14, జనవరి 2022, శుక్రవారం

Sundarakanda సుందరకాండ 35

                                   

రామసుందరం - పఞ్చత్రింశస్సర్గః

 

తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌

ఉవాచ వచనం సాంత్వ మిదం మధురయా గిరా ॥ 1

వానరశ్రేష్ఠుడు చెప్పిన రామకథను విని, మధురసాంత్వవచనాలతో వైదేహి, ఇలా అంది.

క్వ తే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణమ్‌

వానరాణాం నరాణాం చ కథ మాసీ త్సమాగమః ॥ 2

“రాముని నీవెక్కడ కలుసుకొన్నావు? లక్ష్మణుని ఎలా ఎఱుగుదువు? వానరులకు, నరులకు సమాగమం ఎలా కల్గింది?

యాని రామస్య లిఙ్గాని లక్ష్మణస్య చ వానర

తాని భూయ స్సమాచక్ష్వ న మాం శోక స్సమావిశేత్‌ 3

రాముని, లక్ష్మణుని, గుఱుతుల్ని(శరీరలక్షణాల్ని) మళ్లీ చక్కగా వివరించి చెప్పు. అవి వింటే, నాకు, శోకం కల్గదు.

కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశమ్‌ ।

కథ మూరూ కథం బాహూ లక్ష్మణస్య చ శంస మే 4

రాముని అవయవాల కుదిరిక(అమరిక) ఎలా ఉంటుంది? రూపం ఎలా ఉంటుంది? ఊరువులు ఎలా ఉంటాయి? చేతులు ఎలా ఉంటాయి? అలాగే లక్ష్మణుని రూపం కూడా చెప్పు.”

ఏవ ముక్తస్తు వైదేహ్యా హనుమా న్మారుతాత్మజః

తతో రామం యథాతత్త్వ మాఖ్యాతు ముపచక్రమే 5

వైదేహి ఇలా అడగ్గా, రామునిగూర్చి ఉన్నది న్నట్లుగా, మారుతాత్మజుడు, చెప్పడం ఆరంభించాడు.

జానంతీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి

భర్తుః కమలపత్త్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ 6

“కమలపత్త్రాక్షీ! వైదేహీ!, అహో! నా భాగ్యం!. నీ భర్తయొక్క, లక్ష్మణునియొక్క, అవయసంస్థానం, నీకు తెలిసి కూడా, నా అదృష్టశాన నన్ను, అడుగుతున్నావు.

యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై ।

లక్షితాని విశాలాక్షి వదత శ్శృణు తాని మే ॥ 7

విశాలాక్షీ!, రాముని, లక్ష్మణుని, చిహ్నాలను, నేను గుర్తించినంతవఱకు చెప్తాను. విను.      

                                                 రామః కమలపత్త్రాక్ష స్సర్వసత్త్వమనోహరః

రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే  8

జానకీ!, రాముడు, పుట్టుకతోనే, కమలపత్త్రాక్షుడు, సర్వసత్త్వమనోహరుడు, రూపదాక్షిణ్యసంపన్నుడు.

తేజసాఽఽదిత్యసంకాశః క్షమయా పృథివీసమః

బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః ॥ 9

సూర్యునితో సమానమైన తేజస్సు, భూమితో సమమైన క్షమ, బృహస్పతితో సదృశమైన బుద్ధి, ఇంద్రునితో సాటైన యశస్సు కలవాడు.

రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా

రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః ॥ 10

శత్రువులను తపింపచేసేవాడు. ప్రాణిలోకానికి రక్షకుడు, తనవారికి రక్షకుడు, తన నడవడికి, ర్మానికి రక్షకుడు.

రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షితా

మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః ॥ 11

భామినీ!, లోకంలోని నాల్గువర్ణాలకు రక్షకుడు. లోకపు మర్యాదల్ని ఆచరించేవాడు, ఆచరింపచేసేవాడు.

అర్చిష్మా నర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః

సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణామ్‌ ॥ 12

గొప్పతేజస్సు గలవాడు, పెద్దలచే పూజింపబడేవాడు, బ్రహ్మచర్యవ్రతాన్ని పాలించేవాడు, సాధుజనులకు వలసిన ఉపకారాల్ని ఎఱిగి  చేసేవాడు. ర్మలయొక్కగతుల్ని ఎఱిగినవాడు.

రాజవిద్యావినీతశ్చ బ్రాహ్మణానాముపాసితా

శ్రుతవాన్‌ శీలసంపన్నో వినీతశ్చ పరంతపః ॥ 13

రాజవిద్యావినీతుడు. బ్రాహ్మణుల్ని ఉపాసించేవాడు. విద్యల్ని నేర్చినవాడు. శీలసంపన్నుడు. వినీతుడు. శత్రువుల్ని తపింపచేసేవాడు.

యజుర్వేదవినీతశ్చ వేదవిద్భిస్సుపూజితః ।

నుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః 14

యజుర్వేదాన్ని చక్కగా చదివినవాడు. వేదవేత్తలచే, చక్కగా పూజింపబడేవాడు, ధనుర్వేదం, వేదాలు, వేదాంగాల్ని చక్కగా తెలిసినవాడు.

విపులాంసో మహాబాహుః కంబుగ్రీవ శ్శుభాననః ।

గూఢజత్రు స్సుతామ్రాక్షో రామో దేవి జనై శ్శ్రుతః ॥ 15

విశాలమైన మూపులు, పొడవైన దృఢమైన భుజాలు, శంఖంవంటి కంఠం, మంగళకరమైన మోము, పైకి కన్పించని మూపుల సంధి ఎముకలు గల రాముడు, సమస్తలోకాల్లోనూ ప్రసిద్ధుడు.

దుందుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్‌

సమస్సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16

ఆతని ఎలుగు(కంఠస్వరం) భేరీధ్వనిలా ఉంటుంది. నున్నని చక్కని దేహఛాయ, గొప్ప ప్రతాపం కలవాడు. ఎచ్చుతక్కువలు లేక, ఒకటితో ఒకటి చేరని అవయవాలతో అతని దేహం నల్లగా ఉంటుంది.

త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః ।

త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధో గంభీర స్త్రిషు నిత్యశః ॥ 17

రాముని ఱొమ్ము, మణికట్టు, పిడికిలి దిటవుగా, కనుబొమ్మలు, వృషణాలు, బాహువులు దీర్ఘంగా, వెండ్రుకలు, వృషణాలు, మోకాళ్లు సమంగా, నాభి, లోగడుపు, ఱొమ్ము పొడవుగా, కనుగొనలు, నఖాలు, అఱచేతులు, అఱకాళ్లు ఎర్రగా, పాద రేఖలు, వెండ్రుకలు, లింగం నునుపుగా, కంఠధ్వని, నడక, నాభి గంభీరంగా ఉంటాయి.

త్రివలీవాం స్త్ర్యవనత శ్చతుర్వ్యంగ స్త్రిశీర్షవాన్‌

చతుష్కల శ్చతుర్లేఖ శ్చతుష్కిష్కు శ్చతుస్సమః 18

కంఠమందు, పొట్టయందు మూడు రేఖలు గల రాముని స్తనాగ్రాలు, స్తనాలు, రేఖలు పల్లంగా, కంఠం, లింగం, పిఱ్ఱలు, పిక్కలు పొట్టిగా ఉంటాయి. అతని తలలో మూఁడు సుళ్లు, అంగుష్ఠమూలంలో నాలుగు రేఖలు, నుదురు, పాదతలాలు, అఱచేతుల్లో నాలుగు రేఖలు ఉన్నాయి. అతని ఔన్నత్యం తొంబదియా ఱంగుళాలు. అతని బాహువులు, మోకాళ్లు, తొడలు, పిక్కలు సమానంగా, దృఢంగా ఉంటాయి.

చతుర్దశసమద్వంద్వ శ్చతుర్దంష్ట్ర శ్చతుర్గతిః

మహోష్ఠహనునాసశ్చ పంచస్నిగ్ధో౭ష్టవంశవాన్‌ 19

రాముని కనుబొమలు, ముక్కు రంధ్రాలు, కండ్లు, చెవులు, పెదవులు, స్తనాగ్రాలు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, కటిస్థలాలు, చేతులు పాదాలు, పిఱుదులు, సమానంగా ఉంటాయి. అతనికి దంష్ట్రలనఁబడే నాలుగు శుభలక్షణలక్షితాలైన పండ్లు ఉన్నాయి. అతఁడు సింహం, పెద్దపులి, ఏనుగు, వృషభం, ఇవి నడచినట్లు నడుస్తాడు. ఎఱ్ఱఁగా బలిసి ఉండే పెదవులు, బలిసి ఉన్నతాలైన హనువులు, ఉన్నతమైన ముక్కు కలవాడు. అతనికి కండ్లలో, పండ్లలో, దేహచర్మంలో, పాదాల్లో, కేశాల్లో కాంతి ఉంటుంది. అతని బాహువులు, వ్రేళ్లు, తొడలు, పిక్కలు, దీర్ఘాలై ఉంటాయి.

దశపద్మో దశబృత్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్‌

షడున్నతో నవతను స్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః 20

రాముని ముఖం, కండ్లు, నోరు, నాలుక, పెదవులు, దౌడలు, స్తనాలు, గోళ్లు, హస్తాలు, పాదాలు, పద్మాల్లా ఉంటాయి. తల, లలాటం, చెవులు, కంఠం, ఱొమ్ము, హృదయం, కడుపు, చేతులు, కాళ్లు, పిఱ్ఱలు, పెద్దవి. అతఁడు తేజయశోసంపదల్లో ప్రసిద్ధి కెక్కినవాడు. అతని మాతృపితృవంశాలు రెండును పరిశుద్ధాలు. అతని చంక, కడుపు, ఱొమ్ము, ముక్కు మూఁపు, లలాటాలు ఉన్నతాలుగా ఉంటాయి. వ్రేళ్ల గణుపులు, తల వెండ్రుకలు, గోళ్లు, చర్మం, లింగం, మీసం, దృష్టి, బుద్ధి, సూక్ష్మాలు. ఆతఁడు పూర్వాహ్ణ మధ్యా హ్నాపరాహ్ణ కాలాల్లో వరుసగా ధర్మార్థ కామాల్ని అనుష్ఠిస్తాడు.

సత్యధర్మపర శ్శ్రీమాన్‌ సంగ్రహానుగ్రహే రతః

దేశకాలవిభాగజ్ఞః సర్వలోకప్రియంవదః 21

రాముఁడు సత్య ధర్మపాలనలో మిక్కిలి  సక్తి కలవాఁడు. శ్రీమంతుఁడు. ధనాదుల నార్జిస్తాడు. దాన్ని యాచకుల కిస్తాడు. దేశంలో ఏ కాలంలో దేన్ని చేయాలో అదంతా తెలిసినవాడు. సమస్త ప్రాణులతోనూ  ప్రియంగానే మాట్లాడతాడు.

భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రి రపరాజితః

అనురాగేణ రూపేణ గుణై శ్చైవ తథావిథః 22

స సువర్ణచ్ఛవి శ్శ్రీమాన్‌ రామాశ్శ్యామో మహాయశాః ॥

రాముని తమ్ముడు, ఇద్దఱు తల్లుల ముద్దుబిడ్డడు, పరాజయం పొందనివాడు అయిన లక్ష్మణుడు దయలోనూ సౌందర్యంలోనూ ఇతరగుణాల్లోనూ రామునకు సరివచ్చేవాడు.

లక్ష్మణుడు బంగారువన్నెవాడు. రాముడు నీలవర్ణుఁడు.

తా వుభౌ నరశార్దూలౌ త్వద్దర్శనసముత్సుకౌ

విచిన్వంతౌ మహీం కృత్స్నా మస్మాభి రభిసంగతౌ 23

ఆ రామలక్ష్మణులు నీకోసం భూమంతా వెదకుతూ, మమ్మల్ని కలిశారు.

త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరామ్‌

దదర్శతు ర్మృగపతిం పూర్వజే నావరోపితమ్‌ 24

ఋశ్యమూకస్య పృష్ఠే తు బహుపాదపసంకులే

భ్రాతు ర్భయార్త మాసీనం సుగ్రీవం ప్రియదర్శనమ్‌ 25

వారు అలా నిన్ను వెదకుతూ, భూమంతా తిరిగి, అన్న అయిన వాలిచే సింహాసనం నుండి త్రోయబడి, వానివల్ల భయంతో ఋశ్యమూక పర్వతమధ్య ప్రదేశంలో ఉన్న సుగ్రీవుని చూశారు.

వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరమ్‌

పరిచర్యాస్మహే రాజ్యాత్పూర్వజే నావరోపితమ్‌ 26

మేము, సత్యసంగరుడు, వానరాధీశ్వరుడగు సుగ్రీవునకు సేవ చేస్తూంటాము.

తత స్తౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ

ఋశ్యమూకస్య శైలస్య రమ్యం దేశ ముపాగతౌ 27

అంత, నారచీరలు కట్టుకొని, శ్రేష్ఠమైన ధనువులను చేత బూనిన, రామలక్ష్మణులు ఋశ్యమూక పర్వతంలోని సుందరప్రదేశాన్ని చేరారు.

స తౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః

ప్లుతో గిరే స్తస్య శిఖరం భయమోహితః 28

సుగ్రీవుడు, రామలక్ష్మణులను చూసి, భయంతో, వాలి, తన్ను చంపటానికై వీరిని పంపాడేమో అని ఎంచి, ఆ పర్వతశిఖరం మీదికి దుమికాడు.

తత స్స శిఖరే తస్మిన్‌ వానరేంద్రో వ్యవస్థితః

తయో స్సమీపం మామేవ ప్రేషయామాస సత్వరమ్‌ 29

ఆ పిమ్మట, సుగ్రీవుఁడు ఆ పర్వతశిఖరాన ఉండి, రామలక్ష్మణుల ఒద్దకు శీఘ్రంగా నన్నే పంపించాడు.

 

తా వహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవవచనా త్ప్రభూ

రూపలక్షణసంపన్నౌ కృతాంజలి రుపస్థితః 30

సుగ్రీవుని మాట ప్రకారం నేను, రామలక్ష్మణుల ఒద్దకు పోయి చేతులు మొగుడ్చుకొని నిల్చాను.

తౌ పరిజ్ఞాతతత్త్వార్థౌ మయా ప్రీతిసమన్వితౌ

                                                                  పృష్ఠ మారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ 31

నివేదితౌ చ తత్త్వేన సుగ్రీవాయ మహాత్మనే

తయో రన్యోన్య సల్లాపాద్భృశం ప్రీతి రజాయత 32

రామలక్ష్మణులకు యథార్థస్థితిని తెలిపి, వారు సంతోషింపఁగా ఇరువురుని వీపుపై ఉంచుకొని, సుగ్రీవుఁడు ఉండే చోటికి తీసికొనిపోయాను. ఆ తర్వాత రామలక్ష్మణుల యథార్థస్థితిని సుగ్రీవునకు తెలిపాను. రాముఁడు సుగ్రీవుఁడు పరస్పరం మాట్లాడుకోగానే వారికిద్దఱికీ మిక్కిలి స్నేహం కల్గింది.

తత స్తౌ ప్రీతిసంపన్నౌ హరీశ్వరనరేశ్వరౌ

పరస్పరకృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా 33

అంత, నరేశ్వరహరీశ్వరులైన రామసుగ్రీవులు సంతోషం పొంది, ఒకరితో ఒకరు తమ కదివఱకు సంభవించిన స్థితుల్ని చెప్పుకొని, కొంత ఊఱట పొందారు.

తత స్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః

స్త్రీ హేతో ర్వాలినా భ్రాత్రా నిరస్త మురుతేజసా 34

వాలిచే భార్యకారణంగా అవమానింపఁబడి ఉన్న సుగ్రీవుని చూచి. రాముఁడు ఓదార్చాడు.

తత స్త్వన్నాశజం శోకం రామ స్యాక్లిష్టకర్మణః

లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్‌ 35

నీవు అగపడకపోవటం, దానివల్ల రామునకు కల్గిన దుఃఖం గుఱించి లక్ష్మణుఁడు, సుగ్రీవునకు చెప్పాడు.

స శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః

త దాసీ న్నిష్ప్రభో౭త్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్‌ 36

సుగ్రీవుఁడు లక్ష్మణుడు చెప్పిన మాటను విన్నంతనేతనలాగే రామునకూ దుఃఖం సంభవించిందే”  అని రాహువుచే  గ్రసింపబడిన సూర్యునిలా తెల్లబోయాడు.

తత స్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమాణయా

యా న్యాభరణజాలాని పాతితాని మహీతలే 37

తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః

సంహృష్టా దర్శయామాసుః గతిం తు న విదుస్తవ 38

నిన్ను రావణుఁడు కొనిపోయేటప్పుడు నీవు నేల మీద పడ వేసిన సొమ్ముల్ని వానర శ్రేష్ఠులు సంతోషంతో కొని తెచ్చి, రామునకు చూపించారు. వారికి నీ ఉనికి మాత్రం తెలియదు.

తాని రామాయ దత్తాని మయై వోపహృతాని చ

స్వనవం త్యవకీర్ణాని తస్మిన్‌ వితచేతసి 39

ఆ ఆభరణాలు ఆకాశం నుండి గలగల మ్రోగుతూ పడి చెదరిపోగా, నేనే వానిని ఎత్తి పెట్టాను.

వాటిని రామున కిచ్చారు. అతఁడు వానిని చూసి మూర్ఛిల్లాడు.

తా న్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం త

తేన దేవప్రకాశేన దేవేన పరిదేవితమ్‌ 40

ఆ తర్వాత ఆ సొమ్ముల్ని తొడపై ఉంచుకొని, రాముఁడు నానా విధాల రోదించాడు.

పశ్యత స్తాని రుదత స్తామ్యతశ్చ పునః పునః

ప్రాదీపయన్ దాశరథే స్తాని శోకహుతాశనమ్‌ 41

మాటిమాటికి రాముడు ఆ ఆభరణాల్ని చూస్తూ రోదిస్తూ, పరితపించాడు. వాటి దర్శనం రాముని శోకాగ్నిని ప్రజ్వలింపచేసింది.

శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా

మయాపి వివిధై ర్వాక్యైః కృచ్ఛ్రాదుత్థాపితః పునః 42

ఆయన దుఃఖితుడై, బహుకాలం నేలమీద పడి ఉన్నాడు. అందఱితో పాటు నేను కూడా, ఎన్నోరకాల సాంత్వనవాక్యాలతో తేర్పఁగా కష్టం మీద మళ్లీ లేచాడు.

తాని దృష్ట్వా మహాబాహు ర్దర్శయిత్వా ముహుర్ముహుః

రాఘవ స్సహ సౌమిత్రిః సుగ్రీవే స న్యవేయత్‌ 43

రాముడు లక్ష్మణునితో కలిసి, ఆ ఆభరణాల్ని పలుమాఱు చూసి, చూపించి, సుగ్రీవుని చేతి కిచ్చాడు.

స తవాదర్శనా దార్యే రాఘవః పరితప్యతే

మహతా జ్వలతా నిత్య మగ్నినే వాగ్నిపర్వతః 44

పూజ్యురాలా ! నీవు కనపడకపోవటంతో రాముడు మండుతున్న మహాగ్నిచేత అగ్నిపర్వతంలా నిత్యం పరితపిస్తున్నాడు.

త్వత్కృతే త మనిద్రా చ శోక శ్చింతా చ రాఘవమ్‌

         తాపయంతి మహాత్మాన మగ్న్యగార మివాగ్నయః 45

నీ కారణంగా రాముని, అనిద్ర, దుఃఖం, చింత అగ్నిగృహాన్ని అగ్నుల్లా తపింపచేస్తున్నాయి.

త వాదర్శనశోకేన రాఘవః ప్రవిచాల్యతే

     మహతా భూమికంపేన మహానివ శిలోచ్చయః 46

నీవు కనపడకపోవటం వల్ల కల్గిన దుఃఖంతో భూకంపంచేత చలిస్తున్న పర్వతంలా కంపిస్తున్నాడు.

కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ

చర న్న రతి మాప్నోతి త్వా మపశ్య న్నృపాత్మజే 47

నిన్ను చూడకున్నందున, మనోహరాలైన వనాలు, నదులు, సెలయేళ్ల ప్రదేశాలలో తిరిగినా రామునికి ఆనందం కల్గడం లేదు.

స త్వాం మనుజశార్దూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః

సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే 48

రాముఁడు ఇంక శీఘ్రంగా, మిత్రభాంధవసహితంగా రావణుని చంపి, నిన్ను పొందుతాడు.      

సహితౌ రామసుగ్రీవా వుభా వకురుతాం తదా

సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా 49

రామసుగ్రీవులు పరస్పరం (రాముడు) వాలిని చంపేటట్లు, (సుగ్రీవుఁడు) నిన్ను వెదకేటట్లు ప్రతిజ్ఞ చేసికొన్నారు.

తత స్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః

కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః 50

ఆ పిమ్మట రామసుగ్రీవులు కిష్కింధకు పోయి యుద్ధంలో వాలిని కూల్చారు.

తతో నిహత్య తరసా రామో వాలిన మాహవే

సర్వర్క్షహరిసంఘానాం సుగ్రీవ మకరో త్పతిమ్‌ 51

అప్పుడు రాముడు సమస్తభల్లూకవానరసంఘాలకు సుగ్రీవుని ప్రభువుగా చేశాడు.

రామసుగ్రీవయో రైక్యం దేవ్యేవం సమజాయత

నుమంతం చ మాం విద్ధి తయో ర్దూత మిహాగతమ్‌ 52

ఈ ప్రకారం రామునకు సుగ్రీవునకు సమాగమం కల్గింది. నేను హనుమంతుఁడను. ఆ రామసుగ్రీవుల పనుపున దూతనై ఇక్కడికి వచ్చానని తెలుసుకో.

స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః స్సమానీయ హరీశ్వరాన్‌

త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్‌ 53

సుగ్రీవుడు, రాజయ్యాక, బలవంతులైన వానరనాయకుల్ని రప్పించి, నిన్ను వెదకటానికై పది దిక్కులకూ పంపించాడు.

ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా

అద్రిరాజప్రతీకాశా స్సర్వతః ప్రస్థితా మహీమ్‌ 54

పెద్దకొండలంతటి వానరులు సుగ్రీవుని ఆజ్ఞను శిరసావహించి నిన్ను వెదకుతూ భూమంతా తిరుగుతున్నారు.

తత స్తే మార్గమాణా వై సుగ్రీవవచనాతురాః

చరంతి వసుధాం కృత్స్నామ్ వయ మన్యే చ వానరాః 55

అప్పటినుండి నేను మొదలుగా ఆ వానరుల మందఱం సుగ్రీవుని ఆజ్ఞకు భయపడి, నిన్ను వెదకుతూ,  భూమంతా తిరుగుతున్నాం.

అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూను ర్మహాబలః

ప్రస్థితః కపిశార్దూస్త్రిభాగబలసంవృతః 56

వాలిపుత్రుడైన అంగదుఁడు మూఁడవవంతు సైన్యంతో కలసి, మాతో బయలుదేరి వచ్చాడు.

తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వతసత్తమే

భృశం శోకపరీతానా మహోరాత్రగణా గతాః 57

అలా మేం నిన్ను వెదకుతూ వింధ్యపర్వతబిలంలో ప్రవేశించి మరల వచ్చే దారి తెలియక మిక్కిలి దుఃఖిస్తూ, పె క్కహోరాత్రాలు గడపాం.

తే వయం కార్యనైరాశ్యా త్కాల స్యాతిక్రమేణ చ

భయాచ్చ కపిరాజస్య ప్రాణాం స్త్యక్తుం వ్యవస్థితాః 58

సుగ్రీవుఁడు నిర్ణయించిన కాలం అతిక్రమించిపోవటంతో ఇక కార్యసాధనకు ఉపాయం కానక, సుగ్రీవునివలని భయంతో ప్రాణాలు విడువాలని నిశ్చయించాం.

విచిత్య వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ

అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాం స్త్యక్తుం సముద్యతాః

తత స్తస్య గిరే ర్మూర్ధ్ని వయం ప్రాయ ముపాస్మహే ॥ 59

దుర్గమారణ్యాలు, పర్వతాలు, సెలయేఱులు అన్ని పట్టుల్లోనూ వెదకి, నీ ఉనికిని కానక, ప్రాణాలు విడువాలని నిశ్చయించాం. ఆ పర్వతశిఖరంపై, ప్రాయోపవేశానికి పూనుకొన్నాం.

దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్వానరపుంగవాన్‌

భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయ దంగదః 60

తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా

ప్రాయోపవేశ మస్మాకం మరణం చ జటాయుషః 61

అపుడు అంగదుఁడు ప్రాయోపవిష్టులైన వానరుల నందఱ్నీ చూసి, దుఃఖసముద్రంలో మునిగి, నీవు కనపడకపోవటం, వాలి చంపఁబడటం, తమ ప్రాయోపవేశం, జటాయువు మరణం, వీని నన్నింటిని పేర్కొని దు:ఖించాడు.

తేషాం న స్స్వామిసందేశా న్నిరాశానాం ముమూర్షతామ్‌

కార్యహేతో రివాయాతః శకుని ర్వీర్యవాన్ మహాన్‌ 62

గృధ్రరాజస్య సోదర్యః సంపాతి ర్నామ గృధ్రరాట్‌

శ్రుత్వా భ్రాతృవధం కోపా దిదం వచన మబ్రవీత్‌ 63

సుగ్రీవుని ఆజ్ఞను అతిక్రమించడంవల్ల బ్రతుకుపట్ల నిరాశతో ప్రాణాలు విడువనున్న మాకుఁ కార్యసిద్ధిని ఇవ్వటానికే వచ్చినట్లు అక్కడికి వచ్చిన పక్షిరాజు సంపాతి, తన తమ్ముడైన జటాయువు వధను విని, కోపంతో ఇలా అన్నాడు.

యవీయాన్‌ కేన మే భ్రాతా హతః క్వ చ నిపాతితః

ఏత దాఖ్యాతు మిచ్చామి భవద్భి ర్వానరోత్తమాః 64

ఓ వానరశ్రేష్టులారా! నాతమ్ముడగు జటాయువును ఎవడు చంపాడు ? ఎక్కడ చంపాడు ? మీరీ సంగతిని చెప్పవలసిందిగా కోరుతున్నాను.

అంగదో౭కథయ త్తస్య జనస్థానే మహద్వధమ్‌

రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథమ్ 65

జనస్థానంలో నీ కొఱకై రావణుడు, జటాయువును చంపడం మొదలైన వృత్తాంతాన్నంతా, అంగదుడు, ఉన్నది న్నట్లుగా  చెప్పాడు.

జటాయుషో వధం శ్రుత్వా దుఃఖిత స్సోరుణాత్మజః

త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే 66

అరుణుని కొడుకైన ఆ సంపాతి, జటాయువు మరణానికి దుఃఖితుడై, నీవు రావణు నింట ఉన్నావని మాకు చెప్పాడు.

తస్య త ద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనమ్‌

అంగదప్రముఖా స్తూర్ణం తతః సంప్రస్థితా వయమ్‌ 67

పరమసంతోషవర్ధనమైన ఆ సంపాతిమాటను విని అంగదుఁడు మొదలు మేమందఱం శీఘ్రంగా అక్కడినుండి ప్రయాణమయ్యాం.

వింధ్యా దుత్థాయ సంప్రాప్తాః సాగర స్యాంత ముత్తమ్‌

త్వద్దర్శన కృతోత్సాహా హృష్టాః తుష్టాః ప్లవంగమాః 68

అంత వానరులందఱు నిన్ను సందర్శింప ఉత్సుకులై, సంతోషంతో సముద్రపు ఉత్తరగట్టును చేరారు.

అంగదప్రముఖా స్సర్వే వేలోపాంత ముపస్థితాః

చింతాం జగ్ముః పునర్భీతా స్త్వద్దర్శనసముత్సుకాః 69

ఆవిధంగా అంగదుఁడు మున్నగువార లందఱు నిన్ను చూసే ఉత్సాహంతో సముద్రపు గట్టు చేరి సముద్రాన్ని చూసి, భయపడి, మళ్లీ చింతించారు.

అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః

వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః 70

అంత నేను సముద్రాన్ని చూసి, వాళ్ల తీవ్రమైన భయాన్నిపోగొట్టి, నూఱు యోజనాల దూరం గల సముద్రాన్ని దాటివచ్చాను.

లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా

రావణశ్చ మయా దృష్టః త్వం చ శోకపరిప్లుతా 71

రాక్షసులచే నిండి ఉన్న ఈ లంకలోకి రాత్రిపూట ప్రవేశించాను. రావణునీ చూశాను. పరమదు:ఖితవై ఉన్న నిన్నూ చూశాను.

త త్తే సర్వ మాఖ్యాతం యథావృత్త మనిందితే

అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథే రహమ్‌ 72

ఈ వృత్తాంతాన్నంతా జరిగింది జరిగినట్లుగా నీకు చెప్పాను. నేను, రాముని దూతను. నాతో మాట్లాడు.

తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్త మిహాగతమ్‌ ।

సుగ్రీవసచివం దేవి బుద్ధ్వస్వ పవనాత్మజమ్‌ ॥ 73

నేను రామకృతోద్యోగినై నీకొరకై ఇక్కడకు వచ్చాను. సుగ్రీవునకు మంత్రిని. వాయుపుత్రునిగా నన్ను తెలుసుకో.

కుశలీ తవ కాకుత్థ్సః సర్వశస్త్రభృతాం వరః ।

గురో రారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః 74

సర్వశస్త్రభృతాంవరుడైన రాముడు, క్షేమంగా ఉన్నాడు. అన్నకు సేవలు చేస్తూ, లక్ష్మణుడూ కుశలంగా ఉన్నాడు.

తస్య వీర్యవతో దేవి భర్తు స్తవ హితే రతః ।

అహ మేకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనా దిహ ॥ 75

సుగ్రీవుని ఆజ్ఞచే, నీ పెనిమిటి హితం కోరి, నే నొక్కఁడను మాత్రమే ఇక్కడికి వచ్చాను.

మయేయ మసహాయేన చరతా కామరూపిణా

దక్షిణా ది గనుక్రాంతా త్వన్మార్గవిచయైషిణా 76

నే నొక్కడ్నే నీవు ఉండే చోటును వెదకఁగోరి అసహాయుడ్నై, కామరూపినై తిరుగుతూ, ఈ దక్షిణదిక్కు చేరాను.

దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశ మనుశోచతామ్‌ ।

అపనేష్యామి సంతాపం త వాభిగమశంసనాత్‌ ॥ 77

నీవు కనబడకపోవటంతో దుఃఖిస్తున్న వానరులకు, భాగ్యవశాన నీవు అగపడిన సంగతిని చెప్పి, వారి దుఃఖాన్ని పోగొడతాను.

దిష్ట్యా హి మమ న వ్యర్థం దేవి సాగరలంఘనమ్‌ ।

ప్రాప్స్యా మ్యహ మిదం దిష్ట్యా త్వద్దర్శనకృతం యశః ॥ 78

నా అదృష్టం. నేను సముద్రాన్ని దాటి ఇంత దూరం రావడం వ్యర్థం కాలేదు. నాభాగ్యవశాన నిన్ను చూడ్డం వల్ల కల్గిన మహాకీర్తినీ పొందుతాను.

రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వా మభిపత్స్యతే

మిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపమ్‌ 79

రాముడును, శీఘ్రంగా, మిత్ర బంధు సమేతుడైన, రావణుని, సంహరించి, నిన్ను చేపడతాడు.

మాల్యవా న్నామ వైదేహి గిరీణా ముత్తమో గిరిః

తతో గచ్ఛతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః 80

ఓ వైదేహీ! మాల్యవంతం అనే ప్రసిద్ధపర్వతం ఉంది. కేసరి అనే వానరుడు, అక్కడినుండి, గోకర్ణం అనే పర్వతానికి వెళ్లాడు.

స చ దేవర్షి భిర్దిష్టః పితా మమ మహాకపిః

తీర్థే నదీపతేః పుణ్యే శంబసాదన ముద్ధరత్‌ 81

నా తండ్రియైన, ఆ మహాకపి, దేవర్షులచే ఆజ్ఞాపించబడి, సముద్రంయొక్క పుణ్యతీర్థంలో, శంబసాదనుడనే రాక్షసుని, సంహరించాడు.

త స్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి

హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా 82

నేను కేసరి భార్యయందు వాయుదేవునిచే పుట్టాను. నేను చేసిన కార్యానికి గుఱ్తుగా లోకంలో నాకు హనుమంతుడనే  పేరు కల్గింది.

విశ్వాసార్థం తు వైదేహి భర్తు రుక్తా మయా గుణాః

అచిరా ద్రాఘవో దేవి త్వా మితో నయితానఘే 83

నీకు నమ్మకం కలగడం కోసం నీ పెనిమిటి గుణాల్ని చెప్పాను. రాముఁ డింక శీఘ్రంగానే నిన్నిక్కడనుండి కొనిపోగలడు.”

ఏవం విశ్వాసితా సీతా హేతుభి శ్శోకకర్శితా ।

ఉపపన్నై రభిజ్ఞానై ర్దూతం త మచ్ఛతి 84

హనుమంతుడు చెప్పిన సరైన గుఱ్తులచే సీత, అతని రామదూతగా నమ్మింది.

అతులం చ గతా హర్షం ప్రహర్షేణ తు జానకీ ।

నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమో చానందజం జలమ్‌ ॥ 85

ఆమె అప్పుడు సరిలేని సంతోషాన్ని పొంది, వంకరైన కనుబొమ్మలతో అందమైన కళ్లనుండి ఆనందబాష్పాల్ని విడిచింది.

చారు తద్వదనం తస్యా స్తామ్రశుక్లాయతేక్షణమ్‌ ।

అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్‌ ॥ 86

తామ్రశుక్లాయతేక్షణ, విశాలాక్షి, ఆ సీత అందమైన ముఖం రాహువుచే విడువబడిన చంద్రునిలా ప్రకాశించింది.

హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా

అథోవాచ హనూమాం స్తా ముత్తరం ప్రియదర్శనామ్‌ 87

ఆ సీతాదేవి హనుమంతుని స్పష్టంగా వానరుఁడనీ, మాయావి కాడనీ తెలిసికొంది. అంత హనుమంతుఁడు   సీతతో, మళ్లీ ఇలా చెప్పాడు.

త త్తే సర్వ మాఖ్యాతం సమాశ్వసిహి మైథిలి

కిం కరోమి కథం వా తే రోచతే ప్రతియా మ్యహమ్‌ 88

“ఓ మైథిలీ! నీ కీవృత్తాంతాన్నంతా చెప్పాను. ఊఱడిల్లు. నేను ఇప్పుడేం చేయాలి? నీ కేమి తోస్తోంది. శీఘ్రంగా ఆనతియ్యి. నేను పోయిరావాలి.

హతేసురే సంయతి శంబసాదనే

కపిప్రవీరేణ మహర్షిచోదనాత్‌ ।

తతోస్మి వాయుప్రభవో హి మైథిలి

ప్రభావత స్తత్ప్రతిమశ్చ వానరః ॥ 89

మహర్షుల ప్రేరేపణతో నాతండ్రి కేసరి యుద్ధంలో శంబసాదనుని చంపినందువల్ల నేను వాయువునకు పుట్టాను. ప్రభావంలో ఆ వాయువునకు సమానుఁడను.”

--------------------------------------------------------------------------------------

ఆనందరామాయణాంతర్గత

శ్రీరామాష్టకం

సంసారసారం నిగమప్రచారం ధర్మావతారం హృతభూమిభారం

సదాఽవికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి 2

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే పఞ్చత్రింశస్సర్గః (35)

 

మంగళం మహత్

 

  

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...