రామసుందరం
షడ్వింశస్సర్గః
ప్రసక్తాశ్రుముఖీ
త్యేవం బ్రువంతీ జనకాత్మజా ।
అధోముఖముఖీ
బాలా విలప్తు ముపచక్రమే ॥ 1
జనకరాజకుమారి సీత, తలవాల్చి, మొహంనిండా కన్నీళ్లు కాఱుతూండగా, ఇలా చెప్తూ, విలపించడం ప్రారంభించింది.
ఉన్మత్తేవ
ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతీ ।
ఉపావృత్తా
కిశోరీవ వివేష్టంతీ మహీతలే ॥ 2
పిచ్చిపట్టినదానిలా, మత్తు, భ్రాంతి పొందినదానిలా, బడలిక తీఱటానికి పోర్లే, ఆడుగుఱ్ఱపుపిల్లలా, నేలపై పొర్లుతూ, ఏడుస్తోంది.
రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణా ।
రావణేన ప్రమథ్యాహ
మానీతా క్రోశతీ బలాత్ ॥ 3
“రాముడు ఏమఱి ఉన్నప్పుడు, రావణుడు, బిట్టుగా అఱస్తున్న నన్ను, బలవంతంగా, పట్టి, తెచ్చాడు.
రాక్షసీవశ
మాపన్నా భర్త్స్యమానా సుదారుణమ్ ।
చింతయంతీ
సుదుఃఖార్తా నాహం జీవితు ముత్సహే ॥ 4
రాక్షసస్త్రీలకు చిక్కి, చాల
భయంకరమైన బెదిరింపులకు లోనై, రామదర్శనం లేదని, చింతిస్తూ, మహాదుఃఖంతో, పీడింపబడుతూ, ఇలా బ్రతికుండలేను.
నహి మే
జీవితే నార్థో నై వార్థైర్న చ భూషణైః ।
వసంత్యా
రాక్షసీమధ్యే వినా రామం మహారథమ్ ॥ 5
మహారథుడు రాముని,
పాసి, రాక్షసస్తీల మధ్య,
వసిస్తున్న నాకు, జీవించి, ప్రయోజనం ఏమిటి? సంపదలతో కానీ, సొమ్ములతో కానీ, పని ఏమిటి?
అశ్మసార
మిదం నూన మథ వా ప్యజరామరమ్ ।
హృదయం మమ యే
నేదం న దుఃఖే నావశీర్యతే ॥
6
ఈ నా గుండె,
నిజంగా, ఱాయైనా, అయ్యుండాలి. లేదా, జరామరణాలు లేనిదైనా, అయ్యుండాలి. ఎందుకంటే, ఇంతటి దుఃఖానికి కూడా, ఇది,
ముక్కలు కాకుండా, ఉంది.
ధిఙ్మా
మనార్యా మసతీం యాఽహం తేన వినా కృతా ।
ముహూర్తమపి
రక్షామి జీవితం పాపజీవితా ॥ 7
రాముని విడచి, ఇలా, పాపపు బ్రతుకు బ్రతుకుతూ, కొంచెం సేపయినా, ప్రాణాలు కాపాడుకొంటున్న, నేనెంతో, దుష్టురాలను, అసతిని. ధిక్ నాబ్రతుకు!.
కాచమే
జీవితే శ్రద్ధా సుఖే వా తం ప్రియం వినా ।
భర్తారం
సాగరాంతాయా వసుధాయాః ప్రియంవదమ్ ॥ 8
నాలుగుసముద్రాలవఱకూ ఉన్న
భూమండలానికంతా ప్రభువు, ప్రియంవదుడైన, నా ప్రియుడు,
రాముడు, లేకుండా, నాకు ప్రాణం మీద కానీ, సుఖంపై కానీ, ఆసక్తి ఎందుకు?
భిద్యతాం
భక్ష్యతాం వాపి శరీరం విసృజా మ్యహమ్ ।
న చా ప్యహం
చిరం దుఃఖం సహేయం ప్రియవర్జితా ॥ 9
రాక్షసస్త్రీలారా! నేను శరీరాన్ని
విడుస్తున్నాను. దీన్ని బ్రద్దలు చేసుకోండి. తిన్నా తినండి. నేను ప్రియరాముని
విడచి, బహుకాలం, ఈ దుఃఖాన్ని,
ఓర్వలేను.
చరణేనాపి
సవ్యేన న స్పృశేయం నిశాచరమ్ ।
రావణం కిం
పున రహం కామయేయం విగర్హితమ్ ॥ 10
నేను రావణుని, ఎడమకాలితోనైనా
ముట్టను, ఇక వానిని, అతినింద్యంగా, కోరడం ఏమిటి?
ప్రత్యాఖ్యాతం
న జానాతి నాత్మానం నాత్మనః కులమ్ ।
యో
నృశంసస్వభావేన మాం ప్రార్థయితు మిచ్ఛతి ॥ 11
వీడు, క్రూరస్వభావుడై, నన్ను, కోరుతున్నాడు. వీడు,
నా తిరస్కారాన్నే కాక, తాను, తన వంశం (నశిస్తాయని
కూడా) తెల్సుకోలేకుండా ఉన్నాడు.
ఛిన్నా
భిన్నా విభక్తా వా దీప్తే వాగ్నౌ ప్రదీపితా ।
రావణం నోపతిష్ఠేయం
కిం ప్రలాపేన వ శ్చిరమ్ ॥
12
మీరు నన్ను ఛేదించండి. పగులకొట్టండి. ముక్కలుగా
పంచుకోండి. నిప్పులో వేసి కాల్చండి. ఏమైనా చేయండి. నేనుమాత్రం,
రావణుని, లెక్కచేయను. మీరెంతసేపు అఱచినా, ప్రయోజనం లేదు.
ఖ్యాతః
ప్రాజ్ఞః కృతజ్ఞ శ్చ సానుక్రోశశ్చ రాఘవః ।
సద్వృత్తో
నిరనుక్రోశ శ్శంకే మద్భాగ్యసంక్షయాత్ ॥ 13
శత్రువులచేతకూడా,
పొగడబడే, ఖ్యాతుడు, దోషుల్లో కూడా,
గుణాలు గ్రహించే, ప్రాజ్ఞుడు, ఇతరులు, తనకు చేసిన, కొంచెం
ఉపకారాన్నే, కొండంతగా భావించే,
కృతజ్ఞుడు, పరుల కష్టం చూసి, జాలితో
దుఃఖించే, సానుక్రోశుడు, సదాచారుడు
అయిన రాఘవుడు, నా దౌర్భాగ్యంవల్ల, దయమాలి
ఉన్నాడు, అని శంకిస్తున్నాను.
రాక్షసానాం
సహస్రాణి జనస్థానే చతుర్దశ ।
యే నైకేన
నిరస్తాని స మాం కిం నాభిపద్యతే ॥ 14
తానొక్కడే,
జనస్థానంలో, పదునాలుగువేలమంది రాక్షసుల్ని, సంహరించిన, వీరరాముడు, ఎందుకు, నన్ను, రక్షించటంలేదు?
నిరుద్ధా
రావణే నాహ మల్పవీర్యేణ రక్షసా ।
సమర్థః ఖలు
మే భర్తా రావణం హంతు మాహవే ॥ 15
నన్ను, నిర్బంధించిన రావణుడు, అల్పవీర్యం కలవాడు. యుద్ధంలో, ఇలాంటి రావణుని, చంపడానికి, నాభర్త, సమర్థుడు
కదా!.
విరాధో
దండకారణ్యే యేన రాక్షసపుంగవః ।
రణే రామేణ
నిహత స్సమాంకిం నాభిపద్యతే ॥ 16
దండకారణ్యంలో,
రాక్షసపుంగవుడు విరాధునంతటివాణ్ణి, యుద్ధంలో, వధించినట్టి రాముడు, నన్నేల రక్షించడు?
కామం మధ్యే
సముద్రస్య లంకేయం దుష్ప్రధర్షణా ।
న తు
రాఘవబాణానాం గతిరోధీహ విద్యతే ॥ 17
సముద్రమధ్యంలో ఉన్న, ఈ
లంక, ఎదిరించలేనిదనుట వాస్తవమే. అయినా, రామబాణాలను అడ్డగించేదేదీ, ఇక్కడ లేదు.
కిన్ను
తత్కారణం యేన రామో దృఢపరాక్రమః ।
రక్షసాపహృతాం
భార్యా మిష్టాం నాభ్యవపద్యతే ॥ 18
ఒక రాక్షసుడు అపహరించిన, తన
గారాబుఇల్లాలిని, చండపరాక్రమశాలి రాముడు, రక్షించని కారణమేంటో?
ఇహస్థాం మాం
న జానీతే శంకే లక్ష్మణపూర్వజః ।
జానన్నపి హి
తేజస్వీ ధర్షణం మర్షయిష్యతి ॥ 19
లక్ష్మణాగ్రజుడు రాముడు, నే
నిక్కడ ఉన్నానని, ఇంతవఱకు ఎఱుగకున్నాడని తోస్తోంది.
తెలిసుంటే, ఆ మహాతేజస్వి, ఈ తిరస్కారాన్ని, ఎంతమాత్రం సహించడు.
హృతేతి యోఽధిగత్వా
మాం రాఘవాయ నివేదయేత్ ।
గృధ్రరాజోఽపి
స రణే రావణేన నిపాతితః ॥
20
అపహరింపబడిన నాసంగతిని,
రామునికి చెప్పగల, జటాయువు కూడా, యుధ్ధంలో, రావణునివల్ల, హతుడయ్యాడు.
కృతం కర్మ
మహత్తేన మాం తథాఽభ్యవపద్యతా ।
తిష్టతా రావణద్వంద్వే
వృద్ధేనాపి జటాయుషా ॥
21
ఆ జటాయువు,
ముసలివాడైనా, రావణునికి, ఎదురు నిలిచి, ద్వంద్వయుద్ధం చేసి, చేతనైనంతవఱకు, నన్ను కాపాడుతూ, మహాకార్యం చేశాడు.
యది మామిహ
జానీయా ద్వర్తమానాం స రాఘవః ।
అద్య బాణై
రభిక్రుద్ధః కుర్యాల్లోక మరాక్షసమ్ ॥ 22
నేనిక్కడ ఉన్నానని,
రాముడు, తెలిసికొంటే కనుక, ఇప్పుడే, అభిక్రుద్ధుడై, బాణాల్ని ప్రయోగించి, లోకంలో, ఒక్క రాక్షసుడు కూడా లేకుండా, చేసేస్తాడు.
విధమే చ్చ
పురీం లంకాం శోషయేచ్చ మహోదధిమ్ ।
రావణస్య చ
నీచస్య కీర్తిం నామ చ నాశయేత్ ॥ 23
లంకనంతా ఊదివేస్తాడు. సముద్రాన్నంతా ఎండించివేస్తాడు.
నీచుడైన రావణుని, పేరును, కీర్తిని నాశనం చేస్తాడు.
తతో
నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే ।
యథాహ మేవం
రుదతీ తథా భూయో న సంశయః ॥
24
ఆ తర్వాత,
నేను, ఎలా ఏడుస్తున్నానో, అలా, ఇంటింటా, తమ భర్తలను కోల్పోయిన, రాక్షసస్త్రీలందఱూ, ఇంతకంటే ఎక్కువగా, ఏడుస్తారు. ఇందుకు, సందేహం లేదు.
అన్విష్య
రక్షసాం లంకాం కుర్యా ద్రామ స్సలక్ష్మణః ।
న హి
తాభ్యాం రిపు ర్దృష్టో ముహూర్త మపి జీవతి ॥ 25
రామలక్ష్మణులు, ఈ
లంకనంతా వెదకి, రాక్షసులందఱ్నీ చంపుతారు. వారి చూపు పడితే, పగవాడు, క్షణమైనా బ్రతకలేడు.
చితాధూమాకులపథా
గృధ్రమండలసంకులా ।
అచిరేణ తు
లంకేయం శ్మశానసదృశీ భవేత్ ॥ 26
శీఘ్రంగానే, ఈ
లంకామార్గాలన్నీ, పీనుగుపొగలు క్రమ్మగా, గ్రద్దలగుంపులతో నిండి, శ్మశానంలాంటిది, అవుతుంది.
అచిరే ణైవ
కాలేన ప్రాప్స్యా మ్యేవ మనోరథమ్ ।
దుష్ప్రస్థానోఽయ
మాఖ్యాతి సర్వేషాం వో విపర్యయమ్ ॥ 27
శీఘ్రంగానే, నా
కోర్కె, నెఱవేఱగలదు. మీ దుర్మార్గ ప్రవర్తనే, మీకందఱికీ వాటిల్లే కీడును, తెల్పుతోంది.
యాదృశా నీహ
దృశ్యంతే లంకాయా మశుభాని వై ।
అచిరేణ తు
కాలేన భవిష్యతి హతప్రభా ॥
28
లంక, స్వల్పకాలంలోనే, ప్రభ, చెడి, నశించగలదు, అనే అశుభసూచకాలు, ఇక్కడ,
కనిపిస్తున్నాయి.
నూనం లంకా
హతే పాపే రావణే రాక్షసాధమే ।
శోషం
యాస్యతి దుర్ధర్షా ప్రమదా విధవా యథా ॥ 29
ఎవ్వరూ, ఎదిరించలేని లంక,
పాపి రాక్షసాధముడు రావణుడు పోగానే, పెనిమిటి
పోయిన, పడతిలా, సొంపు లేక, వెలవెలపోతుంది. ఇది నిజం.
పుణ్యోత్సవసముత్థా
చ నష్టభర్త్రీ సరాక్షసీ ।
భవిష్యతి
పురీ లంకా నష్టభర్త్రీ యథాఽ౦గనా ॥ 30
రావణుడు, రాక్షసపురుషులందఱూ, నశించిన వెనుక, ఈ లంకాపురి, భర్త, నశించిన, చెలువలా, మంగళోత్సవ
మొక్కటీ లేక, కాంతిహీనమైపోతుంది.
నూనం
రాక్షసకన్యానాం రుదంతీనాం గృహే గృహే ।
శ్రోష్యామి
నచిరా దేవ దుఃఖార్తానా మిహ ధ్వనిమ్ ॥ 31
ఇక, ఈ లంకలో, ఇంటింటా, దుఃఖార్తలై, రోదనం
చేసే, రాక్షసస్త్రీల కంఠధ్వని, అచిరకాలంలోనే, నిశ్చయంగా, నేను వినగలను.
సాంధకారా
హతద్యోతా హతరాక్షసపుంగవా ।
భవిష్యతి
పురీ లంకా నిర్దగ్ధా రామసాయకైః ॥ 32
యది నామ స
శూరో మాం రామో రక్తాంతలోచనః ।
జానీయా
ద్వర్తమానాం హి రావణస్య నివేశనే ॥ 33
ఎఱ్ఱటికనుకొనలు కలవాడు మహాశూరుడు రాముడు,
నేనిక్కడ ఉన్నానని, తెల్సుకొంటే కనుక, వెంటనే, ఈ ల౦క, ఆతని బాణాలచే, దగ్ధమై, చీకట్లు క్రమ్మి, కాంతి చెడి,
మేటి రాక్షసులందరూ కూలినదవుతుంది.
అనేన తు
నృశంసేన రావణే నాధమేన మే ।
సమయో యస్తు
నిర్దిష్ట స్తస్య కాలోఽయమాగతః ।
సచమే విహితో
మృత్యురస్మిన్ దుష్టేన వర్తతే ॥ 34
అధముడు క్రూరుడు రావణుడు,
నాకు, ఎంత సమయాన్ని నిర్ణయించాడో, ఆ
గడువు, సమీపించింది. ఆ దుష్టునిచే విహితమైన, ఆ మృత్యువు కూడా, ఈ సమయంలోనే (ఆతనికే) సంభవిస్తుంది.
అకార్యం యే
న జానంతి నైరృతాః పాపకారిణః ।
అధర్మాత్తు
మహోత్పాతో భవిష్యతి హి సాంప్రతమ్ ॥ 35
పాపిష్ఠులైన
రాక్షసులు, కార్యాకార్యాలు తెల్సుకోలేరు. వారి అధర్మంవల్ల,
ఇప్పుడు, మహోత్పాతం జరుగబోతోంది.
నైతే ధర్మం
విజానంతి రాక్షసాః పిశితాశనాః ।
ధ్రువం మాం
ప్రాతరాశార్థే రాక్షసః కల్పయిష్యతి ॥ 36
ఈ రాక్షసులు,
ఎప్పుడూ, మాంసమే తినే, క్రూరాత్ములు.
వీరికెంతమాత్రం, ధర్మం, తెలియదు.
రావణుడు, నిశ్చయంగా నన్ను, పెందలకడ
తినుబండారంగా, తినగలడు.
సాఽహం కథం కరిష్యామి
తం వినా ప్రియదర్శనమ్ ।
రామం
రక్తాంతనయన మపశ్యంతీ సుదుఃఖితా ॥ 37
ఎఱ్ఱని కంటికొనలు కల్గిన,
రాముని చూడవీలులేక, మిక్కిలి ఏడుస్తున్నదాన్ని నేను. నా
ప్రియుని దర్శనం లేకుండా, ఇపుడు, ఏం
చేయగలను?
యది కశ్చి త్ప్రదాతా
మే విష స్యాద్య భవే దిహ ।
క్షిప్రం
వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా ॥ 38
నాకిక్కడ,
నేడు, ఎవడైనా, విషం ఇస్తే, త్రాగి, శీఘ్రంగా, యముని, చూడగలను. రాముని విడవడం కంటే, అదే నయం.
నాజానా
జ్జీవతీం రామ స్స మాం లక్ష్మణపూర్వజః ।
జానంతౌ తౌ న
కుర్యాతాం నోర్వ్యాం హి మమ మార్గణమ్ ॥ 39
నేను, బ్రతికి ఉన్నట్లు, లక్ష్మణాగ్రజుడు, రామునికి,
ఇంకా తెలియనట్లుంది, తెలిస్తే, సోదరులిద్దఱూ, నాకోసం, భూమంతా, వెదక్కుండా
ఉండరు.
నూనం మ మైవ
శోకేన స వీరో లక్ష్మణాగ్రజః ।
దేవలోక మితో
యాత స్త్యక్త్వా దేహం మహీతలే ॥ 40
లేదా, లక్ష్మణాగ్రజుడు, రాముడు, నిశ్చయంగా, నన్ను
గూర్చిన దుఃఖంతో, భూమిపై, దేహాన్ని, విడచి, దేవలోకం చేరి ఉంటాడు.
ధన్యా దేవా
స్సగంధర్వా స్సిద్ధా శ్చ పరమర్షయః ।
మమ పశ్యంతి
యే నాథం రామం రాజీవలోచనమ్ ॥ 41
అక్కడ, రాజీవలోచనుడైన, నా నాథుని, చూస్తున్న దేవతలు,
గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, మిక్కిలి ధన్యులు.
అథవా కిన్ను
త స్యార్థో ధర్మకామస్య ధీమతః ।
మయా రామస్య
రాజర్షే ర్భార్యయా పరమాత్మనః ॥ 42
అలా కాక, రాముడు, జీవించే ఉంటాడు. అయితే, ధర్మకాముడు ధీమంతుడు
రాజర్షి పరమాత్మ కాన, వైరాగ్యభావంతో ఉండడంవల్ల, ఆయనకు, ఇక, నా అక్కఱ, ఏమి?
దృశ్యమానే
భవే త్ప్రీతి స్సౌహృదం నా స్త్యపశ్యతః ।
నాశయంతి కృతఘ్నాస్తు
న రామో నాశయిష్యతి ॥
43
ప్రీతి కలవాణ్ణి,
ఎప్పుడూ, చూస్తూ ఉంటేనే, వారిమీద, ప్రీతి ఉంటుంది. లేకపోతే, చెడుతుంది. అయితే, కృతఘ్నులు మాత్రమే, విరహంలో,
ప్రీతిని, మఱచిపోతారు. రాముడలా కాదు. ఏర్పడిన ప్రీతిని, నశింపచేయడు.
కిం ను మే న
గుణాః కేచి త్కింవా భాగ్యక్షయో మమ ।
యాఽహం
సీదామి రామేణ హీనా ముఖ్యేన భామినీ ॥ 44
భామినినైన నేను, నాజీవితానికి
ముఖ్యుడైన, రాముని విడచి, దుఃఖంతో, క్షీణిస్తున్నానే. దీనికి కారణం, నా పాపమా? లేక నా దౌర్భాగ్యమా?
శ్రేయో మే
జీవితా న్మర్తుం విహీనాయా మహాత్మనః ।
రామా దక్లిష్టచారిత్రా
చ్ఛూరా చ్ఛత్రునిబర్హణాత్ ॥ 45
క్లిష్టము కాని చరిత్ర కలవాడు, శూరుడు, శత్రునాశకుడు, మహాత్ముడు రాముని ఎడబాటుతో, నేను, బ్రతికి ఉండటం కంటే, మరణించడమే మేలు.
అథవా
న్యస్తశస్త్రౌ తౌ వనే మూలఫలాశినౌ ।
భ్రాతరౌ హి
నరశ్రేష్ఠౌ సంవృత్తౌ వనగోచరౌ ॥ 46
లేక, నరశ్రేష్ఠులైన, ఆ సోదరులిద్దఱూ, శస్త్రాలను విడచి, అడవిలో, కందమూలఫలాలను తింటూ,
మునివృత్తిని, అవలంబించారేమో?
అథవా
రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా ।
ఛద్మనా
ఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 47
అలా కూడా కాకపోతే,
శూరులైన, రామలక్ష్మణసోదరులిద్దఱ్నీ,
రావణుడు, మోసంతో, చంపి ఉంటాడు.
సాఽహ మేవం
గతే కాలే మర్తు మిచ్ఛామి సర్వథా ।
న చ మే
విహితో మృత్యు రస్మిన్ దుఃఖేఽపి వర్తతి ॥ 48
కాలగతి ఇలా ఉండగా, దుఃఖంలో
ఉన్న, నేను, అన్నివిధాల మరణాన్నే, కోరుతున్నాను. ఇంతటి మహాదుఃఖం కల్గి ఉన్నా, నాకు, మరణం రావటం లేదు.
ధన్యాః ఖలు
మహాత్మానో మునయ స్త్యక్తకిల్బిషాః ।
జితాత్మానో
మహాభాగా యేషాం న స్తః ప్రియాప్రియే ॥ 49
‘ఇది ప్రియం’ ‘ఇది అప్రియం’ అనే భేదం, ఎవరికి లేదో, అట్టి, జితేంద్రియులు, మహాభాగ్యవంతులు, పాపదూరులు,
మహాత్ములు అయిన మునులు, ధన్యులు కదా!
ప్రియాన్న
సంభవే ద్దుఃఖ మప్రియా దధికం భయమ్ ।
తాభ్యాం హి
యే వియుజ్యంతే నమ స్తేషాం మహాత్మనామ్ ॥ 50
ప్రియమైన దానివల్ల,
దుఃఖం కల్గదు. అప్రియమైన దానివల్ల, మిక్కిలి భయం, కల్గుతుంది. సుఖదుఃఖాలు కల్గించే, అలాంటి
ప్రియాప్రియాలనుండి అతీతులైన, మహానుభావులకు, నమస్కారం.
సాఽహం
త్యక్తా ప్రియార్హేణ రామేణ విదితాత్మనా ।
ప్రాణాం
స్త్యక్ష్యామి పాపస్య రావణస్య గతా వశమ్ ॥ 51
(నేనా స్థితిని ఇంకా పొందలేదు కాబట్టి
)ప్రియుడు విదితాత్ముడు రామునిచే విడిచిపెట్టబడిన, నేను, పాపాత్ముడు రావణునకు, వశంగతమై, ఉండలేను. ప్రాణాలు విడుస్తాను.”
----------------------------------------------------------------------------------------
దక్షిణే
లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా | పురతో మారుతిర్యస్య తం వన్దే రఘునన్దనమ్ ||31||
ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే షడ్వింశస్సర్గః (26)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి