రామసుందరం
అష్టాదశస్సర్గః
తథా విప్రేక్షమాణస్య
వనం పుష్పితపాదపమ్ ।
విచిన్వత శ్చ వైదేహీం
కించిచ్ఛేషా నిశాఽభవత్ ॥ 1
హనుమంతుడు, ఆ అశోకవనాన్ని
చూస్తూ, సీతను వెదకుతూండగా, రాత్రి చాల గడచి, కొంత ప్రొద్దు
మాత్రం మిగిలింది.
షడంగవేదవిదుషాం క్రతుప్రవరయాజినామ్ ।
శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే
బ్రహ్మరక్షసామ్ ॥ 2
అంత అపరరాత్రియందు, షడంగాలతో
వేదాలను తెలిసి, గొప్పయాగాల్ని యజింపచేసే బ్రహ్మణరాక్షసులు
చేసే,
వేదాధ్యయనధ్వనులు హనుమంతునకు వినబడ్డాయి.
అథ మంగళవాదిత్రశబ్దై శ్శ్రోత్రమనోహరైః ।
ప్రాబుధ్యత మహాబాహు
ర్దశగ్రీవో మహాబలః ॥ 3
అంత
చెవులకు ఇంపుగా, మంగళవాద్యధ్వనులు చెలగగా,
ఆ ధ్వనులకు రావణుడు మేలుకొన్నాడు.
విబుధ్య తు యథాకాలం
రాక్షసేంద్రః ప్రతాపవాన్ ।
స్రస్తమాల్యాంబరధరో
వైదేహీ మన్వచింతయత్ ॥ 4
నిద్రావశాన పూదండలు, వస్త్రం నెలవులు తప్పి
ఉండగా, యుక్తకాలంలో
మేల్కాంచి, అంత, సీతను, తలచుకొన్నాడు.
భృశం నియుక్త
స్తస్యాం చ మదనేన మదోత్కటః ।
న స తం రాక్షసః కామం
శశా కాత్మని గూహితుమ్ ॥ 5
మిక్కుటంగా మత్తిల్లి ఉండేవాఁడు కాబట్టి, పరదారావ్యామోహం పాపం అని
విమర్శింపక, మన్మథునిచే తీవ్రంగా ఫ్రేరితుడై , ఆ
మరులను మనస్సులో అణచుకోలేకపోయాడు.
స సర్వాభరణై ర్యుక్తో బిభ్ర చ్ఛ్రియ మనుత్తమామ్ ।
తాం నగై ర్బహుభి ర్జుష్టాం
సర్వపుష్పఫలోపగైః ॥ 6
వృతాం పుష్కరిణీభిశ్చ
నానాపుష్పోపశోభితామ్ ।
సదామదైశ్చ విహగై
ర్విచిత్రాం పరమాద్భుతామ్ ॥ 7
ఈహామృగైశ్చ వివిధై ర్జుష్టాం
దృష్టిమనోహరైః ।
వీధీ
స్సంప్రేక్షమాణశ్చ మణికాంచనతోరణాః ॥ 8
నానామృగగణాకీర్ణాం
ఫలైః ప్రపతితై ర్వృతాం ।
అశోకవనికా మేవ
ప్రావిశ త్సంతతద్రుమామ్ ॥ 9
సమస్తాభరాణాల్ని
ధరించి, సాటి లేని మేటి కాంతితో
తేజరిల్లుతూ, అశోకవనానికి బయలుదేరాడు. ఆ వనం, సమస్తపుష్పఫలయుతమైన
పెక్కువృక్షాలతో కూడి, పెక్కుకోనేళ్లు అక్కడక్కడ
వెలయ, నానావిధ పుష్పాలతో చూడ సొంపై ఉంది. ఇంకా, ఎప్పుడూ
మత్తిలి మధురధ్వనులు చేసే పక్షులతో విచిత్రమై, మిక్కిలి ఆశ్చర్యకరమై, చూపును, మనసును హరించే, పలువిధాలతోడేళ్లతో కూడి, బెడగారుతోంది. ఇట్లు నానావిధమృగసమూహాలు
నెరసి బెరసి, చెట్లనుండి, రాలిన పండ్లు అందంద కనబడుతూండగా, చెట్లు దట్టంగా ఉన్న
ఆ అశోకవనంలోకి, అందలి మణికాంచనమయాలైన
వెలుపలి ద్వారాల్ని చూస్తూ, ప్రవేశించాడు.
అంగనాశతమాత్రం తు తం వ్రజంత మనువ్రజత్ ।
మహేంద్రమివ పౌలస్త్యం
దేవగంధర్వయోషితః ॥ 10
దేవగంధర్వస్త్రీలు, దేవేంద్రుని వెంబడించినట్లు, ఆ రావణుఁడు పోతూంటే, ఒక నూఱుగురు స్త్రీలు అతనిని వెంబడించారు.
దీపికాః కాంచనీః కాశ్చిజ్జగృహు స్తత్ర యోషితః ।
వాలవ్యజనహస్తాశ్చ
తాలవృంతాని చాపరాః ॥ 11
కాంచనై రపి భృంగారై ర్జహ్రు స్సలిల మగ్రతః ।
మండలాగ్రాన్ బృసీం
చైవ గృహ్యాన్యాః పృష్టతో యయుః ॥ 12
అందులో కొందఱు స్త్రీలు, బంగారుదండెలు
కల కరదీపికలను పట్టుకొని ఉన్నారు. కొందఱు చామరాలు, మఱి కొందఱు విసన కఱ్ఱల్ని, కొందఱు
బంగారుగిండిపాత్రల్లో జలాన్ని
తీసుకొని,
రావణునకు ముందు నడచారు. మఱికొందఱు కాంతలు, కత్తులు, ఆసనాల్ని తీసుకొని, రావణుని వెనుక వచ్చారు.
కాచి ద్రత్నమయీం స్థాలీం పూర్ణాం
పానస్య భామినీ ।
దక్షిణా దక్షిణే నైవ
తదా జగ్రాహ పాణినా ॥ 13
అప్పుడు దక్షిణయైన ఒక చెలువ, మద్యంతో నింపిన మణిమయపాత్రని కుడిచేత పట్టుకొని వస్తోంది.
రాజహంసప్రతీకాశం
ఛత్రం పూర్ణశశిప్రభమ్ ।
సౌవర్ణదండ మపరా
గృహీత్వా పృష్ఠతో యయౌ ॥ 14
మఱియొక్కతి, రాజహంసలా, నిండుచందురునివెల్గులా
తెల్లనై, బంగారుదండం కల ఛత్రాన్ని పట్టుకొని రావణుని వెనుక వస్తోంది.
నిద్రామదపరీతాక్ష్యో
రావణ స్యోత్తమాః స్త్రియః ।
అనుజగ్ముః పతిం వీరం
ఘనం విద్యుల్లతా ఇవ ॥ 15
ఆ ఉత్తమరావణకాంతలు,
నిద్రమత్తులోనూ మద్యం కైపులోనూ కన్నులు మూతపడుతూండగా, మేఘాన్ని మెఱపులు వెంబడించినట్లు, తమ పతి, రావణుని వెంటనంటి
వస్తున్నారు.
వ్యావిద్ధహారకేయూరా
స్సమామృదితవర్ణకాః ।
సమాగళితకేశాంతా
స్సస్వేదవదనా స్తథా ॥ 16
ఘూర్ణంత్యో మదశేషేణ నిద్రయా
చ శుభాననాః ।
స్వేదక్లిష్టాంగకుసుమా
స్సుమాల్యాకులమూర్ధజాః ॥ 17
ప్రయాంతం నైరృతపతిం నార్యో
మదిరలోచనాః ।
బహుమానాచ్చ కామాచ్చ
ప్రియా భార్యాస్త మన్వయుః ॥ 18
ఆ రావణుని ప్రియభార్యలు
నిద్రావశంలో తాఱుమాఱుగా హారాలు, బహుపురుల్ని వేసుకొని, మైపూత మాసిపోగా, కురులు వ్రేలాడుతుండగా, నెమ్మొగంలో చెమట పట్ట, కైపుతో కొంతా, నిదుర చేతా, అడుగులు
తడబడుతూండగా, చెమటతో, అవయవాల్లో, పూలు
వాడిపోగా, మేలయిన పూదండలు, కురుల్లో
చెదరి ఉండగా, భర్తయందలి గౌరవాన, మిక్కుటమైన మరులవల్లా, రావణుడు
పోతూండగా, అతన్ని
వెంబడించారు.
స చ కామపరాధీనః పతి
స్తాసాం మహాబలః ।
సీతాసక్తమనా మందో
మదాంచితగతి ర్భభౌ ॥ 19
ఆ చెలువల పెనిమిటి రావణుడు, మన్మథునకు లోనై , మనస్సు సీతపై తగులుపడగా, జడునిలా, ఏమీ
తోచక, మదంవల్ల, బెడఁగు చూపే నడలతో, ప్రకాశించాడు.
తతః కాంచీనినాదం చ
నూపురాణాం చ నిస్స్వనమ్ ।
శుశ్రావ పరమస్త్రీణాం స కపి
ర్మారుతాత్మజః ॥ 20
అంత వాయుకుమారుఁడు హనుమంతుఁడు, ఉత్తమకాంతారత్నాలు నడచి వస్తూండగా, కలిగే మొలనూళ్ల ఘలంఘలధ్వనులు, అందియల ఝళంఝళ నాదాల్ని
విన్నాడు.
తం చాప్రతిమకర్మాణ మచింత్యబలపౌరుషం ।
ద్వారదేశ మనుప్రాప్తం
దదర్శ హనుమాన్ కపిః ॥ 21
ఎవ్వరూ చేయలేని పెనుకార్యాల్ని
చేసి, ఎన్నరాని
బలాన్ని, పౌరుషాన్ని
కల్గి వెలుఁగుతున్న, ఆ రావణుఁడు, ఆ వనద్వారప్రదేశానికి రాగా, హనుమంతుడు చూశాడు.
దీపికాభి రనేకాభి
స్సమంతా దవభాసితమ్ ।
గంధతైలావసిక్తాభిర్ధ్రియమాణాభి రగ్రతః ॥ 22
స్త్రీలు, పెక్కుదీవియల్ని, వాసననూనె పోసి, ముందు పట్టుకొని పోతూండగా, ఆ దీపాల వెలుతురులో, అతఁడు నలువైపులా, చక్కఁగా, కనబడుతున్నాడు.
కామదర్పమదైర్యుక్తం
జిహ్మతామ్రాయతేక్షణమ్ ।
సమక్షమివ కందర్బ మపవిద్ధశరాసనమ్ ॥ 23
మన్మథవికారం, గరువం, మద్యమదం కల్గి, వంకరలై ఎఱ్ఱనై, పొలుచు, దీర్ఘ నేత్రాలు మీఱ, అతడు, పూవిల్లు విడిచి, ప్రత్యక్షంగా వచ్చిన, మన్మథునిలా
ఉన్నాడు.
మథితామృత ఫేనాభ మరజోవస్త్ర ముత్తమమ్ ।
సలీల మనుకర్షంతం
విముక్తం సక్త మంగదే ॥ 24
మఱియు అతడు, ఎంతమాత్రం దుమ్ము లేక, గట్టిమజ్జిగనురుఁగూ వెచ్చని పాలనురుఁగూ పోలి, మిసమిసని జిలుగైన మేలివస్త్రం నెలవు తప్పి, బాహుపురిలో తగులుకోగా, విలాసపుఠీవితో విడదీసి, లాక్కొంటూ వస్తున్నాడు.
తం పత్రవిటపే లీనః పత్త్రపుష్పఘనావృతః ।
సమీపమివ సంక్రాంతం
నిధ్యాతు ముపచక్రమే ॥ 25
ఆ హనుమంతుఁడు, ఆకులు గుబురుకొన్న ఒక కొమ్మయందు, ఎవ్వరికీ కానరాకుండా, ఆకుల్ని,
పువ్వుల్ని కప్పుకొని, దూరాన ఉన్నా, నిజతేజంవల్ల దగ్గఱకు వచ్చినట్లున్న
ఆ రావణుని చూడసాగాడు.
అవేక్షమాణ స్తు తతో
దదర్శ కపికుంజరః ।
రూపయౌవనసంపన్నా
రావణస్య వరస్త్రియః ॥ 26
అంత, ఆ కపితిలకుడు, అలా రావణుని చూస్తూ, సౌందర్యంలోనూ యౌవనంలోనూ పెంపారే రావణుని వరస్త్రీలను, చూశాడు.
తాభిః పరివృతో రాజా
సురూపాభి ర్మహాయశాః ।
తన్మృగద్విజసంఘుష్టం
ప్రవిష్టః ప్రమదావనమ్ ॥ 27
ఆ రావణుడు సౌందర్యవతులైన ఆ స్త్రీలతో కూడి, మృగాలు, పక్షులు మిగులధ్వనులు
చేస్తూండే,
అంత:పురోద్యానమైన, ఆ అశోకవనంలోకి, ప్రవేశించాడు.
క్షీబో విచిత్రాభరణ
శ్యంకుకర్ణో మహాబలః ।
తేన విశ్రవసః పుత్త్ర స్స దృష్టో
రాక్షసాధిపః ॥ 28
వృతః పరమనారీభి
స్తారాభి రివ చంద్రమాః ।
తం దదర్శ మహాతేజా స్తేజోవంతం మహాకపిః ॥ 29
మద్యపానమత్తుడై, పలువిధాభరణా
తాల్చి, శంకుకర్ణుడు
మహాబలుడు ఆ రావణుడు, చంద్రుఁడు చుక్కలచే పరివృతుడైనట్లు, ఉత్తమస్త్రీలచే పరివేష్టితుడై, హనుమకు కనిపించాడు. మహాతేజుడైన ఆ కపిరాజు, మిక్కిలి తేజంతో రాజిల్లుతున్న, ఆ రావణుని చూశాడు.
రావణోఽయం మహాబాహు రితి సంచింత్య వానరః ।
(సోఽయమేవ పురా శేతే
పురమధ్యే గృహోత్తమే)
అవప్లుతో మహాతేజా హనుమా
న్మారుతాత్మజః ॥ 30
మహాతేజుడు
వాయుకుమారుఁడు హనుమంతుఁడు, ‘ఈ మహాబాహుడు రావణుఁడు’ అని తలఁచి, అతని చేష్టలన్నీ చక్కగా చూడ్డానికి, క్రింది కొమ్మకు
దిగాడు.
స తథాఽప్యుగ్రతేజాస్స న్నిర్ధూత స్తస్య తేజసా ।
పత్త్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతోఽభవత్ ॥ 31
ఆ హనుమంతుఁడు, భయంకరమైన
తేజం కలవాడైనా, ఆ రావణుని తేజానికి డీలుపడి, ఆకులు దట్టంగా క్రమ్ముకొని
ఉన్న ఒకచోట, ఎవ్వరికీ
కనిపించకుండా ఉండేటట్లు, దాగి ఉన్నాడు.
స తా మసితకేశాంతాం
సుశ్రోణీం సంహతస్తనీం ।
దిద్బ్భక్షు
రసితాపాంగా ముపావర్తత రావణః ॥ 32
ఆ రావణుఁడు, నెరికురులచివరలు నల్లనై ఉల్లసిల్లే, సుశ్రోణి,
సంహతస్తని, నల్లనికడకంటిచూడ్కులు వేడ్కలు చేస్తున్న ఆ సీతను
చూడ కోరి,
ఆమె సమీపానికి వచ్చాడు.
----------------------------------------------------------------------------------------------------
వేదాన్తవేద్యో
యజ్ఞేశః పురాణపురుషోత్తమః | జానకీవల్లభః శ్రీమా నప్రమేయపరాక్రమః ||23||
ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టాదశస్సర్గః (18)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి