11, జూన్ 2020, గురువారం

Sundarakanda సుందరకాండ 24



రామసుందరం
చతుర్వింశస్సర్గః

తత స్సీతా ముపాగమ్య రాక్షస్యో వికృతాననాః ।
పరుషం పరుషా నార్య ఊచు స్తాం వాక్య మప్రియమ్‌ ॥ 1
ఆ తర్వాత, వికృతముఖాలు, కఠినస్వభావం కల, ఆ రాక్షసస్త్రీలు, సీతను చేరి, పరుషమైన, అప్రియవాక్యాల్ని ఆమెతో, ఇలా అన్నారు.
కింత్వ మన్తఃపురే సీతే సర్వభూతమనోహరే ।
మహార్హశయనో పేతే న వాస మనుమన్యసే 2
సీతా! సకలజనమనోహరమై, మేలైన శయ్యలతో, అలరారే అంతఃపురంలో, వసించటానికి, సమ్మతించవెందుకు?
మానుషీ మానుష స్యైవ భార్యాత్వం బహుమన్యసే
ప్రత్యాహర మనో రామా న్న త్వం జాతు భవిష్యసి ॥ 3
నీవు, మనుష్య స్త్రీవి కాబట్టి, మనుష్యుడైన రామునకు, భార్యగా ఉండటాన్నే, ఎచ్చుగా భావిస్తున్నావు. వద్దు. రామునినుండి, మనసు మఱల్చుకో. ఇక ఎప్పటికీ, రాముని చేరి, అతని భార్యగా, ఉండలేవు. 
త్రైలోక్యవసుభోక్తారం రావణం రాక్షసేశ్వరమ్‌
భర్తార ముపసంగమ్య విహరస్వ యథాసుఖమ్‌ ॥ 4
ముల్లోకాల్లోని సమస్తధనాల్ని, నిత్యం అనుభవించే, రావణుని పెనిమిటిగా పొంది, సుఖంగా  విహరించు.
మానుషీ మానుషం తం తు రామ మిచ్ఛసి శోభనే
రాజ్యా ద్భ్రష్ట మసిద్ధార్థం విక్లబం త్వ మనిన్దితే 5
కల్యాణీ ! అనిందితా! మానవకాంతవైన నీవు, మనుష్యుడు, రాజ్యభ్రష్టుడు, కోర్కెలు ఈడేర్చుకోలేనివాడు, దీనుడు అయిన, ఆ రామునే కోరుతున్నావు. కాని, రాక్షసేశ్వరుడు, రావణుని కోరకున్నావు.
రాక్షసీనాం వచః శ్రుత్వా సీతా పద్మనిభేక్షణా ।
నేత్రాభ్యా మశ్రుపూర్ణాభ్యా మిదం వచన మబ్రవీత్‌ ॥ 6
పద్మాల్లాంటి కండ్లు కల ఆ సీత, ఆ రాక్షసస్త్రీలు చెప్పింది విని, కన్నులనిండా కన్నీళ్లు వెల్లిగొన, వారితో, ఇలా అంది.
య దిదం లోకవిద్విష్ట ముదాహరథ సంగతాః
నైతన్మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతి వః ॥ 7
మీఱందరూ కల్సి, లోకం ద్వేషించేటట్టి, నా మనసుకు పట్టనట్టి, ఏ మాటనైతే చెప్తున్నారో, అట్టి మాట, పాపవిషయమని, మీకు, అనిపించలేదా?.
న మానుషీ రాక్షసస్య భార్యా భవితు మర్హతి
కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః ॥ 8
మానవ స్త్రీ, రాక్షసుడికి భార్య కావటం, ఎంతమాత్రం యుక్తం కాధు. మీర౦దఱూ, మీ ఇష్టం వచ్చినట్లు, నన్ను, తింటే తినండి. కాని, నేనుమాత్రం, మీరు చెప్పినట్లు, చేయను.
దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా స మే గురుః ।
తం నిత్య మనురక్తాఽస్మి యథా సూర్యం సువర్చలా ॥ 9
ఎవడు నా భర్తో, అతడు, దీనుడైనా కానీ, రాజ్యహీనుడైనా కానీ, అతడే, నాకు, గురుడు. సువర్చల, సూర్యునియందు, అనురాగం కలిగి ఉన్నట్లు, నేను, రామునియందే ఎల్లప్పుడూ అనురక్తనై ఉంటాను.
యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి ।
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా ॥ 10
మహాభాగ శచీదేవి దేవేంద్రుని, అరుంధతి వసిష్ఠుని, రోహిణీదేవి చంద్రుని,
లోపాముద్రా యథాఽగస్త్యం సుకన్యా చ్యవనం యథా
సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా ॥ 11
లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని,
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా ।
నైషధం దమయంతీవ భైమీ పతి మనువ్రతా 12
మదయంతి సౌదాసుని, కేశిని సగరచక్రవర్తిని, భీమరాజపుత్రి దమయంతి నలుని, అనుసరించినట్లు,
తథాఽహ మిక్ష్వాకువరం రామం పతి మనువ్రతా ॥ 13
నేను, నా పెనిమిటి, ఇక్ష్వాకుకులలలాముని, రామునినే అనుసరించి ఉంటాను
సీతాయా వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః
భర్త్సయంతి స్మ పరుషై ర్వాక్యెై రావణచోదితాః ॥ 14
ఆ రాక్షసస్త్రీలు, సీత చెప్పిన మాట విని, కోపావేశాన, మైమఱచి, రావణుడు నియోగించిన విధంగా, పరుషవాక్యాలతో, ఆ చెలువను, బెదరించడం మొదలుపెట్టారు.
అవలీన స్స నిర్వాక్యో హనుమాన్‌ శింశుపాద్రుమే
సీతాం సంతర్జయంతీ స్తా రాక్షసీ రశృణోత్కపిః 15
శింశుపావృక్షంలో దాగి ఉన్న, ఆ హనుమంతుడు, ఏమీ మాట్లాడకుండా, సీతను, అలా బెదిరిస్తున్న, రాక్షసస్త్రీల మాటల్ని, వింటూ, కూర్చొన్నాడు.
తా మభిక్రమ్య సంక్రుద్ధా వేపమానాం సమంతతః
భృశం సంలిలిహు ర్దీప్తాన్‌ ప్రలంబాన్‌ దశనచ్ఛదాన్‌ ॥ 16
ఆ స్త్రీలు, భయంతో, గడగడ వడకుతున్న సీతను, చుట్టుకొని, మిక్కిలి కోపంతో, దీప్తప్రలంబమైన తమ పెదవుల్ని, బిట్టుగా నాకారు.
ఊచుశ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాశు పరశ్వథాన్‌ ।
నేయ మర్హతి భర్తారం రావణం రాక్షసాధిపమ్‌ ॥ 17
వారు మిక్కిలి క్రుద్ధులై , వేగంగా, గండ్రగొడ్డళ్లను చేతబట్టి, సీతను చూసి, “ఇది, రాక్షసరాజు రావణుని, భర్తగా పొందడానికి, అర్హురాలు కాదు” అన్నారు.
సా భర్త్స్యమానా భీమాభీ రాక్షసీభి ర్వరాననా ।
సా బాష్ప మపమార్జంతీ శింశుపాం తా ముపాగమత్‌ ॥ 18
ఆ వరానన, సీత, భయంకరులైన రాక్షసస్త్రీలు, బెదిరిస్తూంటే, కన్నీటిని తుడుచుకొంటూ, హనుమంతుడు దాగి ఉన్న, ఆ శింశుపావృక్షం దగ్గరకు వెళ్లింది.
తత స్తాం శింశుపాం సీతా రాక్షసీభి స్సమావృతా
అభిగమ్య విశాలాక్షీ తస్థౌ శోకపరిప్లుతా ॥ 19
అంత, విశాలాక్షి, ఆ సీత, రాక్షసస్త్రీలు చుట్టూ క్రమ్ముకొనగా, ఆ శింశుపావృక్షాన్ని చేరి, నిల్చుని, శోకంలో మునిగింది.
తాం కృశాం దీనవదనాం మలినాంబరధారిణీమ్‌ ।
భర్త్సయాంచక్రిరే సీతాం రాక్షస్య స్తాం సమంతతః 20
ఉపవాసంతో కృశించినది, దీనవదన, ముఱికిబట్టలు కట్టుకొన్న, సీతాదేవిని చుట్టుముట్టి, ఆ రాక్షసస్త్రీలు, మళ్లీ, బెదిరించడం ప్రారంభించారు.
తత స్తాం వినతా నామ రాక్షసీ భీమదర్శనా ।
అబ్రవీత్‌ కుపితాకారా కరాళా నిర్ణతోదరీ ॥ 21
అప్పుడు భీమదర్శన, కుపితాకార, కరాళ, నిర్ణతోదరి, అయిన వినత అనే రక్కసి, సీతను చూసి, ఇలా అంది.
సీతే పర్యాప్త మేతావ ద్భర్తుస్స్నేహో నిదర్శితః ।
సర్వ త్రాతికృతం భద్రే వ్యసనా యోపకల్పతే 22
“నీకు, నీ పెనిమిటిపై కల నెయ్యాన్ని, చూపించావు. ఇంతవఱకు చాలు. కల్యాణీ! దేన్నయినా, మితి మీఱి చేస్తే, సర్వత్రా దుఃఖమే కల్గుతుంది.
పరితుష్టాస్మి భద్రం తే మానుష స్తే కృతో విధిః ।
మమాపి తు వచః పథ్యం బ్రువంత్యాః కురు మైథిలి ॥ 23
నీవు, మనుష్యజాతికి తగిన, పాతివ్రత్యధర్మాన్ని, ప్రకటించావు. ఇక చాలు. ఎంతో సంతోషించాను. నీకు శుభ మగుగాక!. సీతా!, నేను, చెప్పబోయే, హితమైన మాట కూడా, పాటించు.
రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసామ్‌ ।
విక్రాంతం రూపవంతం చ సురేశమివ వాసవమ్‌ ॥ 24
పరాక్రమవంతుడు, దేవేంద్రునివంటి రూపవంతుడు, సర్వరాక్షసభర్త అయిన, రావణుని, భర్తగా సేవించు.
దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనమ్‌ ।
మానుషం కృపణం రామం త్యక్త్వా రావణ మాశ్రయ ॥ 25
కేవలం మనుష్యుడు, దీనుడు, అయిన రాముని విడిచిపెట్టి, దక్షిణుడు, త్యాగశీలుడు, చూసేవారికి ప్రియదర్శనుడైన, రావణునే, ఆశ్రయించు.
దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణభూషితా ।
అద్య ప్రభృతి సర్వేషాం లోకానా మీశ్వరీ భవ ॥ 26
సీతా!, నీవు, దివ్యమైన చందనం అలదుకొని, దివ్యాభరణాల్ని అలంకరించుకొని, నేటినుండి, సమస్తలోకాలకు, రాణిగా ఉండు.
అగ్నే స్స్వాహా యథా దేవీ శచీ వేంద్రస్య శోభనే ।
కిం తే రామేణ వైదేహి కృపణేన గతాయుషా ॥ 27
కల్యాణీ! అగ్నికి స్వాహాదేవిలా, ఇంద్ర్రునకు శచీదేవిలా, రావణునకు నీవు. దీనుడు, రావణుని చేతిలో కూలే రామునితో నీకేం పని?
ఏత దుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యసి ।
అస్మిన్ముహూర్తే సర్వా స్త్వాం భక్తయిష్యామహే వయమ్‌ ॥ 28
ఇప్పుడు నీవు, నేను చెప్పినట్టు చేయకపోతే, ఈ గడియలోనే మేమందఱం, నిన్ను, తినేస్తాం."
అన్యా తు వికటా నామ లంబమానపయోధరా
అబ్రవీ త్కుపితా సీతాం ముష్టి ముద్యమ్య గర్జతీ 29
లంబమానపయోధరి అయిన, వికట అనే మఱొక రాక్షసస్త్రీ, కుపితయై, పిడికిలి ఎత్తిపట్టుకొని, గర్జిస్తూ, సీతను చూసి, ఇలా అంది.
బహూ న్యప్రియరూపాణి వచనాని సుదుర్మతే
అనుక్రోశా న్మృదుత్వాచ్చ సోఢాని తవ మైథిలి ॥ 30
ఓసి దుష్టబుద్ధీ!, జానకీ!, నీవెన్ని అప్రియవచనాలు ఆడుతున్నా, మేము, దయవల్లా, మా మనసు మెత్తదనంవల్లా, వాటికన్నిటికీ ఓర్చుకొంటున్నాం.
న చ నః కురుషే వాక్యం హితం కాలపురస్కృతమ్‌ ।
ఆనీతాఽసి సముద్రస్య పార మన్యైర్ధురాసదమ్‌
రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలి ॥ 31
ఇప్పటి కాలానికి తగ్గట్లు, నీకు, మేము, హితం చెప్పాం. మామాటల్ని, నీవు, వినడంలేదు. జానకీ!, ఇతరులు రావడానికి సాధ్యం కాని, సముద్రపు ఈవలిగట్టుకు, తేబడ్డావు. అంతే కాక, భయంకరమైన రావణాంతఃపురంలో ఉన్నావు కూడా.
రావణస్య గృహే రుద్ధా మస్మాభిస్తు సురక్షితామ్‌ ।
న త్వాం శక్తః పరిత్రాతు మపి సాక్షాత్పురందరః ॥ 32
రావణుని ఇంట దాచబడి, మావంటివారిచే, లెస్సగా, కావలి కాయబడుతున్న, నిన్ను, కాపాడడానికి, సాక్షాత్ దేవేంద్రునికైనా, అలవి కాదు.
కురుష్వ హితవాదిన్యా వచనం మమ మైథిలి ।
అల మశ్రుప్రపాతేన త్యజ శోక మనర్థకమ్‌ ॥ 33
సీతా!, నీమేలు కోరి, చెప్తున్నాను. నామాట ప్రకారం చెయ్యి. ఇలా కన్నీరు విడిచింది చాలు. దుఃఖంవల్ల, ప్రయోజనం లేదు. కనుక దాన్ని విడచిపెట్టు.
భజ ప్రీతిం చ హర్షం చ త్యజైతాం నిత్యదైన్యతామ్‌ ।
సీతే రాక్షసరాజేన సహ క్రీడ యథాసుఖమ్‌ ॥ 34
సీతా!, నీవు రావణుని స్నేహాన్నిపొంది, ఆనందంగా ఉండు. ఇలాంటి నిత్యదైన్యాన్ని, విడచిపెట్టు. రావణుని కూడి, సుఖంగా క్ర్రీడించు.
జానాసి హి యథా భీరు స్త్రీణాం యౌవన మధ్రువమ్‌ ।
యావ న్నతే వ్యతిక్రామే త్తావ త్సుఖ మవాప్నుహి ॥ 35
పిఱికిదానా! స్త్రీలకు, యౌవనం, శాశ్వతం కాదని, నీకు, తెల్సు కదా!. అట్టి ఎలప్రాయం, గడచిపోకముందే, యౌవనకాలసుఖాన్ని, అనుభవించు.
ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ
సహ రాక్షసరాజేన చర త్వం మదిరేక్షణే 36
మదిరేక్షణా!, నీవు, రావణుని కూడి, రమణీయోద్యానవనాల్లోనూ, పర్వతాల దాపటి వనాల్లోనూ సంచరించు.
స్త్రీసహస్రాణి తే సప్త వశే స్థాస్యంతి సుందరి ।
రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసామ్‌ ॥ 37
సుందరీ! ఏడువేలమంది స్త్రీలు, నీవశంలో ఉండి, నీకు, సేవ చేస్తూంటారు. సర్వరాక్షసభర్తయిన రావణుని, భర్తగా సేవించు.
ఉత్పాట్య వా తే హృదయం భక్షయిష్యామి మైథిలి ।
యది మే వ్యాహృతం వాక్యం న యథావ త్కరిష్యసి ॥ 38
సీతా!, నేను చెప్పినట్లు చేయకపోతే, నీ గుండెను పెఱికి, తింటాను.
తత శ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛితా
భ్రామయంతీ మహచ్ఛూల మిదం వచన మబ్రవీత్‌ ॥ 39
అంత, చండోదరి అనే రాక్షసి, కోపంతో, ఒళ్లు మఱచి, పెద్దశూలాన్ని త్రిప్పుతూ, ఇలా అంది.
ఇమాం హరిణలోలాక్షీం త్రాసోత్కంపిపయోధరామ్‌
రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్‌ ॥ 40
“హరిణలోలాక్షి, రావణాపహృత, త్రాసోత్కంపిపయోధర అయిన ఈమెను చూసి, నాకో గొప్పదైన, వేవిళ్లకోర్కె, కల్గింది.
యకృత్ల్పీహ మథోత్పీడం హృదయం చ సబంధనమ్‌
ఆంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయ మితి మే మతిః ॥ 41
ఈ సీతను చంపి, దీని కడుపుకు ఎడమభాగాన ఉండే, యకృత్ అనే మాంసాన్ని, దీనికి ఎడమప్రక్క ఉండే, ప్లీహమనే మాంసాన్ని, దానికి పైన ఉండే, ఉత్పీడం అనే మాంసాన్ని, తామరమొగ్గలా ఉండే, గుండెను, ప్రేగుల్నీ, తలను, తినాలని కోరుతున్నాను.”
తతస్తు ప్రఘసా నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌ ।
కంఠ మస్యా నృశంసాయాః పీడయామ కి మాస్యతే 42
అంత, ప్రఘస అనే పేరు కల, రాక్షసి, ఇలా అంది. ఈ క్రూరురాలి కుత్తుకను, పిసికి, చంపేద్దాం. ఎందుకు ఊరుకోవడం?
నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతి హ
నాత్ర కశ్చన సందేహః ఖాదతేతి స వక్ష్యతి ॥ 43
ఆ తర్వాత, మనుష్యస్త్రీయైన ఆ సీత చచ్చిందిఅని, రాజుకు, చెప్దాం. అప్పుడు, రాజు, అయితే తినేయండి అంటాడు. ఇందులో, సందేహం ఏం లేదు.”
తత స్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌
విశ స్యేమాం తత స్సర్వా స్సమాన్‌ కురుత పీలుకాన్‌ 44
అప్పుడు, అజాముఖి అనే పేరు కల, రాక్షసి, ఇలా అంది. “ మీరందఱూ, ఈమెను ఖండించి, సమానమైన మాంసఖండాలుగా, చేయండి. 
విభజామ తత స్సర్వా వివాదో మే న రోచతే ।
పేయ మానీయతాం క్షిప్రం లేహ్య ముచ్చావచం బహు 45
పిమ్మట, మనమందఱం, పంచుకొందాం. నాకు, గొడవపడటం, ఇష్టం ఉండదు. వెంటనే, రకరకాల పానీయాల్ని, నంజుకోవడానికి పలుపచ్చళ్లను, ఎక్కువగా తెండి.”  
తత శ్శూర్పణఖా నామ రాక్షసీ వాక్య మబ్రవీత్‌
అజాముఖ్యా య దుక్తం హి తదేవ మమ రోచతే ॥ 46
అప్పుడు, శూర్పణఖ అనే పేరు కల, రాక్షసి ఇలా అంది. అజాముఖి చెప్పింది నాకు నచ్చింది.
సురా చానీయతాం క్షిప్రం సర్వశోకవినాశినీ ।
మానుషం మాంస మాస్వాద్య నృత్యామోఽథ నికుంభిలామ్‌ ॥ 47
అన్ని చింతల్నీ, పోగొట్టే, మద్యాన్ని కూడా, వెంటనే తీసుకొని రండి. మనుష్యమాంసాన్ని తిని, లంకకు, పశ్చిమాన ఉండే, నికుంభిల అనే శక్తికి ప్రియమైన నృత్యాన్ని, చేద్దాం.”  
ఏవం సంభర్త్స్యమానా సా సీతా సురసుతోపమా ।
రాక్షసీభి స్సుఘోరాభి ర్ధైర్య ముత్సృజ్య రోదితి ॥ 48
దేవకన్యలాంటి సీత, భయంకరులైన రాక్షసస్త్రీలు చేసే, బెదిరింపులకు, జడిసి, ధైర్యం విడచి, ఏడ్వసాగింది. 
-------------------------------------------------------------------------------------------
శ్రీరామచన్ద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచన్ద్రచరణౌ శిరసా నమామి, శ్రీరామ చన్ద్రచరణౌ శరణం ప్రపద్యే ||29||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుర్వింశస్సర్గః (24)
మంగళం మహత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...