రామసుందరం
త్రయోదశస్సర్గః
విమానాత్తు సుసమ్క్రమ్య ప్రాకారం హరియూథపః |
హనుమాన్వేగవానాసీ ద్యథా విద్యుద్ఘనాన్తరే || 1
ఆ హనుమంతుడు, మేఘాల్లో మెఱపులా,
విమానంనుండి ప్రాకారానికి
వేగంగా చేరాడు.
సమ్పరిక్రమ్య హనుమా
న్రావణస్య నివేశనాత్ |
అదృష్ట్వా జానకీం సీతా
మబ్రవీ ద్వచనం కపిః || 2
జానకిని కానక, రావణగృహంనుండి
కదలి, ఇలా అనుకొన్నాడు.
భూయిష్ఠం లోలితా లఙ్కా రామస్య చరతా ప్రియమ్ |
న హి పశ్యామి వైదేహీం సీతాం సర్వాఙ్గశోభనామ్ || 3
రామహితార్థినై, లంకంతా
గాలించాను. కానీ వైదేహిని చూడలేకపోయాను.
పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథా |
నద్యోఽనూపవనాన్తాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః |
లోలితా వసుధా సర్వా న తు పశ్యామి జానకీమ్ || 4
అన్ని రకాల జలప్రదేశాలను,(పల్వలాలు,
తటాకాలు, సరస్సులు,
సరిత్తులు, నదులు)
జలాలతో ఉన్న వనాలను, దుర్గమ
పర్వతాలను, ఇది అది అనక, (లంకా) భూమంతా తిరిగి,
గాలించాను. జానకి మాత్రం కనబడలేదు.
ఇహ సమ్పాతినా సీతా రావణస్య నివేశనే |
ఆఖ్యాతా గృధ్రరాజేన న చ పశ్యామి తామహమ్ || 5
రావణుని లంకలోనే సీత ఉందని,
సంపాతి చెప్పాడు. కానీ ఆమెను
చూడలేకపోయాను.
కిం ను సీతాఽథ వైదేహీ మైథిలీ జనకాత్మజా |
ఉపతిష్ఠేత వివశా రావణం దుష్టచారిణమ్ || 6
వైదేహి, మైథిలి, జానకి అయిన సీత
రావణునకు వశమైందా? (అయి ఉండదు).
క్షిప్రముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః |
బిభ్యతో రామబాణానా
మన్తరా పతితా భవేత్ || 7
రామబాణాలకు భయపడి, రావణుడు, సీతను వేగంగా
తెచ్చి ఉండవచ్చు. అపుడు ఆమె మధ్యలోనే
పడిపోయిందేమో?
అథవా హ్రియమాణాయాః పథి సిద్ధనిషేవితే |
మన్యే పతితమార్యాయా హృదయం ప్రేక్ష్య సాగరమ్ || 8
లేదా ఆకాశమార్గంలో వచ్చేటప్పుడు, సాగరాన్ని చూసి,
హృదయం భీతిల్లి, అందులో
పడిపోయిందేమో?
రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ |
తయా మన్యే విశాలాక్ష్యా త్యక్తం జీవితమార్యయా || 9
రావణుని అతివేగంచేతా, వాని
భుజపీడనంచేతా, సీత, జీవితాన్ని
చాలించి ఉండవచ్చు.
ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా |
వివేష్టమానా పతితా సాగరే జనకాత్మజా || 10
బాగా పైనుండి సముద్రాన్ని
దాటుతున్నప్పుడు, జానకి, సాగరంలో
పడిపోయిందేమో?
అహో క్షుద్రేణ వాఽనేన రక్షన్తీ శీలమాత్మనః |
అబన్ధుర్భక్షితా సీతా రావణేన తపస్వినీ || 11
నిస్సహాయురాలైన, తన
శీలాన్ని రక్షించుకొంటున్న, సాధుశీల సీత, రావణునిచే భక్షింపబడి ఉంటుంది.
అథవా రాక్షసేన్ద్రస్య పత్నీభిరసితేక్షణా |
అదుష్టా దుష్టభావాభి
ర్భక్షితా సా భవిష్యతి
|| 12
లేదా అసితేక్షణైన
ఆమెను రావణుని భార్యలు భక్షించారేమో?
సమ్పూర్ణచన్ద్రప్రతిమం పద్మపత్రనిభేక్షణమ్ |
రామస్య ధ్యాయతీ వక్త్రం పఞ్చత్వం కృపణా గతా || 13
తామరసనేత్రాలు కల్గి, పూర్ణచంద్రసమానమైన
రాముని ముఖాన్నే ధ్యానిస్తూ,
దీనురాలై అసువులు వీడిందేమో?
హా రామ లక్ష్మణేత్యేవం హాఽయోధ్యే చేతి మైథిలీ |
విలప్య బహు వైదేహీ న్యస్తదేహా భవిష్యతి || 14
హా రామా! లక్ష్మణా!
అయోధ్యా! అని పెక్కు విధాల విలపించి, తనువు
చాలించిందేమో?
అథవా నిహితా మన్యే
రావణస్య నివేశనే |
నూనం లాలప్యతే సీతా పఞ్జరస్థేవ శారికా || 15
లేదా రావణుని ఇంటనే పంజరంలో
గోరువంకలా విలపిస్తోందేమో?
జనకస్య సుతా సీతా రామపత్నీ సుమధ్యమా |
కథముత్పలపత్రాక్షీ రావణస్య వశం వ్రజేత్ || 16
జానకి, సుమధ్యమ, ఉత్పలపత్రాక్షి, రామపత్ని అయిన సీత, రావణునికి
ఎలా వశమవుతుంది? (కాదు).
వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజా |
రామస్య ప్రియభార్యస్య న నివేదయితుం క్షమమ్ || 17
భార్య అంటే ప్రియం గల
రామునికి, ఆమె, వినష్టనో, ప్రణష్టనో, జీవించిలేదనో, నివేదించడం యుక్తం కాదు.
నివేద్యమానే దోషస్స్యా
ద్దోషస్స్యాదనివేదనే |
కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే || 18
అయితే నివేదించినా
దోషమే, నివేదించకపోయినా దోషమే. ఏం చేయాలి? విషమసమస్యలా ఉంది.
అస్మిన్నేవంగతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిమ్ |
భవేదితి మతం భూయో హనుమాన్ప్రవిచారయత్ || 19
మఱి ఇప్పుడు
చేయవలసింది ఏది? అని హనుమ, మళ్లీ కర్తవ్యాన్ని
ఆలోచించాడు.
యది సీతామదృష్ట్వాఽహం వానరేన్ద్రపురీమితః |
గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి || 20
సీతను చూడకుండా, కిష్కింధకు
వెళ్తే, ప్రయోజనం ఏమిటి?
మమేదం లఙ్ఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి |
ప్రవేశశ్చైవ లఙ్కాయాః రాక్షసానాం చ దర్శనమ్ || 21
(అలా వెళ్తే) సముద్ర
లఙ్ఘనం, లంకాప్రవేశం, రాక్షసుల్ని
చూడ్డం, అంతా వ్యర్థమే.
కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః |
కిష్కిన్ధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ || 22
ఈ స్థితిలో, కిష్కింధకు వెళ్తే, సుగ్రీవుడేమంటాడో? వానరులేమంటారో? ఆ
దశరథాత్మజులేమంటారో?
గత్వా తు యది కాకుత్స్థం వక్ష్యామి పర మప్రియమ్ |
న దృష్టేతి మయా సీతా తతస్త్యక్ష్యతి జీవితమ్ || 23
(కిష్కింధకు) వెళ్లి, కాకుత్స్థునితో ‘ సీత నాకు కన్పించలేదు
’ అనే అప్రియవార్తను
చెప్తే, తత్క్షణమే అతడు జీవితాన్ని చాలిస్తాడు.
పరుషం దారుణం క్రూరం తీక్ష్ణ మిన్ద్రియతాపనమ్ |
సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి || 24
పరుషం, దారుణం, క్రూరం, తీక్ష్ణం, ఇంద్రియతాపనం అయిన ‘ సీత నాకు కన్పించలేదు
’ అనే దుర్వాక్యం వింటే
రాము డుండడు.
తం తు కృచ్ఛ్రగతం దృష్ట్వా పఞ్చత్వగతమానసమ్ |
భృశానురక్తో మేధావీ న భవిష్యతి లక్ష్మణః || 25
కష్టస్థితికి గురై, మరణించాలనుకొనే రాముని చూచి, గాఢానురాగుడు, మేధావి అయిన లక్ష్మణుడు
జీవింపడు.
వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోఽపి మరిష్యతి |
భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి || 26
సోదరులిద్దఱూ లేరని
వినగానే, భరతుడు కూడా మరణిస్తాడు. భరతుని
మృతి చూచి, శత్రుఘ్నుడు బ్రతుకడు.
పుత్రాన్మృతాన్సమీక్ష్యాథ న భవిష్యన్తి మాతరః |
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః || 27
పుత్రుల మరణాలను చూచి, తల్లులైన
కౌసల్య సుమిత్ర కైకేయిలు
జీవించరనేది నిస్సంశయం.
కృతజ్ఞస్సత్యసన్ధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః |
రామం తథా గతం దృష్ట్వా తతస్త్యక్ష్యతి జీవితమ్ || 28
కృతజ్ఞుడు, సత్యసంధుడైన సుగ్రీవుడు, రాముని
స్థితి చూసి, జీవితాన్ని చాలిస్తాడు.
దుర్మనా వ్యథితా దీనా నిరానన్దా తపస్వినీ |
పీడితా భర్తృశోకేన రుమా త్యక్ష్యతి జీవితమ్ || 29
భర్తృశోకంతో పీడింపబడి, పతివ్రతయైన
రుమ జీవితాన్ని చాలిస్తుంది.
వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్శితా |
పఞ్చత్వం చ గతే రాజ్ఞి తారాఽపి న భవిష్యతి || 30
వాలి మరణంతో
దుఃఖపీడితురాలైన తార కూడా సుగ్రీవుడు మరణిస్తే, బ్రతుకదు.
మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవవ్యసనేన చ |
కుమారోఽప్యఙ్గదః కస్మా ద్ధారయిష్యతి జీవితమ్ || 31
తల్లిద్రండ్రుల్ని, పినతండ్రి సుగ్రీవుని, కోల్పోయిన అంగదుడు బ్రతికి ఉండగలడా?
భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతా వనౌకసః |
శిరాంస్యభిహనిష్యన్తి తలైర్ముష్టిభిరేవ చ || 32
ప్రభువు (సుగ్రీవమరణం)
వల్ల కల్గిన దుఃఖంతో, వానరులు, అరచేతులతో, పిడికిళ్లతో, తలలు
బాదుకొంటారు.
సాన్త్వేనానుప్రదానేన మానేన చ యశస్వినా |
లాలితాః కపిరాజేన ప్రాణాంస్త్యక్ష్యన్తి వానరాః || 33
సుగ్రీవుని
అనునయవచనాలతో, బహుమానాలతో, మన్ననలతో, ఇంతవఱకు
లాలింపబడిన వానరులు ప్రాణాలు విడుస్తారు.
న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః |
క్రీడామనుభవిష్యన్తి సమేత్య కపికుఞ్జరాః || 34
వానరశ్రేష్ఠులందఱూ కలసి, ఇకమీద వన
పర్వత గృహాల్లో క్రీడలను అనుభవింపలేరు.
సపుత్రదారాస్సామాత్యా భర్తృవ్యసనపీడితాః |
శైలాగ్రేభ్యః పతిష్యన్తి సమేత్య విషమేషు చ || 35
ప్రభు (సుగ్రీవ)
వ్యసనపీడితులైన వానరులు, దారాపుత్రామాత్యా
సమేతులై, శైలాగ్రాలనుండి విషమప్రదేశాల్లో పడిపోతారు.
విషముద్బన్ధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా |
ఉపవాసమథో శస్త్రం ప్రచరిష్యన్తి వానరాః || 36
విషం కాని, ఉరి కాని, అగ్నిప్రవేశం కాని, ఉపవాసం కాని, శస్త్రం కాని, ప్రయోగించుకొని, వారు, ప్రాణాలు విడుస్తారు.
ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి |
ఇక్ష్వాకుకులనాశశ్చ నాశశ్చైవ వనౌకసామ్ || 37
నేను వెళ్తే, ఇక్ష్వాకువంశం
అంతరిస్తుంది. వానరకోటి గతిస్తుంది. ఘోర
రోదనం మిగుల్తుంది.
సోఽహం నైవ గమిష్యామి కిష్కిన్ధాం నగరీమితః |
న చ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా || 38
కాబట్టి కిష్కింధకు
వెళ్లను గాక వెళ్లను. సీత వినా, నేను, సుగ్రీవుని దర్శింపలేను.
మయ్యగచ్ఛతి చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ |
ఆశయా తౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః || 39
నేను వెళ్లకుండా
ఇక్కడే ఉంటే, రామలక్ష్మణులు, వానరులు ఆశతో
బ్రతికి ఉంటారు.
హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః |
వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజామ్ || 40
సాగరానూపజే దేశే బహుమూలఫలోదకే |
చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతమ్ || 41
జానకి కనబడకపోతే, కందమూలఫలోదకాలు
ఎక్కువగా ఉన్న సాగరతీరప్రదేశాల్లో వృక్షమూలాల్ని ఆశ్రయించి, దొరకిన
ఆహారాన్ని తింటూ, నియతుడనై, వానప్రస్థుడనై, ఉండిపోతాను.
లేదా చితి
కల్పించుకొని, పవిత్రాగ్నిలో
ప్రవేశిస్తాను.
ఉపవిష్టస్య వా సమ్య
గ్లిఙ్గినీం
సాధయిష్యతః |
శరీరం భక్షయిష్యన్తి వాయసాః శ్వాపదాని చ || 42
లేదా ఉపవిష్టుడనై, యోగసాధన ద్వారా, శరీరాన్ని
విడిస్తే, వాయసమృగాదులు తినగలవు.
ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతిః |
సమ్యగాపః ప్రవేక్ష్యామి న చేత్పశ్యామి జానకీమ్ ||43
లేదా నీటిలోకి
ప్రవేశిస్తాను. ఇట్లా దేహాన్ని
త్యజించడం మహర్షులకు సమ్మతమైనదే.
సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్వినీ |
ప్రభగ్నా చిరరాత్రీయం మమ సీతామపశ్యతః || 44
చక్కగా మొదలైనట్టిది, సుందరమైనట్టిది, కీర్తిమాల, యశస్విని అయిన ఈ దీర్ఘరాత్రి, సీతను
చూడకుండానే వ్యర్థంగా ముగిసింది.
తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః |
నేతః ప్రతిగమిష్యామి తా మదృష్ట్వాసితేక్షణామ్ || 45
సీతను చూడకుండా, ఇక్కడనుండి వెళ్లను. వృక్షమూలాల్ని
ఆశ్రయించి, నియమాలు పాటిస్తూ, తపస్వినవుతాను.
యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్య తామ్ |
అఙ్గదస్సహ తైస్సర్వై ర్వానరైర్న భవిష్యతి || 46
సీతను చూడకుండా వెళ్తే, అంగదాది
వానరులెవ్వరూ జీవించరు.
వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి |
తస్మాత్ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసఙ్గమః || 47
(అయితే) మరణం వల్ల ఎన్నో దోషాలు కల్గుతాయి. బ్రతికి
ఉంటే శ్రేయస్సులు పొందవచ్చు. జీవించి
ఉంటే కోరింది తప్పక పొందవచ్చు. అందువల్ల
బ్రతికి ఉంటాను.
ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ముహుః |
నాధ్యగచ్ఛత్తదా పారం శోకస్య కపికుఞ్జరః || 48
ఇలా బహువిధాల
దుఃఖిస్తూ, శోకం నుండి హనుమ బయటపడలేకపోయాడు.
తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుఞ్జరః |
రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలమ్ |
కామమస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి || 49
అనంతరం, ధైర్యవంతుడైన హనుమ, ఇలా అనుకొన్నాడు. సీత సంగతి సరే. ఆమెను తెచ్చిన దశగ్రీవుని వధిస్తాను. దాంతో
ప్రతీకారమైనా తీరుతుంది.
అథవైనం సముత్‍క్షిప్య
హ్యుపర్యుపరి సాగరమ్ |
రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ || 50
లేదా రావణుని
ఎత్తుకొనిపోయి, పశువును పశుపతికి లాగా, రామునికి
సమర్పిస్తాను.
ఇతి చిన్తాం సమాపన్నః సీతామనధిగమ్య తామ్ |
ధ్యానశోకపరీతాత్మా చిన్తయామాస వానరః || 51
ఇలా ఎన్నో ఆలోచనల్లో
మునిగిన హనుమ, సీత కనబడకపోవడంతో శోకాత్ముడై, మళ్ళీ ఇలా ఆలోచించాడు.
యావత్సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీమ్ |
తావదేతాం పురీం లఙ్కాం విచినోమి పునః పునః || 52
రామపత్ని, కనబడేదాకా లంకను మళ్లీ మళ్లీ గాలిస్తాను.
సమ్పాతివచనాచ్చాపి రామం యద్యానయామ్యహమ్ |
అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్సర్వవానరాన్ || 53
సంపాతి చెప్పాడు కదా
అని, రాముని ఇక్కడకు
తీసుకొని వస్తే, భార్యను కానక, ఆయన, వానరులందఱ్నీ
దహిస్తాడు.
ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేన్ద్రియః |
న మత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః || 54
కాబట్టి నియతాహారంతో
జితేంద్రియుడ్నై, ఇక్కడే నివసిస్తాను.
నా నిమిత్తమై, నరవానరులు నశించరాదు.
అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా |
ఇమామధిగమిష్యామి న హీయం విచితా మయా || 55
మహావృక్షాలతో ఎదురుగా
కనబడుతున్న ఈ అశోకవనాన్ని, చేరుకుంటాను. దీన్ని ఇంతవఱకు వెదుకలేదు.
వసూన్రుద్రాంస్తథాఽదిత్యా
నశ్వినౌ మరుతోఽపి చ |
నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః || 56
వసువులకు, రుద్రులకు, ఆదిత్యులకు, ఆశ్వినీదేవతలకు, మరుత్తులకు నమస్కరించి, రాక్షసులకు శోకవర్ధనుడనై, ఈ
అశోకవనంలోకి అడుగుపెడతాను.
జిత్వా తు రాక్షసాన్ సర్వా
నిక్ష్వాకుకులనన్దినీమ్ |
సమ్ప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే || 57
రాక్షసులందఱ్నీ జయించి, ఇక్ష్వాకుకులనందిని
సీతను, తపస్వికి సిద్ధిలా, రామునికి
సమర్పిస్తాను.
సః ముహూర్తమివ ధ్యాత్వా చిన్తావగ్రథితేన్ద్రియః |
ఉదతిష్ఠన్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః || 58
చింతా వ్యాకులుడై, ముహూర్తకాలం హనుమ, ధ్యానమగ్నుడయ్యాడు. అనంతరం లేచాడు.
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః || 59
రామునకు, లక్ష్మణునకు, జనకసుతకు, నమస్కారం. రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయువునకు, నమస్కారాలు. చంద్రార్కులకు, మరుద్దేవతలకు, నమస్కారాలు.
స తేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః |
దిశస్సర్వాస్సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి || 60
వారితో పాటు
సుగ్రీవునకును నమస్కరించి, మారుతి అశోకవనాన్ని గూర్చిన అన్ని దిక్కుల్ని
ఆలోకించాడు.
స గత్వా మనసా పూర్వ
మశోకవనికాం శుభామ్ |
ఉత్తరం చిన్తయామాస వానరో మారుతాత్మజః || 61
అశోకవనంలోకి తన
మనస్సును నిలిపి, కర్తవ్యం ఆలోచించాడు.
ధ్రువం తు రక్షోబహులా భవిష్యతి వనాకులా |
అశోకవనికా చిన్త్యా సర్వసంస్కారసంస్కృతా || 62
సర్వసంస్కారసంస్కృతమైనది, ధ్రువంగా
వృక్షరాక్షసులతో నిండి ఉన్నఅశోకవనాన్ని
తప్పక చూడాలి.
రక్షిణశ్చాత్ర విహితా నూనం రక్షన్తి పాదపాన్ |
భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై || 63
వనరక్షణకై, రక్షకులు ఉండే ఉంటారు. వాయుదేవుడు
కూడా మితవేగంతో, వీస్తున్నాడు.
సంక్షిప్తోఽయం మయాఽత్మా చ రామార్థే రావణస్య చ |
సిద్ధిం మే సంవిధాస్యన్తి దేవాః సర్షిగణా స్త్విహ || 64
రాముని(కి, ఫలసిద్ధి), రావణుని(కి,కనబడకుండుట) కోసం సూక్ష్మరూపాన్ని
ధరించాను. దేవాః సర్షిగణాలు సిద్ధి కూర్చెదరు గాక!
బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ దేవాశ్చైవ దిశన్తు మే |
సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ || 65
స్వయంభువైన బ్రహ్మ, ఇతరదేవతలు, అగ్ని, వాయువు, వజ్రాయుధుడైన
ఇంద్రుడు,
వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ |
అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవ చ || 66
పాశహస్తుడైన వరుణుడు, సూర్యచంద్రులు, మహాత్ములు అశ్వినీదేవతలు, మరుత్తులు, శివుడు,
సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః |
దాస్యన్తి మమ యే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః || 67
సమస్తభూతాలు, సర్వజీవులకు ప్రభువైన విష్ణువు, ఇంకా
నా దృష్టికి గోచరించని, ఇతరదేవతలును నాకు
సిద్ధిని కల్గించెదరు గాక!
తదున్నసం పాణ్డురదన్త మవ్రణం
శుచిస్మితం పద్మపలాశలోచనమ్ |
ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం
ప్రసన్నతారాధిపతుల్యదర్శనమ్ || 68
ఎత్తైన నాసికతో, తెల్లని పలువరుసతో నిర్మలమైన చిఱునవ్వుతో, తామరఱేకుల
కన్నులతో, చంద్రునిలా
ప్రసన్నమనోహరంగా ఉంటుందని రాముడు చెప్పిన సీతమోమును
నేనెప్పుడు చూస్తానో!?
క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా
సుదారుణాలఙ్కృతవేషధారిణా |
బలాభిభూతా హ్యబలా తపస్వినీ
కథం ను మే దృష్టిపథేఽద్య సా భవేత్ || 69
క్షుద్రుడు, పాపి, నృశంసకర్ముడు, సుదారుణాలంకృతవేషధారుడు, అయిన
రావణునిచే బలాభిభూతయైన అబల, తపస్విని సీతను ఎలా
చూడగలనో!?
--------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ | పుత్రౌ
దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||18||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సున్దరకాణ్డే
త్రయోదశస్సర్గః | (13)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి