రామసుందరం
చతుర్దశస్సర్గః
స
ముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్య తామ్ |
అవప్లుతో
మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః || 1
మహాతేజుడైన హనుమంతుఁడు, గడియసేపు ఇట్లా ఆలోచించి, ఆ అశోకవనికకు వెళ్లటానికి
మనసు పుట్టి, ఆ రావణుని గృహంనుండి అశోకవనప్రాకారంమీఁదికి దూఁకాడు.
స తు
సంహృష్టసర్వాఙ్గః ప్రాకారస్థో మహాకపిః |
పుష్పితాగ్రాన్వసన్తాదౌ
దదర్శ వివిధాన్ ద్రుమాన్ || 2
సాలానశోకాన్
భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ |
ఉద్దాలకా
న్నాగవృక్షాం శ్చూతా న్కపిముఖానపి || 3
అథామ్రవణసఞ్ఛన్నాం
లతాశతసమావృతామ్ |
జ్యాముక్త
ఇవ నారాచః పుప్లువే వృక్షవాటికామ్ || 4
ఆ మహాకపి, ఆ ప్రాకారంపైన కూర్చొని, మిక్కిలి ఉబ్బున అవయవాలన్నీ గగుర్పొడువ, వసంతప్రారంభాన కొనలు చక్కగా పూచి ఉన్న మద్దిచెట్లు, మనోహరాలైన అశోకవృక్షాలు, చక్కగా
పుష్పించిన సంపెంగ, విరిగి, పొన్న, మామిడి, తీగకానుగుచెట్లు, ఇలా నానావిధాలైన వృక్షాల్ని చూశాడు. అంత(అనంతరం), అల్లెత్రాటినుండి విడువబడ్డ బాణంలా, అతివేగంగా మామిడితోపులు క్రమ్ముకొని, వందలకొలది లతలు పెనఁగొని ఉండే వృక్షాలజొంపానికి, గంతుకొనిపోయాడు.
స
ప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితామ్ |
రాజతైః
కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతామ్ || 5
విహగైర్మృగసఙ్ఘైశ్చ
విచిత్రాం చిత్రకాననామ్ |
ఉదితాదిత్యసఙ్కాశాం
దదర్శ హనుమాన్ కపిః || 6
వృతాం
నానావిధైర్వృక్షైః పుష్పోపగఫలోపగైః |
కోకిలైర్భృఙ్గరాజైశ్చ
మత్తైర్నిత్యనిషేవితామ్ || 7
ప్రహృష్టమనుజే
కాలే మృగపక్షిసమాకులే |
మత్తబర్హిణసఙ్ఘుష్టాం
నానాద్విజగణాయుతామ్ || 8
మనుజులందఱికీ ఉబ్బు పుట్టిస్తూ, మృగాలు, పక్షులు వ్యాపించి ఒప్పే, వసంతపు తొలుతటి కాలమందు, ఆ అశోకవనికను ప్రవేశించాడు. ఆ వనం, వింతలు కులికే చివరలు కలిగి, పక్షులధ్వనులచే అంతటా బోరుకొంటూ, వెండి, బంగారువన్నెగల వృక్షాలతో చుట్టబడి ఉంది. నానావిధాలైన పక్షులు, మృగసమూహాలు
ఉండడంతో, విచిత్రమై, మావితోపులు, సంపెంగతోపులు మొదలైన నానావిధ అవాంతరవనాలతో కూడి, ఉదయకాలపు సూర్యునిలా ప్రకాశిస్తోంది. అవ్వారి (అధికమైన)
పువ్వులు,
మాగిన పండ్లు
కల్గిన
నానావిధ
వృక్షాలు దాన్ని ఆవరించి ఉన్నాయి. దాంట్లో కోకిలలు, గండుతుమ్మెదమిన్నలు, మిక్కిలి మత్తిల్లి, సదా విలసిల్లుతూంటాయి. నెమిళ్లు మత్తిల్లి, మధురంగా కేకలు వేస్తూంటాయి. పెక్కువిధాలైన పక్షిసమూహాలు రాణిస్తూంటాయి.
మార్గమాణో
వరారోహాం రాజపుత్రీమనిన్దితామ్ |
సుఖప్రసుప్తాన్విహగాన్
బోధయామాస వానరః || 9
హనుమంతుఁడు, ఏ కందూ లేని చక్కదనంతో కూడి, రాజిల్లే ఆ వరారోహ, ఆ రాజకుమారి, సీతను, వెదకుతూండఁగా, అతని సంచారాన చెట్లు కదలడంతో, వాటిలో హాయిగా నిద్రిస్తున్నపక్షులు మేల్కొన్నాయి.
ఉత్పతద్భిర్ద్విజగణైః
పక్షైః సాలాస్సమాహతాః |
అనేకవర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః || 10
అంత, పక్షులు గుంపులుగుంపులుగా ఎగురుతూండగా, వాని ఱెక్కలతాకులకు
కొట్టువడి, వృక్షాలు నానా
వర్ణాలు, నానావిధాలైన పువ్వుల్ని
అవ్వారిగా కురిపించాయి.
పుష్పావకీర్ణశ్శుశుభే
హనుమాన్ మారుతాత్మజః |
అశోకవనికామధ్యే యథా పుష్పమయో గిరిః || 11
అశోకవనం నడుమ, అలా కురిసే పువ్వులు తనపయినంతా
వ్యాపించి క్రమ్మగా, “ పూలకొండా!
” అన్నట్లు హనుమంతుఁడు, శోభిల్లాడు.
దిశస్సర్వాః
ప్రధావన్తం వృక్షషణ్డగతం కపిః |
దృష్ట్వా సర్వాణి భూతాని వసన్త ఇతి మేనిరే || 12
అన్ని దిక్కులకూ పరుగులుపెడుతూ, చెట్లజొంపాల నడుమ ఉన్న ఆ
కపిని చూసి, సమస్తభూతాలూ, వసంతు డనుకొన్నాయి.
వృక్షేభ్యః
పతితైః పుష్పైరవకీర్ణా పృథగ్విదైః |
రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషితా || 13
అక్కడి
భూమిపైన, వృక్షాలనుండి నానావిధాలైన పువ్వులు రాలఁగా,
అది, సొమ్ములతో అలంకరింపఁబడి ఉన్న ఒక ప్రమద(స్త్రీ)లా, విలసిల్లుతోంది.
రస్వినా
తే తరవస్తరసాభిప్రకమ్పితాః |
కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా || 14
ఆ హనుమంతుఁడు బలవంతుఁడు కాబట్టి ఆ వృక్షాల్ని, బలంగా
నాలుగు ప్రక్కలకూ కదలించగా, అవి అపుడు నానావిధాలైన
పూలను కురిపించాయి.
నిర్ధూతపత్రశిఖరాః
శీర్ణపుష్పఫలా ద్రుమాః |
నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః || 15
ఇట్లు హనుమంతుఁడా వృక్షాల్ని
పట్టి, నలుప్రక్కల బిట్టుగా కదల్పఁగా, వానికి వస్త్రసమానాలైన
పత్రాలూ, తలగుడ్డల్లాంటి కొనల మొగ్గలూ, ఆభరణాల్లాంటి
పూలూ, పండ్లూ, రాలడంవల్ల, ఆ చెట్లు, జూదమాడి, ఓడి, గెలిచినవారికి ఇవ్వడానికై
వస్త్రాభరణాల్ని విడచి, క్రిందపెట్టి ఉన్న జూదరుల్లా
కనిపిస్తున్నాయి.
హనూమతా
వేగవతా కమ్పితాస్తే నగోత్తమాః |
పుష్పపర్ణఫలాన్యాశు ముముచుః పుష్పశాలినః || 16
హనుమంతుఁడు మిగుల వేగంతో, పువ్వుల్ని నివ్వటిల్లే(అతిశయించే)
ఆ మేటి వృక్షాల్ని, అల్లలార్పగానే, వానినుండి వడిగా పువ్వులు, ఆకులు, పండ్లు, నేలను
పడ్డాయి.
విహఙ్గసఙ్ఘైర్హీనాస్తే
స్కన్ధమాత్రాశ్రయా ద్రుమాః |
బభూవురగమాః సర్వే మారుతేవ నిర్ధుతాః || 17
ఆ కపిచే, కదల్చబడిన ఆ
వృక్షాలన్నీ, వాయువుచేఁ కదల్చబడినట్లు, ఆ పక్షిగణాలచే దిగవిడువబడి, పువ్వులాకులు మొదలైనవేమీ లేక బోదియలు మాత్రమె మిగిలి ఉండడంతో ఆశ్రయించటానికి అనర్హాలు
అయ్యాయి.
నిర్ధూతకేశీ
యువతిర్యథా మృదితవర్ణకా |
నిష్పీతశుభదన్తోష్ఠీ నఖైర్దన్తైశ్చ విక్షతా || 18
తథా
లాఙ్గూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా |
బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపా || 19
అలా హనుమంతుఁడు, తోక, చేతులు, కాళ్లతో బిట్టుమోదడంతో మేటిచెట్లు విఱిగి, ఆ అశోకవనిక, రతిక్రీడ ఉరవడిని విరియబాఱిన తలవెండ్రుకలు, కౌగిలింతలతో నలగి రాలిన మైపూత, చక్కగా పీల్చడంవల్ల
మంచిదంతంలా తెల్లబాఱిన పెదవి కలిగి గోటినొక్కుల్ని, పల్లొత్తుల్ని
కలిగిన గంట్లతో కూడి బెడఁగారే(రమ్యమైన) ఒక జవరాలిలా
కనబడుతోంది.
మహాలతానాం
దామాని వ్యథమత్తరసా కపిః |
యథా ప్రావృషి విన్ధ్యస్య మేఘజాలాని మారుతః || 20
వర్షాకాలంలో
వాయువు వింధ్యపర్వతమందలి మేఘసమూహాల్ని తుత్తుమురుగా చేసినట్లు, హనుమంతుఁడు బలంతో ఆ
వనమందలి పెనుతీగలజొంపాల్ని ధ్వంసం చేశాడు.
స
తత్ర మణిభూమీశ్చ రాజతీశ్చ మనోరమాః |
తథా కాఞ్చనభూమీశ్చ దదర్శ విచరన్కపిః || 21
ఆ కపి, ఆ వనంలో సంచరిస్తూ, మనోహరాలైన మణిమయభూముల్ని, వెండి భూముల్ని, బంగారు భూముల్ని
చూశాడు.
వాపీశ్చ
వివిధాకారాః పూర్ణాః పరమవారిణా |
మహార్హైర్మణిసోపానైరుపపన్నాస్తతస్తతః || 22
ఇంకా అందులో నానావిధాలైన
ఆకారాలు కల నడబావుల్ని చూశాడు. అవి మిక్కిలి మేలైన జలాలతో నిండి అచ్చటచ్చట ఎంతో శ్రేష్ఠాలు, రత్నమయాలైన
సోపానాలతో కూడి ఉన్నాయి.
ముక్తాప్రవాలసికతాః
స్ఫాటికాన్తరకుట్టిమాః |
కాఞ్చనైస్తరుభిశ్చిత్రైస్తీరజైరుపశోభితైః || 23
వాటిలో ఇసుక
ముత్యాలు, పగడాలే.
వాటి లోపల, అందంద పటికపుఱాలతో కట్టబడిన నెలకట్లున్నాయి. వాటి
తీరాల్లో బంగారువన్నె కలిగి ఉన్న నానావిధవృక్షాలు వాటి కొక శోభ
కలిగిస్తున్నాయి.
ఫుల్లపద్మోత్పలవనాశ్చక్రవాకోపకూజితాః
|
నత్యూహరుతసంఘుష్టా
హంససారసనాదితాః || 24
అందులో తామరతంపరలు, కలువతంపరలు, పొంపిరిగా వికసించి ఉన్నాయి. అందులో చక్రవాకాలు
మధురంగా కూస్తున్నాయి.
ఇంకా అవి నీరుకోళ్లకూతలచేతా, హంసల, బెగ్గురుపిట్టల ధ్వనులచేతా, బోరుకొంటోంది.
దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిః
సరద్భిశ్చ సమన్తతః |
అమృతోపమతోయాభిశ్శివాభిరుపసంస్కృతాః || 25
వాటి
చుట్టూ దీర్ఘాలై, రెండుప్రక్కలా వృక్షాలతో కూడి, అమృతంలా
ఉన్న తీయని మంచిజలాలు కలిగి, మనోహరాలై ఒప్పే నదులు పొదలుతూ, వానికి పొలుపు
కూర్చుతున్నాయి.
లతాశతైరవతతాస్సన్తానకుసుమావృతాః
|
నానాగుల్మావృతఘనాః కరవీరకృతాన్తరాః || 26
ఇంతేకాక, అందులో వందలకొలది
తీవియలు నెరసి బెరసి, కల్పవృక్షాల పువ్వులు క్రమ్మి, నివ్వటిల్లుతోంది. నానావిధాలైన పొదలు, చుట్టూ దట్టంగా క్రమ్ముకొని ఉన్నాయి. మఱియు గన్నేఱుచెట్లు కూడా వాని కొక విశేషమైన
సొంపు నింపుతున్నాయి.
తతోఽమ్బుధరసఙ్కాశం
ప్రవృద్ధశిఖరం గిరిమ్ |
విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితమ్ || 27
శిలాగృహైరవతతం
నానావృక్షైః సమావృతమ్ |
దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతమ్ || 28
అంత, హనుమంతుడు, మేఘంలా కనబడుతూ, ఉన్నతమైన శిఖరాలు
కల్గిన, (జగతిపర్వతం అనబడే) ఒక రమణీయమైన కొండను చూశాడు. దాని కొమ్ములు నానావిధాలై నలుప్రక్కలా
ఒప్పుతున్నాయి. అక్కడ ఱాతిభవనాలు వ్యాపించి ఉన్నాయి. నానావిధాలైన
వృక్షాలు క్రమ్ముకొని ఉన్నాయి.
దదర్శ
చ నగాత్తస్మాన్నదీం నిపతితాం కపిః |
అఙ్కాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియామ్ || 29
ఆ పర్వతంనుండి ఒక నది, ప్రవహిస్తూండగా, చూశాడు. అది ఆ కొండనుండి నేలకు దిగుపాఱుతూండడంవల్ల, కోపంతో, ప్రియుని తొడనుండి దూకి, నేలమీద పడిన ప్రియురాలిలా
కనబడుతోంది.
జలే
నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితామ్ |
వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబన్ధుభిః || 30
పండ్లబరువుతో వంగి, కొనలు ఆ
నదీజలాల్లో, వ్రాలి ఉన్న చెట్లతో
అది ఉల్లసిల్లడం చూస్తే, కోపం కొన్నదై, అనుగుబంధువులచేత పోవద్దని చేతులతో వారింపబడుతున్న ఒక చెలువలా శోభిస్తోంది.
పునరావృత్తతోయాం
చ దదర్శ స మహాకపిః |
ప్రసన్నామివ కాన్తస్య కాన్తాం పునరుపస్థితామ్ || 31
అట్లా నది, కొంతవఱకు ఆ కొండను విడచి, పాఱి, అంత చెట్లకొమ్మలచే కొట్టువడి, మరలి, పర్వతము తట్టుగా పాఱుతూండడాన్ని చూస్తే, బంధువులు
ఓదార్చగా కోపం మాని, కలంక తేఱినదై తన ప్రియుని తిరిగి
పొందిన ఒక కాంతలా, ఆ మహాకపికి మరల
కనబడింది.
తస్యా
దూరాత్సపద్మిన్యో నానాద్విజగణాయుతాః |
దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః || 32
వాయుకుమారుడు, ఆ వానరసింహుడు, ఆ కొండకు దాపున
నానావిధపక్షిగణాలతో
ఒప్పే, తామరకొలంకులను మఱియు నిర్మితమైన ఒక నడబావిని చూశాడు.
కృత్రిమాం
దీర్ఘికాం చాపి పూర్ణాం శీతేన వారిణా |
మణిప్రవరసోపానాం ముక్తాసికతశోభితామ్ || 33
ఆ నడబావిలో
చల్లని జలాలు నిండి ఉన్నాయి. మేలైన రతనాలతో
దానికి సోపానాలు రచింపఁబడి ఉన్నాయి. అందలి ఇసుక ముత్యాలతో
అయినది.
వివిధైర్మృగసఙ్ఘైశ్చ
విచిత్రాం చిత్రకాననామ్ |
ప్రాసాదైస్సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా || 34
అది పలువిధాలైన మృగసమూహాలతో విచిత్రంగా కనబడుతూ, చుట్టూ చిత్రాలైన వనాల వింతలు కులుకుతోంది. విశ్వకర్మ నిర్మితాలై, మిక్కిలి గొప్పలైన
ఉప్పరిగల(మేడల)చేతా,
కాననైః
కృత్రిమైశ్చాపి సర్వతః సమలఙ్కృతామ్ |
యే కేచిత్పాదపాస్తత్ర పుష్పోపగఫలోపగాః || 35
సచ్ఛత్రాస్సవితర్దీకాస్సర్వే
సౌవర్ణవైదికాః |
లతాప్రతానైర్బహుభిఃపర్ణైశ్చ బహుభిర్వృతామ్ || 36
కృత్రిమాలైన వనాలచేతా, అది నలుప్రక్కల అలంకృతమై ఉల్లసిలుతోంది. అచ్చట పువ్వులూ, పండ్లూ
అవ్వారిగా నిండి ఉన్న వృక్షాలన్నిటికి, వచ్చి కూర్చునేవారికి ఎండవానలు తగులకుండా ఏర్పఱచిన మేలుకట్లూ (చవికెలు), పెద్ద అరుఁగులూ, ఆ అరుఁగుల నెక్కడానికై బంగారుతో చేసిన మెట్ల అరుఁగులు ఉన్నాయి.
కాఞ్చనీం
శింశుపామేకాం దదర్శ హరియూధపః |
వృతాం హేమమయీభిస్తు వేదికాభిస్సమన్తతః || 37
ఆ హనుమ, పెక్కు తీగలసమూహాలు, పెక్కు ఆకుజొంపాలతో
పరివృతమై, నలుప్రక్కలా బంగారుమయాలైన అరుఁగులతో
రంగారే ఒక కాంచన శింశుపావృక్షాన్ని(ఇరుగుడు చెట్టును) చూశాడు.
సోఽపశ్యద్భూమిభాగాంశ్చ
గర్తప్రస్రవణాని చ |
సువర్ణవృక్షానపరాన్ దదర్శ శిఖిసన్నిభాన్ || 38
అతఁ డక్కడ, నానావిధాలైన భూభాగాల్ని, పల్లపు ప్రదేశాల్ని, సెలయేళ్లను, బంగారువర్ణం
కలిగి, అగ్నిలా
ధగధగ మెఱస్తున్న వృక్షాలు మఱికొన్నింటిని చూశాడు.
తేషాం
ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః |
అమన్యత తదా వీరః కాఞ్చనోఽస్మీతి వానరః || 39
అప్పుడు వీరుఁడు, హనుమంతుఁడు, ఆ బంగారువృక్షాలకాంతివల్ల, మేరుపర్వతపుకాంతిచేత సూర్యుడు, బంగారుమయంగా కనబడినట్లు, తాను బంగారువన్నెతో చూపట్టగా '
నే నిప్పుడు బంగార మయ్యాను ' అని అనుకొన్నాడు.
తాం
కాఞ్చనైస్తరుగణైర్మారుతేన చ వీజితామ్ |
కిఙ్కిణీశతనిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్ || 40
అత డలా, బంగారువృక్షసమూహాలతో కూడినదై , గాలి వీచడంతో, వానికి కట్టి ఉన్న వందలకొలఁది
చిఱుగంటలు మ్రోగగా, అనంతాలైన శబ్దాలతో కూడి ఉన్న ఆ
అశోకవనిని చూసి, ఆశ్చర్యాన్ని
పొందాడు.
స
పుష్పితాగ్రాం రుచిరాం తరుణాఙ్కురపల్లవామ్ |
తామారుహ్య మహాబాహుశ్శింశుపాం పర్ణసంవృతామ్ || 41
ఆ మహాబాహుఁడు, పూచిన కొనలు గలిగి రమణీయమై, లేతమొలకలు, చిగుళ్లు కలిగి ఆకుజొంపాలతో పెంపారే, ఆ శింశుపావృక్షా
న్నెక్కి,
తనలో తాను
ఇతో
ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసామ్ |
ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సమ్పతన్తీం యదృచ్ఛయా || 42
“ సీత, రాముని చూడ్డానికి ఉవ్విళులూరుతూండేది
కాన దుఃఖాన కంది, కుందిన విరహిణికి ఉబుసు పోకకు వనవిహారాదులు
ఇష్టం కాబట్టి ఇక్కడ ఇటూ అటూ తిరుగుతూండవచ్చు. అందువల్ల
నేను, ఇక్కడ ఉండి, ఆమెను చూస్తాను.
అశోకవనికా
చేయం దృఢం రమ్యా దురాత్మనః |
చమ్పకైశ్చన్దనైశ్చాపి వకులైశ్చ విభూషితా || 43
దురాత్ముడైన రావణుని అశోకవనిక ఇది. మిగుల రమణీయంగా ఉంది. ఇంకా
ఇది చంపక, చందనవృక్షాలు, పొగడచెట్లతో నీటు గులుకుతోంది.
ఇయం
చ నలినీ రమ్యా ద్విజసఙ్ఘనిషేవితా |
ఇమాం సా రామమహిషీ నూనమేష్యతి జానకీ || 44
ఈ తామరకొలను కూడా మిగుల రమ్యమై పక్షిసమూహాలతో ఎంతో శోభిస్తోంది. రాముని దేవి, జనక రాజు కూతురు,
ఆ సీత, ఈ తామర కొలఁకుకు తప్పక వస్తుంది.
సా
రామా రామమహిషీ రాఘవస్య ప్రియా సతీ |
వనసఞ్చారకుశలా నూనమేష్యతి జానకీ || 45
ఆ రామామణి, రాముని దేవి, రాముని గారాబు చెలువ, జానకి, వనాల్లో
సంచరించడంలో ఆఱితేఱినది కాబట్టి
ఈ వనికి సందేహం లేకుండా
వస్తుంది.
అథవా
మృగశాబాక్షీ వనస్యాస్య విచక్షణా |
వనమేష్యతి సాఽఽర్యేహ రామచిన్తానుకర్శితా || 46
అలా
కాకపోతే, కొదమలేడికిలా
బెళుకు కన్నులు కల ఆ పూజ్యురాలు, సీత, రామునిగుఱించిన చింతచే కృశించి, పండితురాలు కాన విరహతాపం
పోగొట్టే ఉపాయ మెఱింగి, అశోకవనమందలి ఈ తామరకొలఁకు దాపటి(సమీప) వనానికి
వస్తుంది.
రామశోకాభిసన్తప్తా
సా దేవీ వామలోచనా |
వనవాసే రతా నిత్యమేష్యతే వనచారిణీ || 47
సొగసు
కన్నుంగవ కల ఆ అన్ను, ఎప్పుడూ వనంలో నివసించటానికి ఆసక్తి కలిగినది. మఱి వనంలో తిరుగుతూండే
స్వభావమూ కలది. అందువల్ల ఇప్పుడు రాముని బాసిన దుఃఖాన పొక్కుతోంది కాబట్టి, ఆ తాపం పోగొట్టుకోవటానికై ఈ వనానికి అవశ్యం
రాగలదు.
వనేచరాణాం
సతతం నూనం స్పృహయతే పురా |
రామస్య దయితా భార్యా జనకస్యసుతా సతీ || 48
రాముని ప్రియభార్య,
జనకుని కూతురు, పతివ్రత, సీత, మునుపు ఎప్పుడూ వనంలో
చరిస్తూండేవారి కుశలం కోరుతూ, వారలతో కూడ వాసం
చేయటానికి ఉవ్విళులూరుతుండేది. ఇది నిజం.
సన్ధ్యాకాలమనాః
శ్యామా ధ్రువమేష్యతి జానకీ |
నదీం
చేమాం శుభజలాం సన్ధ్యార్థే వరవర్ణినీ || 49
నడియౌవనం
కలిగి వెలిగే ఆ వరవర్ణిని, ఆ జానకి, సంధ్యోపాసనలో ఆసక్తి కలది.
కాబట్టి ప్రతిదినమూ, సంధ్యను ఉపాసించటానికి, మంచి జలం
కల ఈ నదికి నిశ్చయంగా వస్తుంది.
తస్యాశ్చాప్యనురూపేయ
మశోకవనికా శుభా |
శుభా
యా పార్థివేన్ద్రస్య పత్నీ రామస్య సమ్మతా || 50
సుందరమైన ఈ అశోకవనిక, భూమీశుడైన రాముని ప్రియభార్య, అతిసుందరి, సీతకు తగి ఉన్నది.
యది
జీవతి సా దేవీ తారాధిపనిభాననా |
ఆగమిష్యతి
సాఽవశ్యమిమాం శివజలాం నదీమ్ || 51
చందురునిలా
సుందరమైన నెమ్మొగం కల ఆ దేవి బ్రతికి ఉంటే కనుక, అవశ్యం మంచి జలాలు కల ఈ నదికి వస్తుంది” అని ఆలోచించాడు.
ఏవం
తు మత్వా హనుమాన్మహాత్మా
ప్రతీక్షమాణో
మనుజేన్ద్రపత్నీమ్ |
అవేక్షమాణశ్చ
దదర్శ సర్వం
సుపుష్పితే పర్ణఘనే నిలీనః || 52
మహాత్ముడైన హనుమంతుఁడు
ఇట్లాలోచించి, మనుజేశుడైన
రామునిపత్ని, సీత రాకకు ఎదురుచూస్తూ, నలుప్రక్కలా పరికిస్తూ, చక్కఁగాఁ పూచి ఉన్న ఆ
వృక్షపు ఆకుజొంపాల దట్టాన దాఁగి ఉండి, అందున్న విశేషాలన్నిటిని చూశాడు.
---------------------------------------------------------------------------------------------------
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ
సర్వధనుష్మతామ్ | రక్షఃకులనిహన్తారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ||19||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే సున్దరకాణ్డే చతుర్దశస్సర్గః
| (14)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి