మేఘసందేశం - 65 వ శ్లోకం
తస్యోత్సంగే ప్రణయిన ఇవ స్రస్తగంగాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్,
యా వః కాలే వహతి సలిలోద్గార ముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీవాభ్రబృందం.
భావం:
ఆ కైలాసపర్వతం మీద అలకాపురి,
ప్రియుని తొడపై ఉన్న కామినిలా ఉన్నది.
ఆ దరినున్న గంగ,
ఆ కామిని మొలనుండి కొంచెం జారిన శ్వేతవస్త్రంలా ఉన్నది.
ప్రియునిచే లాలింపబడుతూ, అలక తీరినట్లున్నది.
వర్షాకాలంలో చినుకులు రాల్చుతూండగా,
ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది.
ఈ సంగతులన్నీ కామచారివైన
నీకు తెలియకుండా ఉండవు.
వివరణ:
కైలాసపర్వతం అనుకూలుడు అనే నాయకుడైతే,
లాలింపబడే అలకాపురి స్వాధీనపతిక అనే నాయిక అని ధ్వనిస్తున్నది.
ఆ పురిలో ఎత్తైన భవనాలున్నాయి.
వాటి దాపున వర్షాకాలంలో మేఘాలు తిరుగాడుతూంటాయి.
అవి చినుకులను కురిపిస్తూంటే,
చూడటానికి ఎలా ఉందంటే,
ప్రియురాలి ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది.
పూర్వమేఘం సమాప్తం
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి