28, మే 2020, గురువారం

Sundarakanda సుందరకాండ 10


రామసుందరం
దశమస్సర్గః
తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితమ్ |
అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనమ్ || 1
హనుమంతుడు ఆ భవనంలో రత్నభూషితమైన ఒక శయనాసనాన్ని (తల్పాన్ని) చూశాడు.
దాంతకాంచనచిత్రాంగై: వైడూర్యైశ్చ వరాసనై: |
మహార్హాస్తరణోపేతై: ఉపపన్నం మహాధనై: || 2
మేలైన కంబళాలతో కప్పబడి,ఎన్నో పీఠాలు కల్గి, దేవలోకంలోని శయనాసనంలా ఉందది.
తస్య చైకతమే దేశే దివ్యమాలావిభూషితమ్ |
దదర్శ పాండురం ఛత్రం తారాధిపతిసన్నిభమ్ || 3
ఆ శయనాసనానికి ఊర్ధ్వభాగంలో దివ్యమాలావిభూషితమై చంద్రునిలా ఉన్న తెల్లని ఛత్రాన్ని చూశాడు.
జాతరూపపరిక్షిప్తం చిత్రభానుసమప్రభమ్ |
అశోకమాలావితతం దదర్శ పరమాసనమ్ || 4
అశోకమాలలతో కూడిన ఆ ఆసనం సూర్యకాంతి సమానమైనది.
వాలవ్యజనహస్తాభి: వీజ్యమానం సమంతత: |
గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితమ్ || 5
అన్ని దిక్కులకూ సుగంధభరితమైన గాలి తగిలేలా కొందఱు స్త్రీలు చామరాలతో విసరుతున్నారు.
పరమాస్తరణాస్తీర్ణమ్ ఆవికాజినసంవృతమ్ |
దామభిర్వరమాల్యానాం సమంతాదుపశోభితమ్ || 6
మేలైన ఆస్తరణాలు, ఉన్నికంబళ్లు, సుగంధపుష్పమాలికలతో శోభిల్లుతున్న
తస్మిన్ జీమూతసంకాశం ప్రదీప్తోత్తమకుండలమ్ |
లోహితాక్షం మహాబాహుమ్ మహారజతవాససమ్ || 7
లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధినా |
సంధ్యారక్తమివాకాశే తోయదం సతటిద్గణమ్ || 8
ఆ తల్పంపై నిద్రిస్తున్న రావణుని హనుమంతుడు చూశాడు. ఆతడు నల్లని మేఘంలా ఉన్నాడు. కర్ణకుండలాలు మెరుస్తున్నాయి. శరీరంపై ఎఱ్ఱచందనం పూయబడిఉంది. ఆభరణాలు ధగధగ మెరుస్తున్నాయి. మెరుపులతో కూడిన మేఘంలా ఉన్నాడు.
వృతమాభరణైర్దివ్యై: సురూపం కామరూపిణమ్ |
సవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరమ్ || 9
మందరపర్వతం నిద్రిస్తున్నట్లు నిశ్చలంగా ఉన్నాడు.
క్రీడిత్వోపరతం రాత్రౌ వరాభరణభూషితమ్ |
ప్రియం రాక్షసకన్యానాం రాక్షసానాం సుఖావహమ్ || 10
రాక్షసులకు రాక్షసకన్యలకు సుఖప్రియాలు కల్గించే
పీత్వాప్యుపరతం చాపి దదర్శ స మహాకపి: |
భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపమ్ || 11
ఆ రావణుడు త్రాగి, ఉపరతుడై, గాఢంగా నిద్రిస్తున్నాడు.
నిశ్శ్వసంతం యథా నాగం రావణం వానరర్షభ: |
ఆసాద్య పరమోద్విగ్న: సోపాసర్పత్ సుభీతవత్ || 12
నాగం(పాము/ఏనుగు)లా నిశ్శ్వాసాలు విడుస్తున్న రావణుని హనుమంతుడు సమీపించి, ఉద్విగ్నుడై, దూరం జరిగాడు.
అథారోహణమాసాద్య వేదికాంతరమాశ్రిత: |
సుప్తం రాక్షసశార్దూలమ్ ప్రేక్షతే స్మ మహాకపి: || 13
సోపానమార్గంలో మఱొక వేదిక మీద కూర్చొని, రావణుని మీదికి దృష్టి సారించాడు.
శుశుభే రాక్షసేంద్రస్య స్వపతశ్శయనోత్తమమ్ |
గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్ || 14
ఆ మహాతల్పం సెలయేఱులా ఉంది. నిద్రిస్తున్న రావణుడందులోకి ప్రవేశించిన మదగజంలా ఉన్నాడు. ( సెలయేఱులోకి మదగజం ప్రవేశించగానే, మిగిలిన మగఏనుగులు భయపడి పారిపోతాయి. ఆడఏనుగులు మాత్రమే అక్కడ ఉంటాయి.)
కాంచనాంగదసన్నద్ధౌ దదర్శ స మహాత్మన: |
విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ || 15
బంగారు భుజకీర్తులతో ఇంద్రధ్వజసమానమైన రావణునియొక్క  చాచిన బాహువులను చూశాడు.
ఐరావతవిషాణాగ్రై: ఆపీడనకృతవ్రణౌ |
వజ్రోల్లిఖితపీనాంసౌ విష్ణుచక్రపరిక్షతౌ || 16
ఆ బాహువులపై ఐరావతం కోరలవల్ల, వజ్రాయుధంవల్ల, విష్ణుచక్రంవల్ల ఏర్పడిన గాయాల గుర్తులు కనబడుతున్నాయి.
పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ |
సులక్షణనఖాంగుష్ఠౌ స్వంగుళీతలలక్షితౌ || 17
అవి బలంతో బాగా బలసి, ఇనుపగుదియల్లా, ఏనుగుతొండాల్లా గుండ్రంగా ఉన్నాయి.
సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ |
విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షావివోరగౌ || 18
ఆ తల్పంపై చాచబడిన ఆ బాహువులు ఐదుపడగల సర్పాల్లా ఉన్నాయి.
శశక్షతజకల్పేన సుశీతేన సుగంధినా |
చందనేన పరార్ధ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ || 19
బాగా ఎఱ్ఱని, చల్లని చందనాలు ఆ బాహువులపై పూయబడి ఉన్నాయి.
ఉత్తమస్త్రీవిమృదితౌ గంధోత్తమనిషేవితౌ |
యక్షకిన్నరగంధర్వ దేవదానవరావిణౌ || 20
స్త్రీలచే పిసుకబడే, యక్షకిన్నరగంధర్వదేవదానవాదులను బాధించే, ఆ బాహువులు
దదర్శ స కపిస్తస్య బాహూ శయనసంస్థితౌ |
మందరస్యాంతరే సుప్తౌ మహాహీ రుషితావివ || 21
మందరగిరిగుహలో నిద్రిస్తున్న క్రుద్ధభుజంగాల్లా ఉన్నాయి.
తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర: |
శుశుభే౭చలసంకాశ: శృంగాభ్యామివ మందర: || 22
పరిపూర్ణమైన ఆ భుజాలతో  రావణుడు శిఖరాలతో కూడిన మందరగిరిలా ఉన్నాడు.
చూతపున్నాగసురభి: వకుళోత్తమసంయుత: |
మృష్టాన్నరససంయుక్త: పానగంధపురస్సర: || 23
ఆతని నిట్టూర్పులు అన్నరసగంధాలతో గుబాళిస్తూ, వాటితో (మామిడి, పున్నాగ మృష్టాన్నరసపానాది గంధాలు)
తస్య రాక్షససింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ |
శయానస్య వినిశ్శ్వాస: పూరయన్నివ తద్గృహమ్ || 24
మందిరాన్ని నింపుతున్నవో అన్నట్లుగా వెడలుతున్నాయి.
ముక్తామణివిచిత్రేణ కాంచనేన విరాజితమ్ |
ముకుటేనాపవృత్తేన కుండలోజ్జ్వలితాననమ్ || 25
ఆ రావణుడు, కొంచెం ఒరిగిన ముక్తామణికాంచనవిరాజితమైన కిరీటం, మనోహరమైన ముఖం,
రక్తచందనదిగ్ధేన తథా హారేణ శోభినా |
పీనాయతవిశాలేన వక్షసా౭భివిరాజితమ్ || 26
రక్తచందనాలు, హారాలతో శోభిల్లే విశాల వక్షఃస్థలం,
పాండురేణాపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణమ్ |
మహార్హేణ సుసంవీతం పీతేనోత్తమవాససా || 27
ఉత్తమమైన క్రిందకు జారిన పీతవస్త్రాలు కల్గి,
మాషరాశిప్రతీకాశం నిశ్శ్వసంతం భుజంగవత్ |
గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమివ కుంజరమ్ || 28
మినుములరాశిలా గున్నాడు. మహాసర్పంలా నిట్టూర్పులు విడుస్తున్నాడు. గంగాజలాలమధ్య నిద్రిస్తున్న ఏనుగులా ఉన్నాడు.
చతుర్భి: కాంచనైర్దీపై: దీప్యమానచతుర్దిశమ్ |
ప్రకాశీకృతసర్వాంగం మేఘం విద్యుద్గణైరివ || 29
కాంచనదీపపుకాంతులమధ్య ఆతడు విద్యుద్గణాలమధ్య మేఘంలా ఉన్నాడు.
పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన: |
పత్నీ స్స ప్రియభార్యస్య తస్య రక్ష:పతేర్గృహే || 30
అలాంటి రావణుని, ఆతని పాదాలచెంత ఉన్న ఆతని భార్యలందఱ్నీ హనుమంతుడు చూశాడు.
శశిప్రకాశవదనా: చారుకుండలభూషితా: |
అమ్లానమాల్యాభరణా దదర్శ హరియూథప: || 31
ఆ రావణపత్నులందఱూ సహజంగానూ, అలంకరణలతోనూ అందంగా ఉన్నారు.
నృత్తవాదిత్రకుశలా రాక్షసేంద్రభుజాంకగా: |
వరాభరణధారిణ్యో నిషణ్ణా దదృశే హరి: || 32
నృత్యవాద్యకళావిశారదులు వారు. రావణుని భుజాలపైన ఒడిలోను నిద్రిస్తున్నారు.
వజ్రవైడూర్యగర్భాణి శ్రవణాంతేషు యోషితామ్ |
దదర్శ తాపనీయాని కుండలాన్యంగదాని చ || 33
వారి వజ్రవైడూర్యగర్భితాలైన కుండలాలు, దండకడియాలు చూశాడు.
తాసాం చంద్రోపమైర్వక్త్రై: శుభైర్లలితకుండలై: |
విరరాజ విమానం తత్ నభస్తారాగణైరివ || 34
వారి కాంతులతో ఆ విమానం నక్షత్రాలకాంతితో వెలిగే ఆకాశంలా ఉంది.
మదవ్యాయామఖిన్నాస్తా రాక్షసేంద్రస్య యోషిత: |
తేషు తేష్వవకాశేషు ప్రసుప్తా: తనుమధ్యమా: || 35
మదవ్యాయామంలో అలసి, గాఢనిద్రలో మునిగిపోయారు.
అంగహారైస్తథైవాన్యా కోమలైర్నృత్తశాలినీ |
విన్యస్తశుభసర్వాంగీ ప్రసుప్తా వరవర్ణినీ || 36
నృత్యనేర్పరి అయిన ఒక శుభాంగి నృత్యభంగిమలతోనే నిద్రిస్తోంది.
కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్తా సంప్రకాశతే |
మహానదీప్రకీర్ణేవ నళినీ పోతమాశ్రితా || 37
మహానదీప్రవాహంలో నావను ఆశ్రయించిన పద్మలతలా ఒక లతాంగి వీణను కౌగిలించుకొని నిద్రిస్తోంది.
అన్యా కక్షగతేనైవ మడ్డుకేనాసితేక్షణా |
ప్రసుప్తా భామినీ భాతి బాలపుత్రేవ వత్సలా || 38
మడ్డుకం అనే ఒక చర్మవాద్యాన్ని చంకలో ఉంచుకొని, నిద్రిస్తున్న ఒక తరుణి చంకలో పిల్లాడు కలిగిన ఇంతిలా ఉంది.
పటహం చారుసర్వాంగీ పీడ్య శేతే శుభస్తనీ |
చిరస్య రమణం లబ్ధ్వాపరిష్వజ్యేవ భామినీ || 39
ప్రియుని కౌగిలించుకొన్న పడతిలా ఒక సుందరి పటహం అనే చర్మవాద్యాన్ని వక్షఃస్థలానికి అదుముకొని, నిద్రిస్తోంది.
కాచిద్వంశం పరిష్వజ్య సుప్తా కమలలోచనా |
రహ: ప్రియతమం గృహ్య సకామేవ చ కామినీ || 40
తమకంతో ప్రియుని కౌగిలించుకొన్న కామినిలా ఒక భామిని వేణువును హృదయానికి హత్తుకొని నిద్రిస్తోంది.
విపంచీం పరిగృహ్యాన్యా నియతా నృత్తశాలినీ |
నిద్రావశమనుప్రాప్తా సహకాంతేవ భామినీ || 41
ఒక రమణి విపంచిని ఎదపై చేర్చుకొని, నిద్రిస్తోంది.
అన్యా కనకసంకాశై: మృదుపీనైర్మనోరమై: |
మృదంగం పరిపీడ్యాంగై: ప్రసుప్తా మత్తలోచనా || 42
మృదంగాన్ని కౌగిలించుకొని ఒక ముదిత, నిద్రిస్తోంది.
భుజపార్శ్వాంతరస్థేన కక్షగేణ కృశోదరీ |
పణవేన సహానింద్యా సుప్తా మదకృతశ్రమా || 43
చంకలో పణవంతో ఒక జాణ నిద్రిస్తోంది.
డిండిమం పరిగృహ్యాన్యా తథైవాసక్తడిండిమా |
ప్రసుప్తా తరుణం వత్సమ్ ఉపగుహ్యేన భామినీ || 44
డిండిమ వాద్యాన్ని గ్రహించి ఒక నెలత, నిద్రిస్తోంది.
కాచిదాడంబరం నారీ భుజసంయోగపీడితమ్ |
కృత్వా కమలపత్రాక్షీ ప్రసుప్తా మదమోహితా || 45
ఆడంబరం అనే తూర్యవాద్యాన్ని హత్తుకొని ఒక అతివ నిద్రిస్తోంది.
కలశీమపవిధ్యాన్యా ప్రసుప్తా భాతి భామినీ |
వసంతే పుష్పశబలా మాలేవ పరిమార్జితా || 46
గాఢనిద్రలో తెలియక ఒక కలకంఠి కలశాన్ని తోసింది. దాంతో అందులోని గంధోదకంతో ఆవిడ తడిసిపోయింది. అపుడామె వాడిపోకుండా నీటితో తడిపిన విచిత్రవర్ణపుష్పలతలా ఉంది.
పాణిభ్యాం చ కుచౌ కాచిత్ సువర్ణకలశోపమౌ |
ఉపగుహ్యాబలా సుప్తా నిద్రాబలపరాజితా || 47
ఒక అబల తన గుండెలను, చేతులతో కప్పుకొని నిద్రిస్తోంది.
అన్యా కమలపత్రాక్షీ పూర్ణేందుసదృశాననా |
అన్యామాలింగ్య సుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వలా || 48
ఒక రమణి మఱొక రామను మదవిహ్వలయై కౌగిలించుకొని నిద్రిస్తోంది.
ఆతోద్యాని విచిత్రాణి పరిష్వజ్య వరస్త్రియ: |
నిపీడ్య చ కుచైస్సుప్తా: కామిన్య: కాముకానివ || 49
అక్కడి స్త్రీలు చిత్రవిచిత్రచతుర్విధవాద్యాలను హృదయాలకు హత్తుకొని నిద్రిస్తున్నారు.
తాసామేకాంతవిన్యస్తే శయానాం శయనే శుభే |
దదర్శ రూపసంపన్నామ్ అపరాం స కపి: స్త్రియమ్ || 50
ఆ కాంతల్లో మిక్కిలి అందమైన ఒక స్త్రీ ప్రత్యేకశయ్యపై నిద్రిస్తుండడం మారుతి చూశాడు.
ముక్తామణిసమాయుక్తై: భూషణైస్సువిభూషితామ్ |
విభూషయంతీమివ తత్ స్వశ్రియా భవనోత్తమమ్ || 51
ఆమె తన శరీర, ఆభరణాలకాంతితో ఆ మహాభవనాన్ని ప్రకాశింపచేస్తున్నట్లుంది.
గౌరీం కనకవర్ణాభామ్ ఇష్టామంత:పురేశ్వరీమ్ |
కపి ర్మందోదరీం తత్ర శయనాం చారురూపిణీమ్ || 52
కనకవర్ణాంగి, రావణుని పట్టమహిషి అయిన ఆ మందోదరి రూపం మనోహరంగా ఉంది.
స తాం దృష్ట్వా మహాబాహు: భూషితాం మారుతాత్మజ: |
తర్కయామాస సీతేతి రూపయౌవనసంపదా |
హర్షేణ మహతా యుక్తో ననంద హరియూథప: || 53
రూప యౌవన సౌభాగ్యాలను బట్టి ఆమె సీతయై ఉండవచ్చుననుకొని, మిక్కిలి హర్షోల్లసితుడయ్యాడు.
ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం
ననంద చిక్రీడ జగౌ జగామ |
స్తంభానరోహన్నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ || 54
ఆనందంతో భుజాస్ఫాలనం కావించాడు. తోకను ముద్దాడాడు. అటూ ఇటూ గంతులు వేశాడు. స్తంభాలమీదకు ప్రాకాడు. క్రిందికి జారాడు. కపిస్వభావాన్ని ప్రదర్శించాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షా మిమాం హరః | తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ||15||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే దశమస్సర్గః (10)

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...