రామసుందరం 1-5
ఇత్యుక్త్వా పాణినా
శైలమ్ ఆలభ్య హరిపుంగవః |
జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ || 133 ||
అని తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యాన్ని
స్వీకరించినట్లు ప్రకటించి, ప్రసన్నముఖుడై, ఆకాశంలో కొంత పైకెగిరి, వేగంగా ముందుకు
సాగిపోయాడు.
స పర్వతసముద్రాభ్యాం బహుమానాదవేక్షితః |
పూజిత శ్చోపపన్నాభిః ఆశీర్భిరనిలాత్మజః || 134 ||
అతణ్ణి సముద్రుడు, మైనాకుడు మిక్కిలి ఆదరంతో చూస్తూ, పూజించారు. ఆశీర్వచనాలతో అభినందించారు.
అథోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ |
పితుఃపంథాన మాస్థాయ జగామ విమలే౭oబరే || 135 ||
హనుమంతుడు సముద్రుని, మైనాకుని వీడ్కొని, కొంత ఎత్తుకు
ఎగిరి,
భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ |
వాయుసూను ర్నిరాలంబే జగామ విమలే౭oబరే || 136 ||
మఱల ఇంకా పైకెగిరి, మైనాకుని చూస్తూ నిర్మలాకాశంలో ముందుకు సాగిపోయాడు.
తద్ద్వితీయం హనుమతో దృష్ట్వాకర్మ సుదుష్కరమ్ |
ప్రశశంసు స్సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః || 137 ||
హనుమంతుడు ఒనర్చిన ఈ
రెండవ కార్యాన్ని చూసి, దేవతలు, సిద్ధులు, పరమర్షు లందఱూ ఆయనను ప్రశంసించారు. (సముద్రలంఘనానికై ఆకాశాన ఎగరడం మొదటిది. మైనాకుని అడ్డంకిని అధిగమించి, పురోగమించడం రెండవది.)
దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్థాస్తస్య కర్మణా |
కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః || 138 ||
ఇంద్రుడు, దేవతలు, మైనాకుడు చేసిన పనికి హర్షించారు.
ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదమ్ |
సునాభం పర్వతశ్రేష్ఠం స్వయమేవ శచీపతిః || 139 ||
సహస్రాక్షుడు (ఇంద్రుడు) పరితోషితుడై, గద్గదస్వరంతో
స్వయంగా
హిరణ్యనాభ! శైలేంద్ర! పరితుష్టో౭స్మి తే భృశమ్ |
అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య! యథాసుఖమ్ || 140 ||
" ఓ
మైనాకా! నీవు చేసిన ఈ పనికి ఎంతో
సంతోషించాను. ఇక నీకు నా భయం లేదు. హాయిగా ఉండు.
సాహ్యం కృతం తే సుమహ ద్విక్రాంతస్య హనూమతః |
క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి || 141 ||
భయమే ఎఱుగక, విశాలమైన సముద్రాన్ని లంఘిస్తున్న, హనుమకు ఏం కష్టం సంభవిస్తుందో అని మేం భయపడుతున్నాం. అట్టి నిర్భయుడైన హనుమంతునకు గొప్పగా సహాయపడ్డావు.
రామస్త్యైష హి దూత్యేన యాతి దాశరథేర్హరిః |
సత్ర్కియాం కుర్వతా తస్య తోషితో౭స్మి దృఢం త్వయా || 142 ||
రామకార్యార్థియై
వెళ్తున్నఆతనిని సత్కరించినందులకు చాల ఆనందిస్తున్నాను." అన్నాడు.
తతః ప్రహర్ష మగమత్ విపులం పర్వతోత్తమః |
దేవతానాం పతిం దృష్ట్వా
పరితుష్టం శతక్రతుమ్ || 143 ||
ఇంద్రుని పరితుష్టిని
చూసి, మైనాకుడు ఎంతో సంతోషించాడు.
స వై దత్తవర శ్శైలో బభూవావస్థిత స్తదా |
హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరమ్ || 144 ||
ఇంద్రుని అభయవరంతో అతని మనస్సు కుదుటపడింది. హనుమంతుడు, ఆ ప్రదేశాన్ని క్షణంలో దాటిపోయాడు.
తతో దేవా స్సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరమ్ || 145 ||
తరువాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, సూర్యకాంతితో వెలిగే నాగమాతయైన సురసతో ఇలా అన్నారు.
అయం వాతాత్మజశ్శ్రీమాన్ ప్లవతే సాగరోపరి |
హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర || 146 ||
“ హనుమంతుడనేవాడు సాగరంపై ఎగురుతూ వస్తున్నాడు. అతనికి
ముహూర్త కాలం (ముహూర్తం ఘటికాద్వయం) విఘ్నం కల్గించు.
రాక్షసం రూపమాస్థాయ
సుఘోరం పర్వతోపమమ్ |
దంష్ట్రాకరాళం పింగాక్షం
వక్త్రం కృత్వా నభస్సమమ్ || 147 ||
భయం కల్గించే పెద్ద కోఱలు, పచ్చని నేత్రాలు, ఆకాశమంత
వెడల్పైన నోరు, కలిగి పర్వతసమానమైన రాక్షసరూపం ధరించు.
బలమిచ్ఛామహే జ్ఞాతుం
భూయశ్చాస్య పరాక్రమమ్ |
త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి || 148 ||
ఇతని బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనుకొంటున్నాం. నిన్ను
ఉపాయంతో జయిస్తాడో? లేక (ఓడిపోయి) విషాదానికి లోనవుతాడో ? "
ఏవముక్తా తు సా దేవీ దైవతై రభిసత్కృతా |
సముద్రమధ్యే సురసా
బిభ్రతీ రాక్షసం వపుః || 149 ||
దేవతలు ఇలా అన్నమీదట, సురస, వారి చేత అభిసత్కృతయై, భయంకరాకారం ధరించి, సముద్రమధ్యంలో
వికృతం చ విరూపం చ
సర్వస్య చ భయావహమ్ |
ప్లవమానం హనూమంతం
ఆవృత్యేదమువాచ హ || 150 ||
వికృతం, విరూపం,
భయావహమైన ఆ రూపంతో, హనుమంతుని అడ్డగించి, ఇలా అంది.
మమ భక్షః ప్రదిష్ట స్త్వ మీశ్వరై ర్వానరర్షభ |
అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననమ్ || 151 ||
“ఓ వానరేశ్వరా! దేవతలు నిన్నునాకు ఆహారంగా నిర్ణయించారు. నిన్ను తింటాను. నా నోటిలో ప్రవేశించు“.
ఏవముక్త స్సురసయా ప్రాంజలి ర్వానరర్షభః |
ప్రహృష్టవదన శ్శ్రీమాన్ ఇదం వచన మబ్రవీత్ || 152 ||
సురస ఇలా అనగా, హనుమంతుడు చేతులు జోడించి, ప్రసన్నవదనుడై ఇలా అన్నాడు.
రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా || 153 ||
“దశరథుని కొడుకైన శ్రీరాముడు తన తమ్ముడు
లక్ష్మణునితోను,
భార్య వైదేహితోను కలసి దండకారణ్యాన ప్రవేశించాడు.
అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః |
తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్వినీ || 154 ||
రాక్షసులతో బద్ధవైరం కలిగి
ఉన్నఆయన, ఒకప్పుడు అన్యకార్యమందుండగా
అతని భార్య సీతను రావణుడు, అపహరించుకొనిపోయాడు.
తస్యాస్సకాశం దూతో౭హం గమిష్యే రామశాసనాత్ |
కర్తు మర్హసి రామస్య సాహ్యం విషయవాసిని || 155 ||
నేను, రాముని పంపున దూతనై, సీత కడకు వెళుతున్నాను.
నీవునూ రాముని రాజ్యంలో ఉన్నదానవు. ఆయనకు సాయం చేయాలి.
అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణమ్ |
ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే || 156 ||
అలా కాదూ అంటే, మైథిలిని చూసి, రాముని సందర్శించి, నీ ముఖాన ప్రవేశిస్తాను. ఇది సత్యం“.
ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ |
అబ్రవీ న్నాతివర్తే న్మాం కశ్చి దేష వరో మమ || 157 ||
హనుమంతుడు ఇలా అన్నాక, ఆ కామరూపిణి,
“ఎవ్వరునూ నన్ను అతిక్రమించి, పోలేరు. ఇది నాకు వరం” అంది.
(ప్రక్షిప్తః)
157 వ శ్లోకం తర్వాత ఈ క్రింది శ్లోకాలు కొన్ని
ప్రతులలో కనిపిస్తున్నాయి. అవి ప్రక్షిప్తాలు. ఈ ఘట్టంలో హనుమ క్రమంగా నూఱు యోజనాలు
పెరిగినట్టు వర్ణింపబడింది. సముద్రం కూడా నూఱు యోజనాలే కాబట్టి హనుమను అటు రాక్షసులు
ఇటు వానరులు తెలిసికొని ఉండేవారు కదా! కనుక ఇవి అసంగతాలు.
-(గోవిందరాజీయం)
తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్య మబ్రవీత్ |
బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనూమతః || 1 ||
(అయినా) ముందుకు వెళ్తున్న హనుమంతుని చూచి,
అతని బలాన్ని పరీక్షించ కోరి, నాగమాతయైన సురస
ప్రవిశ్య వదనం మే౭ద్య గంతవ్యం వానరోత్తమ |
వర ఏష పురాదత్తో మమ ధాత్రేతి సత్వరా |
వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః || 2 ||
“ఓ వానరోత్తమా! ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించే ముందుకు సాగాలి.
పూర్వం బ్రహ్మ నాకు ఇచ్చిన వర మిది“. అంటూ
నోటిని విశాలంగా తెఱచి, హనుమంతుని ముందు
నిలిచింది.
ఏవ ముక్త స్సురసయా క్రుద్ధో వానరపుంగవః |
అబ్రవీత్ కురు వై వక్త్రం యేన మాం విషహిష్యసే || 3 ||
అంత హనుమంతుడు కోపించి, “అయితే నన్ను మ్రింగకలిగేటట్లు నోరు తెఱు” .
ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః |
దశయోజనవిస్తారో బభూవ హనుమాం స్తదా || 4 ||
అని సురసతో పలికి, పది యోజనాల వెడల్పు, అంతే ఎత్తు పెరిగాడు.
తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజన మాయతమ్ |
చకార సురసా చాస్యం వింశ ద్యోజనమాయతమ్ || 5 ||
పది యోజనాల వైశాల్యంతో
ఎదిగి,
మేఘంలాఉన్న ఆయనను చూచి, సురస తన నోటిని ఇరవై యోజనాలకు పెంచింది.
హనుమాంస్తు తతః క్రుద్ధః త్రింశ ద్యోజనమాయతః |
చకార సురసా వక్త్రం చత్వారింశత్ తథోచ్ఛ్రితమ్ || 6 ||
అంత హనుమంతుడు
క్రుద్ధుడై, ముప్పై యోజనాలకు పెరిగాడు. అప్పుడు సురస, తన నోటిని నలబై యోజనాలకు విస్తరించగా,
బభూవ హనుమాన్ వీరః పంచాశ ద్యోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రం షష్టియోజన మాయతం || 7 ||
హనుమంతుడు ఏబై యోజనాలకు
పెరిగాడు. సురస, తన నోటిని అరవై యోజనాలకు పెంచింది.
తథైవ హనుమాన్ వీరః సప్తతీయోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రం అశీతీయోజ నాయతం || 8 ||
హనుమంతుడు, డెబ్బై యోజనాలకు పెరిగాడు. సురస తన నోటిని ఎనబై
యోజనాలకు విస్తరించింది.
హనుమా నచలప్రఖ్యో నవతీయోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రం
శతయోజన మాయతమ్ || 9 ||
హనుమంతుడు, తొంబై యోజనాలకు కొండలా
పెరిగాడు. సురస, తన నోటిని వంద యోజనాలకు విస్తరించింది.
(ఏతవాన్ ప్రక్షిప్తః)
తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్త్ర స్సుబుద్ధిమాన్ |
దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమమ్ |
సుసంక్షిప్యాత్మనః కాయం బభూ వాంగుష్ఠమాత్రకః|| 158 ||
బుద్ధిమంతుడైన వాయుపుత్త్రుడు, దీర్ఘమైన
నాలుకతో, ఘోర నరకప్రాయంగా ఉన్నఆ
నోటిని చూచి, తన కాయాన్ని
సంక్షిప్తంగా చేసి, అంగుష్ఠమాత్రుడయ్యాడు. (బ్రొటనవ్రేలంత
పరిమాణం కలవాడు)
సో౭భిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజనః|
అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచన మబ్రవీత్|| 159 ||
గొప్ప వేగం కల ఆ మారుతి, తటాలున ఆ సురస నోటిలోకి ప్రవేశించి, వెంటనే బయటకు వచ్చి. ఆకాశంలో
నిలిచి, సురసతో అన్నాడు.
ప్రవిష్టో౭స్మి హి తే వక్త్రం దాక్షాయణి నమో౭స్తుతే|
గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ|| 160 ||
“ఓ దాక్షాయణీ! నీకు నమస్కారం. నీ నోట ప్రవేశించాను. ఇక సీత కడకు వెళ్తాను. నీ వరం నిజమైంది కదా!“
తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం
రాహుముఖా దివ|
అబ్రవీత్ సురసా దేవీ
స్వేన రూపేణ వానరమ్|| 161 ||
రాహు ముఖం నుండి
చంద్రునిలా తన ముఖం నుండి వెలువడిన కపివరుని చూసి, సురస నిజ రూపంతో,
అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ
గచ్ఛ సౌమ్య యథాసుఖమ్|
సమానయస్వ వైదేహీం
రాఘవేణ మహాత్మనా|| 162 ||
"ఓ సౌమ్యా! రామకార్యసిద్ధికై సుఖంగా వెళ్ళు. సీతను రాముని వద్దకు చేర్చు“ అంది.
తత్ తృతీయం హనుమతో
దృష్ట్వా కర్మ
సుదుష్కరమ్|
సాధు సాధ్వితి భూతాని
ప్రశశంసు స్తదా హరిమ్|| 163 ||
హనుమంతు డొనర్చిన
దుష్కరమైన ఈ మూడవ కార్యాన్ని చూసి, ప్రాణులన్నీ “బాగు బాగ”ని ప్రశంసించాయి.
--------------------------------------------------------------------------------------------
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి