17, జూన్ 2020, బుధవారం

Sundarakanda సుందరకాండ 30


రామసుందరం
 త్రింశస్సర్గః
హనుమా నపి విక్రాంత స్సర్వం శుశ్రావ తత్త్వతః
సీతాయా స్త్రిజటాయాశ్చ రాక్షసీనాం తర్జనమ్ 1
పరాక్రమవంతుడు హనుమంతుడు, సీతావృత్తాంతం, త్రిజటాస్వప్నవృత్తాంతం, రాక్షసస్త్రీల బెదరింపు, అంతా, (చూస్తూ) విన్నాడు.
అవేక్షమాణ స్తాం దేవీం దేవతామివ నందనే
తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః 2
తరువాత, నందనవదేవతలా ఉన్న, సీతను, చూస్తూ, పెక్కువిధాలుగా, చింతించాడు.
యాం కపీనాం సహస్రాణి సుబహూ న్యయుతాని
దిక్షు సర్వాసు మార్గంతే సేయ మాసాదితా మయా 3
ఎంతోమంది వానరులు వేలు, పదివేలుగా, సమస్తదిక్కుల్లోనూ, ఎవర్ని, వెదకుతున్నారో, సీతమ్మ దర్శనం నాకు ప్రాప్తించింది.
చారేణ తు సుయుక్తేన శత్రో శ్శక్తి మవేక్షతా
గూఢేన చరతా తావ దవేక్షిత మిదం మయా 4
నేను, మిక్కిలి ఎచ్చరిక కల్గి, చక్కని యుక్తితో, శత్రువుల శక్తిని గ్రహించే, చారునిగా నియమింపబడి, రహస్యంగా తిరిగి, ఇదంతా తెల్సుకొన్నాను.
రాక్షసానాం విశేషశ్చ పురీ చేయ మవేక్షితా
రాక్షసాధిపతే రస్య ప్రభావో రావణస్య 5
రాక్షసులవిశేషాల్ని, లంకానగరవివరాల్ని, రావణుని ప్రభావాన్ని చూశాను.
యుక్తం తస్యాప్రమేయస్య సర్వసత్త్వదయావతః
సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణీమ్ 6
అప్రమేయుడు, సమస్తప్రాణులందు దయకలవాడైన రామునికి పత్నియైనది, పతిదర్శనానికై తహతహలాడుతున్నదైన ఈ సీతకు, రాముక్షేమం తెల్పి, కొంత ఊఱట కల్గించడం, యుక్తం.
అహ మాశ్వాసయా మ్యేనాం పూర్ణచంద్రనిభాననామ్
అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖ స్యాంత మగచ్ఛతీమ్ 7
ఇంతకుముందు దుఃఖం అనుభవించనందున, ఇప్పటి దుఃఖానికి ఓర్వలేక, దుఃఖానికి అంతం కనలేక, పరితపిస్తున్న, ఈ పూర్ణచంద్రనిభానన, సీతను, ఓదారుస్తాను.
యద్య ప్యహ మిమాం దేవీం శోకోపహతచేతనామ్
అనాశ్వాస్య గమిష్యామి దోషవ ద్గమనం భవేత్ 8
దుఃఖంతో, మనసు కలగి, క్రుంగిపోయి ఉన్న, సీతను, ఓదార్చకుండా, నేను, రాముని ఒద్దకు వెళ్తే, దోషం సంభవిస్తుంది.
గతే హి మయి తత్రేయం రాజపుత్త్రీ యశస్వినీ
పరిత్రాణ మవిందంతీ జానకీ జీవితం త్యజేత్ 9
నేనలా ఊఱడించకుండానే వెళ్లిపోతే, యశస్విని, రాజపుత్త్రి, జానకి, తన్ను కాపాడేవా రెవ్వరూలే రనుకొని, ప్రాణాలు విడుస్తుంది.
మయా మహాబాహుః పూర్ణచంద్రనిభాననః
సమాశ్వాసయితుం న్యాయ్య స్సీతాదర్శనలాలసః 10
మహాబాహుడు, పూర్ణచంద్రనిభాననుడు, సీతను చూడ్డానికై పిస్తున్నవాడైన రామునికి కూడా, సీత క్షేమవార్తను చెప్పి, ఓదార్చడం న్యాయం.
నిశాచరీణాం ప్రత్యక్ష మనర్హం చాపి భాషణమ్
కథం ను ఖలు కర్తవ్య మిదం కృచ్ఛ్రగతో హ్యహమ్ 11
రాక్షసస్త్రీల ఎదుట, సీతతో మాట్లాడ్డం సరి కాదు. వారికి తెలియకుండా ఎలా మాట్లాడాలి? నేనిప్పుడు చిక్కులో డ్డాను కదా!
అనేన రాత్రిశేషేణ యది నాశ్వాస్యతే మయా
సర్వథా నాస్తి సందేహః పరిత్యక్ష్యతి జీవితమ్ 12
సూర్యోదయంలోపు, నేను, ఓదార్చకపోతే, సీత, ప్రాణాలు విడుస్తుంది. దీనికి ఎంతమాత్రం సందేహం లేదు.
రామశ్చ యది పృచ్ఛే న్మాం కిం మాం సీతాబ్రవీ ద్వచః
కి మహం తం ప్రతి బ్రూయా మసంభాష్య సుమధ్యమామ్‌! 13
సుమధ్యమ, సీతతో మాట్లాడకుండా రాముని ఒద్దకు పోతే, అతడు, సీత నాగుఱించి ఏమంది?’, అని అడిగితే, నేను, ఏమని బదులు చెప్తాను?
సీతాసందేశరహితం మా మిత స్త్వరయాగతమ్
నిర్దహేదపి కాకుత్స్థః క్రుద్ధ స్తీవ్రే చక్షుషా 14
సీతాసందేశం లేకుండా, తొందరపడి వెళ్తే, రాముడు, క్రుద్ధుడై, చుఱుకుచూపుల్తో, నన్ను, దహించినా దహిస్తాడు.
యది చోద్యోజయిష్యామి భర్తారం రామకారణాత్
వ్యర్థ మాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి 15
నేను, (ఈమెతో మాట్లాడకుండానే పోయి) రామకార్యంకోసం, సుగ్రీవుని, ఉత్సాహపఱచి సైన్యసమేతంగా ఇక్కడకు తీసుకువచ్చినా, సీత ప్రాణాలతో లేకపోతే, సుగ్రీవునిరాక వ్యర్థమే అవుతుంది.
అంతరం త్వహ మాసాద్య రాక్షసీనా మిహ స్థితః
శనై రాశ్వాసయిష్యామి సంతాపబహుళా మిమామ్ 16
నేను, క్కడే ఉండి, రాక్షసాంగనలు ఆవలికి పోయి, అవకాశం దొరకగానే, దుఃఖంతో తపిస్తున్న ఈమెను, మెల్లగా, ఓదారుస్తాను.
అహం త్వతితనుశ్చై వానరశ్చ విశేషతః
వాచం చోదాహరిష్యామి మానుషీ మిహ సంస్కృతామ్17
నాది, మిక్కిలి సూక్ష్మదేహం. విశేషించి, వానరరూపం. కాబట్టి నన్ను కనుక్కోలేరు. అందుకనుకూలంగా మానవులు మాట్లాడే సంస్కృతభాషలో మాట్లాడతాను.
యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్
రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి 18
కాని నేను బ్రాహ్మణునిలా, సంస్కృతంలో, మాట్లాడితే, సీత, నన్ను, (సంస్కృతం మాట్లాడ్డంవల్ల) రావణునిగా, ఎంచి, భయపడవచ్చు.
వానరస్య విశేషేణ కథం స్యా దభిభాషణమ్
అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్య మర్థవత్
మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయ మనిందితా 19
ఒక కోతి, ఈ విధంగా, సంస్కృతంలో మాట్లాడ్డం, ఎలా సాధ్యం? (అని, ఈమె, సందేహించవచ్చు) కాబట్టి, తప్పనిసరిగా, చక్కగా అర్థమయ్యే, సాధారణమైన మానవభాషలోనే, (కోసలప్రాంతపు వ్యవహారభాష) మాట్లాడాలి. ఇలా కాకుండా, ఈ అనిందితను, మఱేవిధంగానూ, ఓదార్చడం, సాధ్యం కాదు.
సేయ మాలోక్య మే రూపం జానకీ భాషితం తథా
రక్షోభి స్త్రాసితా పూర్వం భూయ స్త్రాసం గమిష్యతి 20
నా వానరరూపాన్ని, మానవభాష మాట్లాడ్డాన్ని చూసి, పూర్వమే, రాక్షసులకు, భయపడ్డ సీత, తిరిగి ఇంకా  భయపడుతుంది.
తతో జాతపరిత్రాసా శబ్దం కుర్యా న్మనస్వినీ
జానమానా విశాలాక్షీ రావణం కామరూపిణమ్ 21
నన్ను చూసిన వెంటనే, కామరూపుడైన రావణుడనుకొని, మహాయంతో, మనస్విని, విశాలాక్షి సీత, అఱస్తుంది.
సీతయా కృతే శబ్దే సహసా రాక్షసీగణః
నానాప్రహరణో ఘోర స్సమేయా దంతకోపమః 22
సీత గట్టిగా అఱవగానే, వెంటనే, మృత్యువులాంటి, భీకరరాక్షసస్త్రీలందఱూ, వివిధాయుధాలు ధరించి, నామీదకు వస్తారు.
తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః
వధే గ్రహణే చైవ కుర్యు ర్యత్నం యథాబలమ్ 23
అప్పుడు రాక్షసస్త్రీలు, నన్ను అన్నివైపులనుండి, చుట్టుముట్టి, వారి చేతనైనంతవఱకు, చంపడానికి కానీ, బంధించడానికి కానీ, ప్రయత్నిస్తారు.
గృహ్య శాఖాః ప్రశాఖాశ్చ స్కంధాం శ్చోత్తమశాఖినామ్
దృష్ట్వా విపరిధావంతం భవేయు ర్భయశంకితాః 24
పెద్దచెట్లకొమ్మల్ని, చిన్నకొమ్మల్ని, బోదెల్ని, పట్టుకొని, టూ ఇటూ పరుగెత్తుతున్న, నన్ను, చూసి, రాక్షసస్త్రీలు భయసందేహాలకు లోనవుతారు.
మమ రూపం సంప్రేక్ష్య వనే విచరతో మహత్
రాక్షస్యో భయవిత్రస్తా భవేయు ర్వికృతాననాః 25
ఆ అశోకవనంలో తిరుగాడుతున్న, నా మహారూపాన్ని చూసి, వికారముఖాలున్న రాక్షసస్త్రీలు, భయపడతారు.
తతః కుర్యు స్సమాహ్వానం రాక్షస్యో రక్షసా మపి
రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసేంద్రనివేశనే 26
పిదప, రాక్షసస్ర్రీలు, రావణుని ఇంట, రావణునిచే నియోగించబడి, కాపలా ఉన్న రాక్షసులను, పిలుస్తారు.
తే శూలశక్తినిస్త్రింశవివిధాయుధపాణయః
ఆపతేయు ర్విమర్దేస్మి న్వేగే నోద్విగ్నకారిణః 27
రాక్షసులు, శూలాలు, చిల్లకోలలు, కత్తులు మొదలైన నానావిధాయుధాల్ని చేతుల్తో పట్టుకొని, భయోద్వేగకారులై, వేగంగా, యుద్ధానికి వస్తారు.
సంరుద్ధ స్తైస్తు పరితో విధమన్రక్షసాం బలమ్
శక్నుయాం నతు సంప్రాప్తుం పరం పారం మహోదధేః 28
రాక్షసులు నన్ను నలువైపులా చుట్టుముట్టి, అడ్డగిస్తే, వారి బలాల్ని ప్రహరిస్తాను కానీ, (అలసి) మహాసముద్రాన్ని దాటి అవ్వలిగట్టుకు చేరలేను.
మాంవా గృహ్ణీయు రాప్లుత్య బహవ శ్శీఘ్రకారిణః
స్యా దియం చాగృహీతార్థా మమ గ్రహణం భవేత్ 29
చుఱుకైన ఎంతోమంది రాక్షసులు, నాపైకి ఎగిరి, నన్ను, పట్టుకొన్నా పట్టుకొంటారు. అలా జరిగితే సీతకు  రామవృత్తాంతం తెలియదు. నేను కూడా రాక్షసుల చేతిలో చిక్కుతాను.
హింసాభిరుచయో హింస్యు రిమాం వా జనకాత్మజామ్
విపన్నం స్యాత్తతః కార్యం రామసుగ్రీవయో రిదమ్ 30
హింసాప్రియులైన, రాక్షసులు, జానకిని, చంపినా చంపవచ్చు. అలా జరిగితే, రామసుగ్రీవకార్యం, చెడిపోతుంది.
ఉద్దేశే నష్టమార్గేస్మిన్రాక్షసైః పరివారితే
సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకీ 31
ఎవరికీ మార్గం తెలియనిదై, రాక్షసుల రక్షణ కలదై, సముద్రంచే చుట్టబడినదై, రహస్యమైనదై ఉన్న ఈ ప్రదేశంలో, సీత, ఉంది.
విశస్తే వా గృహీతే వా రక్షోభి ర్మయి సంయుగే
నాన్యం పశ్యామి రామస్య సాహాయ్యం కార్యసాధనే 32
యుద్ధంలో, రాక్షసులచే, నేను, కూలినా, పట్టుబడినా, కార్యసాధనలో రామునికి, సాయడగలవాడు, మఱి ఎవడూ, నాకు కనిపించటం లేదు.
విమృశంశ్చ పశ్యామి యో హతే మయి వానరః
శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిమ్ 33
యుద్ధంలో నేను కూలిపోయాక, నూఱు యోజనాల మహాసముద్రాన్ని, దాటగల వానరు డెవడున్నాడో, ఎంత ఆలోచించినా, కానలేకున్నాను.
కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసామ్
తు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదధేః 34
ఎన్నివేలమంది రాక్షసులనైనా, లెక్కచేయకుండా చంపగలను. కానీ, అలా యుద్ధంలో అలసిపోయాక ఈ మహాసముద్రాన్ని దాటి ఆవలిగట్టుకు చేరలేను.
అసత్యాని యుద్ధాని సంశయో మే రోచతే
కశ్చ నిస్సంశయం కార్యం కుర్యా త్ప్రాజ్ఞ స్ససంశయమ్ 35
యుద్ధంలో, జయాపజయాలు నిశ్చయం లేనివి. సందిగ్ధమైన పనిని చేయడం నాకు ఇష్టం కాదు. ప్రాజ్ఞుడైనవాడు, సందిగ్ధకార్యాన్ని నిస్సంశయంగా చేయడు.
ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే
ఏష దోషో మహాన్హి స్యాన్మమ సీతాభిభాషణే 36
మాట్లాడకపోతే, తనకు ఎవ్వరూ దిక్కులేదనుకొని సీత ప్రాణాలు విడుస్తుంది. మాట్లాడితే, ఇపుడు చెప్పినట్లు నాకు మహాదోషం సంభవిస్తుంది.
భూతా శ్చార్థా వినశ్యంతి దేశకాలవిరోధితాః
విక్లబం దూత మాసాద్య తమ స్సూర్యోదయే యథా 37
దూత వివేకం లేనివాడైతే, ఫలించటానికి సిధ్ధంగా ఉన్న కార్యాలు కూడా, వానిచేత, దేశకాలాలకు ప్రతికూలంగా చేయబడి, సూర్యోదయంలో చీకటి నశించినట్లు నశిస్తాయి.
అర్థానర్థాంతరే బుద్ధి ర్నిశ్చితాపి శోభతే
ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః 38
కార్యాకార్యవిషయంలో చక్కని బుద్ధితో ఆలోచించి, నిశ్చయించిన కార్యాన్ని, తామే పండితులమనుకొని అహంకరించే, దూతలకు అప్పగిస్తే, చెడగొడతారు.
వినశ్యే త్కథం కార్యం వైక్లబ్యం కథం భవేత్
లంఘనం సముద్రస్య కథం ను వృథా భవేత్ 39
ఎలా చేస్తే, రామకార్యం చెడకుండాను, వైక్లబ్యానికి తావులేకుండాను, సముద్రలంఘనం వ్యర్థం కాకుండాను ఉంటుంది?
కథం ను ఖలు వాక్యం మే శృణుయా న్నోద్విజేత వా
ఇతి సంచింత్య హనుమాం శ్చకార మతిమా న్మతిమ్ 40
ఎలా చెప్తే, సీత నా మాటల్ని భయపడకుండా వింటుంది?’ మతిమంతుడైన హనుమంతుడు, ఎలా చేస్తే బాగుంటుందా అని చక్కగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చాడు.
రామ క్లిష్టకర్మాణం స్వబంధు మనుకీర్తయన్
నైనా ముద్వేజయిష్యామి ద్బంధుగతమానసామ్ 41
ఎలాంటి కార్యాల్నైనా అవలీలగా చేయగలవాడు, సీతకు బందువు అయిన, రాముని, కీర్తిస్తాను. అపుడు సీత మనసు రామునియందే లగ్నమై ఉంటుంది కాబట్టి ఈమెకు, యం కల్గదు.
ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః
శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్ 42
శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్గిరమ్
శ్రద్ధాస్యతి యథా హీయం తథా సర్వం సమాదధే 43
ఇక్ష్వాకుశ్రేష్ఠుడు, విదితాత్ముడు, రాముడు చెప్పమన్న ధర్మయుక్తశుభవచనాల్ని మెల్లగా ఈమెకు నివేదిస్తూ, తీపారుపలుకుల్తో రాముని మాటలన్నింటినీ వినిపిస్తాను. ఎలా చెప్తే మె, నా మాటల్ని నమ్ముతుందో ఆ ప్రకారం చెప్తాను. ఇలా ఆలోచించి,
ఇతి బహువిధం మహానుభావో
జగతిపతేః ప్రమదా మవేక్షమాణః
మధుర మవితథం జగాద వాక్యం
ద్రుమవిటపాంతర మాస్థితో హనూమాన్ 44
మహానుభావుడైన, హనుమ, జగత్పతి రాముని పత్నిని, చూస్తూ, చెట్టుకొమ్మలచాటున  కూర్చొని, పొల్లులేని, బహువిధమధురవచనాల్ని, ఇలా పలికాడు.
------------------------------------------------------------------------------------------  


ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||35||

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రింశస్సర్గః (30)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...