10, మే 2024, శుక్రవారం

SUNDARAKANDA సుందరకాండ 36

 

రామసుందరం - షట్త్రింశస్సర్గః

 

భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః |

అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 ||

సీతకు నమ్మకం కల్గించడానికై హనుమంతుఁడు వినయంగా మళ్లీ ఇలా అన్నాడు.

వానరోఽహం మహాభాగే దూతో రామస్య ధీమతః |

రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకమ్ || 2 ||

“నేను వానరుఁడను. రాముని దూతను. రాముని పేరు వ్రాసిన ఈ ఉంగరం తెచ్చాను. ఇదిగో చూడు.

ప్రత్యయార్థం తవాఽఽనీతం తేన దత్తం మహాత్మనా |

సమాశ్వసిహి భద్రం తే క్షీణదుఃఖఫలా హ్యసి || 3 ||

[ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః]

నీకు నమ్మకం కల్గటానికై రాముఁడు ఇవ్వగా తీసికొనివచ్చాను. ఇంక ఊఱట పొందు. నీకు మంగళ మగుగాక. నీ దుఃఖాలన్నీ నశించాయి.” (అని, ఆ ఊంగరాన్ని సీత కిచ్చాడు.)

గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణమ్ |

భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితాఽభవత్ || 4 ||

ఆ సీతాదేవి తన పెనిమిటి హస్తభూషణమైన అ ఉంగరాన్ని తీసికొని, చూసుకొంటూ, రాముని పొందినట్లు పరమసంతోషాన్ని పొందింది.

చారు తద్వదనం తస్యాస్తామ్రశుక్లాయతేక్షణమ్ |

అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్ || 5 ||

తామ్రశుక్లాయతేక్షణ, విశాలాక్షి, ఆ సీత అందమైన ముఖం రాహువుచే విడువబడిన చంద్రునిలా ప్రకాశించింది.

తతః సా హ్రీమతీ బాలా భర్తుః సందేశహర్షితా |

పరితుష్టా ప్రియం కృత్వా ప్రశశంస మహాకపిమ్ || 6 ||

ఆ తర్వాత అమె పెనిమిటి వార్త విని, సంతుష్టయయి, సిగ్గుపడి, సంతోషంతో హనుమంతుని ప్రశంసించింది.

విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ |

యేనేదం రాక్షసపదం త్వయైకేన ప్రధర్షితమ్ || 7 ||

"హనుమంతుఁడా! నీవు పరాక్రమవంతుడవు, సమర్థుడవు, బుద్ధిశాలివి. కాబట్టే ఈ రాక్షసస్థానాన్నిలెక్కచేయక ప్రవేశించావు.

శతయోజనవిస్తీర్ణః సాగరో మకరాలయః |

విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః || 8 ||

వంద యోజనాల విస్తీర్ణం, మొసళ్లు గల సముద్రాన్ని నీవు ఆవు పాదమంత చేసి, దాటావు. నీ పరాక్రమం పొగడదగినది.

హి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ |

యస్య తే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సమ్భ్రమః || 9 ||

రావణునివలన భయమూ, కొంచెం కూడ తత్తరపాటూ లేని నిన్ను సాధారణమయిన కోతిగా భావించను.

అర్హసే కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుమ్ |

యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా || 10 ||

రాముడు పంపగా వచ్చావు. కాబట్టి నాతో నీవు మాట్లాడవచ్చు.

ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో హ్యపరీక్షితమ్ |

పరాక్రమ మవిజ్ఞాయ మత్సకాశం విశేషతః || 11 ||

రాముడు నీ పరాక్రమం తెలిసికొకుండా పరీక్షించకుండా పంపడు కదా!. విశేషించి నా ఒద్దకు అసలు పంపఁడు.

దిష్ట్యా కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః |

లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః || 12 ||

(నా)భాగ్యవశాత్తూ రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు.

కుశలీ యది కాకుత్స్థః కిం ను సాగరమేఖలామ్ |

మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థితః || 13 ||

రాముడు కుశలుడైతే, రెచ్చిన ప్రళయ కాలాగ్నిలా సాగరమేఖలయైన భూమిని కోపంతో ఎందుకు దహించడంలేదు?

అథ వా శక్తిమంతౌ తౌ సురాణా మపి నిగ్రహే |

మమైవ తు దుఃఖానామస్తి మన్యే విపర్యయః || 14 ||

అయినా రామలక్ష్మణులు దేవతల నైనా జయించే సమర్థులు. అయితే నాదు:ఖాలకే నాశం లేదు అని అనుకొంటున్నాను.

కచ్చిన్న వ్యథితో రామః కచ్చిన్న పరిపత్యతే |

ఉత్తరాణి కార్యాణి కురుతే పురుషోత్తమః || 15 ||

రాముడు వ్యథ చెందడం లేదు కదా! పరితపించడం లేదుగా! (నన్ను పొందడానికై) చేయవలసిన పనులను చేస్తున్నాడా?

కచ్చిన్న దీనః సంభ్రాంతః కార్యేషు ముహ్యతి |

కచ్చి త్పురుషకార్యాణి కురుతే నృపతేః సుతః || 16 ||

రాముడు దీనుడు, భ్రాంతుడు అయ్యి, పనుల్ని చెఱుపుకోవడం లేదు కదా? పురుషప్రయత్నంతో చేయవలసిన పనులను చేస్తున్నాడా?

ద్వివిధం త్రివిధోపాయ ముపాయమపి సేవతే |

విజిగీషుః సుహృత్కచ్చిన్మిత్రేషు పరంతపః || 17 ||

పరంతపుడైన ఆ రాముడు మంచితలపుతో మిత్రులయెడ సామదానాలు రెండింటిని, శత్రువులయెడ దాన భేద దండ ఉపాయాలు మూడింటిని అవలంబిస్తున్నాడు కదా?

కచ్చిన్మిత్రాణి లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే |

కచ్చిత్కల్యాణమిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః || 18 ||

రాముడు మిత్రుల్ని సంపాదిస్తున్నాడా? ఇతరులును ఆతని మైత్రిని కోరి చేరుతున్నారా? మిత్రులందరూ మంచివారేనా? మిత్రులు ఆతనిని గౌరవిస్తున్నారా?

కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః |

కచ్చిత్పురుషకారం దైవం ప్రతిపద్యతే || 19 ||

రాముడు దేవతానుగ్రహాన్ని కోరుతున్నాడు కదా! పురుషప్రయత్నాన్ని దైవాన్ని (సమంగా) పొందుతున్నాడు కదా! (అంటే దైవాన్ని నమ్మామని ప్రయత్నం మానకూడదు. ప్రయత్నిస్తున్నాం కదా అని దైవాన్ని విడువకూడదు.)

కచ్చిన్న విగతస్నేహః ప్రవాసాన్మయి రాఘవః |

కచ్చిన్మాం వ్యసనాదస్మాన్మోక్షయిష్యతి వానర || 20 ||

రామునకు దూరంగా ఉండడం వల్ల నామీద స్నేహం తెగిపోలేదు కదా! ఈ దుఃఖం నుండి నన్ను విడిపిస్తాడా?

సుఖానాముచితో నిత్యమసుఖానామనౌచితః |

దుఃఖముత్తరమాసాద్య కచ్చిద్రామో సీదతి || 21 ||

ఎల్లప్పుడూ సుఖాలకు ఉచితమైన వాడు దుఃఖాలు అనుభవింప తగనివాడు అయిన రాముడు ఇప్పుడీ అధికమైన దుఃఖానికి కృశించడం లేదు కదా!

కౌసల్యాయాస్తథా కచ్చిత్సుమిత్రాయాస్తథైవ |

అభీక్ష్ణం శ్రూయతే కచ్చిత్కుశలం భరతస్య || 22 ||

కౌసల్య సుమిత్ర భరతుల కుశలవార్తలు తఱచు తెలియవస్తున్నాయి కదా!

మన్నిమిత్తేన మానార్హః కచ్చిచ్ఛోకేన రాఘవః |

కచ్చిన్నాన్యమనా రామః కచ్చిన్మాం తారయిష్యతి || 23 ||

రాముడు నానిమిత్తంగా శోకిస్తున్నాడా? మఱొకదృష్టి లేకుండా నన్ను తరింపజేస్తాడా?

కచ్చిదక్షౌహిణీం భీమాం భరతో భ్రాతృవత్సలః |

ధ్వజినీం మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే || 24 ||

సోదరప్రేమ కల్గిన భరతుడు నాకై అక్షౌహిణీసేనను పంపుతాడా?

వానరాధిపతిః శ్రీమాన్ సుగ్రీవః కచ్చిదేష్యతి |

మత్కృతే హరిభిర్వీరైర్వృతో దన్తనఖాయుధైః || 25 ||

సుగ్రీవుడు వీరులైన వానరులతో కలసి, నాకై ఇక్కడికి వస్తాడు కదా!

కచ్చిచ్చ లక్ష్మణః శూరః సుమిత్రానందవర్ధనః |

అస్త్రవిచ్ఛరజాలేన రాక్షసాన్విధమిష్యతి || 26 ||

లక్ష్మణుడు పెక్కు బాణాలతో రాక్షసుల నందఱ్నీ వధిస్తాడు కదా?

రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే |

ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం ససుహృజ్జనమ్ || 27 ||

యుద్ధంలో భయంకరంగా జ్వలిస్తున్న అస్త్రంచేత రావణుడు మిత్రసహితంగా కూలడం త్వరలో చూడగలను కదా!

కచ్చిన్న తద్ధేమసమానవర్ణం తస్యాననం పద్మసమానగన్ధి |

మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాతపేన || 28 ||

కాంచనంలా నిర్మలం, పద్మంలా సుగంధం కల రాముని ముఖం నేను లేకపోవడం చేత, నీరంతా ఎండిపోయాక ఎండకు కమలంలా శోషిల్లకున్నది కదా!

ధర్మాపదేశాత్త్యజతశ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిమ్ |

నాసీద్వ్యథా యస్య భీర్న శోకః కచ్చిత్స ధైర్యం హృదయే కరోతి || 29 ||

ధర్మానుసారియై రాజ్యం విడిచినపుడు, నన్ను పాదచారిణిగా అడవికి తీసుకొనివచ్చినపుడు, కొంచెమైనా వ్యథ గాని భయం గాని దుఃఖం గాని పొందకుండా (దైర్యంగా) ఉన్న రాముడు ఇప్పుడు మనసులో (అదే) ధైర్యాన్ని పూని ఉన్నాడు కదా!

చాస్య మాతా పితా చాన్యః స్నేహాద్విశిష్టోఽస్తి మయా సమో వా |

తావత్త్వహం దూత జిజీవిషేయం యావత్ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య || 30 ||

దూతవైన హనుమంతుడా! స్నేహం విషయంలో తల్లిగాని, తండ్రిగాని, అన్యులు గాని రామునకు నాకంటె సమానులు లేరు, అధికులు లేరు. ప్రియుని వృత్తాంతాన్ని విన్నంతవఱకే జీవించాలి అని కోరుతున్నాను."

ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా |

శ్రోతుం పునస్తస్య వచోఽభిరామం రామార్థయుక్తం విరరామ రామా || 31 ||

సీత, గొప్పదీ, మధురం అయిన అర్థం గల మాటలు పల్కి, రామునకు సంబంధించిన సంగతులు తెలిపే మనోహరమైన హనుమంతుని మాటలు వినడంకోసం ఊరకుంది.

సీతాయా వచనం శ్రుత్వా మారుతి ర్భీమవిక్రమః |

శిర స్యంజలి మాధాయ వాక్య ముత్తర మబ్రవీత్ || 32 ||

హనుమంతుడు సీత చెప్పింది విని అంజలి జోడించి, ఇలా అన్నాడు.

త్వామిహస్థాం జానీతే రామః కమలలోచనే |

తేన త్వాం నానయత్యాశు శచీమివ పురందరః || 33 ||

“నీ విక్కడ ఉన్నావని రామునకు తెలియదు. అందుచేత శచీదేవిని ఇంద్రునిలా నిన్ను వెంటనే తీసుకొని వెళ్లలేదు. (అనుహ్లాదుడనే దైత్యుడు శచీదేవిని అపహరించా డొకసారి. ఇంద్రునికి కొంతకాలం తర్వాత తెలిసింది. తెలిసిన వెంటనే ఆమెను తిరిగి తెచ్చుకొన్నాడు.)

శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః |

చమూం ప్రకర్షన్మహతీం హర్యృక్షగణసంకులామ్ || 34 ||

నేను (వెళ్లి, నీ) సంగతిని చెప్పగానే వానర భల్లూక సమూహాలతో నిండిన గొప్ప సేనను వెంటబెట్టుకొని, వెంటనే రాముడు ఇక్కడికి వస్తాడు.

విష్టంభయిత్వా బాణౌఘైరక్షోభ్యం వరుణాలయమ్ |

కరిష్యతి పురీం లంకాం కాకుత్స్థః శాంతరాక్షసామ్ || 35 ||

అక్షోభ్యమైన సముద్రాన్ని బాణాలతో స్తంభింపజేసి, (దాటి వచ్చి) లంకలోని రాక్షసుల నందర్నీ వధిస్తాడు.

తత్ర యద్యంతరా మృత్యుర్యది దేవాః సహాసురాః |

స్థాస్యంతి పథి రామస్య తానపి వధిష్యతి || 36 ||

అప్పుడు ఆయన మార్గానికి మృత్యువుగాని దేవతలుగాని అసురులుగాని (మధ్యలో) నిలిస్తే (అడ్డం వస్తే) వాళ్లను కూడ చంపుతాడు.

తవాదర్శనజేనార్యే శోకేన పరిప్లుతః |

శర్మ లభతే రామః సింహార్దిత ఇవ ద్విపః || 37 ||

సీతాదేవీ ! నీవు కనపడకపోవడంతో రాముడు శోకంతో నిండి, సింహంచేత పీడింపబడే ఏనుగులా సుఖాన్ని పొందకున్నాడు.

మలయేన వింధ్యేన మేరుణా మన్దరేణ |

దర్దురేణ తే దేవి శపే మూలఫలేన || 38 ||

యథా సునయనం వల్గు బింబోష్ఠం చారుకుండలమ్ |

ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్రమివోదితమ్ || 39 ||

(మా నివాసాలైన) మలయ వింధ్య మేరు మందర దుర్దుర పర్వతాలపైన (మా ఆహారమైన) మూలఫలాలపైన శపధం చేసి చెప్తున్నాను. చక్కనికండ్లు, మనోహరమైన దొండపండువంటి పెదవి, సుందరమైన కుండలాలు కల ఉదయించిన పూర్ణచంద్రునివంటి రాముని ముఖాన్ని (తప్పక) చూడగలవు.

క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రస్రవణే గిరౌ |

శతక్రతు మివాసీనం నాగరాజస్య [నాకపృష్ఠస్య] మూర్ధని || 40 ||

రావతం మూపుపై కూర్చున్న దేవేంద్రునిలా ప్రస్రవణపర్వతం పై ఉన్న రాముని, వెంటనే చూడగలవు.

మాంసం రాఘవో భుఙ్క్తే చాఽపి మధుసేవతే |

వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమమ్ || 41 ||

రాముడు మాంసం తినడంలేదు. మద్యాన్ని సేవించడంలేదు. ప్రతిదినం సాయంకాలం మాత్రమే వనంలో దొరికే ఆహారాన్ని (మూలఫలాల్ని) తింటున్నాడు.

నైవ దంశా న్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ |

రాఘవోఽపనయేద్గాత్రాత్త్వద్గతేనాంతరాత్మనా || 42 ||

మనస్సు నీమీదే లగ్నమై ఉండడంతో, శరీరంపైన వాలిన అడవియీగల్ని గాని, దోమల్ని గాని, పురుగుల్ని గాని, పాముల్ని గాని అవతలికి తోలికొనడంలేదు.

నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః |

నాన్యచ్చింతయతే కించిత్స తు కామవశం గతః || 43 ||

నిత్యం ధ్యానపరుడు శోకపరాయణుడై ఉన్నాడు. మన్మథునికి వశుఁడై (నిన్ను తప్ప) అన్యమైన దేని గుఱించీ ఆలోచించడంలేదు.

అనిద్రః సతతం రామః సుప్తోఽపి నరోత్తమః |

సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే || 44 ||

సతతం నిద్ర లేదు ఆయనకు. కొంచెం సేపు నిద్రపోయినా సీతా అంటూ మేల్కొంటున్నాడు.

దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాఽన్యత్సుమనోహరమ్ |

బహుశో హా ప్రియేత్యేవం శ్వసంస్త్వామభిభాషతే || 45 || 

ఫల పుష్పాలను గాని, లేదా మనోహరమైన ఏ ఇతరమైన దాన్ని చూసినా నిట్టూరుస్తూ హా ప్రియా అని నీ గుఱించి అనేక పర్యాయాలు మట్లాడతాడు.

దేవి నిత్యం పరితప్యమాన స్త్వామేవ సీతేత్యభిభాషమాణః |

ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృతప్రయత్నః || 46 ||

నిత్యం బాధపడుతున్నాడు. సీతా అంటూ నీ గుఱించే మాట్లాడతాడు. ధృతవ్రతుడై, నిన్ను పొందటానికే ప్రయత్నం చేస్తున్నాడు.”

సా రామసంకీర్తనవీతశోకా రామస్య శోకేన సమానశోకా |

శరన్ముఖే సాంబుదశేషచంద్రా నిశేవ వైదేహసుతా బభూవ || 47 ||

(హనుమ మాటలు విన్న తర్వాత) రామునితో సమానమైన శోకం కల సీత, రామసంకీర్తన విన్నాక దుఃఖం తగ్గినదై, శరత్కాల ప్రారంభంలో మేఘాలు మిగిలి ఉండగా చంద్రునితో కూడిన రాత్రిలా ఉంది.

-------------------------------------------------------------------------------------------------------------

ఆనందరామాయణాంతర్గత

శ్రీరామాష్టకం

 

లక్ష్మీనివాసం జగతాంనివాసం, లంకావినాశం భువనప్రకాశమ్,

భూదేవవాసం శరదిందుహాసం, శ్రీరామచంద్రం సతతం నమామి. 3

 

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే షట్త్రింశస్సర్గః (36)

 

మంగళం మహత్

 

 


 

 

 


SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...