23, మే 2020, శనివారం

Sundarakanda సుందరకాండ 5


రామసుందరం
పంచమస్సర్గః
తత స్స మధ్యంగతమంశుమంతం
జ్యోత్స్నావితానం మహదుద్వమంతమ్ |
దదర్శ ధీమాన్ దివి భానుమంతం
గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతమ్ || 1
అంత హనుమంతుడు,  ఆకాశమధ్యంలో, వెన్నెలలను అన్ని తావులకు విరజిమ్ముతున్న చల్లని చంద్రుణ్ణి చూశాడు. ఆ భానుమంతుడు (చంద్రుడు), ఆవులమందలో తిరుగుతున్న మత్తవృషభంలా ఉన్నాడు.
లోకస్య పాపాని వినాశయంతం
మహోదధిం చాపి సమేధయంతమ్ |
భూతాని సర్వాణి విరాజయంతం
దదర్శ శీతాంశుమథాభియాంతమ్ || 2
లోకుల పాపాల్ని పోగొట్టేవాడు, సముద్రాన్ని వృద్ధి పొందించేవాడు, పంచభూతాలను, ప్రాణులను ప్రకాశింపచేస్తున్నవాడు, అయిన అమృతకిరణుని చూశాడు.
యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా
తథా ప్రదోషేషు చ సాగరస్థా |
తథైవ తోయేషు చ పుష్కరస్థా
రరాజ స చారునిశాకరస్థా || 3
మందరగిరిపైనా, ప్రదోషకాలంలో సముద్రంమీదా, పద్మాల్లోనూ భాసించే లక్ష్మి(కళ/శోభ) చంద్రకిరణాల్లో సుందరంగా ప్రకాశించింది.
హంసో యథా రాజతపంజరస్థః
సింహో యథా మందరకందరస్థః |
వీరో యథా గర్వితకుంజరస్థః
చంద్రో౭పి బభ్రాజ తథా౭oబరస్థః || 4
వెండిపంజరంలో హంసలా, మందరగిరిగుహలో సింహంలా, మత్తగజంపై వీరునిలా, ఆకాశాన చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు.
స్థితః కకుద్మానివ తీక్ష్ణశృంగో
మహాచలశ్శ్వేత ఇవోచ్చశృంగః |
హస్తీవ జాంబూనదబద్ధశృంగో
రరాజ చంద్రః పరిపూర్ణశృంగః || 5
కఱకు శృంగాలు (కొమ్ములు) కల ఎద్దులా, ఉన్నత శృంగాలు (శిఖరాలు) కల తెల్లకొండలా, బంగారుతొడుగుల శృంగాలు (దంతాలు) కల తెల్లఏనుగులా, సంపూర్ణ శృంగాల (షోడశకళల) తో చంద్రుడు తేజరిల్లుతున్నాడు.
వినష్టశీతాంబుతుషారపంకో
మహాగ్రహగ్రాహవినష్టపంకః |
ప్రకాశలక్ష్మ్యాశ్రయనిర్మలాంకో
రరాజ చంద్రో భగవాన్ శశాంకః || 6
చంద్రకిరణాలతో శీతాంబువులు, మంచుబిందువులు నశించాయి. సూర్యకిరణాలను గ్రహించటంతో చంద్రునిలోని మాలిన్యాలు నశించాయి. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమివ్వటంతో చంద్రునిలోని మచ్చకూడా నిర్మలమైంది. ఈ విధంగా శశాంకుడైన చంద్రభగవానుడు విరాజిల్లుతున్నాడు.
శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో
మహారణం ప్రాప్య యథా గజేంద్రః |
రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః
తథా ప్రకాశో విరరాజ చంద్రః || 7
శిలాతలంమీద మృగరాజులా, గొప్పయుద్ధంలో నిలిచిన గజరాజులా, రాజ్యాన్ని పొందిన రారాజులా, రేరాజు శోభిస్తున్నాడు.
ప్రకాశచంద్రోదయనష్టదోషః
ప్రవృత్తరక్షఃపిశితాశదోషః |
రామాభిరామేరితచిత్తదోషః
స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః || 8
చంద్రోదయంతో చీకటి పోయింది. నిశాచరులకు మాంసం తినే కాలమయింది. స్త్రీపురుషులకు ప్రణయకలహాదులు మాన్పి, స్వర్గానందం కల్గించే ప్రదోషకాలం గడచింది.
తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః
స్వపంతి నార్యః పతిభిస్సువృత్తాః |
నక్తంచరాశ్చాపి తథా ప్రవృత్తా
విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః || 9
వీణాతంత్రీరవాలు వీనులవిందు చేస్తున్నాయి. కులసతులు పతులతో గూడి, నిద్రిస్తున్నారు. అద్భుతరౌద్రప్రవృత్తికల నిశాచరులు విహరిస్తున్నారు.
మత్త ప్రమత్తాని సమాకులాని
రథాశ్వభద్రాసనసంకులాని |
వీరశ్రియా చాపి సమాకులాని
దదర్శ ధీమాన్ స కపిః కులాని || 10
మత్తుతో ప్రమత్తులైన వారితో నిండి, ఇఱుకై, రథాశ్వాలు, భద్రగజాలు, ఆసనాలు మెండుగా ఉండి, సంపదలతో విలసిల్లే గృహాలను చూశాడు.
పరస్పరం చాధికమాక్షిపంతి
భుజాంశ్చ పీనానధికం క్షిపంతి |
మత్తప్రలాపా నధికం క్షిపంతి
మత్తాని చాన్యోన్య మధిక్షిపంతి || 11
రాక్షసులలొ కొందఱు పరస్పరం పరిహసించుకొంటున్నారు, ఒకరి భుజాలపై ఒకరు చేతులువేసుకొంటున్నారు. మత్తప్రలాపాలు చేస్తున్నారు. పరస్పరం నిందించుకొంటున్నారు.
రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి
గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి |
రూపాణి చిత్రాణి చ విక్షిపంతి
దృఢాని చాపాని చ విక్షిపంతి || 12
ఱొమ్ములు విరుచుకొంటున్నారు. తమ కాంతలపై తూలిపడుతున్నారు. వివిధవేషాలు ధరిస్తున్నారు. ధనుస్సులను మోపెడుతున్నారు.
దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః
తథా పరాస్తత్ర పునస్స్వపంత్యః |
సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః
క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్శ్వసంత్యః || 13
చందనాది లేపనాలు అలదుకొంటున్న, నిద్రిస్తున్న, నవ్వుతున్న, కోపంతో నిట్టూర్పులు విడుస్తున్న కాంతలు కొందఱ్ని చూశాడు.   
మహాగజైశ్చాపి తథా నదద్భిః
సుపూజితైశ్చాపి తథా సుసద్భిః |
రరాజ వీరైశ్చ వినిశ్శ్వసద్భిః
హ్రదో భుజంగైరివ నిశ్శ్వసద్భిః || 14
ఘీంకరిస్తున్న మహాగజాలు, పూజితులైన సత్పురుషులు, ప్రతివీరులు లేక నిట్టూర్పులు విడుస్తున్న వీరులతో  ఆ లంక, సర్పాలతో నిండిన మడుగులా ఉంది.
బుద్ధిప్రధానాన్ రుచిరాభిధానాన్
సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్ |
నానావిధానాన్ రుచిరాభిదానాన్
దదర్శ తస్యాం పురి యాతుధానాన్ || 15
బుద్ధిమంతులు, చక్కని వ్యవహర్తలు, ఆస్తికులు, వివిధాచారులను, చూశాడు.
ననంద దృష్ట్వా స చ తాన్ సురూపాన్
నానాగుణానాత్మగుణానురూపాన్ |
విద్యోతమానాన్ స తదానురూపాన్
దదర్శ కాంశ్చిచ్చ పునర్విరూపాన్ || 16
సురూపులు, నానాగుణాత్ములు, ఆత్మానుగుణరూపులను చూసి, ఆనందించాడు. ఇంకా వికృతరూపుల్నీ, తదనుగుణంగా ప్రవర్తించేవారినీ చూశాడు.
తతో వరార్హాస్సువిశుద్ధభావాః
తేషాం స్త్రియస్తత్ర మహానుభావాః |
ప్రియేషు పానేషు చ సక్తభావాః
దదర్శ తారా ఇవ సుప్రభావాః || 17
భర్తలపై పరిశుద్ధానురాగం కలవారిని, అనుగుణమైన సత్ర్పవర్తన కల శీలవతులను, ప్రియులపైనా పానాదులపైనా ఆసక్తి కలవారిని, నక్షత్రశోభ కల స్త్రీలను చూశాడు.
శ్రియా జ్వలంతీ స్త్రపయోపగూఢా
నిశీథకాలే రమణోపగూఢాః |
దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢా
యథా విహంగాః కుసుమోపగూఢాః || 18
కొందఱు సౌందర్యవతులు, అర్ధరాత్రిసమయంలో కాంతుల కౌగిళ్లలో చిక్కి, సిగ్గుపడుతూ, ఆనందపరవశులై ఉన్నారు. వారు పుష్పాలతో అలంకరించుకొన్న ఆడపక్షుల్లా ఉన్నారు.
అన్యా: పునర్హర్మ్యతలోపవిష్టా:
తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టా: |
భర్తు:ప్రియా ధర్మపరా నివిష్టా:
దదర్శ ధీమాన్ మదనాభివిష్టా: || 19
కొందఱు ధర్మపరులైన కులసతులు, మేడలపైన, ప్రియుల తొడలపై సుఖంగా కూర్చొని, వారికి ప్రియం చేస్తూ, మన్మథావేశంతో ఉన్నారు.
అప్రావృతాః కాంచనరాజివర్ణాః
కాశ్చిత్ పరార్థ్యా స్తపనీయవర్ణాః |
పునశ్చ కాశ్చిత్ శశలక్ష్మవర్ణాః
కాంతప్రహీణా రుచిరాంగవర్ణాః || 20
మేలి ముసుగులు లేక, బంగారు తీగెల్లా మెఱుస్తున్నవారు, తప్తకాంచనకాంతులతో వెలుగుతున్నవారు, చంద్రునికాంతి కలవారు, విరహతాపానికి లోనైనవారు,
తత: ప్రియాన్ ప్రాప్య మనో౭భిరామాన్
సుప్రీతియుక్తా: ప్రసమీక్ష్య రామా: |
గృహేషు హృష్టా: పరమాభిరామా
హరిప్రవీరస్స దదర్శ రామా: || 21
ప్రియులను పొంది, ఆనందిస్తున్నవారు, మనోహరంగానూ, ఆనందంగానూ ఉన్నవారు - ఇట్టి స్త్రీలను చూశాడు.
చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాలా:
వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలా: |
విభూషణానాం చ దదర్శ మాలా:
శతహ్రదానామివ చారుమాలా: || 22
చంద్రప్రకాశులను, వంకర కనుఱెప్పలు కల నేత్రాలను, విద్యున్మాలలాంటి ఆభరణపంక్తుల్ని చూశాడు.
త్వేవ సీతాం పరమాభిజాతాం
పథి స్థితే రాజకులే ప్రజాతామ్ |
లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం
దదర్శ తన్వీం మనసాభిజాతామ్ || 23
కానీ పరమసౌందర్యవతి, ధర్మమార్గస్థితరాజకులప్రజాత, ప్రఫుల్లలత లాంటి సాధుజాత, అయోనిజ, కృశాంగి అయిన సీతను మాత్రం ఆయన కనుగొనలేకపోయాడు.
సనాతనే వర్త్మని సన్నివిష్టాం
రామేక్షణాం తాం మదనాభివిష్టామ్ |
భర్తుర్మనశ్శ్రీమదనుప్రవిష్టాం
స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టామ్ || 24
సనాతనమార్గాన ప్రవర్తించేది, రామవిరహంతో దుఃఖిస్తున్నది, ఆయనకై ఎదురుతెన్నులు చూస్తున్నది, శ్రీరాముని శ్రీమంతమైన మనస్సులో స్థిరంగా నిల్చి ఉన్నది, నారీరత్నాల్లో అత్యుత్తమురాలైన సీత మాత్రం కంటబడలేదు.
ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం
పురా వరార్హోత్తమనిష్కకంఠీమ్ |
సుజాతపక్ష్మామభిరక్తకంఠీం
వనే ప్రనృత్తామివ నీలకంఠీమ్ || 25
భర్తృవిరహంతో పరితపించేది, కన్నీరు కారుస్తూండేది, గద్గద కంఠం కలది, లోగడ కాంచనాభరణాలు ధరించినది, అందమైన కనుఱెప్పలు, మధుర కంఠస్వరం కలది, వనమయూరి అయిన సీత మాత్రం కనబడలేదు.
అవ్యక్తరేఖా మివ చంద్రరేఖాం
పాంసుప్రదిగ్ధామివ హేమరేఖామ్ |
క్షతప్రరూఢామివ బాణరేఖాం
వాయుప్రభిన్నామివ మేఘరేఖామ్ || 26
సరిగా కనబడని చంద్రరేఖ, ధూళి ధూసరితమైన బంగారురేఖ, గాయం మాని, గుర్తుగా మిగిలిన బాణరేఖ, గాలికి చెదరిన మేఘరేఖ లాంటి సీత,
సీతామపశ్యన్మనుజేశ్వరస్య
రామస్య పత్నీం వదతాం వరస్య |
బభూవ దు:ఖాభిహతశ్చిరస్య
ప్లవంగమో మంద ఇవాచిరస్య || 27
వాక్చతురులలో శ్రేష్ఠుడు, నరేంద్రుడైన రాముని పత్ని అయిన సీత, ఎంత వెదకినా కనబడకపోవడంతో, ఆంజనేయుడు, కొద్దికాలం మందునిలా దుఃఖించాడు.
.................................................................................................................................................................
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ | స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ||10||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచమస్సర్గః (5)

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...