31, మార్చి 2011, గురువారం

మేఘసందేశం 6 వ శ్లోకం

మేఘసందేశం 6 వ శ్లోకం


జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్థిత్వం త్వయి విధివశాద్దూరబంధుర్గతో౭హం
యాంచా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా   6

భావం :

నిన్ను, భువనాల్లో ప్రసిద్ధమైన పుష్కలావర్తకాలనే మేఘాలయొక్క వంశంలో పుట్టినవానిగాను,
ఇచ్చ వచ్చిన రూపం (ధరింప) గలవానిగాను,
ఇంద్రునకు ప్రధానపురుషునిగాను, ఎఱుగుదును.
విధివశంవల్ల దూరప్రదేశంలో బంధువులు గల నేను,
ఆ కారణంచేత, నిన్ను, యాచిస్తున్నాను.
గుణాలు అధికంగా గలవానిని యాచించిన యాచన,
వ్యర్థమైనా, ఇంచుక ప్రియమైనది.
అధములను ఆశ్రయించి, పొందిన కోరిక,
ఫలించినదైనా (అనగా అధముల ద్వారా ఫలితాన్ని పొందినా)
ప్రియమైనది కాదు. ఉత్తమమైంది కాదు.

విశేషాలు :

- మేఘుని వంశాన్ని , సామర్థ్యాన్ని , పలుకుబడిని పొగుడుతున్నాడు.
సహజమే కదా!
ఈ మూడింటిని ప్రశంసిస్తే, పడనివాడెవ్వడు?
ప్రసన్నుడు కానివాడెవ్వడు ?
అప్పుడేకాదు.
ఇప్పుడుకూడా ఈ "మూడింటి "ద్వారానే కదా! చక్రం తిప్పుతున్నారు.
పని చేసిపెట్టేవారిని ఈ విషయాల్లో పొగిడితే పనైపోతుందనే లోకరీతిని, కాళిదాసు వర్ణిస్తున్నాడు.

- "కొంచెం చేసిపెట్టు" "ఈ పని చేయాలి " ఇలా అడిగే కంటే "యాచిస్తున్నాను" అంటే,
అవతలివాడు, తాను ఉన్నతుడైనట్లు భావిస్తాడు.
అసలు యాచన నీచం అంటారా!
నిజమే, ధనం లేనివాడు కాదట దరిద్రుడు.
యాచించినవాడే అసలైన దరిద్రుడు.
సరే మఱి " కొంచెం చేసిపెట్టు" అనడం యాచనేగా !
తేడా ఏముంది ?
ఎలాగా అడుక్కోవాల్సి వచ్చినప్పుడు,
యాచిస్తున్నాను అంటే పోయేదేముంది?

- కామరూపంవల్ల మేఘుడు మానవరూపం కూడా ధరించగలడని విశదమవుతున్నది.
5 వ శ్లోకంలో ఇంకా సందేహం ఉన్నవారికి, ఇపుడు నిస్సందేహమవుతుంది.

- అలాగే, వంశం భువనప్రసిద్ధం ఎప్పుడవుతుంది?
ఆ వంశసంజాతులందఱూ, సజ్జనులైనప్పుడు, పరోపకారులైనప్పుడు. రఘువంశం లాగ.

- "నాకు సహాయం చేస్తే, నీ వంశం భువనప్రసిద్ధమవుతుంది" అని కూడా యక్షుడు,
నర్మగర్భంగా సూచించినట్లు భావించవచ్చు.

సాహిత్యం ఆలోచనామృతం.

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...