30, ఏప్రిల్ 2012, సోమవారం

Meghaduta 65

మేఘసందేశం - 65 వ శ్లోకం

తస్యోత్సంగే ప్రణయిన ఇవ స్రస్తగంగాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్,
యా వః కాలే వహతి సలిలోద్గార ముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీవాభ్రబృందం.



భావం:



ఆ కైలాసపర్వతం మీద అలకాపురి,

ప్రియుని తొడపై ఉన్న కామినిలా ఉన్నది.

ఆ దరినున్న గంగ,

ఆ కామిని మొలనుండి కొంచెం జారిన శ్వేతవస్త్రంలా ఉన్నది.

ప్రియునిచే లాలింపబడుతూ, అలక తీరినట్లున్నది.

వర్షాకాలంలో చినుకులు రాల్చుతూండగా,

ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది.

ఈ సంగతులన్నీ కామచారివైన

నీకు తెలియకుండా ఉండవు.



వివరణ:



కైలాసపర్వతం అనుకూలుడు అనే నాయకుడైతే,

లాలింపబడే అలకాపురి స్వాధీనపతిక అనే నాయిక అని ధ్వనిస్తున్నది.




ఆ పురిలో ఎత్తైన భవనాలున్నాయి.

వాటి దాపున వర్షాకాలంలో మేఘాలు తిరుగాడుతూంటాయి.

అవి చినుకులను కురిపిస్తూంటే,

చూడటానికి ఎలా ఉందంటే,

ప్రియురాలి ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది.


పూర్వమేఘం సమాప్తం


మంగళం మహత్

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

మేఘసందేశం 64 వ శ్లోకం



హేమాంభోజ ప్రసవి సలిలం మానసస్యాదదానః
కుర్వ న్కామం క్షణముఖపట ప్రీతిమైరావతస్య ,
ధున్వన్కల్పద్రుమకిసలయాన్యంశుకాని స్వవాతై
ర్నానాచేష్టైర్జలద లలితైర్నిర్విశేస్తం నగేంద్రమ్ .



భావం:



మేఘుడా! బంగారు తామరపూలు కల మానససరోవరంలో నీరు త్రాగు.

ఐరావతం యొక్క ముఖానికి అలంకారమైన వస్త్రంలా అయ్యి, క్షణకాలం ప్రీతి కలిగించు.

కల్పవృక్షాల చిగుళ్లనే సన్నని వస్త్రాలను నీ వాయువుచేత విదలిస్తూ సరదా చూడు.

ఇలా నీ కిష్టమైన ఆటలాడి, ఆ పర్వతాన భోగించు.




వివరణ:



60 వ శ్లోకం నుండి మొదలైన కైలాసపర్వత ప్రశంస ఈ శ్లోకంతో ముగుస్తోంది.

ఇక మీద నుంచి అలకాపురి వర్ణన.

అందువల్లనేమో ఇచ్ఛవచ్చినట్లు ఆ పర్వతంపై ఆడుకోమంటున్నాడు.




మానససరోవరంలో బంగారు తామరపూలు ఉన్నాయి.

బంగారంతో సంస్పర్శమైన నీరు త్రాగడం చాల మంచిది. శ్రేష్ఠం.




ఐరావతం ఇంద్రుని వాహనం. ఆ ఏనుగు కైలాసపర్వతం దగ్గర ఎందుకున్నదీ అంటే,

శివసేవార్థం ఇంద్రుడు వచ్చాడని భావించవచ్చు.



అలాగే కల్పవృక్షాలు స్వర్గంలోనే ఉన్నాయనుకోనక్కరలేదు.

కోరిన ఫలాల్ని కల్పించే వృక్షమే కల్పవృక్షం.

సాక్షాత్తు పరమశివుడు కొలువైన కైలాసపర్వతాన కల వృక్షాలన్నీ కల్పవృక్షాలే.



ఇక నానావిధ చేష్టలతో ఆ పర్వతంపై క్రీడించు అనడంలో ఔచిత్యం ఉందా అంటే ఉన్నదని చెప్పవచ్చు.

ఎందుకంటే  పర్వతం మేఘుని మిత్రగృహం. పర్వతానికి మేఘానికి సహజమైత్రి.

సహజమైత్రి అంటే దర్శనంతోనే స్నేహం ఏర్పడటం.

వాటికే కాదు శిఖిమేఘాలకు (శిఖి=నెమలి), అబ్జసూర్యులకు (అబ్జం=పద్మం), సముద్రచంద్రులకు,

దృష్టిరమ్యాలకు ( చూపుకు అందానికి మైత్రి. అందం కనబడగానే చూపు ఆనందిస్తుంది. 

తనను చూసి ఆనందించే చూపును చూసి, అందమూ ఆనందిస్తుంది ).

పై జంటలు ఒకదాని దర్శనంతో మరొకటి ఆనందిస్తాయి. అందువల్ల వాటికి సహజమైత్రి.

అందువల్ల నీ మిత్రుని గృహంలో నీవు నీ ఇష్టం వచ్చినట్లు క్రీడించు అంటున్నాడు.



ఇష్టం వచ్చినట్లు అని వ్రాయబోతున్నందున

కాళిదాసు విభిన్నాంశాలను అంటే పొంతనలేని అంశాలను శ్లోకంలో కూర్చాడు.

మొదటిపాదంలో జలపానం, రెండవపాదంలో ఐరావతంతో క్రీడ, మూడవపాదంలో కల్పవృక్షాలతో క్రీడ.



ఇలా చెప్పి, కాళిదాసు ఇక అలకాపురిని మేఘునికి (మనకు కూడా) పరిచయం  చేయబోతున్నాడు.














మంగళం మహత్

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...