17, మే 2020, ఆదివారం

Sundarakanda సుందరకాండ 1-4



రామసుందరం 1-4
త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం |
         పాతళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 93 ||
వీరులైన వారు తిరిగి లేచి రాకుండా, పాతాళద్వారాన్ని పూర్తిగా మూసేశావు.
తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైల వర్ధితుం |
తస్మా త్సంచోదయామి త్వా ముత్తిష్ఠ గిరిసత్తమ || 94 ||
పైకి క్రిందకి అన్నివైపులకూ పెరిగే సామర్థ్యం కలవాడవు. కాబట్టి లే.
స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ |
హనూమాన్ రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః || 95 ||
హనుమంతుడు, రామకార్యార్థమై నీ పైభాగాన ఆకాశంలో ఇదిగో, వస్తున్నాడు.
అస్య సాహ్యం మయా కార్య మిక్ష్వాకుకులవర్తినః |
మమ హీక్ష్వాకవః పూజ్యాః  పరం పూజ్యతమాస్తవ || 96 ||
ఇక్ష్వాకులు నాకు పూజ్యులు. (నన్ను ఆశ్రయించి ఉన్నందున) నీకు మిక్కిలి పూజ్యులు. అందువల్ల ఇక్ష్వాకువంశజుడైన రామసచివునికి సహాయపడడం మన కర్తవ్యం.
కురు సాచివ్య మస్మాకం న నః కార్యమతిక్రమేత్ |
కర్తవ్య మకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ || 97 ||
కాబట్టి మాకు సహాయపడు. మా పనిని విధిగా ఆచరించు. సకాలంలో కర్తవ్యాన్ని (చేయవలసినది) చేయకపోతే పెద్దలకు (ఇంద్రాది దేవతలకు) కోపం వస్తుంది.
సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపి స్త్వయి |
  అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః || 98 ||
పైకి రా. ఈ కపివరుడు మనకు అతిథి. పూజ్యుడు. నీపై అతడు విశ్రాంతి తీసుకొంటాడు.
చామీకరమహానాభ దేవగంధర్వసేవిత |
హనుమాంస్త్వయి విశ్రాంతః తత శ్శేషం గమిష్యతి || 99 ||
ఓ చామీకరమహానాభా!, దేవగంధర్వ సేవితా!, విశ్రాంతి తర్వాత ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ || 100 ||
ఇదిగో, ఆ కపిశార్దూలుడు నీ సమీపానికి రానే వచ్చాడు.
కాకుత్థ్సస్యానృశంస్యం చ  మైథిల్యాశ్చ వివాసనం |
శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి || 101 ||
కాకుత్థ్సుని* (రాముని) మంచితనాన్ని, మైథిలి* దుఃస్థితిని, హనుమంతుని శ్రమను గుర్తించి, బయటకు రా!".
హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః |
ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః || 102 ||
మైనాకుడు, సముద్రుని మాటలను విని, లతలతో కూడిన మహావృక్షాలతో సహా వేగంగా,
స సాగరజలం భిత్త్వా బభూవాభ్యుత్థిత స్తదా |
యథా జలధరం భిత్త్వా దీప్తరశ్మిర్దివాకరః || 103 ||
మేఘపటలాన్ని చీల్చుకొని, ప్రకాశించే కిరణాలతో వచ్చే దివాకరునిలా, సాగరజలాన్ని భేదించుకొని, బయటకు వచ్చాడు.
స మహాత్మా ముహూర్తేన పర్వతస్సలిలావృతః |
దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః || 104 ||
సముద్రజలాలచేత ఆవృతుడై, ఆ మైనాకుడు ఒక్కసారిగా తటాలున తన శృంగాలను దర్శింపజేశాడు.
శాతకుంభమయైః శృంగైః సకిన్నరమహోరగైః |
ఆదిత్యోదయసంకాశైః ఆలిఖద్భిరివాంబరమ్ || 105 ||
కిన్నరులను, మహాసర్పాలను కలిగిన మైనాకుని శిఖరాలు బంగరుకాంతులను ప్రసరిస్తున్నాయి. అవి, ఆకాశాన ఆలిఖిస్తూ, ఉదయిస్తున్న సూర్యకిరణాల్లా భాసిస్తున్నాయి.
తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః |
ఆకాశం శస్త్రసంకాశ మభవత్కాంచనప్రభమ్ || 106 ||
సముద్రజలాలనుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన ఆ శిఖరాల మేలిమి బంగరుకాంతులతో లోహవర్ణంగల ఆకాశం కాంచనప్రభలను పొందింది.
జాతరూపమయైః శృంగైః భ్రాజమానైస్స్వయంప్రభైః |
ఆదిత్యశతసంకాశః సో౭భవ ద్గిరిసత్తమః || 107 ||
స్వర్ణమయములై, స్వయంప్రభలతో వెలిగే శిఖరాలతో ఆ మైనాకుడు నూఱుగురు సూర్యుల్లా ప్రకాశించాడు.
తముత్థితమసంగేన హనూమానగ్రతః స్థితం |
మధ్యే లవణతోయస్య విఘ్నో౭యమితి నిశ్చితః || 108 ||
అకారణంగా సముద్రం మధ్యనుంచి లేచి, ఎదురుగా నిలిచిన మైనాకపర్వతాన్ని చూచి, హనుమంతుడు,
"ఇదొక ఆటంకం" అనుకొన్నాడు.
స తముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః |
ఉరసా పాతమాయాస జీమూతమివ మారుతః || 109 ||
మేఘాన్ని వాయువులా, ఉన్నతమైన ఆ పర్వతాన్ని తన వక్షఃస్థలంతో పడద్రోశాడు.
స తథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః |
బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ || 110 ||
తనను పడద్రోసిన ఆయన వేగాన్ని తెలుసుకుని, మైనాకుడు, ఆనందంతో పులకించాడు.
తమాకాశగతం వీర మాకాశే సముపస్థితః |
ప్రీతో హృష్టమనా వాక్య మబ్రవీత్పర్వతః కపిం |
మానుషం ధారయన్ రూప మాత్మనశ్శిఖరే స్థితః || 111 ||
ప్రేమతో, ప్రసన్నమైన మదితో మానవరూపం ధరించి, తన శిఖరం పైన నిలిచి, హనుమంతునితో ఇలా అన్నాడు.
దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమః |
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖమ్ || 112 ||
" ఓ  వానరోత్తమా! నీవీ దుష్కరకార్యానికి పూనుకొన్నావు. (అలసిపోయావేమో?) నా శిఖరప్రదేశాల్లో నిలచి, హాయిగా కొంతసేపు విశ్రమించు.
రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్థితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః || 113 ||
ఉదధి, రఘువంశజులచే వృద్ధి చెందింది. అందువల్ల సాగరుడు రామకార్యార్థివైన నీకు సపర్యలు చేయాలనుకొంటున్నాడు.
కృతే చ ప్రతి కర్తవ్యమ్ ఏవ ధర్మ స్సనాతనః |
సో౭యం త్వత్ర్పతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి || 114 ||
మేలు చేసినవారికి ప్రత్యుపకారం చేయడం కర్తవ్యం. అది సనాతన శాశ్వత ధర్మ లక్షణం. సాగరుడు నా ద్వారా నీ సమ్మానం పొందటానికి అర్హుడు.
త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః |
తిష్ఠ త్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్ || 115 ||
నీ ఆతిథ్యనిమిత్తం సగరుడు నన్ను సగౌరవంగా ప్రోత్సహించాడు. కనుక కొంతసేపు నా పై విశ్రమించి, ముందుకు సాగు.
యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః |
తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి || 116 ||
శతయోజనాల దూరం దాటడానికి ఉద్యమించిన హనుమ నీ సానువుల నడుమ విశ్రమించి, తక్కిన దూరం దాటగలడు” (అని సముద్రుడు నాతో అన్నాడు.)
తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలం బహు |
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతో౭నుగమిష్యసి || 117 ||
ఇక్కడ కమ్మని వాసనల్ని కుమ్మరించే కందమూలఫలాలున్నాయి. ఎంతో రుచి గల వాటిని ఆస్వాదించు.
అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయా౭స్తివై |
ప్రఖ్యాత స్త్రిషులోకేషు మహాగుణపరిగ్రహః || 118 || 
నీకు మాతోనూ సంబంధం ఉంది. నీవు మహాగుణపరిగ్రహునిగా ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవు.
వేగవంతః ప్లవంతో యే ప్లవంగా మారుతాత్మజ |
తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర || 119 ||
వేగంగా ఎగిరే వానరుల్లో ప్రముఖుడవు.
అతిథిః కిల పూజార్హః ప్రాకృతో౭పి విజానతా |
ధర్మం జిజ్ఞాసమానేన కిమ్ పునస్త్వాదృశో మహాన్ || 120 ||
సామాన్యుడైన అతిథినైనా పూజించడం బుద్ధిమంతులు పాటించే ధర్మం. ఇక మహాత్ముల విషయం చెప్పనేల?
త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః |
పుత్త్రస్తస్యైవ వేగేన సదృశ: కపికుంజర || 121 ||
వేగంలో దేవవరిష్ఠుడైన నీ తండ్రి వాయుదేవునకు నీవే సాటి.
పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత: |
తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణమ్ || 122 ||
నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే. అందువల్ల నీవు నాకు పూజ్యుడవు. కారణం చెప్తా విను.
పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో౭భవన్ |
తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిలవేగినః || 123 ||
పూర్వం కృతయుగంలో పర్వతాలకు ఱెక్కలుండేవి. అవి వాయుగరుడవేగాలతో అన్ని దిక్కులకూ ఎగురుతూండేవి.
తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాస్సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా || 124 || 
అవి తమ మీద పడుతాయేమో అని దేవతలు, ఋషులు, అందరూ భయపడుతూండేవారు.
తతః క్రుద్ధ స్సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః |
పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః || 125 ||
దాంతో శతక్రతుడైన సహస్రాక్షుడు*, (ఇంద్రుడు) కోపించి, వాటి ఱెక్కలన్నిటినీ పూర్తిగా ఖండించేశాడు.
స మాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ |
తతో౭హం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా || 126 ||
నా వద్దకు కూడా క్రుద్ధుడై వస్తూండగా, వాయుదేవుడు నన్ను శీఘ్రమే దూరంగా విసిరేశాడు. (సముద్రంలో పడేశాడు.)
అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ |
గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రా౭భిరక్షితః || 127 ||
నేను సముద్రంలో భద్రంగా ఉన్నానంటే  అది నీ తండ్రి చలువ.
తతో౭హం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః |
త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః || 128 ||
అందువల్ల నీ తండ్రి నాకు పూజ్యుడు. కాబట్టి నిన్ను ఆదరిస్తున్నాను. ఇదీ నీకు నాకు గల సంబంధం.
తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ |
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే || 129 ||
ఈ కారణంగా నీవునాకు సముద్రునికి  ప్రీతి కల్గించు.
శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతో౭స్మి తవ దర్శనాత్ || 130 ||
నీ దర్శనం వల్ల ఆనందించాను. కొంతసేపాగి, అలుపు తీర్చుకో. మా పూజలందుకోప్రేమను ఆదరించు. "
ఏవముక్త: కపిశ్రేష్ఠః తం నగోత్తమమబ్రవీత్ |
ప్రీతో౭ స్మి కృతమాతిథ్యం మన్యురేషో౭పనీయతామ్ || 131 ||
మైనాకుని మాటలను విన్న హనుమంతుడు," మీ మాటలకు, ఆదరణకు తృప్తి చెందాను. ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే భావించు. ఏమీ అనుకోవద్దు.
త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే |
ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే || 132 ||
సమయం మించిపోతోంది. పగలు గడచి ప్రొద్దు క్రుంకుతోంది. మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేశాను. కాన మార్గమధ్యంలో ఇక్కడ ఆగడానికి వీలు లేదు."
-----------------------------------------------------------------------------------------------------
* కాకుత్థ్సుడు - కకుత్థ్సునివంశానికి చెందినవాడు. కకుత్థ్సుడు సూర్యవంశపు రాజు. వికుక్షి కుమారుడు. అసలు పేరు పురంజయుడు. ఈయనకు కకుత్థ్సుడనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి రాక్షసబాధను సహించలేక దేవతలు బ్రహ్మకు, విష్ణువుకు చెప్పుకొన్నారు. వారు పురంజయుని ఆశ్రయించమన్నారు. అపుడు దేవతలు పురంజయుని వేడగా, ఆయన ఎద్దుపైకి ఎక్కి వస్తానన్నాడు. అంత ఇంద్రుడు వృషభమయ్యాడు. పురంజయుడు కకుత్ పై కూర్చొని, రాక్షసులతో యుద్ధం చేసి, ఓడించి, తఱిమాడు. కకుత్ అంటే ఎద్దుమూపురం. దానిపై స్థ అంటే ఉన్నవాడు కాబట్టి కకుత్థ్సుడనే పేరు వచ్చింది. ఇంద్రవాహనుడనే పేరు కూడా వచ్చింది. కకుత్థ్సునివంశంవారు కాకుత్థ్సులు.
* మైథిలి - సీత. నిమిని మథించగా జనకుడు పుట్టాడు. అందువల్ల జనకుని మిథి అన్నారు. మిథి పాలించిన దేశమే మిథిల. మిథిలరాజకుమార్తె కాన సీత మైథిలి అయ్యింది.
* సహస్రాక్షుడు ఇంద్రుడు. వేయి కండ్లు కలవాడు.
-------------------------------------------------------------------------------------
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం | శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 4 ||

ఈ రోజు శార్వరి వైశాఖ బహుళ దశమి భక్తకోటికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

మంగళం మహత్





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...