రామసుందరం
నవమస్సర్గః
తస్యాలయవరిష్ఠస్య మధ్యే విపులమాయతమ్ |
దదర్శ భవనశ్రేష్ఠం హనుమాన్ మారుతాత్మజ: || 1 ||
హనుమంతుడు, ఉత్తమమైన రావణుని భవనం మధ్యలో శ్రేష్ఠమైన పుష్పకవిమానాన్ని చూశాడు.
అర్ధయోజనవిస్తీర్ణ మాయతం యోజనం మహత్ |
భవనం రాక్షసేంద్రస్య
బహుప్రాసాదసంకులమ్
|| 2 ||
రావణుని ఆ మహాభవనం
చుట్టూ అనేక ప్రాసాదాలున్నాయి. ఆ భవనం అర్థయోజనం (4 మైళ్లు) వెడల్పు, ఒక యోజనం (8 మైళ్లు) పొడవున విస్తరించి ఉంది.
మార్గమాణస్తు వైదేహీం సీతామాయతలోచనామ్ |
సర్వత: పరిచక్రామ హనూమా నరిసూదన: || 3 ||
హనుమంతుడు, సీతాదేవిని వెదకుతూ, ఆ భవనమంతా కలయతిరిగాడు.
ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ |
ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రనివేశనమ్ || 4 ||
రాక్షసుల ఉత్తమనివాసాలను పరికిస్తూ, రావణుని ప్రాసాదాన్ని చేరాడు.
చతుర్విషాణై ర్ద్విరదై: త్రివిషాణై స్తథైవ చ |
పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః || 5 ||
ఆ భవనం, - రెండేసి, మూడేసి, నాల్గేసి దంతాలున్న మత్తగజాలచేతా, ఆయుధాలు ధరించి, సర్వసన్నద్ధులై ఉన్న రాక్షసులచేతా
పరివేష్టింపబడి, సురక్షితంగా ఉంది.
రాక్షసీభిశ్చ పత్నీభీ రావణస్య నివేశనమ్ |
ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతమ్ || 6 ||
రావణుని
భార్యలతోనూ, అతడు బలవంతంగా ఎత్తుకువచ్చిన రాజకన్యలతోనూ ఆ
భవనం నిండి ఉంది.
తన్నక్రమకరాకీర్ణం తిమింగిలఝషాకులమ్ |
వాయువేగసమాధూతం పన్నగైరివ సాగరమ్ || 7 ||
మొసళ్లు, మహామత్స్యాలు,
తిమింగిలాలు, చేపలు, విషసర్పాలు, పెనుగాలులు కల్గి, ఆకాశాన్నంటుతున్న తరంగాలతో వ్యాప్తమైన
మహాసాగరంలా ఉందా భవనం.
యా హి వైశ్రవణే లక్ష్మీ:
యా చేంద్రే హరివాహనే |
సా రావణగృహే సర్వా నిత్యమేవానపాయినీ || 8 ||
కుబేరుని సంపద్వైభవాలు, ఇంద్రుని ఐశ్వర్యశోభలు,
రావణుని ఇంట
చిరస్థిరంగా ప్రకాశిస్తున్నాయి.
యా చ రాజ్ఞ: కుబేరస్య యమస్య వరుణస్య చ |
తాదృశీ తద్విశిష్టా వా ఋద్ధీ రక్షోగృహేష్విహ || 9 ||
ఆ రాక్షసగృహాల్లోని
సంపద్వైభవాలు, కుబేర, యమ, వరుణ సంపదలకంటె, గొప్పవి.
తస్య హర్మస్య మధ్యస్థం వేశ్మ చాన్యత్ సునిర్మితమ్ |
బహునిర్యూహసంకీర్ణం దదర్శ పవనాత్మజ: || 10 ||
ఆ మహాప్రాసాదమధ్యభాగంలో
ఉంది మదపుటేనుగులతో
కాపాడబడుతున్న అద్భుతమైన
పుష్పకవిమానం.
బ్రహ్మణో౭ర్థే కృతం దివ్యం
దివి యద్విశ్వకర్మణా |
విమానం పుష్పకం నామ సర్వరత్నవిభూషితమ్ || 11 ||
విశ్వకర్మ బ్రహ్మదేవునికోసం
ఆ పుష్పకవిమానాన్ని సర్వవిధరత్నాలతో "దివి"యందు స్వయంగా నిర్మించి, ఇచ్చాడు.
పరేణ తపసా లేభే యత్ కుబేర: పితామహాత్ |
కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వర: || 12 ||
కుబేరుడు తీవ్రమైన
తపస్సొనర్చి, బ్రహ్మదేవుని అనుగ్రహంతో దాన్ని కానుకగా పొందాడు. రావణుడు తనపరాక్రమంతో కుబేరుని జయించి, ఆ పుష్పకాన్ని తనవశం చేసికొన్నాడు.
ఈహామృగసమాయుక్తై: కార్తస్వరహిరణ్మయై: |
సుకృతైరాచితం స్తంభై: ప్రదీప్తమివ చ శ్రియా || 13 ||
వెండి బంగారాల స్తంభాలు,
వాటిపై వెలుగులు
విరజిమ్మే క్రీడామృగాల బొమ్మలు,
మేరుమందరసంకాశై: ఉల్లిఖద్భిరివాంబరమ్ |
కూటాగారైశ్శుభాకారై: సర్వతస్సమలంకృతమ్ || 14 ||
ఆకాశాన్ని తాకే శిఖరాలు, నేత్రపర్వంచేసే గుప్తగృహాలు,
జ్వలనార్కప్రతీకాశం సుకృతం విశ్వకర్మణా |
హేమసోపానసంయుక్తం చారుప్రవరవేదికమ్ || 15 ||
అగ్నిసూర్యసమానకాంతులు, బంగారుమెట్లు, చూడముచ్చటైన వేదికలు,
జాలవాతాయనైర్యుక్తం కాంచనైస్స్ఫాటికైరపి |
ఇంద్రనీలమహానీల మణిప్రవరవేదికమ్ || 16 ||
బంగారపు స్ఫటికపు కిటికీలు, గవాక్షాలు, ఇంద్రనీల, సింహళ మహానీల వేదికలు,
విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనై: |
నిస్తులాభిశ్చ ముక్తాభి:
తలేనాభివిరాజితమ్ || 17 ||
పగడాలు, మణులు, ముత్యాలు పొదగబడిన భూతలం (నేల), కలిగి,
చందనేన చ రక్తేన తపనీయనిభేన చ |
సుపుణ్యగంధినా యుక్తమ్ ఆదిత్యతరుణోపమమ్ || 18 ||
గుబాళిస్తున్న ఎర్రచందన
సువాసనలతో మధ్యాహ్న సూర్యునిలా తేజరిల్లుతోందా పుష్పకం.
కూటాగారైర్వరాకారై: వివిధైస్సమలంకృతమ్ |
విమానం పుష్పకం దివ్యమ్ ఆరురోహ మహాకపి: || 19 ||
వివిధ మధురాకృతుల
కూటాగారాలు కల ఆ దివ్యవిమానాన్ని ఆ కపివరుడు అధిరోహించాడు.
తత్రస్థస్స తదా గంధం పానభక్ష్యాన్నసంభవమ్ |
దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రత్ రూపవంతమివానిలమ్ || 20 ||
అప్పుడు పానీయాలు, తినుబండారాలు, అన్నాలనుండి పుట్టిన దివ్యగంధం సర్వత్ర
వ్యాపించింది. ఆ వాసన నాసాపుటాలకు తాకగానే, వాయుదేవుడే ఆకృతిదాల్చి, ఆ పరిమళరూపంలో వచ్చాడా అని హనుమంతుడు
భావించాడు.
స గంధస్తం మహాసత్త్వం బంధుర్బంధుమివోత్తమమ్ |
ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర స రావణ: || 21 ||
ఒక బంధువు తన
ఆప్తబంధువును పిలిచినట్టుగా ఆ సువాసన (వాయువు) హనుమంతుని "ఇలా రా, ఇలా రా" అని రావణుడున్న స్థలానికి పిలుస్తున్నట్లుంది.
తతస్తాం ప్రస్థితశ్శాలాం
దదర్శ మహతీం శుభామ్ |
రావణస్య మన:కాంతాం కాంతామివ వరస్త్రియమ్ || 22 ||
హనుమంతుడు
ముందుకు సాగి, శుభాకృతిగల ఒక విశాలమైన శాలను చూశాడు. అది రావణునకు అత్యంత ప్రియమైనది.
మణిసోపానవికృతాం హేమజాలవిభూషితామ్ |
స్ఫాటికైరావృతతలాం దంతాంతరితరూపికామ్ || 23 ||
ఆ శాల, మణిసోపానాలు, బంగారుకిటికీలు, స్ఫటిక, దంత భూతలం,
ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి |
విభూషితాం మణిస్తంభై: సుబహుస్తంభభూషితామ్ || 24 ||
రజత, స్వర్ణ, ముక్త, ప్రవాళ సమంచిత మణిస్తంభాలు,
సమై: ఋజుభిరత్యుచ్చై: సమంతాత్ సువిభూషితై: |
స్తంభై: పక్షైరివాత్యుచ్చై: దివం సంప్రస్థితామివ || 25 ||
సమానంగా నిర్మించబడి, ఆకాశానికి ఎగురుతున్నట్లున్న పక్షాల్లాంటి
అలంకృతమైన అత్యున్నత స్తంభాలు,
మహత్యా కుథయాస్తీర్ణాం పృథివీలక్షణాంకయా |
పృథివీమివ విస్తీర్ణాం
సరాష్ట్రగృహమాలినీమ్
|| 26 ||
పఱచబడిన, పృథివీ (నదులు,సముద్రాలు, గిరులు, వనాది) లక్షణాలు గల విశాల, చిత్ర, రత్నకంబళం
నాదితాం మత్తవిహగై: దివ్యగంధాధివాసితామ్ |
పరార్థ్యాస్తరణోపేతాం రక్షో౭ధిపనిషేవితామ్ || 27 ||
మిక్కిలి మత్తిల్లిన
పక్షుల కలకలాలు, దివ్యపరిమళాలు,
సర్వోత్తమ ఆస్తరణాలు,
ధూమ్రామగరుధూపేన విమలాం హంసపాండురామ్ |
చిత్రాం పుష్పోపహారేణ
కల్మాషీమివ
సుప్రభామ్ || 28 ||
శ్వేతకాంతులు, అగరుధూపాలు, పుష్పహారాలు, చిత్రవర్ణాలు
కలది. కామధేనువులా అన్ని కోరికలు తీర్చగలది.
మనస్సంహ్లాదజననీం వర్ణస్యాపి ప్రసాదినీమ్ |
తాం శోకనాశినీం దివ్యాం
శ్రియస్సంజననీమివ
|| 29 ||
చక్కని ఆహ్లాదాన్ని
గూర్చే శోకనాశిని. వన్నెచిన్నెలు, దివ్యసంపదలు కలది.
ఇంద్రియాణీంద్రియార్థైస్తు పంచ పంచభిరుత్తమై: |
తర్పయామాస మాతేవ తదా రావణపాలితా || 30 ||
శబ్ద (గానాలు), స్పర్శ (వాయువులు),
రూప (అందాలు), రస (మధురభక్ష్యాలు),
గంధా (సువాసనలు) ది విశేషాలతో కన్నతల్లి పుత్రునికి తృప్తి
కల్గించినట్లుగా ఆ శాల హనుమంతునికి తృప్తి కల్గించింది.
స్వర్గో౭యం దేవలోకో౭యమ్ ఇంద్రస్యేయం పురీ భవేత్ |
సిద్ధిర్వేయం పరా హి స్యాత్ ఇత్యమన్యత మారుతి: || 31 ||
ఆ శాలను చూసి, హనుమంతుడు,
"ఇది స్వర్గమా? అందులో దేవతలుండే చోటా? అందులోనూ ఇంద్రుడుండే అమరావతా? దివ్య తపశ్చర్య ఫలరూప పరాసిద్ధా?"
అని అనుకొన్నాడు.
ప్రధ్యాయత ఇవాపశ్యత్ ప్రదీప్తాం స్తత్ర కాంచనాన్ |
ధూర్తానివ మహాధూర్తై: దేవనేన పరాజితాన్ || 32 ||
మహాజూదరులచేత ఓడింపబడి, దీర్ఘాలోచనలో పడిన జూదరుల్లా, బంగారుకాంతులతో నిశ్చలంగా ఉన్న
మణిస్తంభదీపాల్ని అక్కడ మారుతి చూశాడు.
దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ |
అర్చిర్భిర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత || 33 ||
ఆ శాల దేదీప్యానికి
దీపజ్వాలలు, రావణుని తేజస్సు, ఆభరణప్రకాశాలు కారణాలనుకొన్నాడు.
తతో౭పశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరస్రజమ్ |
సహస్రం వరనారీణాం నానావేషవిభూషితమ్ || 34 ||
నానావిధవర్ణవస్త్రాలు, పూలమాలలు,
వివిధవేషభూషణాలు కలిగి, కంబళాలపై నిద్రించిన, వేలకొలది అందగత్తెలను హనుమంతుడు చూశాడు.
పరివృత్తే౭ర్ధరాత్రే తు పాననిద్రావశంగతమ్ |
క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా|| 35 ||
వారు అర్ధరాత్రి దాకా
క్రీడావినోదాలతో అలసిపోయి, తృప్తి లేనివారయినా, మద్యపానమత్తుకు లోబడి, బలవంతంగా నిద్రించారు.
తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణమ్ |
నిశ్శబ్దహంసభ్రమరం యథా పద్మవనం మహత్ || 36 ||
వారితో పాటు వారి
ఆభరణాలు కూడా నిశ్చలమై, అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ దృశ్యం, - కదలని హంసలు, భ్రమరాలు కల పద్మవనంలా అందంగా ఉంది.
తాసాం సంవృతదంతాని మీలితాక్షీణి మారుతి: |
అపశ్యత్పద్మగంధీని వదనాని సుయోషితామ్ || 37 ||
కండ్లు, పెదాలు మూసుకొని, నిద్రిస్తున్నారు వారు. పద్మాల్లా సుగంధాలు వెదజల్లే వారి ముఖాలను
హనుమంతుడు చూశాడు.
ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే |
పునస్సంవృతపత్రాణి రాత్రావివ బభుస్తదా || 38 ||
వారి ముఖాలు ఉదయం
వికసించి, రాత్రి ముకుళించిన కమలాల్లా ఉన్నాయి.
ఇమాని ముఖపద్మాని నియతం మత్తషట్పదా: |
అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పున: పున: || 39 ||
నిజంగానే పద్మాలనుకొని, తుమ్మెదలు వారి ముఖాలను మాటిమాటికి
కోరుతున్నాయి.
ఇతి చామన్యత శ్రీమాన్ ఉపపత్త్యా మహాకపి: |
మేనే హి గుణతస్తాని సమాని సలిలోద్భవై: || 40 ||
సుగంధాది గుణాలవల్ల ఆ
ముఖాలను పద్మాలతో పోల్చవచ్చని హనుమంతుడనుకొన్నాడు.
సా తస్య శుశుభే శాలా తాభిఃస్త్రీభిర్విరాజితా |
శారదీవ ప్రసన్నా ద్యౌ: తారాభిరభిశోభితా || 41 ||
అలాంటి తరుణీమణులతో ఆ
గృహం తారకలతో కూడిన శరత్కాలపు ఆకాశంలా ఉంది.
స చ తాభి: పరివృత: శుశుభే రాక్షసాధిప: |
యథా హ్యుడుపతిశ్శ్రీమాన్ తారాభిరభిసంవృత: || 42 ||
ఆ రమణులతో చుట్టబడి
ఉన్న రావణుడు తారాపరివృతుడైన ఉడుపతి(చంద్రుడు)లా ఉన్నాడు.
యాశ్చ్యవంతే౭Oబరాత్తారా:
పుణ్యశేషసమావృతా: |
ఇమాస్తాస్సంగతా: కృత్స్నా
ఇతి మేనే హరిస్తదా || 43 ||
"అనుభవించినా కూడా ఇంకా పుణ్యం మిగిలిఉండటంతో భూమిపై రాలిన తారలే ఈ
వనితలు" అని హనుమంతుడు భావించాడు.
తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషామ్ |
ప్రభావర్ణప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితామ్ || 44 ||
ఆ స్త్రీలందఱూ
నక్షత్రాల కాంతిని, రంగును, నిర్మలత్వాన్ని కలిగి ఉన్నారు.
వ్యావృత్తగురుపీనస్ర క్ప్రకీర్ణవరభూషణా: |
పానవ్యాయామకాలేషు నిద్రాపహృతచేతస: || 45 ||
పానవ్యాయామకాలాల్లో ఆ
యువతుల పెద్ద లావు పూలమాలలు తారుమారయ్యాయి. ఆభరణాలన్నీ అటూ ఇటూ చెదిరాయి. నిద్రలో మునగడంతో మనోవ్యాపారాలన్నీ ఆగాయి.
వ్యావృత్తతిలకా: కాశ్చిత్
కాశ్చిదుద్భ్రాంతనూపురా:
|
పార్శ్వే గళితహారాశ్చ కాశ్చిత్ పరమయోషిత: || 46 ||
కొందఱి తిలకాలు
చెదిరాయి. కొందఱి అందెలు స్థానాలు తప్పాయి.
కొందఱి కంఠహారాలు
ప్రక్కకు జారాయి.
ముక్తాహారా౭౭వృతాశ్చాన్యా:
కాశ్చిద్విస్రస్తవాసస: |
వ్యావిద్ధరశనాదామా: కిశోర్య ఇవ వాహితా: || 47 ||
కొందఱి ముత్యాలహారాలు
తెగి, వారి మీదే పడి ఉన్నాయి.
కొందఱి వస్త్రాలు
జారిపోయాయి. కొందఱి మొలనూలు తెగి, వదులవడంతో, వారు, వదులైన కట్టు కలిగి,
భూమిపై అటూ ఇటూ
పొర్లాడే ఆడుగుఱ్ఱపుపిల్లల్లా ఉన్నారు.
సుకుండలధరాశ్చాన్యా విచ్ఛిన్నమృదితస్రజ: |
గజేంద్రమృదితా: ఫుల్లా లతా ఇవ మహావనే || 48 ||
కొందఱి పూలమాలలు తెగి, నలిగిపోయి ఉన్నాయి. దాంతో వారు అడవిలో గజరాజు తాకిడితో నలగిన
లతల్లా ఉన్నారు.
చంద్రాంశుకిరణాభాశ్చ హారా: కాసాంచిదుత్కటా: |
హంసా ఇవ బభుస్సుప్తా: స్తనమధ్యేషు యోషితామ్ || 49 ||
కొందఱి గుండెలమధ్యనున్న హారాలు తెల్లగా పెద్దగా ఉండటంతో అవి,
నిద్రిస్తున్న హంసల్లా
ఉన్నాయి.
అపరాసాం చ వైడూర్యా: కాదంబా ఇవ పక్షిణ: |
హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్ || 50 ||
కొందఱి
వైడూర్యమణిహారాలు కాదంబాల్లా (ధూమ్రవర్ణపు ముక్కు, కాళ్లు, ఱెక్కలు కల హంసలు),
కొందఱి హేమసూత్రహారాలు
జక్కవల్లా ఉన్నాయి.
హంసకారండవాకీర్ణా: చక్రవాకోపశోభితా: |
ఆపగా ఇవ తా రేజు: జఘనై: పులినైరివ || 51 ||
పెద్ద
ఇసుకతిన్నెల్లాంటి జఘనాలున్న ఆ జవ్వనులు, హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకాలతో కూడిన నదుల్లా ఉన్నారు.
కింకిణీజాలసంకోశా: తా హైమవిపులాంబుజా: |
భావగ్రాహా యశస్తీరా: సుప్తా నద్య ఇవా౭౭బభు: || 52 ||
చిఱుగజ్జెలు - మొగ్గలు,
బంగారు ఆభరణాలు - పెద్ద కమలాలు,
మనోభావాలు - మొసళ్లు,
యశస్సులు - తీరాలు,
వారు నదుల్లా ఉన్నారు.
మృదుష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితా: |
బభూవుర్భూషణానీవ శుభా భూషణరాజయ: || 53 ||
(నిద్రకు
ముందు నగలు తీసివేసిన) కొందఱి అతివల మెత్తని అవయవాల్లోనూ వక్షాలపైనా ఉన్న
(ఎడతెగక
ధరించడంతో ఏర్పడిన) నగల చక్కని ఆనవాళ్లు,
భూషణాలుగానే
శోభిస్తున్నాయి.
అంశుకాంతాశ్చ కాసాంచిత్ ముఖమారుతకంపితా: |
ఉపర్యుపరి వక్త్రాణాం వ్యాధూయంతే పున: పున: || 54 ||
కొందఱు ముఖాలపై
కప్పుకొన్న అంశుకాంతాలు , వారి ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలకు మాటిమాటికీ రెపరెపలాడుతున్నాయి.
తా: పతాకా ఇవోద్ధూతా: పత్నీనాం రుచిరప్రభా: |
నానావర్ణసువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే || 55 ||
నానావిధవన్నెచిన్నెలతో
శోభిల్లే ఆ మగువల ముఖాలపై మనోజ్ఞప్రభలు కల చీరెల చెఱగులు ఎగురవేసిన పతాకాల్లా
ఉన్నాయి.
వవల్గుశ్చాత్ర కాసాంచిత్
కుండలాని శుభార్చిషామ్ |
ముఖమారుతసంసర్గాత్ మందం మందం సుయోషితామ్ || 56 ||
కొందఱి కుండలాలు వారి
ముఖవాయుస్పర్శల ప్రభావంతో తిన్నతిన్నగా కదులుతున్నాయి.
శర్కరాసవగంధైశ్చ ప్రకృత్యా సురభిస్సుఖ: |
తాసాం వదననిశ్శ్వాస: సిషేవే రావణం తదా || 57 ||
సహజంగానే సువాసనభరితాలై,
సుఖాన్నిచ్చే వారి నిశ్శ్వాసాలు
మధురాలైన మద్యాల గుబాళింపులతో రావణుని సేవించాయి.
రావణాననశంకాశ్చ కాశ్చిద్రావణయోషిత: |
ముఖాని స్మ సపత్నీనామ్
ఉపాజిఘ్రన్
పున: పున: || 58 ||
రావణపత్నులు కొందఱు
రావణుని ముఖమనుకొని,
సవతుల ముఖాలను మళ్లీ
మళ్లీ మూర్కొంటున్నారు.
అత్యర్థం సక్తమనసో రావణే తా వరస్త్రియ: |
అస్వతంత్రాస్సపత్నీనాం
ప్రియమేవా౭౭చరంస్తదా
|| 59 ||
రావణసక్తమనస్కులైన ఆ
సవతులు కూడా, మధుపానపరవశంతో (రావణుడే మూర్కొనినట్లు భావించి)
సపత్నులకు ప్రియం
కలిగిస్తున్నారు.
బాహూనుపనిధాయాన్యా: పారిహార్యవిభూషితాన్ |
అంశుకాని చ రమ్యాణి
ప్రమదాస్తత్ర
శిశ్యిరే || 60 ||
కొందఱు కంకణాలంకృతాలైన
బాహువుల్ని, కొందఱు వస్త్రాల్ని తలగడలుగా చేసుకొని, శయనించారు.
అన్యా వక్షసి చాన్యస్యా:
తస్యా:కాశ్చిత్
పునర్భుజమ్ |
అపరా త్వంకమన్యస్యా:
తస్యా
శ్చాప్యపరా భుజౌ || 61 ||
ఒక పడతి మఱొక యువతి
వక్షంపై తల ఉంచితే, ఆమె భుజాన్నిమఱో భామిని తలగడగా చేసుకొంది. ఒక వనిత మఱొక ముదిత ఒడిని ఆశ్రయిస్తే, ఒక తన్వి మఱొక ఇంతి భుజాలపై తలపెట్టి నిద్రలో
మునిగింది.
ఊరుపార్శ్వకటీపృష్ఠమ్ అన్యో౭న్యస్య సమాశ్రితా: |
పరస్పరనివిష్టాంగ్యో
మదస్నేహవశానుగా:
|| 62 ||
ఆ స్త్రీలందఱూ పరస్పరం ఊరువులను, పార్శ్వాలను, కటిప్రదేశాలను, వీపులను ఆధారంగా చేసుకొని, అన్యోన్యం అవయవాలను పడవేసి, నిద్రించారు.
అన్యోన్యభుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితా హి సా |
మాలేవ గ్రథితా సూత్రే శుశుభే మత్తషట్పదా || 63 ||
కొందఱు వరుసగా భుజాలు
చాచి, పండుకొన్నారు. అందువల్ల అది స్త్రీమాల గా కనిపిస్తోంది.
మాలలా ఉన్నభుజాలపై వారి
తలవెండ్రుకలు పూలదండపై తుమ్మెదల్లా నిగనిగలాడుతున్నాయి.
లతానాం మాధవే మాసి ఫుల్లానాం వాయుసేవనాత్ |
అన్యోన్యమాలాగ్రథితం సంసక్తకుసుమోచ్చయమ్ || 64 ||
వ్యతివేష్టిత సుస్కంధమ్ అన్యోన్యభ్రమరాకులమ్ |
ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణస్య తత్ || 65 ||
మాలికలా ఏర్పడి, పుష్పాలు ధరించి, ఒకరినొకరు చుట్టుకొని (చెట్టుబోదెలమీద అల్లుకొని) చెదరిన ముంగురులు (తుమ్మెదలు)
ముఖమారుతం (వాయువు) వల్ల కదలే కొంగులు కల ఆ రావణస్త్రీవనం వసంతవైశాఖంలోని
లతావనంలా ఉంది.
ఉచితేష్వసి సువ్యక్తం న తాసాం ఓషితాం తదా |
వివేకశ్శక్య ఆధాతుం భూషణాంగాంబరస్రజామ్ || 66 ||
ఆ సమయంలో ఆ అతివల
ఆభరణాలు, అవయవాలు, వస్త్రాలు, పూలమాలలు ఉండవలసినచోటే ఉన్నా, అందఱూ కలసి పండుకోవటంవల్ల ఏవి ఎవరివో తెలియటం లేదు.
రావణే సుఖసంవిష్టే తా: స్త్రియో వివిధప్రభా: |
జ్వలంత: కాంచనా దీపా: ప్రైక్షంతా౭నిమిషా ఇవ || 67 ||
రావణుడు మేల్కొని ఉండగా
చూడ్డం అసాధ్యం కాబట్టి, అక్కడి స్వర్ణస్తంభదీపాలు,
రావణుడు నిద్రపోయాక, ఆ ముదితలను ఱెప్పపాటు లేకుండా
చూస్తున్నట్లున్నాయి. (నిశ్చలమయ్యాయి)
రాజర్షిపితృదైత్యానాం గంధర్వాణాం చ యోషిత: |
రాక్షసానాం చ యా: కన్యా: తస్య కామవశం గతా: || 68 ||
రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతలు, రాక్షసకన్నెలు ఆ రావణుని వలచి వచ్చారు.
యుద్ధకామేన తాస్సర్వా రావణేన హృతాస్త్ర్సియ: |
సమదా మదనేనైవ మోహితా: కాశ్చిదాగతా: || 69 ||
ఆ ఆడువారందఱూ
యుద్ధకాముడైన రావణునిచేత అపహరింపబడినవారే.
కొందఱు మాత్రం రావణుని
మోహించి వచ్చారు.
న తత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య
వీర్యోపపన్నేన గుణేన లబ్ధా |
న చాన్యకామాపి న చాన్యపూర్వా
వినా వరార్హాం జనకాత్మజాం తామ్ || 70 ||
సీత తప్ప తక్కిన ప్రతి వనితా రావణుని పరాక్రమాది గుణాలకు మోహించి వచ్చిందే
కానీ బలాత్కారంగా
తేబడినది కాదు. ఆ స్త్రీలలో మఱొకరి ప్రియురాలూ లేదు. మఱొకరి భార్యా లేదు.
న చాకులీనా న చ హీనరూపా
నాదక్షిణా నానుపచారయుక్తా |
భార్యా౭భవత్ తస్య న హీనసత్త్వా
న చాపి కాంతస్య న కామనీయా || 71 ||
ఆ కాంతలందఱూ మంచివంశంలో
పుట్టినవారు, అందగత్తెలు, జాణలు, ఉపచారయుక్తలు, బుద్ధిమంతులు,
భర్తకు మరులు
గొల్పేవారు.
బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య
యదీదృశీ రాఘవధర్మపత్నీ |
ఇమా యథా రాక్షసరాజభార్యా:
సుజాతమస్యేతి హి సాధుబుద్ధే: || 72 ||
"రావణుని చేరి, అతడి భార్యలు సుఖంగా ఉన్నట్లే, సీత కూడా రాముని చేరి, హాయిగా ఉంటే ఈ రావణునికి శుభం కల్గుతుంది. (సీతను అపహరించకున్నా / ఆమెను రామునికి అప్పగించినా రావణునికి మేలే
జరుగుతుంది)
పునశ్చ సో౭చింతయదార్తరూపో
ధ్రువం విశిష్టా గుణతో హి సీతా |
అథాయమస్యాం కృతవాన్ మహాత్మా
లంకేశ్వర: కష్టమనార్యకర్మ || 73 ||
సద్గుణాల్లో ఈ
కాంతలకన్నా సీత ఎంతో అధికురాలు.
అటువంటి సీతను అపహరించి, ఆమె విషయంలో రావణుడెంతో అనుచితమైన పని చేశాడు".
అని హనుమంతుడు
చింతించాడు.
---------------------------------------------------------------------------------------------------------------------------------
వజ్రపఞ్జరనామేదం
యో రామకవచం స్మరేత్ | అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ||14||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే
నవమస్సర్గః (9)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి