9, ఫిబ్రవరి 2013, శనివారం

13, 14, 15 తేదీల్లో వివాహాల మీద సందేహం...!?

ఈ 2013 ఫిబ్రవరి 13, 14, 15 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష పెళ్లిళ్లని,
(తర్వాత శుక్ర మౌఢ్యంవల్ల ముహూర్తాలు లేవు)  పేపరు వార్త.

కానీ మౌఢ్యం (అందరూ మూఢం/మూఢమి అని వ్యవహరిస్తారు. మనం కూడా అర్థం కావడానికి అలా వాడదాం) లో మాత్రమే కాదు.

మూఢం ముందు వెనుక కూడా కొన్ని రోజులు వివాహాది శుభకార్యాలు చేయకూడదని విన్నాను.

నాకు తెలిసిన విషయాలు మనవి చేస్తాను.
 " కాస్త వినండి. "

రవితో గురుశుక్రులు కలవడాన్నే మూఢమి అంటారు.
గురుడు కలిస్తే గురుమూఢం. శుక్రుడు కలిస్తే శుక్రమూఢం.
దీన్నే గురుశుక్రుల అస్తమయం అని కూడా అంటారు.
అస్తమయదినం నుండి మూఢం.
మూఢం పూర్తి అయిన రోజున గురుడయితే గురూదయం శుక్రుడయితే శుక్రోదయం అవుతుంది.

ఇందులో మరల వీరు తూర్పున అస్తమించడం, పశ్చిమాన అస్తమించడం అని రెండు రకాలు.
దీన్ని పంచాంగంలో చూసి తెలుసుకోవచ్చు.

ఈ నందన సం||రం, మాఘమాసంలో షష్ఠినుండి (16 ఫిబ్రవరి 2013 ) శుక్రమూఢం.
ఈ సారి శుక్రుడు తూర్పున అస్తమిస్తున్నాడు.

అస్తమించడానికి ముందు కొన్ని రోజులు శుక్రుడు  వృద్ధుడై ఉంటాడు.
తిరిగి ఉదయించాక కొన్నిరోజులు బాలుడై ఉంటాడు. అలాగే గురుడు కూడా.

అంటే        =       వృద్ధత్వం   **   అస్తమయం   ***  బాలత్వం
                                                  (మూఢం)

వృద్ధత్వం, బాలత్వం ఎంతకాలం?

ఈ విషయంలో "ముహూర్తచింతామణి" అనే సుప్రసిద్ధగ్రంథంలో ఆ గ్రంథరచయిత,

"పురః పశ్చాద్భృగోర్బాల్యం త్రిదశాహంచ వార్థకం
పక్షం పంచదినం తేద్వే గురోః పక్షముదాహృతైః
తే దశాహం ద్వయోః ప్రోక్తకైశ్చిత్సప్తదినం పరైః
త్ర్యహంత్వాత్వయికస్యన్యై రర్ధాహంచ త్ర్యహంవిధోః"  అన్నది.

భావం : శుక్రుడు తూర్పున అస్తమించేముందు  15 రోజులు వృద్ధుడు.
          తిరిగి                 ఉదయించేముందు  3 రోజులు బాలుడు.
                    పశ్చిమాన అస్తమించేముందు  5 రోజులు వృద్ధుడు.
         తిరిగి                   ఉదయించేముందు 10 రోజులు బాలుడు.

ఇక గురునకు బాల్యవార్థక్యాలు రెండూ 15 రోజులు.

అని తన నిశ్చితాభిప్రాయం చెప్పి,

గురుశుక్రులు ఉభయులకూ కొందఱు 10 రోజులని,  కొందఱు 7 రోజులని,
కార్యావశ్యాన్ని బట్టి 3 రోజులని కొందఱూ చెప్తున్నారంటూ,

మూఢంలోనే కాక ఈ రోజుల్లో కూడా వివాహాదులు చెయ్యకూడదన్నాడు.

ఇక  మహాకవి కాళిదాసు తన కాలామృతంలో పై విధంగానే చెప్తూ,
శుక్రుడు పశ్చిమాన అస్తమించాక 10 రోజులన్నాడు. (ఇది కాళిదాసు నిశ్చితాభిప్రాయం.)

అని చెప్పి, కొందఱు 5 రోజులంటారని తెల్పాడు.

గురుశుక్రులు ఉభయులకూ కొందఱు 5 రోజులంటారన్నాడు.

ఇంకా చెప్తూ, వింధ్యపర్వతదక్షిణదేశస్థులు 3 రోజులు విడిచి, వివాహాదులు చేయవచ్చునని కొందఱన్నారంటాడు.

ఈ ఇద్దరు ప్రామాణికగ్రంథకర్తలూ తమ అభిప్రాయాలు చెప్పి, మిగిలినవారి అభిప్రాయాలు కూడా చెప్పారు.

మీరు జాగ్రత్తగా గమనిస్తే, కనీసం 3 రోజులు కచ్చితంగా వదలాలని తెలుస్తుంది.


మఱి 16 ఫిబ్రవరి 2013 నుండి మూఢం అయినప్పుడు, కనీసం  3 రోజులు ముందు పనికిరాదు అంటే
13, 14, 15  తేదీల్లో వివాహాలు ఎలా చేస్తారు?

కాన ఈ విషయమై విజ్ఞులు  నా ఈ సందేహాన్ని తీరుస్తారని ఆశిస్తున్నాను.
మంగళం మహత్

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...