత? నీ కైలాసపర్వతమెంత? అని

ఆ పర్వతాన్ని ఎత్తాడు. అది చూచి, శివుడు దాన్ని అదిమాడు.

దాని క్రింద అతని చేతులు పడి నలిగిపోయాయి.

ఆ బాధతో లోకాలన్నీ భయపడేటట్లు పెద్ద రావం చేశాడు.

అప్పటినుంచి దశకంఠునికి రావణుడు అనే పేరు వచ్చింది.

ఆ తర్వాత కైలాసపర్వతంనుండి శివానుగ్రహంతో బయటపడ్డాడు.

రావణుడు ఎత్తడం వల్ల ఆ పర్వతసానువుల్లో పగుళ్ళు ఏర్పడ్డాయి.

అందువల్ల ఆ పర్వతం అతుకులు పెట్టినట్లుందని కాళిదాసు వర్ణిస్తున్నాడు.
అది వెండికొండ కాబట్టి,

దేవతావనితలు తమ ప్రతిబింబాలు చూసుకోవడానికి

దాన్ని అద్దంలా ఉపయోగించుకొంటారని కవి మనోహరమైన ఊహ.

ప్రతిరోజూ శివుడు నవ్వే స్వచ్ఛమైన నవ్వు ప్రోగుపడి,

కైలాసపర్వతమైందని మరొక మనోజ్ఞమైన వర్ణన.

తెలుపును మంచివాని మనసుతోనూ,

స్వచ్ఛమైన నవ్వుతోనూ పోలుస్తారు.

ఇది కవిసమయం.
"ఓ మేఘుడా! అటువంటి కైలాసపర్వతం

నీకు వేడుక కలిగిస్తుంది. పుణ్యాన్నీ ప్రసాదిస్తుంది."

అని యక్షుడంటున్నాడు.


మంగళం మహత్

20, నవంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 59 వ శ్లోకం

ప్రాలేయాద్రే రుపతట మతిక్రమ్య తాంస్తా న్విశేషాన్

హంసద్వారం భృగుపతి యశోవర్త్మ యత్క్రౌంచ రంధ్రమ్,

తేనోదీచీం దిశ మనుసరే స్తిర్యగాయామశోభీ

శ్యామః పాదో బలినియమనాభ్యుద్యతస్యేవ విష్ణోః

భావం :


హిమవత్పర్వతతటాల్లో ( హిమపర్వత ప్రదేశాల్లో / మంచుకొండ చఱియల్లో )

ఆ యా విశేషాలను అతిక్రమించి, ( దాటిపోయి )

హంసలదారి మరియు పరశురాముని కీర్తిమార్గం అయిన క్రౌంచ పర్వతబిలంనుండి,

బలిని బంధించటానికి పూనుకొన్న విష్ణువు నల్లని పాదంలా

అడ్డంగానూ పొడవుగానూ ప్రకాశిస్తూ ఉత్తరదిశగా వెళ్లు.
వివరణ :

హిమాద్రి యందు చూడదగిన ఎన్నో వింతలున్నాయి.

అవన్నీ చూడాలంటే ఆలస్యమవుతుంది.

కాబట్టి నీ దారిన పో.

పోతూంటే క్రౌంచం అనే పేరుగల మహాపర్వతం అడ్డు వస్తుంది.

ఆ పర్వతానికి ఒక రంధ్రం ఉంది.

అది పూర్వం పరశురాముడు చేసినది.

పరశురాముడు కుమారస్వామితో కలసి,

శివునివద్ద అస్త్రవిద్య నేర్చుకొంటూ, స్కందునితో పోటీపడి,

వాడి బాణాలతో ఈ క్రౌంచపర్వతాన్ని భేదించి, ప్రసిద్ధికెక్కాడు.

అప్పటినుండి వర్షాకాలం రాగానే హంసలు,

ఈ రంధ్రంనుండి వెడలి, మానససరోవరానికి చేరతాయి.

నీవు ఈ దారిగుండా వెళ్లు.

అప్పుడు నీవు, బలిని అణచదలచి, ఎత్తిన విష్ణువు పాదంలా శోభిల్లుతూంటావు.

మంగళం మహత్

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...