12, జూన్ 2020, శుక్రవారం

Sundarakanda సుందరకాండ 25


రామసుందరం
పంచవింశస్సర్గః
తథా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు
రాక్షసీనా మసౌమ్యానాం రురోద జనకాత్మజా ॥ 1
ఆ విధంగా, మృదుత్వం లేని ఆ రాక్షస స్త్రీలు, పరుషంగా, బహుదారుణంగా, పలుమాట లాడుతూంటే, సీత విని, ఎంతో రోదించింది.
ఏవ ముక్తాతు వైదేహీ రాక్షసీభి ర్మనస్వినీ
ఉవాచ పరమత్రస్తా బాష్పగద్గదయా గిరా ॥ 2
మనస్విని సీత, ఆ రాక్షస స్త్రీల బెదిరింపుమాటలను విని, మిక్కిలి భయపడి, బాష్పగద్గదయై, ఇలా అంది.
న మానుషీ రాక్షసస్య భార్యా భవితు మర్హతి
కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః ॥ 3
ఎప్పటికీ మానవస్త్రీ రాక్షసునికి భార్య కాదగదు.  యథేచ్ఛగా మీరందఱూ నన్ను తినేయండి. నేను మీరు చెప్పినట్లు చేయను.
సా రాక్షసీమధ్యగతా సీతా సురసుతోపమా ।
న శర్మ లేఖే దుఃఖార్తా రావణేన చ తర్జితా ॥ 4
ఆవిధంగా, రావణునిచేత, బెదరింపఁబడి, దుఃఖంతో, బాధపడుతూ, రాక్షసస్త్రీల నడుమ ఉన్న, దేవకన్యతో సమానమైన, ఆ సీత,  సుఖాన్ని పొందకుంది.
వేపతే స్మాధికం సీతా విశంతీ వాంగ మాత్మనః
వనే యూథపరిభ్రష్టా మృగీ కోకైరివార్దితా 5
అడవిలో, తన గుంపు తప్పి, తోడేళ్లచేత, బాధింపబడే లేడిలా, సీత, తన శరీరాన్ని, దగ్గరకు ముడుచుకొంటూ, వణకుతోంది.
సా త్వశోకస్య విపులాం శాఖా మాలంబ్య పుష్పితాం ।
చింతయామాస శోకేన భర్తారం భగ్నమానసా 6
భగ్నమానస, ఆ సీత, చక్కగా పుష్పించిన, అశోకవృక్షపు ఒక పెద్దకొమ్మను పట్టుకొని, దుఖంతో, పెనిమిటిగుఱించి, ఆలోచించసాగింది.
సా స్నాపయంతీ విపులౌ స్తనౌ నేత్రజలస్రవైః ।
చింతయంతీ న శోకస్య త దాంత మధిగచ్చతి 7
తన విపులవక్షస్థలాన్ని, కన్నీటితో, తడిపేస్తూ, రామునే చింతిస్తూ, ఏడుస్తున్న, ఆమె, దుఖానికి, అంతమే లేకపోయింది.
సా వేపమానా పతితా ప్రవాతే కదళీ యథా ।
రాక్షసీనాం భయత్రస్తా వివర్ణవదనాఽభవత్‌ ॥ 8
పెద్దగాలికి అరటిచెట్టులా, ఆమె, కపించిపోతూ, క్రిందపడి, రాక్షసస్త్రీల భయంతో, వివర్ణవదన,(తెల్లబాఱినముఖం కల్గినది) అయ్యింది.
తస్యా స్సా దీర్ఘవిపులా వేపంత్యా సీతయా తదా ।
దదృశే కంపినీ వేణీ వ్యాళీవ పరిసర్పతీ ॥ 9
వణకుతున్న, ఆ సీతయొక్క పొడవైన, విపులమైన జడ కదులుతూ ఉండటంతో, విలవిల చలిస్తున్న, సర్పంలా కనిపిస్తోంది.
సా నిశ్శ్వసంతీ దుఃఖార్తా శోకోపహతచేతనా ।
ఆర్తా వ్యసృజ దశ్రూణి మైథిలీ విలలాప హ ॥ 10
ఆ సీత, ఇలా దుఃఖంతో, బుద్ధి కలతపడగా, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ, ఏడ్చింది.
హా రామేతి చ దుఃఖార్తా హా పున ర్లక్ష్మణేతి చ
హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ ॥ 11
సీత, ఇలా దుఃఖార్తయై, “హా రామా!” అని, హా లక్ష్మణా! అని, హా నా అత్తా కౌసల్యా! హా సుమిత్రా అని విలపించింది.
లోకప్రవాద స్సత్యోఽయం పండితై స్సముదాహృతః ।
అకాలే దుర్లభో మృత్యు స్స్త్రియా వా పురుషస్య వా ॥ 12
య త్రాహ మేవం క్రూరాభీ రాక్షసీభి రి హార్దితా ।
జీవామి హీనా రామేణ ముహూర్త మపి దుఃఖితా ॥ 13
నేను, ఇక్కడ, ఇలా, క్రూర రాక్షసస్త్రీలచే, పీడింపబడుతూ, రాముడు లేకుండా, దుఃఖితనై, ప్రాణాలు విడువలేక, ముహూర్తమైనా జీవిస్తున్నాను. కాబట్టి,  స్త్రీకైనా, పురుషునకైనా, (తామే కోరినా సరే) అకాలంలో (మరణకాలం కానప్పుడు/ఈశ్వరేచ్ఛ లేనప్పుడు) మృత్యువు దుర్లభం అని పండితులు చెప్పే మాట సత్యం.
ఏషాఽల్పపుణ్యా కృపణా వినశిష్యా మ్యనాథవత్‌ ।
సముద్రమధ్యే నౌః పూర్ణా వాయువేగై రివాహతా ॥ 14
సముద్రమధ్యంలో, వాయువేగంచేత, నిండు నౌక, కొట్టబడి, కూలినట్లు, అల్పపుణ్యను, దీనురాలను అయిన నేను, అనాథలా నశిస్తాను. 
భర్తారం త మపశ్యంతీ రాక్షసీవశ మాగతా ।
సీదామి ఖలు శోకేన కూలం తోయహతం యథా ॥ 15
నా భర్తను, చూడలేని నేను, ఈ రాక్షసస్త్రీలకు చిక్కి, జలంచే కూల్చబడిన గట్టులా, శోకంతో నశించిపోతాను కదా!.
తం పద్మదళపత్రాక్షం సింహవిక్రాంతగామినమ్‌
ధన్యాః పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినమ్‌ 16
తామరపూరేకుల్లాంటి కన్నులు, సింహపునడక, కల్గినవాడు, కృతజ్ఞుడు, ప్రియం పలికేవాడు అయిన, నా నాథుని, పుణ్యాత్ములు చూస్తారు. 
సర్వథా తేన హీనాయా రామేణ విదితాత్మనా ।
తీక్ష్ణం విష మివాస్వాద్య దుర్లభం మమ జీవితమ్‌ ॥ 17
విదితాత్ముడైన రాముని, పాసిన, నాకు, తీక్ష్ణమైన విషం ఆస్వాదించినట్లు, అన్నివిధాలుగానూ, జీవితం ఇక దుర్లభం.   
కీదృశం తు మయా పాపం పురా జన్మాంతరే కృతమ్‌ ।
యేనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణమ్‌ ॥ 18
నాకు, ఇప్పుడు, ఘోరం, దారుణం అయిన దుఃఖం కల్గింది. కాబట్టి, పూర్వజన్మలో, ఎంత దారుణమైన పాపం చేశానో కదా!
జీవితం త్యక్తు మిచ్ఛామి శోకేన మహతా వృతా
రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాద్యతే మయా ॥ 19
రాక్షసస్త్రీలు కావలి ఉన్నారు. కాబట్టి, రాముని పొందలేను. అందువల్ల, ఇట్టి మహాదుఃఖాన్ని అనుభవిస్తున్న నేను, ఇక జీవించను.
ధిగస్తు ఖలు మానుష్యం ధి గస్తు పరవశ్యతాం
న శక్యం య త్పరిత్యక్తు మాత్మచ్ఛందేన జీవితమ్‌ ॥ 20
చ్ఛామరణానికి వీలు లేని, మానవజన్మ, పరాధీన జీవితం, రెండూ నింద్యాతినింద్యమైనవి.
------------------------------------------------------------------------------
మాతా రామో మత్పితా రామచన్ద్రః, స్వామీ రామో మత్సఖా రామచన్ద్రః |
సర్వస్వం మే రామచన్ద్రో దయాళుః, నాన్యం జానే నైవ జానే న జానే ||30||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచవింశస్సర్గః (25)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి