రామసుందరం
పంచదశస్సర్గః
స వీక్షమాణ స్తత్రస్థో మార్గమాణ శ్చ
మైథిలీమ్ ।
అవేక్షమాణ శ్చ మహీం సర్వాం తా
మన్వవైక్షత ॥ 1
ఆ హనుమంతుఁడు, ఆ
శింశుపావృక్షంపైనుండి, సీతాదేవిని, వెదకువాడై, నాలుగుప్రక్కలా, పలువిధాల చూపులు
ప్రసరింపచేస్తూ, అశోకవనమంతా కలయ చూశాడు.
సంతానకలతాభిశ్చ పాదపై రుపశోభితామ్ ।
దివ్యగంధరసోపేతాం సర్వత స్సమలంకృతామ్ ॥ 2
అది కల్పవృక్షపుతీగలు, వృక్షాలతో, శోభిస్తూ, మిక్కిలి మేలైన వాసనలు గుబాళిస్తూ,
అన్నివైపులా చక్కఁగా అలంకృతమై ఒప్పుతోంది.
తాం స నందనసంకాశాం మృగపక్షిభి రావృతాం ।
హర్మ్యప్రాసాదసంబాధాం
కోకిలాకులనిస్వనామ్ ॥ 3
కాంచనోత్పలపద్మాభి
ర్వాపీభి రుపశోభితామ్ ।
బహ్వాసనకుథోపేతాం బహుభూమిగృహాయుతామ్ ॥
4
మఱియు నందనవనంలా కనబడుతూ, మృగపక్షుల్ని
మెండుగా కలిగి, మేడలు, ఉప్పరిగలతో క్రిక్కిరిసి, కోకిలరవాలు బోరుకొన, బంగారు తామరలు, కలువలు కల నడబావులతో, పెక్కాసనాలు, ఆస్తరణాలు, అనేకాలైన నేలమాళిగలతో శోభిలుతోంది.
సర్వర్తుకుసుమై రమ్యాం ఫలవద్భిశ్చ
పాదపైః ।
పుష్పితానా మశోకానాం శ్రియా
సూర్యోదయప్రభామ్ ॥ 5
ప్రదీప్తా మివ తత్రస్థో మారుతి
స్సముదైక్షత ।
నిష్పత్రశాఖాం విహగైః క్రియమాణా
మివాసకృత్ ॥ 6
సమస్త ఋతువుల్లోనూ
పువ్వులు పూస్తూ, పండ్లు పండే
వృక్షాలు కల ఆ వనం, ఎఱ్ఱగా పుష్పించి ఉన్న అశోకవృక్షాలకాంతిచే అప్పుడు ఉదయిస్తున్నసూర్యునిలా
ప్రకాశిస్తూ, జ్వలిస్తోందా? అన్నట్లుంది. నానావిధపక్షులు,
గుంపులుగుంపులుగా ఎగిరి, అందలి చెట్లపై
తటాలున పడటంతో,
వాని ఱెక్కల తాకున కొమ్మలనుండి ఆకులన్నీ రాలి, రిత్తకొమ్మలు కలవిగా కనబడుతోంది.
వినిష్పతద్భిశ్శతశ
శ్చిత్రైః పుష్పావతంసకైః ।
ఆమూలపుష్పనిచితై రశోకై శ్శోకనాశనైః
॥ 7
పుష్పభారాతిభారై శ్చ స్పృశద్భి
రివ మేదినీం ।
కర్ణికారైః కుసుమితైః కింశుకైశ్చ
సుపుప్పితైః ॥ 8
కొనమొదలుకొని వేళ్ల వఱకు దట్టంగా పూచి, చూసేవారి శోకాల్ని
పోగొడుతున్న అశోకవృక్షాలు, పువ్వుజొంపాల పెనుబరువువల్ల మిక్కిలి వంగడంతో నేలను తాకుతున్నట్టు కనబడుతున్న
పూచిన కొండగోగులు, చక్కఁగా పుష్పించిన
మోదుగుచెట్లు, ఆ
వనంలో పొలుపారుతున్నాయి.
స దేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః
।
పున్నాగా స్సప్తపర్ణాశ్చ
చంపకోద్దాలకా స్తథా ॥
9
వివృద్ధమూలా బహవ శ్సోభన్తే స్మ
సుపుష్పితాః ।
శాతకుంభనిభాః కేచి త్కేచి దగ్నిశిఖోపమాః
॥ 10
నీలాంజననిభాః కేచి త్తత్రా౭శోకా
స్సహస్రశః ।
నందనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా
॥ 11
అతివృత్త మివాచింత్యం దివ్యం రమ్యం
శ్రియావృతమ్ ।
ద్వితీయ మివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతమ్
॥ 12
పుష్పరత్నశతై
శ్చిత్రం పంచమం సాగరం యథా ।
సర్వర్తుపుష్పైర్నిచితం
పాదపై ర్మధుగంధిభిః ॥
13
అలా చక్కగా పూచి ఉన్న వృక్షాల కాంతితో, ఆ
వనప్రదేశం, మండేదానిలా నలువైపులా కనబడుతోంది. ఆ వనంలో
సురపొన్నచెట్లు, ఏడాకుల అరంట్లు, సంపెంగచెట్లు, విరిగిచెట్లు, పెక్కులు వేళ్లు పెరిగి, చక్కఁగా పూచి, ఎంతో
శోభిస్తున్నాయి. బంగారురంగు కలిగి కొన్ని, అగ్గిజ్వాలలా మెఱస్తూ
కొన్ని, నీలంపుఱాలతో, కాటుకతో సాటియై
కొన్ని, ఇలా వేలకొలఁది అశోకవృక్షాలు విలసిల్లుతున్నాయి.
మఱియు అది నందనవనాన్ని
మించినదై, కుబేరుని చైత్రరథంలా చిత్రమై, అచింత్యం, దివ్యం, రమణీయమై
ఎల్లెడల కాంతి తళుకొత్తుతూ, పుష్పాలనే నక్షత్రగణాలతో రాణించడం
వల్ల రెండవ ఆకాశం, పుష్పాలనే రత్నసమూహాలతో
చిత్రితమైంది కాన ఐదవ సముద్రం
అనేలా ఒప్పుతూ, సమస్తఋతువుల్లోనూ
పుష్పాలు నెఱసి ఉండ, వృక్షాలు తేనెవాసనలు గుబాళిస్తూండ, ఒప్పుతోంది.
నానానినాదై రుద్యానం రమ్యం మృగగణై ర్ద్విజైః
।
అనేకగంధప్రవహం పుణ్యగంధం మనోరమమ్ ।
శైలేంద్ర మివ గంధాడ్యం ద్వితీయం
గంధమాదనమ్ ॥ 14
ఆ ఉద్యానం, మఱియు నానావిధధ్వనులు చేసే, మృగపక్షిసమూహాలు కలిగి, రమణీయమై వెలుఁగుతూ, పెక్కు వాసనలు గుబాళిస్తూండే వాయువుతో కూడి, మనోహరమై, సుగంధసంపన్న మవ్వడంవల్ల, గంధపరిపూర్ణపర్వతరాజమైన రెండవ గంధమాదనంలా
కనబడుతోంది.
అశోకవనికాయాం తు తస్యాం వానరపుంగవః ।
స దదర్శావిదూరస్థం చైత్యప్రాసాద ముచ్ఛ్రితమ్ ॥ 15
వానరతిలకుఁడు హనుమంతుఁడు, అశోకవనిని చూసి, అందే కొంత దాపున, మిక్కిలి ఉన్నతమై, బౌద్ధాలయంలా నిర్మితమై ఉన్న, ఒక ప్రాసాదాన్ని
చూశాడు.
మధ్యే స్తంభసహస్రేణ
స్థితం కైలాసపాండురమ్ ।
ప్రవాళకృతసోపానం తప్తకాంచనవేదికమ్ ॥ 16
అది నడుమ వేయిస్తంభాలతో
ధరింపఁబడినదై, కైలాసపర్వతంలా తెల్లగా ఉల్లసిల్లుతోంది. దానికి పగడాల మెట్లు, మేలిబంగారపు అరుఁగులు ఉన్నాయి.
ముష్ణంత
మివ చక్షూంషి ద్యోతమాన మివ శ్రియా ।
విమలం ప్రాంశుభావత్వా దుల్లిఖంత
మివాంబరమ్ ॥ 17
అది
కన్నుల్ని మిఱుమిట్లు కొల్పుతూ, ఎంతో కాంతితో తళుకొత్తుతూ
నిర్మలమై, మిక్కిలి పొడవవ్వడం వల్ల ఆకాశాన్ని
ఒరసేలా కనబడుతోంది.
తతో
మలినసంవీతాం రాక్షసీభి స్సమావృతామ్ ॥ 18
ఉపవాసకృశాం దీనాం నిశ్శ్వసంతీం
పునః పునః ।
దదర్శ శుక్లపక్షాదౌ
చంద్రరేఖా మివామలామ్ ॥ 19
అంత ఆ
హనుమంతుఁడు, ఆ వనంలో మాసిన చీరగట్టి, చుట్టూ రాక్షస స్త్రీలు కావలి ఉండగా, ఉపవాసాన కృశించి, విన్ననై , మాటిమాటికి నిట్టూరుస్తూ, శుక్లపక్షం మొదట విమలమైన చంద్రరేఖలా, తేజం కుంది
ఉన్న ఒక చెలువను చూశాడు.
మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభామ్
।
పినద్ధాం ధూమజాలేన శిఖా మివ విభావసోః ॥ 20
ఆమె రూపు బాగా మాఱి
ఉన్నందున, మిక్కిలి కష్టంతో మెల్లగా గుఱుతు తెలుస్తోంది. మనోహరమైన మేనికాంతి కలిగి, మాసిన చీర గట్టి ఉండడం
వల్ల, ఆవిడ, పొగగుంపుచే కప్పబడిన అగ్నిజ్వాలలా భాసిస్తోంది.
పీతే నైకేన సంవీతాం క్లిష్టే
నోత్తమవాససా ।
సపంకా మనలంకారాం విపద్మా మివ పద్మినీమ్
॥ 21
ఇంకా ఆ చెలువ, ఉత్తరీయం
లేక, పచ్చనై మాసిన మేలికట్టుపుట్టా
నొక్కటినే కట్టి ఉంది. బురదతో కూడినదై, అలంకారం
లేక, తామరలు లేని తమ్మికొలంకులా ఉంది.
వ్రీళితాం
దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీమ్ ।
గ్రహేణాంగారకేణేవ పీడితా మివ రోహిణీమ్
॥ 22
ఆమె, పరపురుషునిచేత చిక్కానే
అని లజ్జితయై, పతివియోగదుఃఖాన పొక్కుతూ, వసివాళ్లు వాఁడి, జాలిగొల్పుతూ, రావణుబారి చిక్కి, అంగారక గ్రహంచేత
పీడితయైన రోహిణిలా వెత చెందుతోంది.
అశ్రుపూర్ణముఖీం
దీనాం కృశా మనశనేన చ ।
శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణామ్
॥ 23
ఆ అమ్మ, మొగమంతా బాష్పజలాలతో, దొప్పదోగ, దీనయై, అశన(అన్న)లేమిచే కృశించి,
ఎప్పుడూ శోకంపాలయి, ఎడతెగని చింతను
పడి, నిత్యం దుఃఖమే గతియై ఉంది.
ప్రియం జన మపశ్యన్తీం పశ్యన్తీం
రాక్షసీగణమ్ ।
స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతా మివ ॥
24
ఇంతే కాక, ఆ పడతి, తనకు ప్రియమైన జనాన్ని
చూడ్డం కుదరక, శత్రువులైన రాక్షసీగణాన్నే
చూస్తున్నదై, తన జాతి పదువును పాసి, కుక్కలగుంపుచే చుట్టుముట్టబడిన ఆడులేడిలా బాధపడుతోంది.
నీలనాగాభయా వేణ్యా జఘనం గతయైకయా ।
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీ మివ ॥ 25
ఆ చెలువ, నల్లనిసర్పంలా నల్లబాఱుతూ, మొలవఱకు వ్రేలాడుతున్న ఒంటిజడ కలిగిందై, శరత్కాలంలో
నల్లనై కారుకొనే వనపంక్తితో కూడిన భూమిలా
కొమరారుతోంది.
సుఖార్హాం దుఃఖసంతప్తాం వ్యసనానా
మకోవిదామ్ ।
తాం సమీక్ష్య విశాలాక్షీ మధికం మలినాం
కృశామ్ ।
తర్కయామాస
సీతేతి కారణైరుపపాదిభిః
। 26
ఆమె సుఖాలనుభవించడానికే
తగినది; ఇదివఱ కెన్నఁడూ
వ్యసనాలపడి ఎఱుఁగనిదైనా, ఇప్పుడు దుఃఖాలపాలై
మిక్కిలి తపిస్తోంది. అట్లు మిక్కిలి మలినయై, చిక్కి ఉన్న ఆ
విశాలాక్షి చెలువను, చక్కఁగా చూసి, యుక్తియుక్తాలైన
కారణాలచేత 'ఈమే సీత' అని ఊహించాడు.
హ్రీయమాణా
తదా తేన రక్షసా కామరూపిణా ।
యథారూపా హి దృష్టా వై తథారూపేయ మంగనా ॥ 27
అతఁడు “ కామరూపియైన
ఆ రాక్షసు డప్పుడు కొనిపోతున్న చెలువకు ఏ
రూపం ఉండగా మేము చూశామో, అట్టి రూపమే ఈవిడకుంది
“ అని ఊహించాడు.
పూర్ణచంద్రాననాం సుభ్రూమ్
చారువృత్తపయోధరాం ।
కుర్వన్తీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా
దిశః ॥ 28
తాం నీలకేశీం బింబోష్ఠీం
సుమధ్యాం సుప్రతిష్ఠితామ్
।
సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా
॥ 29
పున్నమచందురునిలాంటి నెమ్మొగం, సొబగైన కనుబొమలు, సొగసు
కులికే వృత్తపయోధరాలు కలిగి, తన దేహకాంతులతో, దిక్కుల్లోని చీకట్లు పోగొట్టి, దేదీప్యమానాలు కావిస్తూ, నల్లనై
నిగనిగలాడే నెఱికురులు, దొండపండులా ఎఱ్ఱనైన పెదవి, సన్నని నెన్నడుము, చక్కఁగా అమరి ఉన్న అడుగులు బెడఁగుచూప, తామరపూరేకుల్లా కన్నుంగవ చెన్నార, మన్మథునిరతిలా
ఆ సీత పొలుపారుతోంది.
ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్రప్రభా
మివ ॥ 30
భూమౌ సుతను మాసీనాం నియతా మివ తాపసీమ్
।
నిశ్శ్వాసబహుళాం
భీరుం భుజగేంద్రవధూ మివ ॥ 31
మఱియు ఆ
కొమ్మ, సమస్తజగానికి
మనస్సునకు ఇంపై, సంపూర్ణచంద్రప్రభలా వెల్గుతూ, మిక్కిలి చిక్కి ఉన్న చెలువంపుమేనితో భూమిపై కూర్చొని, నియమం ఊని ఉన్న తాపసిలా కనబడుతూ, భయంతో మిక్కుటంగా నిట్టూర్పులు విడుస్తూ, సర్పరాజ్యకన్యలా, చెన్నారుతోంది.
శోకజాలేన మహతా వితతేన న రాజతీమ్ ।
సంసక్తాం ధూమజాలేన శిఖా మివ విభావసోః ॥ 32
ఆమె పెనుదుఃఖపరంపరలు మిక్కిలి పయిపయి పర్వగా, చెలువు కంది, కుందుతూ, పొగలగుంపులు క్రమ్ముకొన్న అగ్నిజ్వాలలా, కాంతి తూలి ఉంది.
తాం స్మృతీ మివ సందిగ్ధా మృద్ధిం
నిపతితా మివ ।
విహతా మివ చ శ్రద్ధా మాశాం ప్రతిహతా మివ
॥ 33
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా
మివ ।
అభూతే నాపవాదేన కీర్తిం నిపతితా మివ ॥ 34
రామోపరోధవ్యధితాం
రక్షోహరణకర్శితామ్ ।
అబలాం మృగశాబాక్షీం వీక్షమాణాం తత స్తతః
॥ 35
బాష్పాంబుపరిపూర్ణేన
కృష్ణవక్రాక్షిపక్ష్మణా ।
వదనే నాప్రసన్నేన నిశ్శ్వసంతీం
పునః పునః ॥ 36
మలపంకధరాం దీనాం మండనార్హా మమండితామ్ ।
ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘై
రివావృతామ్ ॥ 37
మఱియు ఆ
ముద్దియ, సందేహార్థం కల మన్వాదిస్మృతిలా, క్షీణించిన సంపదలా, ఫలాభావంతో నమ్మిక లేక వమ్మయిన శ్రద్ధలా, భగ్నమైన ఆశలా, విఘ్నాన్ని పొందిన కార్యసిద్ధిలా, కలకచెందిన బుద్ధిలా, లేనిపోని అపవాదం చేత తూలిన కీర్తిలా, స్రుక్కుతూ, రాముని పొందటానికి
ఏ వీలు లేకపోవడంతో ఆఱాటపడుతూ, రాక్షసు డపహరించి తేవడంవల్ల
కృశించి, సత్తువ కూడా నశించి, జింకపిల్లలా, బెళుకులైన
కండ్లను,
ఇటూ అటూ నలుప్రక్కలా చూస్తూ, కన్నీళ్లు
మిక్కిలి క్రమ్మి, నల్లనై, వంకలు దీఱిన
కనుఱెప్పలతో కూడి కలగంబాఱి
ఉన్న నెమ్మొగంతో, మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ,
ముఱికి రొంపిగొని ఉన్నమేనితో, విన్ననై , అలంకారాలకు తగినదైనా, భర్తృవిరహాన్నిబట్టి అలంకారం మాలి, నల్లనిమబ్బులతో కప్పబడిన, చుక్కలఱేని
కాంతిలా కనబడుతోంది.
తస్య సందిదిహే బుద్ధి ర్ముహుః సీతాం
నిరీక్ష్య తు ।
ఆమ్నాయనామయోగేన
విద్యాం ప్రశిథిలా మివ ॥ 38
దుఃఖేన బుబుధే సీతాం హనుమా ననలంకృతామ్ ।
సంస్కారేణ యథా హీనాం వాచ మర్ధాంతరం
గతామ్ ॥ 39
తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీ
మనిందితామ్ ।
తర్కయామాస
సీతేతి కారణైరుపపాదిభిః ॥ 40
మాటిమాటికి అభ్యాసము చేయకపోవడంతో
నెలకొనక మఱచిపోయిన విద్యలా, కృశించి ఉన్న, సీతను, మాటిమాటికి చూసి, “ ఇలా చిక్కి స్రుక్కి మలినయై ఉన్నదే! ఈమె సీత అగునో, కాదో” అని ఆ హనుమంతుని బుద్ధి సందేహం
పొందింది. చక్కగా శబ్దవ్యుత్పత్తి తెలియనివాడు తానొకమాట చెప్పఁగా అది శబ్దవ్యుత్పత్తిచే సవరించకపోవడం వల్ల చెప్పఁదలచిన అర్థం కాక వేఱొక అర్థం
ప్రతిపాదించబడినదై, పిదప వాఁడు శబ్దవ్యుత్పత్తి ఎఱిగాక, దాని అర్థం
ఇది అని తెలియునట్లు, హనుమంతుఁడు
అలంకారం లేక, ఉపవాసాదులతో, మాఱరూపు పొంది ఉన్న సీతను, రాముఁడు చెప్పిన చిహ్నాలనుబట్టి ఆలోచించి, పిదప బహుకష్టంతో
తెలిసికొన్నాడు. అనిందితయైన ఆ వాలుగన్నుల రాజకుమారిని చూసి, ఉపపాదకాలైన
కారణాలచేత సీత అని ఊహించాడు.
వైదేహ్యా యాని చాంగేషు తదా రామో౭న్వకీర్తయత్
।
తాన్యాభరణజాలాని శాఖాశోభీ
న్యలక్షయత్ ॥ 41
రాముడు, హనుమంతునితో, బయలుదేఱేటప్పుడు సీత అంగాలయందు ఏయే
ఆభరణాలున్నట్లు చెప్పెనో, ఆ
ఆభరణాలన్నీ, సీత, పతివ్రత కాబట్టి భర్తృవిరహంలో ధరించకూడదని, చెట్టుకొమ్మలకు కట్టి ఉంచడాన్ని, చూశాడు.
సుకృతౌ కర్ణవేష్టౌ
చ శ్వదంష్ట్రౌ
చ సుసంస్థితౌ ।
మణివిద్రుమచిత్రాణి హస్తే ష్వాభరణాని చ
॥ 42
శ్యామాని చిరయుక్తత్వా త్తథా
సంస్థానవంతి చ ।
తా న్యే వైతాని మన్యే౭హం
యాని రామో౭న్వకీర్తయత్!।
43
తత్రయా న్యవహీనాని తా న్యహం నోపలక్షయే ।
యా న్యస్యా నావహీనాని తా నీమాని న సంశయః
॥ 44
అవి, చక్కని పనితనం
కల కుండలాలు, త్రివర్ణకపు పువ్వులరూపాన
చక్కనై రూపొందిన కర్ణపార్శ్వభూషణాలు, మఱియు వానిలో హస్తాలందు మణులచేతా, పగడాలచేతా రచితాలై, వింతవింతలైన
ఆభరణాలు, ఆవిడ విరహతాపపువేడిమి సోకి, నల్లబాఱి
ఉన్నాయి. మఱియు అతడు ఆమె అవయవాల్లో, ఆయా ఆభరణాలు, చాలకాలంగా
ధరించినవి కావడంవల్ల, అపుడు విడువబడినా, వాటిని వాటి
ఆకారాలుగా ఏర్పడి ఉన్న ముద్రలను చూశాడు. చూసి, “ రాముడు
గుర్తులుగా చెప్పిన ఆభరణాలు ఇవే
కానీ వేఱు కాదు. ఆ ఋశ్యమూకంపై సీత, ఏ ఆభరణాల్ని
పడవేసిందో, ఆ ఆభరణాలు నాకిక్కడ
కనబడలేదు. అప్పుడు పాఱవేయని ఆభరణాలే ఇప్పుడున్నవి. ఇందుకు సందేహం లేదు.
పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభమ్
।
ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైః
॥ 45
అప్పుడు ఋశ్యమూకపర్వతంపై, పసుపురంగు కలిగి, బంగారుపట్టెలా మెఱస్తున్న, మేలి ఉత్తరీయాన్ని, జాఱ విడువబడి చెట్టుకొమ్మకు తగిలి ఉండగా, వానరులు చూశారు.
భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే ।
అనయై వాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ ॥ 46
మఱియు గల్లుగల్లుమని ధ్వనిస్తూ, గొప్పలై ఉన్న మేలి ఆభరణాల్ని, భూమిపై వేయగా వారు చూశారు కదా!. అవన్నీ
ఈవిడ, తీసి, పాఱవేసినవే
అవుతాయి.
ఇదం చిరగృహీతత్వాద్వసనం క్లిష్టవత్తరమ్
।
తథా౭పి
నూనం తద్వర్ణం
తథా శ్రీమ ద్యథేతరత్ ॥
47
ఈ వస్త్రం, బహుకాలంగా విడువక, తొడుగబడటంవల్ల చాల నలఁగుడుపడి మిక్కిలి మాసి ఉంది. అయినా, ఆ పర్వతంపై పాఱవైచినదానిలాగ అదే రంగు, అదే కాంతి కలిగి ఉంది.
ఇయం కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ।
ప్రణష్టాపి సతీ యా౭స్య మనసో నా ప్రణశ్యతి ॥ 48
ఏ సీత, రాముని కన్నులకు కనబడకున్నదైనా, అతఁ డెల్లప్పుడూ మనసులో ధ్యానిస్తూండడాన్ని
బట్టి, సదా విడువక ఆ
రాముని మనస్సులోనే ఉంటుందో, బంగారువంటి
మేనిరంగు కల చెలువ, రాముని
ప్రియమహిషి అయినట్టి ఆ
సీతే, ఈవిడ.
ఇయం సా యత్కృతే
రామః చతుర్భిః
పరితప్యతే ।
కారుణ్యే నానృశంస్యేన శోకేన మదనేన చ ॥ 49
స్రీ ప్రణష్టేతి
కారుణ్యా దాశ్రితే త్యానృశంస్యతః ।
పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ ॥ 50
రాముడు ఏ సీత గుఱించి కారుణ్యం, అక్రూరత్వం (ఆశ్రితరక్షణైక స్వభావము), శోకం, మన్మథవికారం అనే ఈ నాలుగింటి చేతా, అనఁగా ఆపత్కాలంలో
స్త్రీలను రక్షించాలి కానీ రక్షించలేకపోయానే
అనే కారుణ్యం చేతా, ఆశ్రితురాల్ని
రక్షించటానికి లేకపోయిందే అనే ఆశ్రితరక్షణైకస్వభావంచేతా, వేదాలు, మగవాని దేహంలో సగం
భార్య అని చెప్పునట్లు నాలో సగమైన నాయిల్లాలు కనబడకపోయిందే
అనే శోకం చేతా, నామనస్సునకు ఇంపు కూర్చే ప్రియురాలు కానరాకున్నదే
అనే మన్మథవికారం చేతా పరితపిస్తున్నాడో
ఆ సీతే ఈ సుదతి.
అస్యా దేవ్యా యథా రూప
మంగప్రత్యంగసౌష్టవమ్ ।
రామస్య చ యథా రూపం త స్యేయ మసితేక్షణా ॥ 51
ఈ దేవిశరీరం, అంగ ప్రత్యంగాల సౌందర్యం ఎట్టివో, ఆ రాముని శరీరమూ, అంగ ప్రత్యంగాల సౌందర్యమూ
అట్టివే. కాన అతనికి నల్లనికన్నుంగవ కల
ఈ చిన్నారి తగి ఉన్నది.
అస్యా దేవ్యా మన స్తస్మిం స్తస్య
చాస్యాం ప్రతిష్ఠితమ్ ।
తేనేయం స చ ధర్మాత్మా ముహూర్త మపి జీవతి
॥ 52
ఈసీత మనసు రామునియందు, రాముని మనస్సు ఈమెయందు, ఇలా
ఇరువురూ ఒండొరుల మనస్సులయందు స్థిరంగానూ, దృఢంగానూ నెలకొని ఉండడంవల్లే
ఇలా బ్రతికున్నారు కానీ లేకపోతే ముహూర్తంసేపయినా బ్రతికి ఉండలేరు.
దుష్కరం కృతవాన్రామో హీనో య దనయా ప్రభుః
।
ధారయత్యాత్మనో దేహం న శోకే నావసీదతి ॥ 53
"రాముడు, సీత లేకున్నా దేహాన్ని
ధరించి ఉన్నాఁడే! సీత మాత్రం స్వతంత్రురాలు కాదు కాన దేహాన్ని
విడచిపెట్టలేదు. రాముఁడు మగవాడు కాన స్వతంత్రుడై ఉన్నప్పటికీ
దేహాన్ని విడువలేదు. మఱి దుఃఖాన స్రుక్కి, చిక్కక ఉన్నాడు. ఇది దుష్కరమైన కార్యం. ఇలాంటి దాన్ని అతఁడు చేశాడు.
ఇలా మఱెవ్వరు ఉండలేరు.
దుష్కరం కురుతే రామో య ఇమాం
మత్తకాశినీమ్ ।
సీతాం వినా మహాబాహు ర్ముహూర్తమపి జీవతి
॥ 54
ఉత్తమకాంతారత్నమైన
ఈ సీతను విడిచి, ఇంతవఱకు ఆ రాముఁడు ముహూర్తమైనా బ్రతికున్నాడు. ఇలాంటి
సతిని విడిచి మఱొకఁ డుండలేఁడు. కాబట్టి అతఁ డెలాంటివారికైనా చేయ నలవి కాని కార్యాన్ని
చేస్తున్నాడు” అని భావించాడు.
ఏవం
సీతాం తదా దృష్ట్వా హృష్టః పవనసంభవః ।
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్ ॥
55
హనుమంతుఁ డప్పుడలా మాసినచీరకట్టి, ఉపవాసాదిపతివ్రతాధర్మాలతో కూడి
ఉన్న సీతను చూసి, సంతోషించి, మనసులో రాముని తలచుకొని, ఆయనను మరల పొందటానికి
అవసరమైన పతివ్రతాధర్మాల్ని పాటించే సీతను పొందిన
రామప్రభువు, “మహాభాగ్యవంతుడే” అని
ఆయనను, ప్రశంసించాడు.
------------------------------------------------------------------------------------
ఆత్తసజ్యధనుషావిషుస్పృశా
వక్ష యాశుగనిషఙ్గసఙ్గినౌ |
రక్షణాయ
మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ||20||
ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచదశస్సర్గః (15)
మంగళం మహత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి