రామసుందరం
వింశస్సర్గః
స తాం పతివ్రతాం
దీనాం నిరానందాం తపస్వినీమ్ ।
సాకారై ర్మధురై
ర్వాక్యై ర్న్యదర్శయత రావణః ॥ 1
అట్లు, ఆ దీనురాలు
నిరానందిని తపస్విని
పతివ్రత సీతకు, రావణుఁడు, సాభిప్రాయాలైన తీయని మాటలతో, తన హృదయాన్ని
ఇలా తెలిపాడు.
మాం దృష్ట్వా
నాగనాసోరు గూహమానా స్తనోదరమ్ ।
అదర్శన మి వాత్మానం
భయా న్నేతుం త్వ మిచ్ఛసి ॥ 2
"కరిహస్తాల్లాంటి
ఊరువులు కల సీతా!, నీవు నన్ను చూసి
భయంతో వక్షస్థలం, కడుపు మూసికొని, నిన్ను నా కెంతమాత్రం
కనబడకూడదని కోరినట్లున్నావు.
కామయే త్వాం
విశాలాక్షి బహమన్యస్వ మాం ప్రియే ।
సర్వాంగగుణసంపన్నే
సర్వలోకమనోహరే ॥ 3
సర్వాంగగుణసంపన్నవు.
సర్వలోకమనోహరివి. విశాలాక్షివి. కాబట్టి నాకెంతో ప్రియురాలవు. నిన్ను చూసి
కామిస్తున్నాను. నన్ను గారవించు.
నేహ కేచి న్మనుష్యా
వా రాక్షసాః కామరూపిణః ।
వ్యపసర్పతు తే సీతే
భయం మత్తస్సముత్థితమ్ ॥ 4
ఇక్కడ
మనుష్యులు కానీ, కామరూపులు రాక్షసులు కానీ, నీకు, భయం
కల్గించేవారెవ్వరూ లేరు. నావలని భయాన్ని
సీతా! వలదు. దిగవిడువు.
స్వధర్మో రక్షసాం
భీరు సర్వథైవ న సంశయః ।
గమనం వా పరస్త్రీణాం
హరణం సంప్రమథ్య వా ॥ 5
పిఱికిదానా! నాకు, పరస్త్రీగమనం
దోషమనుకోవద్దు. ఏ స్త్రీలనైనా పొందడం కానీ, బలాత్కారంగా
అపహరించడం కానీ, రాక్షసులకు ధర్మం. ఇందుకు సందేహం లేదు. కులధర్మంవల్ల ఎంతమాత్రం
దోషం లేదు.
ఏవం చైత దకామాం తు న
త్వాం స్ప్రక్ష్యామి మైథిలి ।
కామం కామ శ్శరీరే మే యథాకామం
ప్రవర్తతామ్ ॥ 6
ఈ విషయం ఇలా ఉన్నా, నీవు నన్ను కామించట్లేదు కాబట్టి నిన్నుమాత్రం
నేను తాకను. కాన నా ఎడల నీకు మిక్కిలి యథేచ్ఛకామం కల్గుగాక!
దేవి నేహ భయం కార్యం
మయి విశ్వసిహి ప్రియే ।
ప్రణయస్వ చ తత్త్వేన
మైవం భూ శ్శోకలాలసా ॥ 7
దేవీ!
ప్రియురాలా! ఇహ(ఇచట/ఈకామవిషయంలో) భయపడవద్దు. నన్ను నమ్ము. యథార్థంగా నాయందు
స్నేహాన్ని ఉంచు. ఇలా దుఃఖిస్తూండకు.
ఏకవేణీ ధరాశయ్యా
ధ్యానం మలిన మంబరమ్ ।
అస్థానేఽప్యుపవాసశ్చ నైతా
న్యౌపయికాని తే ॥
8
ఒకటే జడగా కురులు పెనచుకోవడం,
నేలపై పరుండటం, చింతలో మునిఁగి ఉండటం, ముఱికి వస్త్రం, తగని సమయంలో
ఉపవాసం, ఇవన్నీ నీకు తగినవి కావు. వీటిని విడు.
విచిత్రాణి చ
మాల్యాని చందనా న్యగరూణి చ ।
వివిధాని చ వాసాంసి
దివ్యా న్యాభరణాని చ ॥ 9
మహార్హాణి చ పానాని
శయనా న్యాసనాని చ ।
గీతం నృత్తం చ వాద్యం
చ లభ మాం ప్రాప్య మైథిలి ॥ 10
సీతా! నీవు నన్ను కూడి, పలువిధపుష్పమాలికల్ని, చందనగంధాల్ని
అగురుగంధాల్ని, వివిధవస్త్రాల్ని, దివ్యాభరణాల్ని
ధరించి, ఉత్తమపానీయాల్ని
త్రాగుతూ, మేలి శయనాల్ని, ఆసనాల్ని, హాయిగా అనుభవిస్తూ, ఆటపాటలతో, వాద్యాలతో, పొద్దుపుచ్చుతూ, సుఖంగా
ఉండు.
స్త్రీరత్న మసి మైవం భూః కురు గాత్రేషు
భూషణమ్ ।
మాం ప్రాప్య హి కథం
ను స్యా స్త్వ మనర్హా సువిగ్రహే ॥ 11
సుందరగాత్రీ! నీవు, ఇంతులలో కెల్ల మేలుబంతివి. ఇలా
ఉండకు. మేన, సొమ్ములు ధరించు. నన్ను పొంది
కూడా, నీవు, సొమ్ములు లేనిదానిలాగా
ఉండటం తగినదా? ఎంతమాత్రం తగదు.
ఇదం తే చారు సంజాతం
యౌవనం వ్యతివర్తతే ।
య దతీతం పునర్నైతి స్రోత శ్శీఘ్ర మపామివ ॥ 12
మనోజ్ఞంగా పొడచూపే, నీ ఎలజవ్వనమంతా
వ్యర్థంగా గడచిపోతోంది. వేగంగా పాఱిపోయిన నీళ్లు మఱల రానట్లు, కడచిన వయసు, మరల రాదు. కాన ఇపుడే భోగాలనుభవించు.
త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స
విశ్వసృట్ ।
న హి రూపోపమా త్వన్యా
త వాస్తి శుభదర్శనే ॥ 13
శుభదర్శనా! లోకంలో
ఎక్కడా నీలాంటి రూపు కలది, వేఱొక్కతి కాన రాదు. అందువల్ల,
రూపాలు పన్నే ఆ బ్రహ్మదేవుఁడు, నిన్ను నిర్మించి, ఇక నీకంటె
అతిశయించిన రూపును నిర్మించడం అశక్యమని ఎంచి, సృష్టి చేయడం
మానేశాడని తలుస్తాను.
త్వాం సమాసాద్య వైదేహి రూపయౌవనశాలినీమ్ ।
కః పుమా నతివర్తేత
సాక్షాదపి పితామహః ॥ 14
సీతా! ఎనలేని సౌందర్యయౌవనాలతో పొలుపారే నిన్ను చూసి, ఏ పురుషుడు నిన్ను
దాటి, పోగలడు. మఱి సాక్షాత్ బ్రహ్మదేవుడైనా
అంతే. (నిజమే. బ్రహ్మకు తల్లి కదా! ఏ బిడ్డడు తల్లిని దాటి ఉండగలడు?)
యద్యత్పశ్యామి తే
గాత్రం శీతాంశుసదృశాననే ।
తస్మిం స్తస్మిన్
పృథుశ్రోణి చక్షు
ర్మమ
నిబధ్యతే
॥ 15
శీతాంశుసదృశాననా!, పృథుశ్రోణీ!, సీతా!, నిన్ను, నీ అవయవాల్లో
దేన్ని చూసినా మఱల నాకన్నుగవను అక్కడినుండి మరల్చలేకపోతున్నాను.
భవ మైథిలి భార్యా మే
మోహ మేనం విసర్జయ ।
బహ్వీనా
ముత్తమస్త్రీణా మాహృతానా మితస్తతః ।
సర్వాసామేవ భద్రం తే
మ మాగ్రమహిషీ భవ ॥ 16
సీతా! నాకు భార్యవు
కా. నేను పరపురుషుణ్ణనే ఈ అజ్ఞానాన్ని
విడచిపెట్టు. నీకు శుభంబగుఁగాక!. నేను, నానాస్థలాలనుండి తెచ్చిన ఉత్తమస్త్రీలు చాలామంది
ఉన్నారు. వాఱందరికన్న నీవు, నాకు, అగ్రభార్యగా ఉండు.
లోకేభ్యో యాని
రత్నాని సంప్రమ థ్యాహృతాని వై ।
తాని మే భీరు సర్వాణి రాజ్యం
చైత దహం చ తే ॥
17
పిఱికిదానా! నేను, నానాలోకాలనుండి బలిమి నెఱపి, తెచ్చిన, అన్నిరత్నాలు, నారాజ్యం నీవే. నేనూ నీకు భృత్యుణ్ణయ్యాను.
విజిత్య పృథివీం
సర్వాం నానానగరమాలినీమ్ ।
జనకాయ ప్రదాస్యామి తవ
హేతో ర్విలాసిని ॥ 18
విలాసినీ ! నేను నీకుఁగా, నానావిధనగరాల్ని వరుసగా కల్గి
వెల్గుతున్న, భూమినంతా
జయించి, జనక మహారాజునకు ఇస్తాను.
నేహ పశ్యామి
లోకే౭న్యం యో మే ప్రతిబలో భవేత్ ।
పశ్య మే సుమహ ద్వీర్య
మప్రతిద్వంద్వ మాహవే ॥ 19
నన్నెదురుగా నిలిచి, మార్కొనుపాటివాడు ఇదివఱకు
ఈ లోకాన నాకు కనిపించలేదు. యుద్ధంలో
నా పరాక్రమమెంత ఎదురులేనిదో, అది ఎంత గొప్పదో చూడు.
అసకృ త్సంయుగే భగ్నా
మయా విమృదితధ్వజాః ।
అశక్తాః ప్రత్యనీకేషు
స్థాతుం మమ సురాసురాః ॥ 20
నా శత్రువుల్లో, దేవతలు, అసురులు, నాతో, యుద్ధం చేసి, పలుమాఱు భంగపడి, టెక్కెములు విఱువబడి , నా ఎదుట నిలువలేక, పాఱిపోయారు, ఇంక ఇతరుల సంగతి చెప్పనేల?
ఇ చ్ఛయా క్రియతా మద్య
ప్రతికర్మ త వోత్తమమ్ ।
సప్రభా ణ్యవసజ్యంతాం
తవాంగే భూషణాని చ ॥ 21
(ఇట్టి వాడను కాబట్టి నా ఎడ వైరస్యం లేక) నీవే ఇచ్చగించి, ఇప్పుడు చక్కగా అలంకరించుకో. నీ అవయవాలన్నిటికి
కాంతులు
మెఱసే
ఆభరణాల్ని
ధరించు.
సాధు పశ్యామి తే రూపం
సంయుక్తం ప్రతికర్మణా ।
ప్రతికర్మాభిసంయుక్తా
దాక్షిణ్యేన వరాననే ॥ 22
భుజ్‌క్ష్వ భోగా
న్యథాకామం పిబ భీరు రమస్వ చ ।
యథేష్టం చ ప్రయచ్ఛ త్వం పృథివీం వా
ధనాని చ
॥ 23
నీవు చక్కఁగా అలంకరించుకొంటే, నీ రూపాన్ని, లెస్సగా, చూడ కోరుతున్నాను. వరాననా! నీవు సరళంగా అలంకరించుకొని, నీ ఇచ్చవచ్చినట్లు భోగాల్ని
అనుభవించు.
పిఱికిదానా! మద్యాల్ని
త్రాగు. క్రీడించు. నీకు కావలసిన వారికి, యథేష్టంగా, భూమిని కానీ, ధనం కానీ ఇచ్చుకో.
లలస్వ మయి విస్రబ్ధా ధృష్ట మాజ్ఞాపయస్వ చ ।
మత్ప్రసాదా ల్లలంత్యాశ్చ
లలంతాం బాంధవా స్తవ ॥ 24
నన్నునమ్మి, నాయందు ప్రీతిని ఉంచు. సంకోచించక, దిట్టతనంతో, నీకు కావలసిన పనులకు, నన్ను, పనిగొను. నీవు నా అనుగ్రహంతో సంతసాన క్రీడిస్తూంటే, నీ
బంధువులూ ప్రీతిని పొందుతారు.
ఋద్ధిం మ మానుపశ్య
త్వం శ్రియం భద్రే యశశ్చ మే ।
కిం కరిష్యసి రామేణ
సుభగే చీరవాససా ॥ 25
కల్యాణీ! నా సమృద్ధిని, నా సంపత్తిని, నా కీర్తిని, చూడు. సుందరీ! నారచీరలు కట్టుకొని, అడవిపాలయిన రామునితో నీకేమి పని?
నిక్షిప్తవిజయో రామో గతశ్రీ
ర్వనగోచరః ।
వ్రతీ స్థండిలశాయీ చ
శంకే జీవతి వా నవా ॥ 26
జయం మాలి, సంపద తూలి, అడవిపాలయి, వానప్రస్థవ్రతం కైకొని, భూమిపై పరుంటున్న, రాముడు, ఇంకా బ్రతికున్నాడో లేడో, అని నాకు, సందేహంగా ఉంది.
న హి వైదేహి రామ స్త్వాం ద్రష్టుం వా ప్యుపలప్స్యతే ।
పురోబలాకై రసితై
ర్మేఘై ర్జ్యోత్స్నా
మివావృతామ్
॥ 27
సీతా! కొక్కెరలు పురోభాగాన ఉండడం
వల్ల మిక్కిలి
గొప్పలైన నల్లనిమేఘాలు క్రమ్ముకోగా, మఱుగుపడిన వెన్నెలను చూడ్డానికి
అలవి
కానట్లు, నా వశంలో ఉన్న, నిన్ను చూడ్డానికైనా
రామునకు శక్యం కాదు.
న చాపి మమ హస్తా త్త్వాం ప్రాప్తు మర్హతి రాఘవః ।
హిరణ్యకశిపుః కీర్తి
మింద్రహస్తగతామివ ॥ 28
హిరణ్యకశిపుడు, ఇంద్రునిచేతికి చిక్కిన తన భార్యను మఱల నారదుని మూలంగా
పొందాడు.
అట్లే
నాచేతికి చిక్కిన నిన్నా రాముడు మఱల పొందుతాడనుకొన్నావా? అతడేమి చేసినా నానుండి మరల నిన్ను పొందలేడు సుమా!
చారుస్మితే చారుదతి
చారునేత్రే విలాసిని ।
మనో హరసి మే భీరు
సుపర్ణః పన్నగం యథా ॥ 29
పిఱికిదానా! చారుస్మితవు
చారుదంతివి చారునేత్రవు విలసినివి ఇంత ఒప్పులకుప్పవైనా
తుదకు పిఱికిదానివి.
ధైర్యం లేకపోయింది. ఇట్టి చక్కదనంవల్ల,
గరుడుడు సర్పాన్ని హరిస్తున్నట్లు
నామనస్సును అపహరిస్తున్నావు కదా!
క్లిష్టకౌశేయవసనాం తన్వీ మ
ప్యనలంకృతామ్ ।
త్వాం దృష్ట్వా
స్వేషు దారేషు రతిం నోపలభా మ్యహమ్ ॥ 30
నీవు నలగిన పట్టువలువ కట్టుకొని, కృశించి, నకనకలాడుచు, ఏమీ
అలంక రించుకోకుండా ఉన్నప్పుడే, నిన్ను చూడగానే,
నాభార్యలందు నాకు రుచి కల్గటం లేదు. నీవు మంచిపుట్టము కట్టి చక్కగా అలకరించుకొని, సంతోషంతో
ఉప్పొంగుతూండగా, చూస్తే, ఎలా ఉంటుందో!
అంతఃపురనివాసిన్య స్స్ర్తియ స్సర్వగుణాన్వితాః ।
యావంత్యో మమ సర్వాసా
మైశ్వర్యం కురు జానకి ॥ 31
సీతా. ! నా అంతఃపురంలో
సమస్తశుభలక్షణసంపన్నలైన ఉత్తమకాంతలెందఱు
కలరో ఆ అందఱకు ఈశ్వరిగా ఉండు.
మమ హ్యసితకేశాంతే త్రైలోక్యప్రవరా స్స్ర్తియః ।
తా స్వాం
పరిచరిష్యంతి శ్రియ మప్సరసో యథా ॥ 32
నల్లని నెఱికురులకొనలుగలదానా ! ముల్లోకాల్లో
అన్నిటా ఉత్తమలయిన నాభార్య లందఱూ లక్ష్మీదేవికి అప్సరసలు పరిచర్య
చేసినట్లు, నీకు, పరిచర్య చేస్తారు.
యాని వైశ్రవణే సుభ్రు రత్నాని చ ధనాని చ ।
తాని లోకాంశ్చ
సుశ్రోణి మాం చ భుంక్ష్వ యథాసుఖమ్ ॥ 33
సుభ్రూ! సుశ్రోణీ! కుబేరుని
వద్ద కల సమస్త రత్నాల్ని, ధనాల్ని, నేను గెలిచినట్టి లోకాల్ని,
నీవిగా చేసుకొని, హాయిగా అనుభవిస్తూండు. నన్నుకూడా పతిగా
చేసుకొని సుఖాన్ని అనుభవించు.
న రామ స్తపసా దేవి న
బలేన న విక్రమైః ।
న ధనేన మయా తుల్య
స్తేజసా యశసాఽపి వా ॥ 34
దేవీ!, రాముడు, తపం, బలం, పరాక్రమం, ధనం, తేజం, కీర్తి, వీటిలో ఎందులోనూ నాకు సాటి కాలేడు.
పిబ విహర రమస్వ
భుంక్ష్వ భోగాన్
ధననిచయం ప్రదిశామి మేదినీం చ ।
మయి లల లలనే యథాసుఖం
త్వం
త్వయి చ సమేత్య లలంతు
బాంధవా స్తే ॥ 35
లలనా ! నీవు నీ ఇచ్చవచ్చినట్లు, మద్యాలు త్రాగు, సుఖంగా విహరించు.
కావలసిన భోగాల్ని
అనుభవించు. నీకు ధనసమూహమంతా
ఇస్తాను. భూమినంతా ఇస్తాను. నన్ను ఇష్టపడు. నీబంధువులందఱూ నిన్నుకూడి, సంతోష మనుభవిస్తారుగాక!.
కుసుమితతరుజాలసంతతాని
భ్రమరయుతాని
సముద్రతీరజాని ।
కనకవిమలహారభూషితాంగీ
విహర మయా సహ భీరు
కాననాని ॥ 36
పిఱికిదానా! పుష్పించి
ఉన్న దట్టమైన వృక్షసమూహాలు, తుమ్మెదల మధుర ఝంకృతులు
కల రమణీయ సముద్రతీరారణ్యాల్లో, బంగారుసొమ్ములచేతా, నిర్మలహారాలచేతా, మేనెల్ల అలంకరించుకొన్నదానవై, నాతో కూడి, క్రీడించు.
--------------------------------------------------------------------------------------------------
రామం
దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం | స్తువన్తి నామభిర్దివ్యైర్న తే సంసారిణో నరాః ||25||
ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే వింశస్సర్గః
(20)
మంగళం
మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి