16, మే 2020, శనివారం

Sundarakanda సుందరకాండ 1-3



రామసుందరం 1-3
లఘుత్వేనోపపన్నం తత్  విచిత్రం సాగరే౭పతత్ |
ద్రుమాణాం వివిధం పుష్పం  కపివాయుసమీరితం |
తారాశతమివాకాశం  ప్రబభౌ స మహార్ణవః || 53 ||
తేలిక కాబట్టి, పూలు ఆయన వేగానికి మఱికొంత దూరం అనుసరించి, విచిత్రంగా సాగరం*లో పడ్డాయి. అపుడా అర్ణవం (సముద్రం) అసంఖ్యాకతార*లతో కూడిన ఆకాశం అయ్యింది.
పుష్పౌఘేణానుబద్ధేన  నానావర్ణేన వానరః |
బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణవిభూషితః || 54 ||
తన శరీరాన్ని అంటుకొని ఉన్న  రంగురంగుల పూలతో అతడు, ఆకాశంలో మెఱపుతీగెలతో కూడిన మేఘంలా మెఱశాడు.
తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయ మదృశ్యత |
తారాభి రభిరామాభిః ఉదితాభి రివాంబరమ్ || 55 ||
ఆయన వేగానికి  చెల్లాచెదరై పడిన పువ్వులతో సముద్రజలం, ఉదయిస్తున్న, అందమైన తారలతో అలరారే అంబరంలా కనబడింది.
తస్యాంబరగతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ |
పర్వతాగ్రా ద్వినిష్క్రాంతౌ  పంచాస్యావివ పన్నగౌ || 56 ||
బాగా చాపబడిన (గొప్ప వ్రేళ్ళు గల) ఆయన బాహువులు, పర్వతశిఖరంనుండి వెలువడిన అయిదుతలల పాముల్లా కనబడ్డాయి.
పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం |
పిసాసురివ చాకాశం దదృశే స మహాకపిః || 57 ||
(సముద్రానికి దగ్గరగా పోతున్నప్పుడు) సముద్రాన్ని త్రాగుతున్నవాడిలా (దూరంగా పోతున్నప్పుడు) ఆకాశాన్ని పానం చేసేవాడిలా అనిపించాడు.
తస్య విద్యుత్ప్రభాకారే వాయుమార్గానుసారిణః |
నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ || 58 ||
మెఱపుల్లా మెఱసే ఆయన నయనాలు రెండూ పర్వతంపై ఉన్న రెండు అగ్నుల్లా ఉన్నాయి. (పర్వతంపై రెండగ్నులుంటే ఎలా ఉంటుందో అలా)
పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే |
చక్షుషీ సంప్రకాశేతే  చంద్రసూర్యావివోదితౌ || 59 ||
పింగళవర్ణం*తో (గోరోచనం) గుండ్రంగా విశాలంగా ఉన్న ఆయన నేత్రాలు ఉదయిస్తున్న సూర్యచంద్రు*ల్లా భాసిల్లాయి.
ముఖం నాసికయా తస్య  తామ్రయా తామ్రమాబభౌ |
సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ || 60 ||
ఎఱ్ఱని నాసిక గల ఆయన ఎఱ్ఱని ముఖం సంధ్యా*రాగసంశోభితమైన సూర్యమండలంలా ప్రకాశించింది.
లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే |
అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః || 61 ||
ఎగిరిపోతున్న ఆయన వాలం, మహోన్నతంగా నిలచి, పైకెత్తబడిన శక్ర*ధ్వజం (ఇంద్రధ్వజం)* లా శోభించింది.
లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో౭నిలాత్మజః |
వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీన భాస్కరః || 62 ||
మహాత్ముడు, తెల్లనిపలువరుస గలవాడు, మహాప్రాజ్ఞుడు* అయిన ఆ అనిలాత్మజుడు, చక్రాకృతిలో ఉన్న తోకతో కూడి, పరివేషం*తో ఉన్న భాస్కరునిలా తేజరిల్లాడు.
స్ఫిగ్దేశేనాభితామ్రేణ రరాజ స మహాకపిః |
మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా || 63 ||
తోక యొక్క ప్రారంభప్రదేశం ( కటిప్రదేశం) ఎఱ్ఱగా ఉండడంతో రెండు బద్దలుగా చేయబడిన ధాతుశిల కల్గి ఉన్న పర్వతంలా విరాజిల్లాడు.
తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం |
కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి || 64 ||
ఆయన బాహుమూలాల ద్వారా ప్రసరిస్తున్న వాయువు జీమూతం*లా గర్జిస్తోంది.
ఖే యథా నిపతంత్యుల్కా  హ్యుత్తరాంతాద్వినిస్సృతా |
దృశ్యతే సానుబంధా చ  తథా స కపికుంజరః || 65 ||
పొడవైన తోకతో ఉత్తరంనుండి దక్షిణానికి (లంకకు) సాగిపోతున్న ఆయన ఆకాశంలో ఉత్తరాన పొడమి, దక్షిణదిశగా రాలే (లంకలో వ్రాలే) తోకచుక్క*లా కనిపించాడు.
పతత్పతంగసంకాశో వ్యాయతశ్శుశుభే కపిః |
ప్రవృద్ధ ఇవ మాతంగః  కక్ష్యయా బద్ధ్యమానయా || 66 ||
సూర్యునితో సమానంగా ఆకాశంలో సాగిపోతున్న ఆ విశాలదేహుడు కక్ష్య*యందు బంధింపబడిన దీర్ఘ(పెద్ద)మాతంగం*లా ఉన్నాడు.
ఉపరిష్టాచ్ఛరీరేణ  ఛాయయా చావగాఢయా |
సాగరే మారుతావిష్టా నౌరివాసీ త్తదా కపిః || 67 ||
ఆయన దేహం - ఆకాశంలో, నీడ - సముద్రంలో ఉండడంతో, క్రింది కొంత భాగం నీటిలో మునిగి, పైభాగం తేలుతూ, పవనప్రభావాన పోతున్న ఓడలా కనిపించాడు.
యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః |
స స తస్యోరువేగేన  సోన్మాద ఇవ లక్ష్యతే || 68 ||
ఆతడు దాటిపోతున్న సముద్రప్రాంతాలన్నీ, ఆ ప్రబలవేగానికి అల్లకల్లోలాలై, (తిరుగుడు పడి, నురుగు విడుస్తూ, పైకెగురుతున్న జలంతో) ఉన్మాదభరితాలయ్యాయి. (చిత్తభ్రమను పొందినట్లయ్యాయి.)(అలాగే లంకలోని ప్రదేశాలు, వాటిలోని జనం, రావణాదులు, హనుమంతుని చేష్టలకు ఉన్మాదులవుతారని చెప్పవచ్చు.)
సాగరస్యోర్మిజాలానా మురసా శైలవర్ష్మణాం |
అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః || 69 ||
కొండంత ఎత్తుకు ఎగురుతున్న సముద్రతరంగాల్ని తన ఱొమ్ముతో నెట్టుతూ, వాటిని ఛిన్నాభిన్నం చేస్తూ, మిక్కిలి వేగంగా ఆకాశంలో తేలి, పోతున్నాడు.
కపివాతశ్చ బలవాన్  మేఘవాతశ్చ నిస్సృతః |
సాగరం భీమనిర్ఘోషం కంపయామాసతుర్భృశమ్ || 70 ||
బలమైన ఆయన గమనవేగవాయువు, మేఘాలగాలి రెండూ కలసి, భయంకరఘోషలతో ఘూర్ణిల్లుతూన్న సాగరాన్ని ఇంకా కంపింపజేశాయి.
వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవణాంభసి |
పుప్లువే కపిశార్దూలో వికిరన్నివ రోదసీ || 71 ||
పై కెగురుతున్న పెద్ద పెద్ద అలలను కకావికలు చేస్తూ, ఒక విభజన రేఖలా భూమ్యాకాశాలను వేరుచేస్తున్నట్లుగానూ, (వారధి నిర్మాణ సూచన.)
మేరుమందరసంకాశా నుద్ధతాన్ స మహార్ణవే |
అతిక్రామ న్మహావేగః తరంగాన్ గణయన్నివ || 72 ||
మేరు*మందర* పర్వతాలంత ఎత్తుకు ఎగురుతున్నఆ తరంగాలను లెక్కపెడుతున్నవాడిలాగానూ ముందుకు పయనించాడు. ( లంకలో సైన్యం మొదలైన వాటిని లెక్కపెట్టబోతున్నాడు.)
తస్య వేగసముద్ధూతం జలం సజలదం తదా |
అంబరస్థం విబభ్రాజ శారదాభ్రమివాతతమ్ || 73 ||
ఆయన వేగానికి ఆ సముద్రజలం ఆకాశమంతా వ్యాపించి, తెల్లని శరత్కాలమేఘంలా విరాజిల్లింది.
తిమినక్రఝషాః కూర్మా దృశ్యంతే వివృతా స్తదా |
వస్త్రాపకర్షణేనేవ  శరీరాణి శరీరిణామ్ || 74 ||
సముద్రజలాలన్నీ అటూ ఇటూ తొలగిపోవడంవల్ల తిమి* నక్ర* ఝష* కూర్మాలు, వస్త్రాలు తొలగిన మానవ శరీరాల్లా కనబడ్డాయి. (లంకలో వివస్త్రల దర్శన సూచన.) 
ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాస్సాగరాలయాః |
వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే || 75 ||
సముద్రసర్పాలు గరుత్మంతుడనుకొని, భయపడ్డాయి. (రాక్షసులు హనుమంతుడెవరో తెలియక , రకరకాలుగా తలపోసి, భయపడబోతున్నారు.)
దశయోజనవిస్తీర్ణా త్రింశద్యోజనమాయతా |
ఛాయా వానరసింహస్య  జలే చారుతరా౭భవత్ || 76 ||
ఆయన నీడ పది యోజనాల* పొడవు, ముప్పై యోజనాల వెడల్పుతో నీటిపై అందంగా ఉంది.
శ్వేతాభ్రఘనరాజీవ వాయుపుత్రానుగామినీ |
తస్య సా శుశుభే ఛాయా వితతా లవణాంభసి || 77 ||
ఆ నీడ ఆయనను అనుసరిస్తూ, సముద్రజలంలో నిర్మలమైన, దట్టమైన మేఘమండలంలా ప్రకాశించింది.
శుశుభే స మహాతేజా  మహాకాయో మహాకపిః |
వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః || 78 ||
ఆ మహాకాయతేజుడు నిరాధారమైన ఆకాశంలో పోతూ, ఱెక్కల పర్వతంలా భాసించాడు.
యేనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః |
తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః || 79 ||
ఆయన వేగంగా పోయిన మార్గంలోని సముద్రం ముందుకు ఉబ్బి, విశాలమైన తొట్టిలా కనబడింది.
ఆపాతే పక్షిసంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ |
హనుమాన్ మేఘజాలాని  ప్రకర్షన్ మారుతో యథా || 80 ||
పక్షిపథంలో పక్షిరాజు గరుత్మంతునిలా సాగిపోతూ,  మేఘాలను ఆకర్షిస్తూ, వెళ్లే వాయువులా ఒప్పుతున్నాడు. 
పాండురారుణవర్ణాని నీలమాంజిష్ఠకాని చ |
కపినాకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే || 81 ||
ఆయనచే ఆకర్షింపబడుతున్న ఆ మేఘాలు తెలుపు, ఎఱుపు, నలుపు పసుపు వన్నెలున్నవి.
ప్రవిశన్నభ్రజాలాని  నిష్పతంశ్చ పునః పునః |
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ  చంద్రమా ఇవ లక్ష్యతే || 82 ||
పదే పదే మేఘాల్లో ప్రవేశిస్తూ, బయటకు వస్తూపురోగమిస్తున్న హనుమ, మేఘాలచే మూయబడి, మరల బయటపడుతూండే చంద్రునిలా గోచరించాడు.                                                                         
ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా |
వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః || 83 ||
అప్పుడు, హనుమంతుని చూసి, దేవతలు, గంధర్వులు, దానవులు* ఆయనపై పూలవానలు కురిపించారు.
తతాప న హి తం సూర్యః  ప్లవంతం వానరోత్తమం |
సిషేవే చ తదా వాయూ రామకార్యార్థసిద్ధయే || 84 ||
రామకార్యార్థసిద్ధికై వెళ్తున్న ఆయనకు,  సూర్యుడు, తాపాన్ని కలిగించలేదు. వాయువు కూడా చల్లగా వీస్తూ, ఆయనను సేవించాడు. (తండ్రి సేవించుటేమి? అనగా కుమారుడు రామభక్తుడు కాన సేవార్హుడే)
ఋషయ స్తుష్టువు శ్చైనం ప్లవమానం విహాయసా |
జగుశ్చ దేవగంధర్వాః  ప్రశంసంతో మహౌజసమ్ || 85 ||
ఆ మహాతేజుని ఋషులు స్తుతించారు. దేవతలు, గంధర్వులు ప్రశంసిస్తూ, కీర్తించారు
నాగాశ్చ తుష్టువు ర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః |
ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమమ్ || 86 ||
నాగులు, యక్షులు, దిక్పాలురు*, దేవతాదులు ప్రస్తుతించారు. ఖగాలు* (పక్షులు) నుతించాయి.
తస్మిన్ ప్లవగశార్దూలే  ప్లవమానే హనూమతి |
ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః || 87 ||
అంత హనుమంతుడు సాగిపోతూండగా, సాగరుడు, ఇక్ష్వాకువంశసమ్మానాన్ని పొందాలని కోరి, ఇలా ఆలోచించాడు.
సాహాయ్యం వానరేంద్రస్య  యది నాహం హనూమతః |
కరిష్యామి భవిష్యామి  సర్వవాచ్యో వివక్షతామ్ || 88 ||
"నేను ఇప్పుడు హనుమంతునకు దోహదపడకపోతే, అందఱూ నన్ను అన్నివిధాలా నిందిస్తారు.
అహమిక్ష్వాకునాథేన  సగరేణ వివర్ధితః |
ఇక్ష్వాకుసచివశ్చాయం నావసీదితుమర్హతి || 89 ||
ఇక్ష్వాకు*ప్రభుడైన సగరునిచే వృద్ధిపొందాను. ఈ హనుమ, ఇక్ష్వాకులకు సచివుడు. (స్నేహితుడు, సహాయుడు) అటువంటి ఇతడు శ్రమపడకూడదు.
తథా మయా విధాతవ్యం  విశ్రమేత యథా కపిః |
శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతితరిష్యతి || 90 ||
కాబట్టి ఇతనికి విశ్రాంతిని సమకూర్చాలి. విశ్రాంతి తర్వాత సుఖంగా (నన్ను) దాటగలడు."
ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్ఛన్నమంభసి |
హిరణ్యనాభం మైనాక మువాచ గిరిసత్తమమ్ || 91 ||
ఈవిధంగా సముద్రుడు, సాధుమతితో (మంచి మనస్సుతో) ఆలోచించి, తనలో (నీటిలో) దాగి ఉన్న మైనాకునితో ఇలా అన్నాడు.
త్వమిహాసురసంఘానాం  పాతాళతలవాసినాం |
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘ స్సన్నివేశితః || 92 ||
"ఓ మైనాకా!* ఇంద్రుని కారణంగా* పాతాళ*వాసులైన రక్కసిమూకలకు అడ్డుగా పరిఘ (గడియమ్రాను, పెనుశిల) లా నిలిచావు.   
--------------------------------------------------------------------------------------------                        
* సాగరం - "సగరపుత్రైః ఖాతస్సాగరః" = సగరపుత్రులచే త్రవ్వబడినది. సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. ఈయనది సూర్యవంశం. కేశిని, సుమతి అనువారలు ఇతని భార్యలు. కేశిని యందు అసమంజసుడు అనే ఒక కుమారుని, సుమతియందు అరవైవేలమంది పుత్రులను ఇతడు కన్నాడు. ఒకసారి అశ్వమేధయాగం చేస్తూ యాగాశ్వం వెంట పుత్రులను పంపాడు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని రసాతలాన తపస్సు చేస్తున్న కపిలముని ఆశ్రమాన కట్టించాడు. సగరుని పుత్రులు అంతా వెతికి, సముద్రంలో అశ్వమున్నదేమో అని దాన్ని వేయి యోజనాలు త్రవ్వారు. సగరపుత్రులచేత త్రవ్వబడి, విశాలం చేయబడినది గాన అప్పటి నుండి, సాగరం అని జలధి పిలువబడింది.
* తారలు - దీనియందు నావికులు తరింతురు. అంటే తారలసహాయంతో నావికులు సాగరాన్ని దాటతారు.
* పింగళవర్ణం - నలుపు పసుపు వన్నెలు కలసిన రంగు.
* చంద్రుడు - అత్రి మహర్షికి, అనసూయకు  బ్రహ్మంశను జన్మించినవాడు. అని మార్కండేయపురాణం. దత్తాత్రేయచరిత్రలు చెప్తాయి. క్షీరసాగరమథనంలో జన్మించాడని భారతం. దక్షుని కుమార్తెలు ఇరవైఏడుమంది (అశ్విన్యాది నక్షత్రాలు) ఇతని భార్యలు. వారిలో రోహిణియందు ఎక్కువ అనురాగం చూపించడంతో, దక్షుని శాపానికి గురయ్యాడు. దానిప్రకారం వృద్ధిక్షయాలు పొందుతూంటాడు. తిథులకు, మనస్సుకు, ఔషధులకు, సస్యాలకు కారకుడు. నవగ్రహాల్లో ఒకడు. భూమికి ఉపగ్రహం అని సైన్స్.
* సంధ్య - అహోరాత్రాలచే సంధింపబడేదాన్ని దేనియందు లెస్సగా ధ్యానం చేస్తారో దాన్ని సంధ్య అంటారు. అహోరాత్రాలు అంటే పగలూ రాత్రీ. ప్రొద్దు (సూర్యుడు) పొడుచుటకు ముందు ఐదు గడియల వఱకును - ప్రాతస్సంధ్య.  ప్రొద్దు క్రుంకిన పిదప మూడు గడియల వఱకును గల కాలం - సాయంసంధ్య. పగటియొక్క మధ్యభాగం - మధ్యాహ్నస్సంధ్య.
* శక్రుడు - దుష్టుల్ని జయించడంలో శక్తి కలవాడు. ఇంద్రుడు.
* శక్రధ్వజం - ఇంద్రధ్వజం. వైజయంతం అని పేరు. ధ్వజం అంటే టెక్కెం / జెండా.
* మహాప్రాజ్ఞుడు - ప్రాజ్ఞుడు అంటేనే మిక్కిలి తెలిసినవాడు. ఇక మహా అంటే ఇంకా ఎంతో!.
* పరివేషం - చుట్టూ కాంతి వలయం ఉంటే దాన్ని పరివేషం అంటారు.
*జీమూతం మేఘం. ఉదకం దీనియందు బంధింపబడుతుంది అనే అర్థంలో ఈ పదం పుట్టింది.
* తోకచుక్క - అరిష్టసూచకం అని పెద్దలంటారు.
* కక్ష్య - ఏనుగు నడుమున కట్టే మోకు.(మోకు = లావుత్రాడు.)
*మాతంగం ఏనుగు. మతంగ మహర్షి వల్ల పుట్టింది కాన మాతంగం.
* మేరువు - ఒక పర్వతం. బంగారు పర్వతం. అసురలను హింసించేది, తన శిఖరాలచేత నక్షత్రాలను వహించేది, అనే అర్థాల్లో మేరు అనే పేరు వచ్చింది. ఇది భూమి చుట్టు మేఖలలా (వడ్డాణం) ఉంటుంది. దీని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూంటారు. దీని శిఖరాలపై దేవతలు విహరిస్తూంటారు.
* మందరం - ఒక పర్వతం. క్షీరసాగరమథనంలో కవ్వంగా ఉపయోగపడింది. ఈ రెండు పర్వతాలూ ఎత్తైనవి.
* తిమి - ఆర్ద్రం గానూ, నూఱు యోజనాల పొడవూ ఉన్న చేప.  ప్రామాణిక నిఘంటువుల్లో నూఱు యోజనాల చేప అని అర్థం ఉన్నా, ఆ రోజుల్లో ఎక్కువ పొడవును సూచించడానికి శతయోజనం అనేవారనిపిస్తుంది. బాగా పెద్ద చేప అని చెప్పవచ్చు. ఈ తిమిని మింగే చేపలనే తిమింగలాలంటారు.
* నక్రం - భూమియందు పాదవిక్షేపం చేయనిది = మొసలి.
* ఝషం - పిల్ల చేపలను చంపి తినే చేప.
* కూర్మం - కుత్సితమైన వేగం కలది, జలాన్ని పాడుచేసేది = తాబేలు.
* యోజనం - ఆమడ. ఇది దూరాన్ని సూచించే ప్రమాణం. ఒక యోజనం అంటే నాలుగు క్రోసుల దూరం. ( క్రోసు = రెండు మైళ్లు.) / ఎనిమిది మైళ్లు.
* దానవులు - దనువుకు పుట్టినవారు. ఈ దనువు కశ్యపుని భార్య.
* దిక్పాలురు - దిక్కులకు అధిపతులు. వరుసగా తూర్పు ఇంద్రుడు, ఆగ్నేయం అగ్ని, దక్షిణం యముడు, నిరృతి నిరృతి, పశ్చిమం వరుణుడు, వాయవ్యం వాయువు, ఉత్తరం కుబేరుడు, ఈశాన్యం - ఈశానుడు.
* ఖగాలు - ఆకాశమందు తిరిగేవి = పక్షులు.
* ఇక్ష్వాకువు - వైవస్వతమనువు కుమారుడు. రాముని వంశానికి మూలపురుషుడు. ఇక్ష్వాకువంశం వారిని ఇక్ష్వాకులు అంటారు. రాముని వంశానికి వరుసగా సూర్యవంశం, ఇక్ష్వాకువంశం, కాకుత్థ్సవంశం, రఘువంశం అనే పేళ్లున్నాయి.
* మైనాకుడు - మేనకా హిమవంతుల కుమారుడు. పర్వతరూపుడు. ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను విఱిచేటప్పుడు, ఇతడు భయపడి, దక్షిణసముద్రంలో దాగాడు.
* ఒకసారి బలి, ఇంద్రుని జయించి, స్వర్గాన్ని ఆక్రమించుకొన్నాడు. అప్పుడు విష్ణువు వామనుడై బలిని పాతాళానికి పంపాడు. అతనితో రాక్షసులు పాతాళానికి చేరారు. సముద్రంలోనే పాతాళద్వారం ఉంది.వారు తిరిగి రాకుండా ఇంద్రుడు, సముద్రంలోనే ఉన్న మైనాకుని ఆ ద్వారానికి అడ్డుగా ఉండమన్నాడు.
* పాతాళం - అధోలోకం. బలినివాసం. పాపాలు చేస్తే దీంట్లో పడతారు. ముల్లోకాల్లో ఒకటి. స్వర్గలోకం, మర్త్యలోకం (భూలోకం), పాతాళం అనేవి ముల్లోకాలు.
-----------------------------------------------------------------------------------------------------
సాసితూణధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం | స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం || 3 ||

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...