రామసుందరం 1-6
స సాగర మనాధృష్య మభ్యేత్య వరుణాలయమ్ |
జగా మాకాశ మావిశ్య వేగేన గరుడోపమ: || 164 ||
వేగంలో గరుడసమానుడైన ఆ మారుతి, ఎదిరింప సాధ్యం కాని ఆ సముద్రంపై ఆకాశ మార్గానికి ఎగిరి, ప్రయాణం సాగించాడు.
సేవితే వారిధారాభి:
పతగైశ్చ నిషేవితే |
చరితే కైశికాచార్యై: ఐరావతనిషేవితే || 165 ||
మేఘాలు విడిచే నీటిధారలతో
ఒప్పుతూ, పక్షులకు ఆటపట్టై, కైశికాచార్యులకు (తుంబురాదులు) సంచారస్థానమై, ఐరావతా*నికి నెలవై,
సింహకుంజరశార్దూల
పతగోరగవాహనై: |
విమానైస్సంపతద్భిశ్చ విమలై స్సమలంకృతే || 166 ||
సింహాలు, ఏనుగులు, పెద్దపులులు, పక్షులు, సర్పాలు వీటితో లాగబడే విమలవిమానాలతో అలంకృతమై,
వజ్రాశనిసమాఘాతై:
పావకైరుపశోభితే |
కృతపుణ్యైర్మహాభాగై: స్వర్గజిద్భిరలంకృతే || 167 ||
అశని (వజ్రాయుధం, పిడుగు) ఘాతాలతో, అగ్నికాంతులతో తేజరిల్లుతూ, తమ పుణ్యకర్మలతో స్వర్గాన్ని జయించినవారలతో భూషితమై,
వహతా హవ్యమత్యర్థం
సేవితే చిత్రభానునా |
గ్రహనక్షత్రచంద్రార్క తారాగణవిభూషితే || 168 ||
హవ్యవాహనునికి మార్గమై, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రసూర్యులు, తారాగణాలతో విభూషితమై,
మహర్షిగణ గంధర్వ
నాగయక్షసమాకులే |
వివిక్తే విమలే విశ్వే విశ్వావసునిషేవితే || 169 ||
మహర్షిగణాలతో, గంధర్వనాగయక్షులతో కూడి, విమలమై, విశ్వావసుడనే గంధర్వునిచే సేవింపబడుతూ,
దేవరాజగజాక్రాంతే
చంద్రసూర్యపథే శివే |
వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే || 170 ||
ఐరావతానికి క్రీడాస్థానమై, చంద్రసూర్యులకు దారై, మంగళకరమై, జీవలోకానికి బ్రహ్మ నిర్మించిన మేలుకట్టై,
బహుశస్సేవితే వీరై:
విద్యాధరగణైర్వరై: |
జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతి: || 171 ||
వీరులు, విద్యాధరులచే సేవింపబడే, ఆ (గొప్ప) ఆకాశమార్గాన మారుతి, గరుత్మంతునిలా సాగిపోతున్నాడు.
(హనుమాన్
మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా |
కాలాగరుసవర్ణాని రక్తపీతసితాని చ |
కపినాకృష్యమాణాని
మహాభ్రాణి చకాశిరే ||
ప్రవిశ న్నభ్రజాలాని
నిష్పతంశ్చ పున: పున: |
ప్రావృషీందురివాభాతి నిష్పతన్ ప్రవిశం స్తదా ||
వాయువులా మేఘాలను
చీల్చుకుంటూ పోతున్నాడు హనుమ. నలుపు, అగరు, ఎఱుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘాలు ఆయనచే ఆకర్షింపబడుతూ ప్రకాశిస్తున్నాయి. మేఘమండలంలో
పదేపదే లోపలికి చొరబడుతూ, బయటకు వస్తూ, వర్షాకాలంలో మేఘాల మధ్య సంచరించే చంద్రునిలా
ప్రకాశించాడు.)
ప్రదృశ్యమాన స్సర్వత్ర
హనుమాన్ మారుతాత్మజ: |
భేజే౭Oబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్ || 172 ||
నిరాధారమైన ఆ ఆకాశంలో
సర్వత్ర గోచరిస్తూ, ఆయన, క్రిందికి ముడుచుకొన్నందున వ్రేలాడే ఱెక్కలుగల పర్వతరాజులా తేజరిల్లాడు.
ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ |
మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణీ || 173 ||
కామరూపిణి యైన సింహిక అనే రాక్షసి, మారుతిని చూసి, దేహాన్ని పెంచి, మనసులో,
అద్య దీర్ఘస్య కాలస్య
భవిష్యామ్యహమాశితా |
ఇదం హి మే మహత్ సత్త్వం చిరస్య వశమాగతమ్ ||174 ||
"ఇంతకాలానికి
ఒక మహాజంతువు నాకు లభించబోతోంది. చాలాకాలం తరువాత మంచి
ఆహారాన్ని తినబోతున్నాను".
ఇతి సంచింత్య మనసా
ఛాయామస్య సమాక్షిపత్ |
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానర: || 175 ||
అని అనుకొని, ఆయన ఛాయను ఒడిసి పట్టింది. తన నీడ లాగబడుతుండగా హనుమంతుడు,
సమాక్షిప్తో౭స్మి సహసా
పంగూకృతపరాక్రమ: |
ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే || 176 ||
" సముద్రంలో ఎదురుగాలికి పయనించే మహానావలా నా
పరాక్రమం కుంటుబడుతోంది ".
తిర్యగూర్ధ్వమధశ్చైవ
వీక్షమాణ స్తత: కపి: |
దదర్శ స మహత్ సత్త్వమ్ ఉత్థితం లవణాంభసి || 177 ||
అనుకొని, ఆయన, ఈ ప్రక్క, ఆ ప్రక్క, పైన, క్రింద పరికించి, సముద్రం నుంచి పైకి లేచిన మహాజంతువును చూశాడు.
తద్దృష్ట్వా చింతయామాస
మారుతి ర్వికృతాననమ్ |
కపిరాజేన కథితం
సత్త్వ మద్భుతదర్శనమ్ || 178 ||
ఛాయాగ్రాహి మహావీర్యం
తదిదం నాత్ర సంశయ: |
స తాం బుద్ధ్వార్థతత్త్వేన
సింహికాం మతిమాన్ కపి: || 179 ||
దాని వికృతమైన ముఖాన్ని
చూచి, మారుతి, "ఆశ్చర్యకరం, మహాశక్తిమంతం అయిన ఈ ఛాయాగ్రాహిని గూర్చే సుగ్రీవుడు చెప్పాడు.అదే ఇది. సందేహం లేదు" అనుకొని, దాన్ని సింహికగా గుర్తించాడు.
వ్యవర్ధత మహాకాయ:
ప్రావృషీవ బలాహక: |
తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపే: || 180 ||
ఆ మహాకపి, వర్షాకాలమేఘంలా శరీరాన్ని పెంచాడు. పెఱుగుతున్న
ఆ మహాకాయాన్ని చూచి,
వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభమ్ |
ఘనరాజీవ గర్జంతీ వానరం సమభిద్రవత్ || 181 ||
సింహిక, పాతాళకుహరం లాంటి తన నోటిని తెఱచింది. మేఘమండలంలా
గర్జిస్తూ, హనుమంతుని పట్టుకోబోయింది.
స దదర్శ తత స్తస్యా
వివృతం సుమహన్ముఖమ్ |
కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపి: || 182 ||
ఆయన, బుద్ధిమంతుడు కాబట్టి తన
శరీరాన్ని మ్రింగటానికి తెఱవబడిన
ఆ నోటిని చూచి, దాని జీవస్థానాల్ని కనిపెట్టాడు.
స తస్యా వివృతే వక్త్రే
వజ్రసంహనన: కపి: |
సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల: || 183 ||
వజ్రదేహుడైన ఆ మహాబలుడు, తన
దేహాన్ని సంక్షిప్తంగా చేసికొని,
సింహిక నోటిలోకి
ప్రవేశించాడు.
ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశు: సిద్ధచారణా: |
గ్రస్యమానం యథాచంద్రం పూర్ణం పర్వణి రాహుణా || 184 ||
అలా ప్రవేశిస్తున్నప్పుడు
ఆ హనుమంతుడు, పున్నమినాడు రాహువుచే మ్రింగబడుతున్న నిండు చంద్రునిలా
సిద్ధచారణులకు కనిపించాడు.
తతస్తస్యా నఖైస్తీక్ష్ణై: మర్మాణ్యుత్కృత్య
వానర: |
ఉత్పపాతాథ వేగేన మనస్సంపాతవిక్రమ: || 185 ||
వాడియైన గోళ్లతో సింహిక మర్మస్థానాలను చీల్చి, అది నోరు మూసేలోగా
మనోవేగంతో ఆ నోటినుండి బయల్వెడలి
పైకి ఎగశాడు.
తాం తు దృష్ట్వా చ ధృత్యా చ
దాక్షిణ్యేన నిపాత్య చ |
స కపిప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్ || 186 ||
ధైర్యంతోనూ, సామర్థ్యంతోనూ ఆ
సింహికను పడద్రోసి, వేగంగా మళ్లీ దేహాన్ని పెంచాడు.
హృతహృత్ సా హనుమతా
పపాత విధురా౭Oభసి |
(స్వయంభువైవ
హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే |)
తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికామ్ || 187 ||
అలా హనుమంతుడు సింహిక
గుండెల్ని చీల్చేయగా, అది, స్మృతి తప్పి, నీటిలో పడింది. (హనుమంతుడు
సింహికను హతమార్చడం బ్రహ్మసంకల్పం / దైవనిర్ణయం.) అలాంటి
సింహికను చూసి,
భూతాన్యాకాశచారీణి
తమూచు: ప్లవగోత్తమమ్ |
భీమమద్య కృతం కర్మ మహత్ సత్త్వం త్వయా హతమ్ || 188 ||
ఆకాశసంచారులైన భూతాలు సంతోషంతో హనుమంతునితో,ఇలా అన్నాయి." నీవు ఇపుడు భీమకార్యం చేశావు.
ఈ మహాప్రాణిని
హతమార్చావు.
సాధయార్థ మభిప్రేత మరిష్టం ప్లవతాం వర |
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ || 189 ||
ధృతి ర్దృష్టి ర్మతిర్దాక్ష్యం స్వకర్మసు
న సీదతి |
స తైస్సంభావిత: పూజ్య:
ప్రతిపన్నప్రయోజన: || 190 ||
ఇక నీవనుకొన్నమంగళకార్యం సాధించు. నీకు
లాగ ధృతి, (ధైర్యం) దృష్టి, (దూర, సూక్ష్మ దృష్టులు) మతి, (ఆలోచన, తత్త్వనిశ్చయశక్తి, సమయస్పూర్తి) దాక్ష్యం (దక్షత / పటుత్వం / సామర్థ్యం) ఈ నాలుగు లక్షణాలు
కలవాడు తన పనులను నెరవేర్చుకోవడంలో విఫలుడు కాడు ". అని వారిచేత పూజింపబడి,
జగామాకాశమావిశ్య
పన్నగాశనవత్ కపి: |
ప్రాప్తభూయిష్ఠపారస్తు సర్వత: ప్రతిలోకయన్ || 191 ||
ఆకాశమార్గాన గరుత్మంతునిలా సాగిపోయాడు. ఇంచుమించుగా ఆవలి తీరాన్ని చేరి, నలువైపుల
చూస్తూండగా,
యోజనానాం శతస్యాంతే
వనరాజిం దదర్శ స: |
దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితమ్ || 192 ||
నూఱు యోజనాలు అంతమయ్యాక అడవుల గుంపొకటి కనిపించింది. భూమిపైకి దిగుతూనే, వివిధ
వృక్షాలతో విభూషితమైన,
ద్వీపం శాఖామృగశ్రేష్ఠో
మలయోపవనాని చ |
సాగరం సాగరానూపం సాగరానూపజాన్
ద్రుమాన్ || 193 ||
లంకాద్వీపాన్ని, మలయపర్వతమందలి
ఉపవనాల్నిచూశాడు. సాగరాన్ని, సాగరతీరాన్ని, సాగరతీరమందలి వృక్షాల్ని,
సాగరస్య చ పత్నీనాం
ముఖాన్యపి విలోకయన్ |
స మహామేఘసంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్ || 194 ||
సాగరంలో కలిసే నదీముఖాలను చూస్తూ, తన
దేహం మహామేఘంలా
నిరుంధంత మివాకాశం
చకార మతిమాన్ మతిమ్ |
కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసా: || 195 ||
ఆకాశాన్ని
అడ్డగిస్తున్నట్లుండడం చూసి,
ఇలా ఆలోచించాడు."నా మహాకాయాన్ని, అమితవేగాన్ని, రాక్షసులు
చూస్తే,
మయి కౌతుహలం కుర్యు: ఇతి
మేనే మహాకపి: |
తత శ్శరీరం సంక్షిప్య తన్మహీధరసన్నిభమ్ || 196 ||
ఆశ్చర్యచకితులవుతారు".అని అనుకొని, తన
పర్వతాకారదేహాన్ని, చిన్నదిగా చేసి,
పున: ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్ |
త ద్రూప మతిసంక్షిప్య
హనుమాన్ ప్రకృతౌ స్థిత: |
త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరి: || 197 ||
ప్రకృతిచేత
కప్పబడినవాడు (మాయామోహితుడు)
మోహాన్ని వీడిన తర్వాత
మళ్లీ స్వరూపాన్ని పొందినట్లు తన
సహజరూపాన్ని ధరించాడు. వామనరూపుడై వచ్చి, మూడడుగులుంచి, త్రివిక్రముడై,
బలి విక్రమాన్ని
హరించిన హరి, తిరిగి వామనరూపాన్ని పొందినట్లు హనుమంతుడు, తన రూపాన్ని అతిచిన్నదిగా చేసుకొన్నాడు.
స చారు నానావిధరూపధారీ
పరం సమాసాద్య సముద్రతీరమ్ |
పరై రశక్య: ప్రతిపన్నరూప:
సమీక్షితాత్మా సమవేక్షితార్థ: || 198 ||
మనోహరమైన వివిధరూపాలను
ధరించేవాడు, శత్రువులకు అశక్యుడు అయిన మారుతి, సముద్రపు అవ్వలితీరానికి చేరాడు. తర్వాత
తన దేహాన్ని చూసి, కర్తవ్యాన్ని నిర్ణయించుకొని, తన
సహజరూపాన్ని ధరించాడు.
తతస్స లంబస్య గిరేస్సమృద్ధే
విచిత్రకూటే నిపపాత కూటే |
సకేతకోద్దాలకనాళికేరే
మహాద్రికూటప్రతిమో మహాత్మా || 199 ||
ఆ మహాపర్వతశిఖరసమానుడు, సర్వవస్తుసమృద్ధం, విచిత్రశిఖరాలు, మొగలిపొదలు, విరిగిచెట్లు, కొబ్బరిచెట్లు
ఉన్నలంబపర్వతశిఖరంపై దిగాడు.
తతస్తు సంప్రాప్య సముద్రతీరం
సమీక్ష్య లంకాం గిరివర్యమూర్థ్ని |
కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే
విధూయ రూపం వ్యథయన్ మృగద్విజాన్ || 200 ||
అంత ఆ హనుమంతుడు, సముద్రతీరానికి
పోయి, త్రికూటపర్వతశిఖరాన ఉన్నలంకను చూస్తూ, తన వెనుకటి దేహాన్ని
విదల్చికొని, జంతువులు, పక్షులు భయపడేటట్లు ఆ
గిరిపై వ్రాలాడు.
స సాగరం దానవపన్నగాయుతం
బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్ |
నిపత్య తీరే చ మహోదధే స్తదా
దదర్శ లంకామ్ అమరావతీమివ || 201 ||
పెద్ద పెద్ద అలలు గలిగి, దానవులకు
పన్నగాలకు నెలవైన, సముద్రాన్ని హనుమంతుడు
తన పరాక్రమంతో దాటి, తీరాన దిగి, అమరావతి
లాంటి లంకాపురిని చూశాడు.
----------------------------------------------------------------------------------------
ఐరావతం = 1. ఇంద్రుని ఏనుగు 2. వంకఱ లేని నిడుపాటి ఇంద్రధనస్సు ౩. మేఘం మీది మేఘం.
దీన్నే రాజమేఘం అంటారు.
-----------------------------------------------------------------------------------------
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితం | స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ
భగ్నేశకార్ముకః || 6 ||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ప్రథమస్సర్గః (1)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి