19, జూన్ 2020, శుక్రవారం

Sundarakanda సుందరకాండ 32


రామసుందరం
ద్వాత్రింశస్సర్గః

తత శ్శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసా ।
వేష్టితార్జునవస్త్రం తం విద్యుత్సంఘాతపింగళమ్‌॥ 1
అంత, చెట్టుకొమ్మలనడుమ దాగున్నవాడై, తెల్లని వస్త్రం కట్టుకొని, మెఱపులగుంపులా పింగళవర్ణకాంతి కల్గి ఉన్న, ఆ హనుమంతుని చూసి, సీత, మనస్సు కలత చెందింది.
సా దదర్శ కపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినమ్‌ ।
ఫుల్లాశోకోత్కరాభాసం తప్తచామీకరేక్షణమ్‌ ॥ 2
(సాధు దృష్ట్వా హరిశ్రేష్ఠం వినీతవ దవస్థితమ్‌ )
మైథిలీ చింతయామాస విస్మయం పరమం గతా
అహో భీమ మిదం రూపం వానరస్య దురాసదమ్‌ 3
దుర్నిరీక్ష మితి జ్ఞాత్వా పునరేవ ముమోహ సా ।
విలలాప భృశం సీతా కరుణం భయమోహితా 4
రామ రామేతి దుఃఖార్తా లక్ష్మణేతి చ భామినీ
రురోద బహుధా సీతా మందం మందస్వరా సతీ ॥ 5
తరువాత ఆమె, చక్కగా పరిశీలిస్తూ, ఆ చెట్టుకొమ్మపై, వినయం కలవాడై, కూర్చొని, ప్రియవాక్యాలు పల్కుతూ, వికసించిన అశోకపుష్పాలకాంతితో ప్రకాశిస్తూ, కరిగించిన బంగారపువన్నె కల కండ్లతో ఒప్పే, ఒక కపిని (హనుమంతుడు), చూసింది. అంత, హరిశ్రేష్ఠుని దర్శనంతో, సీత, పరమాశ్చర్యాన్ని పొంది, ఇలా చింతించింది.య్యో! ఈ వానరరూపం, ఎంతో భయంకరంగా ఉంది? చేరరానిది, చూడకూడనిది అని, తలచి, మళ్లీ, మూర్ఛపోయింది. తిరిగి తెప్పరిల్లి, భయమోహిత ఆ సీత దుఃఖార్తయై, రామా! రామా!, లక్ష్మణా! అంటూ, వినేవారికి జాలిపుట్టేలా, ఎంతో విలపించింది. తర్వాత, మందస్వరంతో, బహువిధాలుగా, మెల్లగా, ఏడ్చింది.
సా తం దృష్ట్వా హరిశ్రేష్ఠం వినీతవ దుపస్థితమ్‌
మైథిలీ చింతయామాస స్వప్నోఽయ మితి భామినీ ॥ 6
భామిని మైథిలి ఆ సీత, వినీతుడై, తనకు సమీపాన చెట్టుపై ఉన్న హనుమంతుని చూసి, ఇది స్వప్నమే కానీ వేఱొకటికాదు అని తలచింది.
సా వీక్షమాణా పృథుభుగ్నవక్త్రం
శాఖామృగేంద్రస్య యథోక్తకారమ్‌
దదర్శ పింగాధిపతే రమాత్యం
 వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠమ్‌ ॥ 7
ఆ సీత, ఇటూ అటూ చూస్తూ, పృథుభుగ్నవక్త్రం కలవాడు, వానరేశ్వరుడు సుగ్రీవుని ఆజ్ఞను పాటించే మంత్రి, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుదేవుని కుమారుడు, అయిన హనుమంతుని చూసింది.
సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా
గతాసుకల్పేవ బభూవ సీతా ।
చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో
విచింతయామాస విశాలనేత్రా ॥ 8
ఆ విశాలనేత్ర సీత, ఆ హనుమంతుని, చూడగానే, చేష్టలుడిగినదై, ప్రాణాలు పోయినదానిలా ఉండి, చాలసేపటికి, తెప్పరిల్లి,  ఇలా ఆలోచించింది.
స్వప్నే మయాయం వికృతోద్య దృష్టః
శ్శాఖామృగ శ్శాస్త్రగణై ర్నిషిద్ధః
స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ
తథా పితుర్మే జనకస్య రాజ్ఞః 9
నేనిప్పుడు కలలో, వికృతమైన కోతిని చూశాను. శాస్త్రాలయందంతటా కలలో కోతి కనిపించటం నిషిద్ధం. (అలా కనపడితే మహాదుఃఖం కల్గుతుంది) రామాదుల కేమి కష్టం వచ్చిందో? లక్ష్మణసహితుడైన రామునకు, నా తండ్రి, జనకమహారాజునకు, మంగళంబగుగాక!
స్వప్నోఽపి నాయం నహి మేస్తి నిద్రా
శోకేన దుఃఖేన చ పీడితాయాః
సుఖం హి మే నాస్తి యతోఽస్మి హీనా
తేనేందుపూర్ణప్రతిమాననేన 10
ఇది, కల కాదు. (రామవిరహంవల్ల)శోకంతో, (రాక్షసపీడవల్ల)దుఃఖంతో, పీడింపబడే, నాకు, నిద్ర లేదు. ఇక కల ఎలా వస్తుంది? నిండుచంద్రునిలాంటి ముఖం , రాముని విడచి ఉన్నాను. ఇక, నాకు, సుఖం ఎక్కడిది?. సుఖం లేనప్పుడు నిద్ర ఎలా వస్తుంది.? కాన ఇది కల కానే కాదు.
రామేతి రామేతి సదైవ బుద్ధ్యా
విచింత్య వాచా బ్రువతీ తమేవ ।
తస్యానురూపం చ కథాం తర్థ
మేవం ప్రపశ్యామి తథా శృణోమి 11
నేను ఎల్లప్పుడూ, రామునే మనస్సులో ధ్యానిస్తూ, నోట రామనామం జపిస్తూ, అందుకు తగ్గట్టుగా నారామునిగుఱించిన కథను వింటున్నాను.
అహం హి త స్యాద్య మనోభవేన
సంపీడితా తద్గతసర్వభావా ।
విచింతయంతీ సతతం తమేవ
థైవ పశ్యామి తథా శృణోమి 12
నేను, రామవిరహంవల్ల, మన్మథునిచే పీడింపబడుతూ, ఎల్లప్పుడూ రామునే ధ్యానిస్తూ, తద్గతమైన మనోభావం కల్గి ఉండడం వల్ల, రాముని రూపం నా కండ్లకు కనిపిస్తోంది. రామవృత్తాంతం చెవులకు వినిపిస్తోంది.
మనోరథ స్స్యాదితి చింతయామి
తథాపి బుద్ధ్యాపి వితర్కయామి ।
కిం కారణం తస్య హి నాస్తి రూపం
సువ్యక్తరూపశ్చ వద త్యయం మామ్‌ ॥ 13
అందువల్ల నాలో నిండి ఉన్న రామవిషయకమైన మనోరథంవల్లే ఇలా వినిపిస్తోంది కాబట్టి ఇది భ్రాంతి అనుకొంటున్నాను. కానీ బుద్ధితో విచారిస్తే, కాదనిపిస్తోంది. ఎందుకంటే మనోరథానికి రూపం లేదు. ఈ వానరుడు, ఎదురుగా కనిపిస్తున్నాడు. అతడు చెప్పేది కూడా స్పష్టంగా వినిపిస్తోంది. కాబట్టి ఇది నాకోసం చెప్తున్న మాటే కానీ వేఱు కాదు.
నమోస్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయంభువే చైవ హుతాశనాయ
అనేన చోక్తం యదిదం మమాగ్రతో
వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా ॥ 14
దేవేంద్రునికి, బృహస్పతికి, బ్రహ్మదేవునికి, గ్నిదేవునకు, నమస్కారం. నా ముందఱ ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యాలగుగాక! అన్యథా కాకుండుగాక! అని సీత పలికింది.
------------------------------------------------------------------------------------------
రామో రాజమణిః సదా విజయతే, రామం రమేశం భజే, రామేణాభిహతా, నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం, రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః,సదా భవతు మే భో రామ మాముద్ధర ||37||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ద్వాత్రింశస్సర్గః (32)
మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...