రామసుందరం
ఏకవింశస్సర్గః
తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ।
ఆర్తా దీనస్వరా దీనం
ప్రత్యువాచ శనై ర్వచః ॥ 1
రౌద్రరక్షసుడు, ఆ రావణుఁ డాడిన మాట
విని, సీత,
ఆర్తయై, దీనయై, దీనస్వరంతో, మెల్లగా, ఇలా అంది.
దుఃఖార్తా రుదతీ సీతా
వేపమానా తపస్వినీ ।
చింతయంతీ వరారోహా
పతిమేవ పతివ్రతా ॥ 2
తృణ మంతరతః కృత్వా
ప్రత్యువాచ శుచిస్మితా ।
నివర్తయ మనో మత్త
స్స్వజనే క్రియతాం మనః ॥ 3
ఉత్తిమకాంత పతివ్రత ఆ సీత, దుఃఖపీడితయై, రోదిస్తూ, భయంతో గడగడ వడఁకుతూ,
చూసేవారికి
జాలిగొల్పుతూ, మనస్సులో పతినే ధ్యానిస్తూ, సహజమైన తెలిచిఱునవ్వు, మొగంలో ముఱువు
చూపుతుండగా, రావణునితో ప్రత్యక్షంగా మాట్లాడడం తగదు కాబట్టి, ఒకగడ్డిపోఁచను నడుమ ఉంచుకొని, వానితో “ నానుండి మనసు మరల్చుకో. మఱలించుకొని, నీభార్యలయందు ఉంచు.
న మాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ ।
అకార్యం న మయా కార్య మేకపత్న్యా
విగర్హితమ్ ॥ 4
కులం సంప్రాప్తయా
పుణ్యం కులే మహతి జాతయా ।
ఏవ ముక్తా తు వైదేహీ
రావణం తం యశస్వినీ ॥ 5
రాక్షసం పృష్ఠతః
కృత్వా భూయో వచన మబ్రవీత్ ।
నాహ మౌపయికీ భార్యా
పరభార్యా సతీ తవ ॥ 6
పాపాత్ముడు కోరిన, మంచి మోక్షసిద్ధిలా, నీవు, నన్ను, కోర తగదు. పాపికి, మోక్షం కలుగనట్లు, నీకు, నేను దక్కను. నేను, పవిత్రకులంలో
పెండ్లై, మెట్టినదాన్ని. అలాగే
గొప్పవంశంలో పుట్టాను. పతివ్రతను. ఇట్టి నాకు, ఇలాంటి చేయరాని, నిందాకార్యం చేయదగదు “ అంటూ, మహాపతివ్రత యశస్విని ఆ సీత, రావణుని సరకుగొనక, అవలిమోముగా తిరిగి, " నేను పరపురుషుని భార్యను, పతివ్రతను. కాన నీకు భార్యగా తగినదాన్ని
కాను.
సాధు ధర్మ మవేక్షస్వ
సాధు సాధువ్రతం చర ।
యథా తవ తథాఽన్యేషాం
దారా రక్ష్యా నిశాచర ।
ఆత్మాన ముపమాం కృత్వా
స్వేషు దారేషు రమ్యతామ్ ॥ 7
సాధుజనుల ధర్మాన్ని
చక్కగా గుఱ్తెఱుగు. తప్పక సత్పురుషునియమం చొప్పున లెస్సగా నడుచుకో. ఇలాంటి నడత నీకు తగదు. రాక్షసుడా! ఇతరులు
నీభార్యలను కోరితే, నీకెలా
ఉంటుందో అట్లే ఇతరులునూ. నీవు, నీవిషయాన్నే ఉపమానంగా చేసుకొని, నీభార్యల శీలాన్ని, రక్షించవలసిన అక్కఱ, నీకు, ఉన్నట్లే, ఇతరుల భార్యలనూ రక్షించాలి. కాబట్టి పరభార్యలను విడచి, నీభార్యలతో సుఖించు.
అతుష్టం స్వేషు
దారేషు చపలం చలితేంద్రియమ్ ।
నయంతి నికృతిప్రజ్ఞం
పరదారాః పరాభవమ్ ॥ 8
తనభార్యలయందు, తనివి పొందక, చపలుడై, చపలాలైన
ఇంద్రియాలు కల్గి, గూఢవిప్రియాలు చేయడంలో
ఆఱితేఱి, పరభార్యలను కూడితే, దానివల్ల వాని ఆయువు, ఐశ్వర్యం మొదలైనవన్నీ, నశించి, వాడు కీడు
పొందుతాడు.
ఇహ సంతో న వాసంతి
సతోవా నానువర్తసే ।
తథాహి
విపరీతా తే బుద్ధి రాచారవర్జితా ॥ 9
వచో
మిథ్యాప్రణీతాత్మా పథ్య ముక్తం విచక్షణైః ।
రాక్షసానా మభావాయ
త్వం వా న ప్రతిపద్యసే ॥ 10
అకృతాత్మాన మాసాద్య
రాజాన మనయే రతమ్ ।
సమృద్ధాని వినశ్యంతి
రాష్ట్రాణి నగరాణి చ ॥ 11
ఇక్కడ నీకిట్టి అనర్థంనుండి
వారించడానికి, మంచి చెప్పే పెద్దలెవ్వరూ లేరా? ఉన్నా,
నీవు వాళ్లను అనుసరించవా? నీవు వాళ్లను అనుసరించవులాగుంది.
నీ విపరీతమైన ఈ దుర్బుద్ధే ఈ విషయాన్ని తెల్పుతోంది. నా బుద్ధి ఎలా
తెలుసు? అంటావేమో,
నీవు శిష్టాచారాన్ని దిగవిడిచి, ఇలా చేయడమే
నీ బుద్ధి విపరీతమైనదని తెల్పుతోంది. లేక, పండితులైనవారు, నీకు, హితోక్తులు చెప్పినా, నీవు, రాక్షసులకు, నాశనమే కలిగింప తలఁచి, ఆ
పండితుల మాటల్ని, పాటించకున్నావా ఏంటి? మంచి తెలివితేటలు లేనివాఁడు, దుర్మార్గుడు, రాజైతే,
దేశాలు, పట్టణాలు సకలసంపదలతో, నిండి ఉన్నవైనా నశించకమానవు.
తథేయం త్వాం సమాసాద్య
లంకా రత్నౌఘసంకులా ।
అపరాధా త్తవైకస్య
నచిరా ద్వినశిష్యతి ॥ 12
ఆ ప్రకారం
చూస్తే, పలువిధరత్నాలతో నిండి, పెంపు సొంపారే, ఈ
లంకంతా, నిన్ను
రాజుగా పొంది, నీ ఒక్కని
అపరాధంవల్ల త్వరగానే నాశనమవ్వగలదు.
స్వకృతై ర్హన్యమానస్య
రావణాదీర్ఘదర్శినః ।
అభినందంతి భూతాని
వినాశే పాపకర్మణః ॥ 13
ఏవం త్వాం పాపకర్మాణం
వక్ష్యంతి నికృతా జనాః ।
దిష్ట్యైతద్వ్యసనం ప్రాప్తో
రౌద్ర ఇత్యేవ హర్షితాః ॥ 14
రావణా!
పాపకర్ముడైనవాడు, దూరదృష్టి లేక, తాను చేసిన పాపాలచే కొట్టువడి, నాశనమవ్వగా, చూసి, ప్రాణులందఱూ ఆమోదిస్తారు. ఇలాగే పాపకర్ముడైన నీకిక నాశం కల్గినప్పుడు,
ముందు నీచేత వంచితులైన
జను లందఱూ, 'మా భాగ్యంవల్ల, బెడిదుడైన వీనికి, వ్యసనం సంభవించింది’ అని
ఉబ్బుతో చెప్పుకొంటారు.
శక్యా లోభయితుం నాహ మైశ్వర్యేణ ధనేన వా
।
అనన్యా రాఘవే ణాహం భాస్కరేణ ప్రభా యథా ॥ 15
నన్ను నీ అంతఃపుర స్త్రీల కెల్లా
ఈశ్వరిగా చేయడంవల్ల కానీ, ఆభరణాదులిచ్చి కానీ, ఆశ
పెట్టడానికి, నీ కెంతమాత్రం అలవి కాదు. వెలుతురు, సూర్యుని వీడి ఉండనట్లు, నేనూ, రామునికి, ఎంతమాత్రం
వేఱుపడి
ఉండను.
ఉపధాయ భుజం తస్య
లోకనాథస్య సత్కృతమ్ ।
కథం నామోపధాస్యామి
భుజ మన్యస్య కస్యచిత్ ॥ 16
నేను అట్టి లోకనాథుఁడైన
రాముని కౌగిట, అతని కుడిబుజాన్ని తలగడగాఁ పొందిన
పొగడ్తగలదాన్ని. ఇట్టి నేను ఇక అనామధేయుఁ డైన
మఱొకని, నీలాంటి అల్పుని బుజాన, తల ఎలా
మోపుతాను?
అహ మౌపయికీ భార్యా త
స్యైవ వసుధాపతేః ।
వ్రతస్నాతస్య విప్రస్య
విద్యేవ విదితాత్మనః ॥ 17
వేదవ్రతస్నాతుడు, బుద్ధిమంతుఁడు, ఆత్మజ్ఞానవంతుడు అయిన బ్రాహ్మణునకు
యోగాభ్యాసవిద్య ఒప్పి ఉన్నట్లు, నేను, భూపతియైన ఆ రామునకే తగిన ఇల్లాల్ని.
సాధు రావణ రామేణ మాం
సమానయ దుఃఖితామ్ ।
వనే వాశితయా సార్థం కరేణ్వేవ గజాధిపమ్
॥ 18
రావణా!, నీవు, మంచివాడివుగా! అడవిలోని మగఏనుగుమిన్నను, దాన్ని పాసి, దుఃఖించే, ఆడుగజంతో కూర్చునట్లు, రాముని పాసి, దుఃఖిస్తున్న, నన్ను రామునితో చక్కగూర్చు.
మిత్త్ర మౌపయికం కర్తుం
రామస్థ్సానం పరీప్సతా ।
వధం చానిచ్ఛతా ఘోరం త్వయాఽసౌ పురుషర్షభః ॥ 19
నీవు ఈ లంకలో తిరంగా ఉండాలని
కోరి, భయంకరమైన వధ
కోరనివాడవైతే, రామునితో మైత్రి కోరుకోవడమే, నీకు ప్రస్తుతకర్తవ్యం.
విదిత స్సహి ధర్మజ్ఞః
శరణాగతవత్సలః ।
తేన మైత్రీ భవతు తే
యది జీవితు మిచ్ఛసి ॥ 20
ఆ రాముడు,
ధర్మవిదుడని, శరణాగతవత్సలుడని జగద్విదితుడు కదా!. జీవించాలనే
కోరిక నీకుంటే ఆయనతో స్నేహం చెయ్యి.
ప్రసాదయస్వ త్వం చైనం
శరణాగతవత్సలమ్ ।
మాం చాస్మై ప్రయతో
భూత్వా నిర్యాతయితు మర్హసి ॥ 21
నీవు శరణాగతవత్సలుడైన ఆ రాముని
అనుగ్రహాన్ని సంపాదించు. నేనూ నీకోసం వేడుకొంటాను. నిర్మలచిత్తంతో,
నన్ను, ఆయనకు అప్పగించు.
ఏవం హి తే భవేత్
స్వస్తి సంప్రదాయ రఘూత్తమే ।
అన్యథా త్వం హి కుర్వాణో వధం
ప్రాప్స్యసి రావణ ॥ 22
రావణా! ఈ విధంగా, నన్ను, రామునికి అర్పిస్తేనే, నీకు,
క్షేమం కల్గుతుంది. వేఱేవిధంగా ప్రవర్తిస్తే, నీకు చావు
తప్పదు.
వర్జయే ద్వజ
ముత్సృష్టం వర్జయే దంతక శ్చిరమ్ ।
త్వద్విధం తున సంక్రుద్ధో లోకనాథ స్స రాఘవః ॥ 23
ఒకవేళ ఇంద్రుఁడు ప్రయోగించిన వజ్రాయుధం, నీవంటివాణ్ణి
విడిచినా విడుస్తుంది. యముఁడు కూడా నిన్ను
విడిచినా విడుస్తాడు. ఈ ఉభయులకూ లొంగలేదని
విఱ్ఱవీగకు.
లోకనాథుడగు రాముడు
కుపితుఁడయ్యెనా, నీవంటి దుష్టాత్ముని, ఎంతమాత్రము చంపకుండా విడువఁడు.
రామస్య ధనుష శ్శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనమ్ ।
శతక్రతువిసృష్టస్య నిర్ఘోష మశనేరివ ॥ 24
నీవు త్వరలోనే దేవేంద్రుడు
వైచిన వజ్రాయుధంలా మహాధ్వనితో కూడిన రాముని వింటిధ్వనిని వినగలవు.
ఇహ శీఘ్రం సుపర్వాణో
జ్వలితాస్యా ఇవోరగాః ।
ఇషవో నిపతిష్యంతి
రామలక్ష్మణలక్షణాః ॥ 25
రక్షాంసి
పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః ।
అసంపాతం
కరిష్యంతి పతంతః కంకవాససః ॥ 26
సొగసులైన గనుపులు కల్గి, మండునట్లున్నముఖాలతో, సర్పాల్లా
విలసిల్లుతూ,
రామలక్ష్మణుల
పేళ్లచే అంకితాలైన బాణాలు, శీఘ్రం గానే ఈ లంకలో
పడగలవు. ఆ బాణాలు పట్టణంపై నలుగడలా పడుతూ, రాక్షసుల్ని చంపుతూ ఎంతమాత్రం చోటు లేనట్లు
పట్టణమంతా వ్యాపించగలవు.
రాక్షసేంద్రమహాసర్సాన్
స రామగరుడో మహాన్ ।
ఉద్ధరిష్యతి వేగేన
వైనతేయ ఇ వోరగాన్ ॥ 27
రాముడనే మహాగరుడుడు,
గరుత్మంతుడు సర్పాల్ని త్రుంచినట్లు, వేగంగా, రాక్షసులనే మహాసర్పాల్ని, పెళ్లగించి వేస్తాడు.
అపనేష్యతి మాం భర్తా
త్వత్త శ్శీఘ్రమరిందమః ।
అసురేభ్యశ్శ్రియం దీప్తాం విష్ణు స్త్రిభిరివ క్రమైః ॥ 28
నీచేతినుండి నన్ను పొందడం రాముని తరం
కాదంటావా, విష్ణువు మూడడుగులచే అసురుల దగ్గరనుండి తేజరిల్లుతున్న లక్ష్మిని
కొనిపోయినట్లు అరిందముడైన నాపతి, రాముడు, నీ వద్ద నుండి నన్ను శీఘ్రంగా కొనిపోగలడు.
జనస్థానే హతస్థానే
నిహతే రక్షసాం బలే ।
అశక్తేన త్వయా రక్షః
కృత మేత దసాధు వై ॥ 29
రాక్షసా! జనస్థానంలో రాక్షసబలమంతా
రూపుమాయగా, నీవు ఎదుర్కొని, యుద్ధం చేసే,
శక్తి లేనివాడవు. కాబట్టి భయంతో నన్ను దొంగిలించడం అనే ఈ దుష్కార్యానికి ఒడిగట్టావు.
ఆశ్రమం తు తయో శ్శూన్యం ప్రవిశ్య
నరసింహయోః ।
గోచరం గతయో ర్భ్రాత్రో రపనీతా త్వయాఽధమ ॥ 30
నీచుడా! పురుషసింహులైన ఆ అన్నదమ్ములు
రామలక్ష్మణులు వెలుపలకు పోగానే, అది చూసి, నీవు ఆశ్రమంలో ప్రవేశించి, దొంగతనంగా నన్ను తెచ్చావు.
నహి గంధ ముపాఘ్రాయ
రామలక్ష్మణయో స్త్వయా ।
శక్యం సందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివ ॥ 31
అప్పుడు రామలక్ష్మణుల వాసననైనా
నీవు మూర్కొని ఉండుంటే బెబ్బులుల వాసన కన్న కుక్కలా నీవక్కడ వారి సమ్ముఖాన
నిమిషమైనా నిల్చి ఉండలేవు.
తస్య తే విగ్రహే
తాభ్యాం యుగగ్రహణ మస్థిరమ్ ।
వృత్రస్యేవేంద్రబాహుభ్యాం
బాహో రేకస్య నిగ్రహః ॥ 32
నీవు మొదలే బలం లేనందున భయపడి
ఉన్నావు. అట్టి నీకు రామలక్ష్మణులిఱువురితో యుద్ధం కల్గితే, నీకు జయం దక్కదు.
వృత్ర, ఇంద్రుల, యుద్ధంలో, ఇంద్రునికి, రెండుచేతులుండడంతో, ఒకటే చేయి ఉన్న, వృత్రునకు అపజయం కల్గినట్లు, వారలిఱువురూ, నీవొకడవు కాన,
వారిచే, నీకు, అపజయం తప్పదు.
క్షిప్రం తవ స నాథో
మే రామ స్సౌమిత్రిణా సహ ।
తోయ మల్ప మి వాదిత్యః
ప్రాణా నాదాస్యతే శరైః ॥ 33
నా ప్రాణనాథుడు రాముడు, లక్ష్మణునితో కూడి, సూర్యుడు కిరణాలతో కొంచెపు నీళ్లను గ్రహించేలాగ, శీఘ్రంగా బాణాలతో నీ
ప్రాణాలు తీస్తాడు.
గిరిం కుబేరస్య గతోఽపధాయ వా
సభాం గతో వా వరుణస్య
రాజ్ఞః ।
అసంశయం దాశరథేర్న మోక్ష్యసే
మహాద్రుమః కాలహతోఽశనేరివ ॥ 34
నీకిది మంచికాలం
కాదు. కాబట్టి నన్నిట్లా చెరబెట్టావు. దానివల్ల రాముని బారినుండి
పలాయితుడవై, కుబేరుని పట్టణానికి పోయినా, వరుణునిసభకు పోయినా, మఱి ఎక్కడికి పోయినా, పిడుగుపాటుకు, పెద్దమ్రాకు తప్పించుకోలేనట్లు, నీవు తప్పించుకోలేవు”
అంది.
----------------------------------------------------------------------------------------------
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సున్దరం, కాకుత్స్థం
కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం |
రాజేన్ద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం, వన్దే
లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ||26||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకవింశస్సర్గః
(21)
మంగళం
మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి