31, మార్చి 2011, గురువారం

సద్గుణాభిరాముడు - రాముడు

ప్రశ్న :


శ్రీరాముని మంథర, కైక,వాలి,మొదలైనవారు నిందించినట్లు ,
రాముడు, శంబూకుని వధించడం అన్యాయమని,
ఇలా ఆధునికులు, రాముని రకరకాలుగా నిందిస్తున్నారు. భావ్యమా?


దీనికి "శ్వేతద్వీపం" అనే ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి పత్రిక ఇచ్చిన


సమాధానం :


నారదునిచేత, వాల్మీకిచేత, ప్రజలచేత, తల్లులచేత, తమ్ములచేత,
గుహుడు,శబరి మొదలైన గిరిజనులచేత,
 హనుమదాదివానరులచేత,
ఋషులచేత,
విభీషణాది రాక్షసులచేత,
ఇందరిచేత పొగడబడిన సద్గుణాభిరాముడు రాముడు.
( పైన పేర్కొన్నవారు ఎవరికివారే విభిన్నులు. రకరకాల సామాజికవర్గాలు.
ఒకరిచేత (నిజంగా) స్తుతింపబడటమే కష్టం.
మరి ఇన్ని విభిన్నవర్గాలవారి చేత స్తుతింపబడటం, ఎంత అసాధారణం? ఈ ఒక్కటి చాలు)

ఇతరులు పొగిడినా - లేని సద్గుణాలు రావు. నిందించినా - ఉన్నసద్గుణాలు పోవు.

పురుషోత్తమునకు రామునకు ఈ నిందాస్తుతులు సమానం.

ఎవరో నిందిస్తే, రాముని శీలం కళంకితమైందనుకోవడం భావనపుంసకత్వానికి నిదర్శనం.
ఇలాంటి రచనలు చేసేవారు తన అంతరాత్మమీద నమ్మకం లేనివాడు.
తన ప్రవర్తనమీద (తన) కన్న, తనగుఱించి ఇతరులు పలికిన మాటలపై నమ్మకం గలవాడు,
ఆత్మవంచకుడు అవుతాడు.

స్వాతంత్ర్యానంతరమే భారతీయులకు మానసికస్వాతంత్ర్యం సన్నగిల్లింది.
బానిసబుద్ధిపెరిగింది.

భారతీయసంస్కృతికి మూలపురుషులైన మహాపురుషులలో లోపాలను ఎత్తి చూపడం సరదా అయింది. గొప్పతనంగా లెక్కించబడుతోంది.

రామాయణాన్ని విమర్శించడానికి రామాయణాన్ని చదవకపోవడమే మొదటి అర్హతగాగల ఇటువంటివారికి
కొందరు పాశ్చాత్యులు, పాశ్చాత్య మానసపుత్రులు, దేశవిచ్ఛిన్నకారుల మాటలు ప్రమాణాలు.

చిత్రమేమంటే వేలాది పాశ్చాత్యులు,
ఇపుడు రామాయణాదులను చదివి, విని, స్ఫూర్తిపొంది, ఆనందిస్తున్నారు.
తమ తమ భాషలలో రచనలుగా ప్రచురిస్తున్నారు.
నాటకాలుగా ప్రదర్శిస్తున్నారు.
కొందరు గీతాలుగా ఆలపిస్తున్నారు.

భవిష్యత్తులో ఇటువంటి పాశ్చాత్యులు భారతీయులకు గురువులు కావచ్చుకూడా.

పండితులు విషయాలను ముందు తాము సరిగా అవగాహన చేసుకోకుండా చెప్పడం కూడా ఒక కారణం కావచ్చు.

మంథర ఒకే తప్పుమాట అన్నది రాముని గుఱించి,
- "రాముడు రాజైతే నీ కుమారుని తక్కువగా చూస్తాడు."
అది కూడా భరతుని రాజును చేయాలనే దురాశతో.
ఆమె అభిప్రాయం తప్పని తేలింది తరువాత.
రాముడు భరతుని యువరాజు చేశాడు.
ఇది ఎవరూ పట్టించుకోరు.

కైక కూడా రాముని సద్గుణాలు కీర్తించింది. చెడుగా అనలేదెక్కడా.

సినిమాల్లో మాత్రమే పరశురాముడు రాముని "గర్వి" అంటాడు. రామాయణంలో కాదు.
"శివునివిల్లు ఎక్కుపెట్టావు కదా! ఈ విష్ణువువిల్లు కూడా ఎక్కుపెట్టు " అన్నాడు. అంతే.

వాలి కూడా నిందించలేదు.
తనను చంపడానికి కారణం అడిగాడు.
సమాధానం విన్నాక తన కుమారుని అంగదుని రాముని రక్షణకు అప్పజెప్పాడు.
తనను చంపినవారికి తన కుమారుని ఎవరైనా అప్పజెప్తారా?

చివరకు రావణుడు కూడా
" భార్యకు ఐహికసుఖాలు అందించలేని అసమర్థుడు"
అన్న ఒక్కమాట కూడా సీతకు రాజభోగాలను ఎరగా చూపడం కోసమే.
దీనిని సీత తిప్పికొట్టింది.

ఇక రామాయణంలో శంబూకుడే లేడు. ఎవరో కల్పించారు.
వాల్మీకి పేరున ఉత్తరరామాయణంలో.

బాల్యచేష్టకైనా కుశలవులు రాముని నిందింపలేదు.
సినిమాలో చూపినది అధర్మం, అనుచితం.

రావణుడు యుద్ధంలో రాముని మొదటిసారి దర్శించి,
ఆ జానకిరాముని పరాక్రమానికి, దివ్య సౌందర్యానికి నిశ్చేష్టుడయ్యాడు.

సద్గుణాలే సౌందర్యంగా వ్యక్తమవుతాయి.
రాముడు సద్గుణ సౌందర్యవంతుడు.

కాని మురారి అనే సంస్కృతకవీంద్రుడు చెప్పినట్లు
రామునిలో ఒకే దుర్గుణం ఉంది.

అది ఏమిటంటే, ఎందరు ఎంతగా ఎన్నిసార్లు వర్ణించినా తనివి తీరకపోవడం.

మంగళం మహత్

మేఘసందేశం 6 వ శ్లోకం

మేఘసందేశం 6 వ శ్లోకం


జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్థిత్వం త్వయి విధివశాద్దూరబంధుర్గతో౭హం
యాంచా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా   6

భావం :

నిన్ను, భువనాల్లో ప్రసిద్ధమైన పుష్కలావర్తకాలనే మేఘాలయొక్క వంశంలో పుట్టినవానిగాను,
ఇచ్చ వచ్చిన రూపం (ధరింప) గలవానిగాను,
ఇంద్రునకు ప్రధానపురుషునిగాను, ఎఱుగుదును.
విధివశంవల్ల దూరప్రదేశంలో బంధువులు గల నేను,
ఆ కారణంచేత, నిన్ను, యాచిస్తున్నాను.
గుణాలు అధికంగా గలవానిని యాచించిన యాచన,
వ్యర్థమైనా, ఇంచుక ప్రియమైనది.
అధములను ఆశ్రయించి, పొందిన కోరిక,
ఫలించినదైనా (అనగా అధముల ద్వారా ఫలితాన్ని పొందినా)
ప్రియమైనది కాదు. ఉత్తమమైంది కాదు.

విశేషాలు :

- మేఘుని వంశాన్ని , సామర్థ్యాన్ని , పలుకుబడిని పొగుడుతున్నాడు.
సహజమే కదా!
ఈ మూడింటిని ప్రశంసిస్తే, పడనివాడెవ్వడు?
ప్రసన్నుడు కానివాడెవ్వడు ?
అప్పుడేకాదు.
ఇప్పుడుకూడా ఈ "మూడింటి "ద్వారానే కదా! చక్రం తిప్పుతున్నారు.
పని చేసిపెట్టేవారిని ఈ విషయాల్లో పొగిడితే పనైపోతుందనే లోకరీతిని, కాళిదాసు వర్ణిస్తున్నాడు.

- "కొంచెం చేసిపెట్టు" "ఈ పని చేయాలి " ఇలా అడిగే కంటే "యాచిస్తున్నాను" అంటే,
అవతలివాడు, తాను ఉన్నతుడైనట్లు భావిస్తాడు.
అసలు యాచన నీచం అంటారా!
నిజమే, ధనం లేనివాడు కాదట దరిద్రుడు.
యాచించినవాడే అసలైన దరిద్రుడు.
సరే మఱి " కొంచెం చేసిపెట్టు" అనడం యాచనేగా !
తేడా ఏముంది ?
ఎలాగా అడుక్కోవాల్సి వచ్చినప్పుడు,
యాచిస్తున్నాను అంటే పోయేదేముంది?

- కామరూపంవల్ల మేఘుడు మానవరూపం కూడా ధరించగలడని విశదమవుతున్నది.
5 వ శ్లోకంలో ఇంకా సందేహం ఉన్నవారికి, ఇపుడు నిస్సందేహమవుతుంది.

- అలాగే, వంశం భువనప్రసిద్ధం ఎప్పుడవుతుంది?
ఆ వంశసంజాతులందఱూ, సజ్జనులైనప్పుడు, పరోపకారులైనప్పుడు. రఘువంశం లాగ.

- "నాకు సహాయం చేస్తే, నీ వంశం భువనప్రసిద్ధమవుతుంది" అని కూడా యక్షుడు,
నర్మగర్భంగా సూచించినట్లు భావించవచ్చు.

సాహిత్యం ఆలోచనామృతం.

మంగళం మహత్

30, మార్చి 2011, బుధవారం

మేఘసందేశం 5 వ శ్లోకం

ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః 
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః 
ఇత్యౌత్సుక్యాదపరిగణయ౯ గుహ్యకస్తం యయాచే 
కామార్తా హి ప్రకృతికృపణా శ్చేతనాచేతనేషు

భావం : ధూమం, జ్యోతి, సలిలం మరుత్తుల కలయిక అయిన మేఘం ఎక్కడ? 
సమర్థాలైన ఇంద్రియాలు గల ప్రాణులచేత పంపదగిన వార్తావిషయాలు ఎక్కడ? 
ఉత్సుకతచేత ( ప్రియురాలిని ఎప్పుడు కలిసికొందునా అని తహతహచేత ) ఇది పరిగణించక, 
యక్షుడు, ఆ మేఘాన్ని ( తన క్షేమవార్తను ప్రియురాలికి చెప్పమని ) యాచించాడు. 
( అవును ) అంతే కదా! కామార్తులు, చేతనాచేతన విషయాల్లో స్వభావంచేత దీనులు. 
అనగా తెలివిమాలినవారు. 
యుక్తాయుక్త విచారం లేనివారని అర్థం.

విశేషాలు : ~ 4 వ శ్లోకం చదువుతూనే, ఆవేశపరులైన పాఠకులు కొందఱు, 
మేఘం చేత సందేశం పంపడమేమిటి? నాన్సెన్స్. అనేస్తారని 
కవికులగురువు కాళిదాసు, తానే ప్రశ్న వేసుకొని, వెంటనే సమాధానం చెప్పేశాడు.

నిజమైన గురువులు శిష్యుల ప్రశ్నలను తామే వేసుకొని, 
జవాబులతో పాఠ్యబోధనకు సిద్ధమవుతారు. 
ఇక శిష్యుల సందేహాలకు తావెక్కడ? 
అటువంటి గురువులుంటే శిష్యులు సిద్ధులవుతారు. 
తమ గురువులను ప్రసిద్ధులను చేస్తారు.

~ ధూమం = పొగ జ్యోతి = వెలుగు, అగ్ని సలిలం = నీరు మరుత్తు = గాలి వీటి కలయికట మేఘం. 
సైన్స్ ఇంత అందంగా చెప్పలేదోమో గదా!

~ ఇక్కడ వార్తాహరుల లక్షణాలను కాళిదాసు చెప్తున్నాడు. 
" పుల్లయ్య -వేమవరం " లాగ కాకుండా, 
వారు పటుకరణులై ఉండాలిట. 
అంటే తగిన సమర్థులై ఉండాలి. 
ఒకరు పంపిన వార్తను దూరంగా ఉన్నవారికి చేరవేసేటప్పుడు, 
అవతలివారి అనుబంధ సందేహాలను కూడా తీర్చగలిగిన నేర్పరులై ఉండటమే కాదు. 
ప్రయాణశ్రమను కూడా తట్టుకోగలిగి ఉండాలి. 
అది పటుకరణులు అంటే. 
ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు ఆనాడు లేవుగా! 
ప్రతి చిన్న విషయానికి వెనక్కి తిరిగి రాలేరుగా!

~ " యాచన " అనే పదం యక్షుని దీనస్థితిని తెలియజేస్తుంది. 
కామవిషయంలో దిగజారాడు కాబట్టి యాచించాడు. 
సహాయం చేసిపెట్టమని. 
నిజానికి ఈ యాచన భగవంతుని అనుగ్రహం పట్ల ఉండాలి.

~ కామార్తులకు చేతనాచేతనాల్లో జడత్వాన్ని ఇచ్చి, ప్రకృతి కృపణ చూపిస్తుంది. 
భగవదార్తులకు చేతనాచేతనాల్లో చైతన్యాన్ని ( భగవద్దర్శనం ) ఇచ్చి, ప్రకృతి కృప చూపిస్తుంది. 
( ఇది ఆయా పదాల ఆధారంగా నాకు తోచిన ఆలోచన. 
పొరపాట్లను పండితులు పరిగణించవలదని, 
మన్నించమని ప్రార్థన.)


27, మార్చి 2011, ఆదివారం

మేఘసందేశం 4 వ శ్లోకం

మేఘసందేశం 4 వ శ్లోకం

ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలంబనార్థీ
జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్ప్రవృత్తిమ్
స ప్రత్యగ్రైః కుటజకుసుమైః కల్పితార్ఘాయ తస్మై
ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార 4

భావం : ఆ యక్షుడు, శ్రావణమాసం సమీపిస్తూండగా,
భార్య జీవితాలంబనాన్ని ఆశించి,
తన క్షేమవృత్తాంతాన్ని, ఆమెకు పంపగోరినవాడై,
క్రొత్తవైన (అనగా స్వభావసిద్ధంగా ఆషాఢమాసంలో పూచునట్టి)
కొండమల్లె పూవులచేత మేఘుని పూజించి,
ప్రీతి కలిగేటట్లుగా స్వాగతం పలికాడు.
అనగా కుశలాన్ని, కుశలాగమనాన్ని అడిగాడు.

విశేషాలు : ~ విరహార్తులకు, వర్షర్తువు (వర్ష+ఋతువు) మిక్కిలి ఉద్దీపకం.
ఆ ఋతువులో విరహబాధ ఎక్కువ అవుతుంది.

~ ఋతుసంబంధం వచ్చింది కాబట్టి, యువతకు కొన్ని విషయాలు
~ చైత్రం , వైశాఖం = వసంతర్తువు  (వసంతఋతువు అనకూడదు)
జేష్ఠం , ఆషాఢం = గ్రీష్మర్తువు  (గ్రీష్మఋతువు అనరాదు)
శ్రావణం , భాద్రపదం = వర్షర్తువు - మిగిలినవి పైలాగే
ఆశ్వియుజం , కార్తికం = హేమంతర్తువు
మార్గశిరం , పుష్యం = శరదృతువు
మాఘం , ఫాల్గుణం = శిశిరర్తువు అనేవి తెలుగు మాసాలు, ఋతువులు 
రెండు మాసాలు ఒక ఋతువు.
పైన చూడండి. ~ అలాగే పూజాదులలో కాలసంకీర్తనంలో "వసంతర్తౌ - చైత్రమాసే" - అని చదవాలి కాని వసంతఋతౌ అనరాదు.
మిగిలినవి అలాగే.

~ మేఘానికి ఉన్న పర్యాయ పదాల్లోంచి జీమూతమనే పదాన్ని తీసుకొని,
చాల అర్థవంతంగా కాళిదాసు వాడాడు.
ఆ పదానికి అర్థం జీవనానికి మూట.
జీవనం అంటే బ్రతుకు అని నీరు అని అర్థాలుండటంవల్ల
నాయకుని కుశలాన్ని నాయికకు తెలిపి,
ఆమెకు బ్రతుకునివ్వబోతున్నాడు అని ముందే మనకు స్ఫురిస్తుంది.

~ పని అప్పజెప్పాలనుకొన్నప్పుడు,
కేవలం దాన్నే ప్రస్తావించక,
తగిన మంచిమాటలాడి,
కుశలాదులడిగి, ప్రసన్నం చేసుకొన్న తరువాత ,
పని పురమాయిస్తే ,
జరగకపోవడం ఉండదన్న చక్కని లోకవ్యవహారాన్ని కాళిదాసు ఇక్కడ బోధిస్తున్నాడు.

~ కొండమీద కూడా మల్లెలు పూయించే భగవంతుని సున్నితహృదయాన్ని ఎంతని ఏమని పొగడవచ్చు?

~ ప్రీతి అనే పదం తోనే తీపి గుర్తుకొస్తుంది.
ప్రీతిగా మట్లాడే మాటలు నోరు తీపి అయితే కలిగే ఆనందాన్ని కలిగిస్తాయి.

~ "కుశలం" అన్న పదం ఆలోచిస్తే,
రామాయణం గుర్తుకొస్తుంది.
సీతారాముల మధ్య హనుమంతుడు నిర్వహించినది ఉభయకుశలోపరేకదా!
సీతను చూసి వచ్చిన తరువాత రామునితో ఆంజనేయుడు,
"కుశలం సీత" అని మొదట చెప్పి,
మిగిలిన విషయాలు తరువాత చెప్పాడు.

~ మిగిలిన విశేషసుమనస్సులు, సుమనస్సులు ఆలోచించిన కొద్దీ, పరిమళిస్తాయి.

26, మార్చి 2011, శనివారం

మేఘసందేశం ౩ వ శ్లోకం

తస్య స్థిత్వా కథమపి పురః కౌతుకాధానహేతో,
రంతర్బాష్ప శ్చిరమనుచరో రాజరాజస్య దధ్యౌ,
మేఘాలోకే భవతి సుఖినో2ప్యన్యథావృత్తి చేతః
కంఠాశ్లేషప్రణయిని జనే కిం పునర్దూరసంస్థే. 3

భావం : కుబేరుని అనుచరుడైన ఆ యక్షుడు,
కంటి లోపల ఇమిడి ఉన్న కన్నీళ్ళతో,
ప్రియురాలితో కూడి ఉండాలనే కోరికను కలిగించడానికి కారణమైన
ఆ మేఘం ఎదుట ఎట్టకేలకు నిలిచి,
చాలసేపు చింతించాడు.

(చింత = తలఁపు)
(ఎందుకంటే) మేఘదర్శనం, ప్రియురాలి సమక్షంలో ఉన్నవాని
మనసును కామోద్దీపం చేస్తుంది.
మరి కంఠాలింగనాన్ని కోరుతున్న
భార్య దూరంగా ఉంటే ఇంక ఏమి చెప్పవచ్చు?

విశేషాలు : ~ ఆ యక్షుడు, యక్షరాజైన కుబేరుని అనుచరుడు.
కుబేరుడు ఉత్తరదిక్పాలకుడు.
అతని అనుచరునికి మేఘం మీద అధికారం ఉంటుంది.
అనుచరుడని కాళిదాసు చెప్పడంలో ఉద్దేశం ఇదే.
అయినా ఆజ్ఞాపించక యాచిస్తాడు. (6వ శ్లోకంలో తెలుస్తుంది.)
ముందే ఈ విషయం తెలిస్తే చదువరులకు యక్షుని వినయం
అర్థం అవుతుందని నా ఉద్దేశం. కాబట్టి అతడు అవినయపూర్వకంగా
కాక "విధి"పూర్వకంగా తప్పుచేశాడని తెలుస్తుంది.

~ ధీరోదాత్తుడు కాబట్టి కన్నీళ్ళు పైకి రాలేదు.

~ మేఘాలు కమ్ముకొన్నాక ,
వాటిని చూసి,
వర్షభావనతో
ఆహార ప్రియులకు పకోడీలమీద ఎలా ఉద్దీపన కలుగుతుందో,
అలాగే కాముకులకు
(ఇక్కడ కామం అంటే ధర్మపత్నియందలి కామం మాత్రమే)
మేఘదర్శనం కోరికలను పుట్టిస్తుంది.

మేఘసందేశం 2 వ శ్లోకం

తస్మి న్నద్రౌ కతిచి దబలా విప్రయుక్త స్స కామీ
నీత్వా మాసా న్కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః
ఆషాఢస్య ప్రథమదివసే మేఘ మాశ్లిష్టసానుమ్
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ 2


భావం : భార్యను ఎడబాసి ఉండడంచేత కృశించినవాడై,
ఆ (చిత్రకూట) పర్వతం మీద,
కొన్ని మాసాలు కష్టంగా గడిపాడు.
(ఇక్కడ కొన్ని అంటే ఎనిమిది మాసాలు అని గ్రహించాలి.
ఎందుకంటే ఇతడు మేఘునితో
సంవత్సరానికి ఇక నాలుగుమాసాలు ఉన్నాయని చెప్పబోతున్నాడు.)
అంతట ఆషాఢమాసం తొలిరోజునందు
ఆ కొండ చరియను కమ్ముకొని,
దరిని గోరాడు ఏనుగులా ఉన్న
మేఘాన్ని చూశాడు.

విశేషాలు :- కృశించాడు అని చెప్పక కాళిదాసు ఒక చమత్కారంగా, ఆ యక్షుని,
 " బంగారు కడియంజారడంవల్ల వట్టిదైన ముంజేయి గలవాడు" అని విశేషణం వేసి, వర్ణించాడు.
చేతినుండి కడియం జారిపోయేంతగా చేయి సన్నబడిపోయింది.
అనగా శరీరం కృశించింది. అని స్ఫురిస్తుంది. ఇదే కవిత్వం అంటే.

- ఎనిమిది మాసాలు అష్టకష్టాలను గుర్తుకు తెస్తుంది.
( ఎనిమిది అంటే సంస్కృతంలో అష్ట అనికదా!)

- మేఘదర్శనం అయింది అంటే
అంతకు ముందు ఆకాశం శూన్యంగా ఉందని కదా!
యక్షుని మనసులా.
తొలి అనే పదం (ప్రథమ) కూడా ,
ఎనిమిదిమాసాలు భార్య ఆలోచనలను తప్ప మరి దేన్నీ పట్టించుకోని అతడు మేఘాన్ని చూడగలిగాడు.
అంటే క్రొత్త ఆశ చిగురించిందన్న మాట.
మేఘం మొలకలు వేయిస్తుంది. చిగుళ్ళూ వేయిస్తుంది. నీటిని ఇచ్చి.

(ఇంకా ఆలోచించండి. మీకూ క్రొత్తభావాలు తడతాయి.)

భవదీయుడు.

25, మార్చి 2011, శుక్రవారం

మేఘసందేశం



ఓం

కవికులగురువు కాళిదాసు రచించిన మేఘసందేశం ఖండకావ్యం 

శ్లోకాలు , భావాలు ,నాకు తోచిన విశేషాలు 
ఆసక్తి ఉన్న వారి కోసం 

సతతం.  

మేఘసందేశం

ఖండకావ్యాల్లోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే సర్వోత్కృష్ట రచన. ఉత్తరభారతంలో మేఘదూతమంటారు.

మానవహృదయాంతరసూక్ష్మభావవ్యక్తీకరణే కాక ప్రకృతిని, భౌగోళికమైన నదులు, పర్వతాలు, పట్టణాదులు, పల్లెలను కాళిదాసు చాల చక్కగా వర్ణించాడు. దీనిలో అంగిరసం (హృదయస్పర్శియైన) విప్రలంభ శృంగారం.

 

యక్షుడొకడు అలకాధిపతి కుబేరుని కోపానికి గురై ఒక సంవత్సరం భార్యావియోగంతో

రామగిరి (నాగపూర్ కు 28 మైళ్ళ దూరంలో వున్న రామటేక్) ఆశ్రమప్రాంతంలో కాలం గడుపుతుంటాడు. వర్షాకాలారంభంతో భార్యావియోగం సహింపరానిదై, విరహానలంలో కాలిపోతూ అలకానగరంలో ఉండే తన భార్య దగ్గరికి దూతగా వెళ్ళమని ఆకాశంలోని మేఘాన్ని ప్రార్థించి, ఆవిడకు సందేశాన్ని పంపటమే ఇందులోని ఇతివృత్తం.

 

అయితే సందేశం మొత్తం దాదాపు 20 శ్లోకాల్లోనే ఉంది. మిగతా కావ్యమంతా అలకానగర మార్గం, అలకానగరం, యక్షుని గృహం, విరహంతో ఉన్న యక్షిణి వర్ణనలు కన్పిస్తాయి. ఈ మార్గవర్ణనను కాళిదాసు ఆమ్రకూటంతో మొదలుపెట్టి, వింధ్యాచలప్రత్యగ్రభాగంలో విస్తరించిన నర్మదానది, దశార్ణదేశరాజధాని వేత్రవతినదీతీరస్థ విదిశానగరం, తత్సమీప నీచగిరి, ఉజ్జయిని (ఉజ్జయినీ విశేషాలను 15 శ్లోకాల్లో వర్ణించాడు. ఇంత విస్తరంగా ఇక ఏ ప్రదేశాన్ని వర్ణించలేదు) గంభీరానది, దేవగిరి, చర్మణ్వతీనది, తత్ససమీప దశపురనగరం, బ్రహ్మావర్తదేశం, సరస్వతీనది, కురుక్షేత్రం, కనఖలనగరం, గంగానది, హిమాలయాలు, (హిమాలయాలకు, కైలాసపర్వతానికి 11 శ్లోకాలు)  ఆ తర్వాత హిమాలయాల్లో వున్న అలకానగరాలను వర్ణించాడు.

 

మేఘసందేశ కావ్య రచనా ప్రేరణ

 

ఈ కావ్యంలోని సహజచిత్రణతో కూడిన హృదయాభివ్యక్తి స్వానుభవంతోనే సాధ్యమని, కాబట్టి కాళిదాసు భార్యావియోగం అనుభవించి వ్రాశాడని విమర్శకులు తలచారు. కావచ్చు. కాని వేదకావ్యేతిహాసపురాణాదుల్లో సందేశ ఘట్టాలున్నాయి. భారతంలో నలదమయంతుల హంసదౌత్యం, రామాయణంలో హనుమంతుని దౌత్యం, ఋగ్వేదంలోని సరమదౌత్యఘట్టం ప్రసిద్ధమైనవి. అయితే హనుమత్పందేశఘట్టం కాళిదాసు మీద అధిక ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. రామాయణంలో వర్షర్తు సందర్భంలో రాముడు సీతా వియోగ బాధను పొంది, హనుమంతుని దూతగా పంపాడు. ఈ సందేశఘట్టం వాల్మీకిని అభిమానించిన కాళిదాసును ఆకర్షించి ఉంటుంది. వాల్మీకిశ్లోకభావ ప్రభావం ఉత్తరమేఘంలో కన్సిస్తోందని వరదాచార్యులు గుర్తించాడు. అంతేగాక కాళిదాసుకు బద్ధవైరి అని ఐతిహ్యంగల ఘటఖర్పరుడు ఒకానొక స్త్రీ విరహబాధతో మేఘం ద్వారా భర్తకు సందేశాన్ని పంపినట్లుగా ఒక సందేశ కావ్యాన్ని వ్రాశాడు. కవితో గల స్పర్దతోనో లేక హనుమత్సందేశాదులను అనుసరిస్తూనో కాళిదాసు సుందరకావ్యాన్ని రచించాడు. ఏమైతేనే ఈ రచన తర్వాత పూర్వ సందేశకావ్యాలు సూర్యునిముందు దివిటీలైపోయాయి.

 

మేఘసందేశ శ్లోక సంఖ్య

పూర్ణ సరస్వతి 110 శ్లోకాలకు వ్యాఖ్యానం వ్రాయగా వల్లభదేవుడు 111 శ్లోకాలకు, భరతసేనుడు 114 శ్లోకాలకు, మల్లినాథుడు 121 శ్లోకాలకు వ్యాఖ్యానాలు వ్రాయడంవల్ల శ్లోకసంఖ్యను గూర్చి ఏకాభిప్రాయం లేదు.

 

మేఘ సందేశంలోని వృత్తం

మందాక్రాంతం. ఇది సార్థక నామధేయురాలు. గుర్వక్షరాలతో మందమందంగా నడిచే ఈ వృత్తం కరుణాదిరసాలకు సరిపోతుంది. పెద్ద వృత్తం కాబట్టి విషయబాహుళ్యంతో, వియోగదుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రియుని మనఃస్థితి చిత్రణకు తగి ఉంటుంది. కాళిదాసు ప్రయోగించటం వల్ల వృత్తానికి అనంతరకాలంలో బాగా ప్రచారం వచ్చింది.

 

మేఘసందేశంలోని ప్రతి ఒక్క శ్లోకంలో వర్ణిత దృశ్యాన్ని, వస్తువును ఒక చిత్రపటంగా గీయవచ్చు. కళ్లకు కట్టేటట్టుగా దృశ్యాన్ని కాళిదాసు వర్ణించాడు. ఒక శ్లోకాన్ని చదివి దానిలోని వస్తువును పాఠకుడు మనఃపటలం మీద తనవిదీరా దర్శిస్తూ, రమిస్తూ, మఱొక శ్లోకపఠనానికి ముందుకు సాగుతాడు. రమించే సమయం ఆయా సహృదయుని బట్టి ఎంతైనా కావచ్చు. వర్ణచిత్రాల ప్రదర్శనశాలను దర్శించినట్లుగా అన్నమాట. ఇందులోని ప్రతి శ్లోకం అందమైందే. రమణీయభావసంపదతో, వర్ణనలసొంపుతో కూడినదే. పాఠకుని హృదయాన్ని రసప్లావితం చేసేదే.

 

మేఘసందేశ టీకలు అనువాదాలు

 మేఘసందేశానికి దాదాపు 40 టీకలున్నాయి. సుప్రసన్నమైన వైదర్భీరీతిలో వ్రాయబడిన ఇంత చిన్న కావ్యానికి ఇన్ని టీకలుండటమే దాని వ్యాప్తి, ప్రఖ్యాతులను  తెలియజేస్తోంది. మేఘసందేశం అనేక ఆధునిక భారతీయ భాషల్లోనే కాక ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, చైనా, టిబిట్ భాషల్లోకి అనువదింపబడింది.

 

మేఘసందేశకావ్య ప్రభావం - సందేశ కావ్యాలు

కాళిదాసు మేఘసందేశాన్ని ఆదర్శంగా పెట్టుకొని వాయు, పారావత, చక్రవాక, కీరసందేశాల వంటివి చాల రచింపబడ్డాయి. ఇవన్నీ అలభ్యం. భామహుడు వీటిని తన కావ్యాలంకారంలో విమర్శించాడు. క్రీ.శ.11 తర్వాత దాదాపు 50 సందేశ కావ్యాలు వ్రాయబడ్డాయి అని తెలుస్తోంది. వీటి మీద మేఘసందేశ కావ్యవస్తువు, శైలి, భావాల ప్రభావం స్పష్టంగా ఉంది. కొందరు కవులు మేఘసందేశ శ్లోకాల చివరిపాదాన్ని తీసుకొని సమస్యాపూరణ పద్దతిలో మొదటి మూడు పాదాలను వ్రాసి సందేశకావ్యాలను వ్రాసారు. జైన, వైష్లవ కవులు మేఘసందేశం ఆదర్శంగా ఎన్నో సందేశకావ్యాలను వ్రాసారు.

 

మేఘసందేశాన్ని అనుకరించిన కావ్యాల పట్టిక

ధోయి కవి - పవన సందేశం (క్రీ.. 1170)

వేదాంతదేశికులు - హంస సందేశం (క్రీ..1268 - 1369)

అవధూతరామయోగి – సిద్ధసందేశం (క్రీ. 13)

మాధవకవీంద్ర - ఉద్ధవసందేశం (క్రీ. 13)

వినయప్రభు - చంద్రసందేశం (క్రీ. 13)

ఉద్దండుడు - కోకిల సందేశం (క్రీ.. 1400 ప్రాంతం)

వామన భట్ట బాణుడు - హంససందేశం (క్రీ.. 1420)

సుందరగని/ణి శీలసందేశం (క్రీ.. 1484)

రూపగోస్వామి - హంస సందేశం, ఉద్ధవ సందేశం (క్రీ.శ.1490-1563)

విష్ణుదాసు - మనోసందేశం (క్రీ.. 15)

రఘునాథదాసుడు - హంస సందేశం (క్రీ.. 16)

విష్ణుత్రాత - కోకసందేశం (క్రీ. 16)

పరమేశ్వర - చకోరసందేశం (క్రీ. 16)

రుద్ర న్యాయవాచస్పతి - పికసందేశం (క్రీ.. 17)

వాదిరాజు - పవనసందేశం (క్రీ.. 17)

శ్రీకృష్ణసార్వభౌముడు పాదాంకసందేశం (క్రీ.. 17)

సిద్దనాథుడు - పవనసందేశం (క్రీ.. 17)

కృష్ణనాథుడు - వాతసందేశం (క్రీ.. 17)

వాసుదేవుడు – భృంగసందేశం (క్రీ.. 17)

జంబుకవి చంద్రసందేశం (క్రీ.. 17)

బోలానాథుడు - పంథసందేశం (క్రీ.. 17)

రామదయాళ్ - అనిలసందేశం (క్రీ.. 17)

శతావధానకవి శ్రీకృష్ణదేవ - భృంగసందేశం (క్రీ.. 18)

లంబోదర వైద్యుడు - గోపీసందేశం (క్రీ.. 18)

త్రిలోచనుడు - తులసీసందేశం (క్రీ.. 18)

వైద్యనాథుడు - తులసీసందేశం (క్రీ.. 18)

హరిదాసు - కోకిలసందేశం (క్రీ.. 18)

త్రైలోక్యమోహనుడు - మేఘసందేశం (క్రీ.. 19)

రామశాస్త్రి - మేఘ ప్రతిసందేశం (క్రీ.. 19)

శిష్టు కృష్ణమూర్తి  -యక్షోల్లాసం (క్రీ.శ. 19)

నిత్యానందశాస్త్రి - హంససందేశం (ఆధునికుడు)

కాళీప్రసాదు - భక్తిసందేశం (కాలం తెలియదు)

రామారామకవి - మనోసందేశం (కాలం తెలియదు)

శ్రీశైల వేంకటాచార్యుడు - కోకిలసందేశం (కాలం తెలియదు)

విద్యావిధానకవీంద్రాచార్య సరస్వతి - హంస సందేశం

పూర్ణసరస్వతి - హంస సందేశం

ఇద్దరు అజ్ఞాతకవుల రెండు హంససందేశాలు

ఇంకా కాకసందేశం, పాదపసందేశం, బకసందేశం, మృగసందేశం మొదలైనవెన్నో సందేశకావ్యాలు ఆధునికకాలం వఱకు వ్రాయబడ్డవి ఉన్నాయి.




కశ్చి త్కాన్తావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ్య భర్తుః
యక్ష శ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
స్నిగ్ధ చ్ఛాయాతరుషువసతిం రామగిర్యాశ్రమేషు  1



భావం :  ఒక యక్షుడు 




(తన ప్రభువైన) కుబేరుని ఆజ్ఞను



ఏమరుపాటుచేత చెల్లించలేదు.



 అందువల్ల కుబేరుడు కోపించి,



సంవత్సరకాలం కాంతను (భార్య) ఎడబాసి,


దూరంగా ఉండమని శపించాడు. 



ఆ శాపంచేత, అతడు,




సీతారాములు వసించిన, 



దట్టములైన నీడలనిచ్చే చెట్లున్న



రామగిరి (చిత్రకూట) ఆశ్రమాల్లో ఉండి,


శాపప్రభావంచేత తన దివ్యశక్తి పోయినవాడై,


ప్రియురాలినెడబాసిన దుఃఖంచేత సంవత్సరకాలవిరహాన్ని

ఎంతో గొప్పకాలంగా గడుపుతున్నాడు.








విశేషాలు : రామగిరి ఎక్కడ ఉందో తెలిస్తే, "రూట్" అవగాహన అవుతుంది.








స్వ అధికారంనుండి ప్రమత్తులు కాకూడదు ఎవరూ కూడా.








భార్యావిరహం భరించలేనంతటి (గొప్ప)ది.









కాళిదాసు ఇక్కడ "గురు" అనే పదం వాడాడు.గమనించండి.








శక్తిమంతుల శాపంవల్ల మహిమలు (గొప్పతనాలు) అంతరిస్తాయి.








చెడుపనికి ఫలితం సంవత్సరం లోపు.









చక్రే అంటే చేసెను. 











చక్ర పదం వాడడం వల్ల కుదురుగా ఉండలేకపోయాడు అని స్ఫురిస్తుంది.








దట్టములైన నీడనిచ్చే చెట్లు అనడంవల్ల ,









యక్షునికి (భార్య సమక్షం) అనే










వెలుగే లేకుండాపోయింది అని స్ఫురిస్తుంది. చమత్కారం.








రామగిరి అని ప్రయోగించి, రాముని, 


ఆయన విరహాన్ని కాళిదాసు జ్ఞప్తికి తెస్తున్నాడు.















మంగళం మహత్










ఇది మధ్యప్రదేశ్ లోని రామటేక్ అనబడే రామగిరి ఇది ఆంధ్రప్రదేశ్ - కరీంనగర్ లోని రామగిరి





































































































భావం : ఒక యక్షుడు (తన ప్రభువైన) కుబేరుని ఆజ్ఞను










ఏమరుపాటుచేత చెల్లించలేదు. అందువల్ల కుబేరుడు కోపించి,










సంవత్సరకాలం కాంతను (భార్య) ఎడబాసి,










దూరంగా ఉండమని శపించాడు. ఆ శాపంచేత, అతడు,










సీతారాములు వసించిన, దట్టములైన నీడలనిచ్చే చెట్లున్న










రామగిరి (చిత్రకూట) ఆశ్రమాల్లో ఉండి,










శాపప్రభావంచేత తన దివ్యశక్తి పోయినవాడై,










ప్రియురాలినెడబాసిన దుఃఖంచేత సంవత్సరకాలవిరహాన్ని










ఎంతో గొప్పకాలంగా గడుపుతున్నాడు.














విశేషాలు :






రామగిరి ఎక్కడ ఉందో తెలిస్తే, "రూట్" అవగాహన అవుతుంది.










స్వ అధికారంనుండి ప్రమత్తులు కాకూడదు ఎవరూ కూడా.










భార్యావిరహం భరించలేనంతటి (గొప్ప)ది.










కాళిదాసు ఇక్కడ "గురు" అనే పదం వాడాడు.గమనించండి.










శక్తిమంతుల శాపంవల్ల మహిమలు (గొప్పతనాలు) అంతరిస్తాయి.










చెడుపనికి ఫలితం సంవత్సరం లోపు.










"చక్రే" అంటే చేసెను. చక్ర పదం వాడడం వల్ల










కుదురుగా ఉండలేకపోయాడు అని స్ఫురిస్తుంది.










దట్టములైన నీడనిచ్చే చెట్లు అనడంవల్ల ,










యక్షునికి (భార్య సమక్షం) అనే










వెలుగే లేకుండాపోయింది అని స్ఫురిస్తుంది. చమత్కారం.










రామగిరి అని ప్రయోగించి, రాముని,










ఆయన విరహాన్ని కాళిదాసు జ్ఞప్తికి తెస్తున్నాడు.
































SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...