30, మార్చి 2011, బుధవారం

మేఘసందేశం 5 వ శ్లోకం

ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః 
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః 
ఇత్యౌత్సుక్యాదపరిగణయ౯ గుహ్యకస్తం యయాచే 
కామార్తా హి ప్రకృతికృపణా శ్చేతనాచేతనేషు

భావం : ధూమం, జ్యోతి, సలిలం మరుత్తుల కలయిక అయిన మేఘం ఎక్కడ? 
సమర్థాలైన ఇంద్రియాలు గల ప్రాణులచేత పంపదగిన వార్తావిషయాలు ఎక్కడ? 
ఉత్సుకతచేత ( ప్రియురాలిని ఎప్పుడు కలిసికొందునా అని తహతహచేత ) ఇది పరిగణించక, 
యక్షుడు, ఆ మేఘాన్ని ( తన క్షేమవార్తను ప్రియురాలికి చెప్పమని ) యాచించాడు. 
( అవును ) అంతే కదా! కామార్తులు, చేతనాచేతన విషయాల్లో స్వభావంచేత దీనులు. 
అనగా తెలివిమాలినవారు. 
యుక్తాయుక్త విచారం లేనివారని అర్థం.

విశేషాలు : ~ 4 వ శ్లోకం చదువుతూనే, ఆవేశపరులైన పాఠకులు కొందఱు, 
మేఘం చేత సందేశం పంపడమేమిటి? నాన్సెన్స్. అనేస్తారని 
కవికులగురువు కాళిదాసు, తానే ప్రశ్న వేసుకొని, వెంటనే సమాధానం చెప్పేశాడు.

నిజమైన గురువులు శిష్యుల ప్రశ్నలను తామే వేసుకొని, 
జవాబులతో పాఠ్యబోధనకు సిద్ధమవుతారు. 
ఇక శిష్యుల సందేహాలకు తావెక్కడ? 
అటువంటి గురువులుంటే శిష్యులు సిద్ధులవుతారు. 
తమ గురువులను ప్రసిద్ధులను చేస్తారు.

~ ధూమం = పొగ జ్యోతి = వెలుగు, అగ్ని సలిలం = నీరు మరుత్తు = గాలి వీటి కలయికట మేఘం. 
సైన్స్ ఇంత అందంగా చెప్పలేదోమో గదా!

~ ఇక్కడ వార్తాహరుల లక్షణాలను కాళిదాసు చెప్తున్నాడు. 
" పుల్లయ్య -వేమవరం " లాగ కాకుండా, 
వారు పటుకరణులై ఉండాలిట. 
అంటే తగిన సమర్థులై ఉండాలి. 
ఒకరు పంపిన వార్తను దూరంగా ఉన్నవారికి చేరవేసేటప్పుడు, 
అవతలివారి అనుబంధ సందేహాలను కూడా తీర్చగలిగిన నేర్పరులై ఉండటమే కాదు. 
ప్రయాణశ్రమను కూడా తట్టుకోగలిగి ఉండాలి. 
అది పటుకరణులు అంటే. 
ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు ఆనాడు లేవుగా! 
ప్రతి చిన్న విషయానికి వెనక్కి తిరిగి రాలేరుగా!

~ " యాచన " అనే పదం యక్షుని దీనస్థితిని తెలియజేస్తుంది. 
కామవిషయంలో దిగజారాడు కాబట్టి యాచించాడు. 
సహాయం చేసిపెట్టమని. 
నిజానికి ఈ యాచన భగవంతుని అనుగ్రహం పట్ల ఉండాలి.

~ కామార్తులకు చేతనాచేతనాల్లో జడత్వాన్ని ఇచ్చి, ప్రకృతి కృపణ చూపిస్తుంది. 
భగవదార్తులకు చేతనాచేతనాల్లో చైతన్యాన్ని ( భగవద్దర్శనం ) ఇచ్చి, ప్రకృతి కృప చూపిస్తుంది. 
( ఇది ఆయా పదాల ఆధారంగా నాకు తోచిన ఆలోచన. 
పొరపాట్లను పండితులు పరిగణించవలదని, 
మన్నించమని ప్రార్థన.)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...