25, మే 2020, సోమవారం

Sundarakanda సుందరకాండ 7

రామసుందరం
సప్తమస్సర్గః

స వేశ్మజాలం బలవాన్ దదర్శ
వ్యాసక్తవైడూర్యసువర్ణజాలమ్ |
యథా మహత్ప్రావృషి మేఘజాలం
విద్యుత్పినద్ధం సవిహంగజాలమ్ || 1
వైడూర్యాలు పొదిగిన బంగారుకిటికీలు, వాటిలో పక్షుల్ని కలిగి ఉండి, విద్యుత్కాంతుల్ని విరజిమ్మే వర్షాకాలమేఘాల్లా ఆ మహాంతఃపురంలో గృహాలు భాసిస్తున్నాయి.
నివేశనానాం వివిధాశ్చ శాలా:
ప్రధానశంఖాయుధచాపశాలా: |
మనోహరాశ్చాపి పునర్విశాలా:
దదర్శ వేశ్మాద్రిషు చంద్రశాలా: || 2
పర్వతాల్లాంటి ఆ గృహాల్లో శ్రేష్ఠతమాలైన శంఖాయుధధనుశ్శాలలు, మనోహరమైన విశాలమైన చంద్రశాలలు చూశాడు.
గృహాణి నానావసురాజితాని
దేవాసురైశ్చాపి సుపూజితాని |
సర్వైశ్చ దోషై: పరివర్జితాని
కపిర్దదర్శ స్వబలార్జితాని || 3
రావణుడు నిజబలంతో సంపాదించిన ఆ గృహాలు నానావసురాజితాలు, సురాసురల ప్రశంసలు అందుకొనేవి, ఏ దోషాలు లేనివి.
తాని ప్రయత్నాభిసమాహితాని
మయేన సాక్షాదివ నిర్మితాని |
మహీతలే సర్వగుణోత్తరాణి
దదర్శ లంకాధిపతేర్గృహాణి || 4
సర్వగుణోత్కృష్టాలైన ఆ గృహాలు, ఎంతో ప్రయత్నంతో సాక్షాత్తూ మయుడే నిర్మించినవా అన్నట్టున్నాయి.
తతో దదర్శోచ్ఛ్రితమేఘరూపం
మనోహరం కాంచనచారురూపమ్ |
రక్షో౭ధిపస్యాత్మబలానురూపం
గృహోత్తమం హ్యప్రతిరూపరూపమ్ || 5
తర్వాత హనుమంతుడు, ఒక ఉత్తమమైన గృహాన్ని చూశాడు. అది మేఘంలా ఉన్నతంగా ఉంది. బంగారంతో చేసినందువల్ల మనోహరంగా ఉంది. సాటిలేనిదై, రావణుని బలానికి తగినట్టుగా ఉంది.
మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం
శ్రియా జ్వలంతం బహురత్నకీర్ణమ్ |
నానాతరూణాం కుసుమావకీర్ణమ్
గిరేరివాగ్రం రజసావకీర్ణం || 6
అది, భూమికి దిగివచ్చిన స్వర్గంలా ఉంది. రత్నాలతో వెలుగుతోంది. ఎన్నో రకాల వృక్షాలపూలతో కప్పబడి, పూలపుప్పొడితో నిండిన పర్వతశిఖరంలా ఉంది.
నారీప్రవేకైరివ దీప్యమానం
తటిద్భిరంభోదవదర్చ్యమానమ్ |
హంసప్రవేకైరివ వాహ్యమానం
శ్రియా యుతం ఖే సుకృతాం విమానమ్ || 7
దానిలో మెఱపుతీగల్లాంటి నారీరత్నాలుండటంతో విద్యుల్లతాయుతమేఘంలా ఉంది. అందఱితో సేవింపబడుతోంది. రాజహంసలతో మోయబడుతున్న, సుకృతుల విమానంలా ఉంది.
యథా నగాగ్రం బహుధాతుచిత్రం
యథా నభశ్చ గ్రహచంద్రచిత్రమ్ |
దదర్శ యుక్తీకృతమేఘచిత్రం
విమానరత్నం బహురత్నచిత్రమ్ || 8
చంద్రాదిగ్రహాలతో శోభిల్లుతున్న ఆకాశంలా, నానావిధరత్నచిత్రితమై, గైరికాదిబహువర్ణశోభితమైన పర్వతశిఖరంలా, చిత్రవిచిత్రమేఘరాశిలా ఉంది.
మహీకృతా పర్వతరాజిపూర్ణా
శైలా: కృతా వృక్షవితానపూర్ణా: |
వృక్షా: కృతా: పుష్పవితానపూర్ణా:
పుష్పం కృతం కేసరపత్త్రపూర్ణమ్ || 9
దానిపై పెక్కు దృశ్యాలు చిత్రించి ఉన్నాయి. భూమి, దానిపై పర్వతపంక్తులు, వాటిపై వృక్షసమూహాలు, ఆ వృక్షాలపై పుష్పవితానాలు, వాటిపై కేసరాలు, పత్రాలు ఉన్నాయి.
కృతాని వేశ్మాని చ పాండురాణి
తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి |
పునశ్చ పద్మాని సకేసరాణి
ధన్యాని చిత్రాణి తథా వనాని || 10
స్వచ్ఛకాంతులు విరజిమ్మే గృహాలు,  రంగురంగుల పూలసరస్సులు, కింజల్కాలున్న పద్మాలు చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రిత వనాలు అత్యద్భుతాలు.
పుష్పాహ్వయం నామ విరాజమానం
రత్నప్రభాభిశ్చ వివర్ధమానమ్ |
వేశ్మోత్తమానామపి చోచ్చమానం
మహాకపిస్తత్ర మహావిమానమ్ || 11
అది, "పుష్పకం" అనే పేరుతో విరాజిల్లే మహావిమానం.  రత్నకాంతుల్ని అన్ని దిశలకూ విరజిమ్ముతూ, ఆకాశానికి ఎగురుతున్నదా అన్నట్లుంది. అక్కడున్న అన్నింటికంటే అదే ఉత్తమప్రాసాదం
కృతాశ్చ వైడూర్యమయా విహంగా:
రూప్యప్రవాళైశ్చ తథా విహంగా: |
చిత్రాశ్చ నానావసుభిర్భుజంగా
జాత్యానురూపాస్తురగాశ్శుభాంగా: || 12
ఆ విమానంలో వైడూర్యాలు, వెండి, పగడాలతో చెక్కబడ్డ పక్షులు, వివిధమణిచిత్రితసర్పాలు, శుభాంగాలు కల్గిన ఉత్తమజాతి గుఱ్ఱాలు
రూపొందింపబడి ఉన్నాయి.
ప్రవాళజాంబూనదపుష్పపక్షా:
సలీలమావర్జితజిహ్మపక్షాః |
కామస్య సాక్షాదివ భాంతి పక్షా:
కృతా విహంగాస్సుముఖాస్సుపక్షా: || 13
విలాసభంగిమల్లో వంచబడి, వంకరలు తిరిగి ఉన్న చక్కని ముఖాలు, మంచి ఱెక్కలు గల పక్షుల్ని చెక్కారు. ఆ ఱెక్కలపై, బంగారం మరియు పగడాల పువ్వులు ముద్రింపబడిఉన్నాయి. ఆ పక్షులు మన్మథసహాయకుల్లా ఉన్నాయి.
నియుజ్యమానాస్తు గజాస్సుహస్తా:
సకేసరాశ్చోత్పలపత్రహస్తా: |
బభూవ దేవీ చ కృతా సుహస్తా
లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా || 14
ఆ విమానంలో, పద్మాలను ధరించి, పద్మసరస్సులో రాజిల్లుతున్నలక్ష్మీదేవిని, ఆమెకు ఇరువైపులా తమ తొండాలతో పద్మాలను, పత్రాలను గ్రహించి, ఆ దేవికి అభిషేకం చేస్తున్న ఏనుగులను చిత్రించారు. వాటి శరీరాలపై పద్మకేసరాలు రాలి ఉన్నాయి.
ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం
సవిస్మయో నగమివ చారుశోభనమ్ |
పునశ్చ తత్పరమసుగంధి సుందరం
హిమాత్యయే నగమివ చారుకందరమ్ || 15
పర్వతంలా ఉన్నతమై, ఆహ్లాదకరంగా ఉన్న ఆ పుష్పకాన్ని చూచి, హనుమంతుడు, ఆశ్చర్యపడ్డాడు. వసంతర్తువులో పరిమళభరితమై, అందమై చక్కని గుహలుకల పర్వతంలా ఉన్న ఆ భవనంలోకి ఆయన మఱోమాఱు ప్రవేశించాడు.
తతస్స తాం కపిరభిపత్య పూజితాం
చరన్ పురీం దశముఖబాహుపాలితామ్ |
అదృశ్య తాం జనకసుతాం సుపూజితాం
సుదు:ఖిత: పతిగుణవేగనిర్జితామ్ || 16
తర్వాత ఆ కపివరుడు,  లంకంతా తిరిగినా, పరమపూజ్యురాలు, తన సద్గుణాలతో శ్రీరాముని జయించినది అయిన సీత కనబడకపోవడంతో  విచారగ్రస్తుడయ్యాడు.
తతస్తదా బహువిధభావితాత్మన:
కృతాత్మనో జనకసుతామ్ సువర్త్మన: |
అపశ్యతో౭భవదతిదు:ఖితం మన:
సుచక్షుష: ప్రవిచరతో మహాత్మన: || 17
హనుమంతుడు నిశ్చయబుద్ధితో, పరిపరివిధాల ఆలోచనలు చేస్తూ, అంతటా సంచరిస్తూ, సీతకై వెదకాడు. అయినా జానకిని కానక, మిక్కిలి దుఃఖించాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ | నరో న లిప్యతే పాపై ర్భుక్తిం ముక్తిం చ విన్దతి ||12||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తమస్సర్గః (7)

మంగళం మహత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...