రామసుందరం
ఏకోనవింశస్సర్గః
తస్మిన్నేవ తతః కాలే
రాజపుత్త్రీ త్వనిందితా ।
రూపయౌవనసంపన్నం
భూషణోత్తమభూషితమ్ ॥ 1
తతో దృష్ట్వైవ వైదేహీ రావణం
రాక్షసాధిపమ్ ।
ప్రావేపత వరారోహా
ప్రవాతే కదళీ యథా ॥ 2
రావణుఁడు వచ్చినంతనే, అప్పుడు, అనిందిత రాజకుమారి విదేహరాజసుత ఉత్తమకాంత ఆ
సీత, సౌందర్యయౌవనసంపన్నుడు ఉత్తమభూషణభూషితుడు రాక్షసాధిపుడు
రావణుని, దూరాన్నే చూసి, పెనుగాలికి అల్లలాడే
అరఁటిచెట్టులా, భయంతో
గడగడ వడకింది.
ఆచ్ఛాద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ।
ఉపవిష్టా విశాలాక్షీ
రుదంతీ వరవర్ణినీ ॥ 3
విశాలమైన కన్నుగవ కల, ఆ
వరవర్ణిని, రావణుని రాకను చూసి, దిగులుతో,
తొడలచేత కడుపును, బుజాలచేత బిగిచన్నుగవను కప్పు
కొని ఏడుస్తూ, కూర్చొంది.
దశగ్రీవస్తు వైదేహీం
రక్షితాం రాక్షసీగణైః ।
దదర్శ సీతాం
దుఃఖార్తాం నావం సన్నామి వార్ణవే ॥ 4
రాక్షసగణాలు చుట్టూ
కావలి ఉండగా, సముద్రంలో
మునిగిన ఓడలా, దుఃఖాన కుందుతున్న, ఆ విదేహరాజసుత సీతను, రావణుడు చూశాడు.
అసంవృతాయా మాసీనాం
ధరణ్యాం సంశితవ్రతామ్ ।
ఛిన్నాం ప్రపతితాం
భూమౌ శాఖామివ వనస్పతేః ॥ 5
మిక్కిలి పదునైన పతివ్రతాన్ని
పూనింది కాబట్టి, పఱపేమీ లేని రిత్తనేలపై కూర్చొని, నఱుకఁగానే నేలబడ్డ చెట్టుకొమ్మలా,
మలమండనచిత్రాంగీం మండనార్హా
మమండితామ్ ।
మృణాళీ పంకదిగ్ధేవ
విభాతి న విభాతి చ ॥ 6
అంగాల్లో
క్రమ్ముకొన్న ముఱికి కూడా సొమ్ములా, ఎమ్మెలు చూపగా, ఆశ్చర్యం కొల్పుతూ, రూపు పెంపున
చేసి, అలంకారాలకు
తగినదైనా, ఏమీ అలంకారం చేసుకోక, బురదలో మునిగి ఉన్న తామరతూడులా, ప్రకాశిస్తూ, ప్రకాశించక, రావణునకు కనబడింది.
సమీపం రాజసింహస్య
రామస్య విదితాత్మనః ।
సంకల్పహయసంయుక్తై ర్యాంతీమివ మనోరథైః ॥ 7
మఱియు, ఆ చెలువ, రాజసింహుడు ఆత్మవిదుడు రాముని దగ్గరకు
వెళ్లే వీలు లేనందువల్ల, సంకల్పాలనే గుఱ్ఱాల్ని పూన్చి, మనస్సనే రథాన్నెక్కి, అతని కడకు పోతున్నదానిలా,
శుష్యంతీం రుదతీ
మేకాం ధ్యానశోకపరాయణాం ।
దుఃఖ స్యాంత
మపశ్యంతీం రామాం రామ మనువ్రతామ్ ॥ 8
వేష్టమానాం
తథా౨౨విష్టాం పన్నగేంద్రవధూమివ ।
ధూప్యమానాం గ్రహేణేవ
రోహిణీం ధూమకేతునా ॥ 9
రామునికోసం పెక్కుతలపోతలపడి, రాముణ్ణే మనసులో భావించుకొంటూ,
ఆహారం లేనందున ఎండి, ఏడుస్తూ, ఒంటరై, సదాధ్యానశోకపరాయణయై, దుఃఖపుతుది కానక, రాముని అనుసరించడమే
వ్రతంగా కలది కాబట్టి, ఆతని పాసిన ఆరాటంలో మణిమంత్రాదులకు కట్టుపడి నేలను చుట్టుకొని ఉన్న సర్పరాజకన్యలా, అంగాల్ని
ముడుచుకొంటూ, ధూమకేతుగ్రహంచేత క్రమ్ముకోబడిన
రోహిణిలా పొక్కుతూంది.
వృత్తశీలకులే జాతా
మాచారవతి ధార్మికే ।
పున స్సంస్కార
మాపన్నాం జాతా మివ చ దుష్కులే ॥ 10
మఱియు, గట్టిశీలం
కల్గి, సమయాచారసంపన్నమై, ధర్మప్రధానమైన
వంశంలో పుట్టి, పిదప దుష్కులాన పెండ్లియై, ఆ
కులంలో మరలా పుట్టినట్టిదైన కన్యలా, మిక్కిలి కీడ్పడి ఉంది.
అభూతే నాపవాదేన
కీర్తిం నిపతితామివ ।
ఆమ్నాయానా మయోగేన
విద్యాం ప్రశిథిలామివ ॥ 11
ఇంతేకాక, ఆ అమ, మిథ్యావాదంతో తూలిన మంచి కీర్తిలా, ఆవృత్తి లేకపోవడంవల్ల మఱపు తగిలి, మిక్కిలి శిథిలమైన విద్యలా,
సన్నామివ మహాకీర్తిం
శ్రద్ధామివ విమానితామ్ ।
పూజామివ పరిక్షీణా
మాశాం ప్రతిహతామివ ॥ 12
సన్నగిలిన పెనుకీర్తిలా,
అవమానం పొందినవానికి అవమానించిన
వానిపట్ల కల అక్కఱలా, పూజాద్రవ్యాలు కొంచెమయిన పూజలా,
దెబ్బతిన్న ఆశలా,
ఆయతీమివ విధ్వస్తా
మాజ్ఞాం ప్రతిహతామివ ।
దీప్తామివ దిశం కాలే
పూజా మపహృతామివ ॥ 13
మిక్కిలి తగ్గిన ఆగామిలాభంలా,
భృత్యులు అనుష్ఠించకున్న ఆజ్ఞలా,
ఉత్పాతకాలంలో జ్వలిస్తున్న
దిక్కులా, అపహరింపబడిన పూజాద్రవ్యాల్లా,
పద్మినీమివ
విధ్వస్తాం హతశూరాం చమూమివ ।
ప్రభామివ తమోధ్వస్తా
ముపక్షీణా మివాపగామ్ ॥ 14
మంచు మొదలైన
వానిచేత సొంపు తూలిన తామరతీఁగలా,
శూరులను కోల్పోయిన సేనలా, చీకటిచే క్రమ్మబడిన వెలుతురులా,
నీళ్లు ఇంచుమించుగా ఎండిపోయిన నదిలా,
వేదీమివ పరామృష్టాం
శాంతా మగ్నిశిఖామివ ।
పౌర్ణమాసీ మివ నిశాం
రాహుగ్రస్తేందుమండలామ్ ॥ 15
అపవిత్రాలైనవి తాఁకిన అగ్నివేదిలా, చల్లాఱిన అగ్నిజ్వాలలా,
రాహుగ్రస్తుడైన చంద్రమండలం కల పున్నమరాత్రిలా,
ఉత్కృష్టపర్ణకమలాం
విత్రాసితవిహంగమామ్ ।
హస్తిహస్తపరామృష్టా
మాకులాం పద్మినీ మివ ॥ 16
ఏనుగులు తొండాలతో, తామరాకుల్ని, తామర పువ్వుల్ని, బెఱుకఁగా, పక్షులు బెదరి, చెదరి, ఆకులపడి
ఉన్న తామరకొలఁకులా,
పతిశోకాతురాం శుష్కాం నదీం విస్రావితామివ ।
పరయా మృజయా హీనాం కృష్ణపక్షనిశా
మివ ॥ 17
గట్లు తెంపి, నీటినంతా, వేఱొక చోటికి పాఱింపగా, ఎండిపోయిన నదిలా,
పతిని పాసిన శోకాన పీడితయై, కృష్ణపక్షరాత్రిపగిది భర్తృదుఃఖాన
మంచి దేహ సంస్కారమేమీ చేసుకోకపోవడంతో, కాంతిహీనయై కనబడుతూ,
సుకుమారీం సుజాతాంగీం
రత్నగర్భగృహోచితామ్ ।
తప్యమానా మివోష్ణేన మృణాళీ మచిరోద్ధృతామ్ ॥ 18
సుకుమారియై సుందరాలైన అవయవాలు
కల్గి, మణిమయాలైన
గర్భగృహాల్లో ఉండ తగినదైనా, వట్టిబయలనేలను కూర్చొండుట
చేసి, కొంతసేపటికిముందే
పెఱుకబడి,
ఎండకు వాడుతున్న తామరతూడులా
కన్పిస్తూ,
గృహీతా మాలితాం
స్తంభే యూథపేన వినాకృతామ్ ।
నిశ్శ్వసంతీం సుదుఃఖార్తాం
గజరాజవధూ మివ ॥ 19
అరణ్యాన వేటకాండ్రు పట్టుకొని స్తంభాన
కట్టివేస్తే, గమికానిని పాసి, నిట్టూర్పులు విడుస్తూ, చాల దుఃఖాన పొక్కుతున్న మేటి ఆడుగజంలా,
ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానా
మయత్నతః ।
నీలయా నీరదాపాయే
వనరాజ్యా మహీ మివ ॥ 20
సంస్కారం లేనందున, కురులన్నీ
ఒక్కటిగా పెనఁచికొని, నిడుదగా ఏర్పడిన, ఒంటిజడ బెడగార,
శరదృతువులో నల్లనివనపంక్తితో, కూడుకొన్న భూమిలా, భాసిల్లుతూ,
ఉపవాసేన శోకేన
ధ్యానేన చ భయేన చ ।
పరిక్షీణాం కృశాం
దీనా మల్పాహారాం తపోధనామ్ ॥ 21
ఉపవాస, శోక, ధ్యాన(చింతన), భయాలతో, ఎంతో క్షీణించి, కృశించి, విన్ననై, పాతివ్రత్యమనే
తపమే ధనంగా కల్గి మితాహారాన్ని
భుజించడం అనే ఉత్తమస్త్రీలక్షణంతో కూడి,
ఆయాచమానాం దుఃఖార్తాం
ప్రాంజలిం దేవతా మివ ।
భావేన రఘుముఖ్యస్య
దశగ్రీవపరాభవమ్ ॥ 22
దుఃఖాన చేతులు పిసుక్కొంటూ, మోడ్చి ఉండటంతో, మనసున రామునిచే రావణునకు పరాభవం కలుగాలని, ఇష్టదేవతను బతిమాలుకొంటున్నట్టు, కనబడుతోంది.
సమీక్షమాణాం రుదతీ
మనిందితాం
సుపక్ష్మతామ్రాయత
శుక్లలోచనామ్ ।
అనువ్రతాం రామ మతీవ మైథిలీం
ప్రలోభయామాస వధాయ
రావణః ॥ 23
ఈవిధంగా, తనకు రక్షకు డెవ్వఁడయినా కనబడతాడా!? అని, నాలుగు ప్రక్కలా
చూస్తూ, ఏడుస్తున్నదై, తొంగలి ఱెప్పలు కల్గి, చివరల
ఎఱ్ఱనై, నడుమ తెల్లగా ఉల్లసిల్లే, వాలుకన్నులు కల్గి, ఏ కందూ పొందక, ఎప్పుడూ రాముని అనుసరించుటే మిక్కిలి వ్రతంగా
కలిగి, వెలుఁగుతున్న, ఆ
మిథిలరాజసుత సీతను, రావణుఁడు, తనచావుకోసం, తనమీద
ఆశపడేలా,
ప్రలోభపెట్టడానికి, పూనుకొన్నాడు.
--------------------------------------------------------------------------------------------------
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః | అశ్వమేధాధికం
పుణ్యం సమ్ప్రాప్నోతి న సంశయః ||24||
ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకోనవింశస్సర్గః (19)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి