20, మే 2020, బుధవారం

Sundarakanda సుందరకాండ 2


రామసుందరం

ద్వితీయస్సర్గః

స సాగర మనాధృష్య మతిక్రమ్య మహాబల: |

త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ || 1

ఆ మహాబలుడు, సముద్రాన్ని అవలీలగా దాటి, స్వస్థచిత్తుడై, త్రికూటశిఖరాన ఉన్న లంకను చూశాడు.

తత: పాదపముక్తేన పుష్ప వర్షేణ వీర్యవాన్ |

అభివృష్ట: స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా || 2

ఆ పర్వతం మీద వృక్షాలు వర్షంలా కురిపించే పూలతో , ఆయన శరీరం, పుష్పమయమైంది.

యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వా౭ప్యుత్తమవిక్రమ: |

అనిశ్శ్వసన్ కపిస్తత్ర న గ్లాని మధిగచ్ఛతి || 3

నూఱు యోజనాల సముద్రాన్ని దాటి కూడా ఆయన ఏమాత్రం అలసట పొందలేదు. పైగా ఒక్క నిట్టూర్పు నైనా విడవలేదు.

శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి |

కిం పున స్సాగర స్యాంతం సంఖ్యాతం శతయోజనమ్ || 4

"వందల యోజనాలనైనా దాటగలను. ఒక్క నూఱు యోజనాల సముద్రాన్ని దాటడంలో ఆశ్చర్యమేముంది" అనుకొన్నాడు.

స తు వీర్యవతాం శ్రేష్ఠ: ప్లవతామపి చోత్తమ: |

జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోధధిమ్ || 5

వీరులలో శ్రేష్ఠుడు, ఎగిరేవారిలో ఉత్తముడు కాబట్టి ఆయన మహసముద్రాన్ని దాటి, లంకను చేరగలిగాడు.

శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ |

గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ || 6

ఆయన, నల్లని పచ్చిక నేలలు, గండశిలలు, నగాలు, (వృక్షాలు, కొండలు) సువాసనలు కలిగిన అడవులను మధ్యమార్గాన చూస్తూ వెళ్లాడు.

శైలాంశ్చ తరుసంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితా: |

అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభ: || 7

దట్టంగా వృక్షాలున్నపర్వత శిఖరాలను, పుష్పించిన వనాలను దాటాడు.

స తస్మిన్నచలే తిష్ఠన్ వనాన్యుపవనాని చ |

స నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ: || 8

ఆయన, లంబపర్వతంపై ఉండి, అక్కడి వనాలను, ఉపవనాలను, (తోటలను) త్రికూట పర్వత శిఖరంపై ఉన్న లంకను చూశాడు.

సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ |

ప్రియాళాన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి || 9

అక్కడి సరళ (దేవదారు), కొండగోగు,  ఖర్జూరం, మోరటి, నిమ్మ చెట్లను, కొండమల్లె, మొగలి పొదలను,

ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్ఛదాం స్తథా |

అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ || 10

సువాసనల పిప్పలి, కడిమి, ఏడాకుల అరటి, వేగిస, కాంచన, పుష్పించిన గన్నేరు చెట్లను,

పుష్పభారనిబద్ధాంశ్చ తథాముకుళితానపి |

పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్ || 11

పూలభారంతో వంగిన, మొగ్గ తొడిగిన, వివిధ పక్షులతో నిండిన, గాలికి తలలూపే ఇతర చెట్లను,

హంసకారండవాకీర్ణా వాపీ: పద్మోత్పలాయుతా: |

ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ || 12

హంసలు, కారండపక్షులు, పద్మాలు, కలువలు కల దిగుడుబావులు, సుందర విహారస్ఠలాలు, జలాశయాలు,

సంతతాన్ వివిధైర్వృక్షై: సర్వర్తుఫలపుష్పితై: |

ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర: || 13

అన్ని ఋతువుల్లోనూ పుష్పించే, ఫలించే వృక్షాలను, అందమైన ఉద్యానవనాలను, ఆయన, చూశాడు.

సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణపాలితామ్ |

పరిఖాభి: సపద్మాభి: సోత్పలాభి రలంకృతామ్ || 14

లంకను సమీపించాడు. ఆ లంక పద్మాలు, కలువలు కల అగడ్తలతో,

సీతాపహరణార్థేన రావణేన సురక్షితామ్ |

సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి: || 15

సీతను అపహరించిన రావణుని రక్షణలో ఉంది. ఉగ్రధనస్సులను ధరించిన రాక్షసులు కావలి కాస్తున్నారు.

కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేన మహాపురీమ్ |

గృహైశ్చ గ్రహసంకాశై: శారదాంబుదసన్నిభై: || 16

బంగారు ప్రాకారాలతో, తెల్లని, గ్రహ సదృశ (సమాన) గృహాలతో,

పాండురాభి: ప్రతోళీభి: ఉచ్చాభి రభిసంవృతామ్ |

అట్టాలకశతాకీర్ణాం పతాకాధ్వజశోభితామ్ || 17

స్వచ్ఛాలై, విశాలమైన ప్రధాన వీథులతో, లెక్కలేనన్ని కోట బురుజులతో, పతాక ధ్వజాలతో,

తోరణై: కాంచనైర్దివ్యై: లతాపంక్తివిచిత్రితై: |

దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా || 18

బంగారు తోరణాలతో, విచిత్ర లతా పంక్తులతో, అమరావతిలా వెలిగిపోతోంది.

గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనై: శ్శుభై: |

దదర్శ స కపిశ్రేష్ఠ: పురమాకాశగం యథా || 19

తెల్లని, అందమైన భవనాలతో ఆ లంక, త్రికూట శిఖరాన ఉండడంతో, హనుమంతుడు, దాన్ని, 'ఆకాశపురం'గా భావించాడు.

పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా |

ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీమ్ || 20

రావణ పాలితమై, విశ్వకర్మ నిర్మితమైన ఆ పురం, 'ఆకాశంలో తేలియాడుతోందా' అన్నట్లుంది.

వప్రప్రాకారజఘనాం విపులాంబునవాంబరామ్ |

శతఘ్నీశూలకేశాంతా మట్టాలకవతంసకామ్ || 21

కోట ప్రాకారమే జఘనంగా, విపులమైన సముద్ర / అగడ్తలలోని జలాలే నూత్నవస్త్రాలుగా, శతఘ్నులు, శూలాలే కేశపాశాలుగా, కోట బురుజులే కర్ణాభరణాలుగా భాసిల్లే, సుందరిలా,

మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా |

ద్వార ముత్తర మాసాద్య చింతయామాస వానర: || 22

విశ్వకర్మ, మనసు పెట్టి నిర్మించిన, ఆ లంక ఉత్తరద్వారం దగ్గరకు చేరి, మారుతి, ఆలోచన మొదలుపెట్టాడు.

కైలాసశిఖరప్రఖ్యామ్ ఆలిఖంతీ మివాంబరమ్ |

డీయమానా మివాకాశ ముచ్ఛ్రితై ర్భవనోత్తమై: || 23

"ఈ నగరం, కైలాస శిఖర సమానమై, అంబరాన్నంటే మహాభవనాలతో, ఆకాశంలో ఎగురుతోందా? అన్నట్లుంది.

సంపూర్ణాం రాక్షసైర్ఘోరై: నాగైర్భోగవతీమివ |

అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా || 24

పూర్వం కుబేరుని అధీనంలో ఉండి, స్పష్టంగా, చక్కగా నిర్మింపబడిన ఈ పురం నాగజాతులుండే భోగవతి (పాతాళం) లా భయంకరమైన రాక్షసులతో నిండి ఉంది.

దంష్ట్రిభిర్బహుభిశ్శూరైః శూలపట్టిసపాణిభి: |

రక్షితాం రాక్షసైర్ఘోరై: గుహామాశీవిషైరివ || 25

సర్పాలు కావలి కాచే గుహలా, ఈ లంక, కోఱలు, శూలాలు, పట్టిసాలు, ధరించిన  ఎంతోమంది శూరులైన రాక్షసులచే రక్షింపబడుతోంది".

తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య స: |

రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానర: || 26

లంక రక్షణ విధానాన్ని, దాని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూచి, మారుతి, రావణుని భయంకరమైన శత్రువుగా భావించి, ఇలా ఆలోచించాడు.

ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకా: |

న హి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి || 27

"వానరులు ఇక్కడికి వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఈ లంకను జయించడం దేవతలవల్ల కూడా కాదు.

ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితామ్ |

ప్రాప్యాపి స మహాబహు: కిం కరిష్యతి రాఘవ: || 28

ఎంతటివారికైనా ప్రవేశించ శక్యం కానిది ఇది. రాముడు, మహాబాహువైనా లంకను చేరి, ఏం చేయగలడు?

అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే |

న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే || 29

రాక్షసులు కాబట్టి సామోపాయానికి అవకాశం లేదు. ధనవంతులు కాన దానమూ పనిచేయదు. బలవంతులు కాబట్టి భేదానికీ చోటు లేదు. ఇక యుద్ధమన్న పరిస్థితి కనిపించడం లేదు. (4 ఉపాయాలూ* నిరర్థకాలు )

చతుర్ణామేవ హి గతి: వానరాణాం మహాత్మనామ్ |

వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమత: || 30

అంగదుడు,* నీలుడు,* నేను, సుగ్రీవుడు * నలుగురం మాత్రమే లంకలోకి ప్రవేశించగలం.

యావజ్జానామి వైదేహీం యది జీవతి వా న వా |

తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజామ్ || 31

అయినా వైదేహి* బ్రతికి ఉందా లేదా అని తెలుసుకొని, ఆమెను చూచిన తర్వాతే  ఆలోచించడం యుక్తం.

తతస్స చింతయామాస ముహూర్తం కపికుంజర: |

గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రత: || 32

రామాభ్యుదయరతుడైన హనుమంతుడు, ఆ గిరి శిఖరం మీద నిలచి, క్షణం ఆలోచించాడు.

అనేన రూపేణ మయా న శక్యా రక్షసాం పురీ |

ప్రవేష్టుం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితై: || 33

క్రూరులు, బలవంతులు అయిన రాక్షసులు రక్షించే ఈ లంకాపురంలోకి, నే నీ రూపంలో ప్రవేశించడం అసాధ్యం.

ఉగ్రౌజసో మహావీర్యా బలవంతశ్చ రాక్షసా: |

వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా || 34

ఉగ్రులు, మహాబలురైన ఈ రాక్షసుల కన్నుగప్పి, జానకి*ని వెతకాలి.

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీ మయా |

ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ || 35

కనబడీ కనబడని (సూక్ష్మ) రూపాన్ని ధరించి, రాత్రిపూట ప్రవేశించటం యుక్తం.

తాం పురీం తాదృశీం దృష్ట్వాదురాధర్షాం సురాసురై: |

హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహు: || 36

సురాసురులకు దుర్భేద్యమైన లంకను చూచి, సీతను వెతికే రీతిని నిశ్చయింఛుకొన్నా, హనుమంతుడు, మాటిమాటికీ ఆలోచించాడు.

కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజామ్ |

అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా || 37

రావణునికి తెలియకుండా మైథిలి*ని చూడాలి. దానికేది ఉపాయం?

న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మన: |

ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజామ్ || 38

రామకార్యం భంగం కాకుండా ఎలా ప్రవర్తించాలి? ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండే సీతను నేనొక్కడనే ఎలా చూడగలను?

భూతాశ్చార్థా విపద్యంతే దేశకాలవిరోధితా |

విక్లబం దూతమాసాద్య  తమస్సూర్యోదయే యథా || 39

దూత అవివేకం వల్ల ఫలితాలనిచ్చే పనులు కూడా దేశకాలవిరోధాలై సూర్యోదయకాలంలో చీకట్లలా నశిస్తాయి.

అర్థానర్థాంతరే బుద్ధి: నిశ్చితాపి న శోభతే |

ఘాతయంతి హి కార్యాణి దూతా: పండితమానిన: || 40

తాము పండితులమని అహంకరించే దూతలవల్ల ఏం చేయాలో ముందే నిశ్చయించిన పనులైనా సఫలం కావు.

న వినశ్యేత్ కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్

లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్ || 41

ఏం చేస్తే, రామకార్యం చెడకుండా, నాకు అవివేకి అనే పేరు రాకుండా, సముద్ర లంఘనం వ్యర్థం కాకుండా. ఉంటుంది?

మయి దృష్టే తు రక్షోభీ రామస్య విదితాత్మన: |

భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్ఛత: || 42

నేను, రాక్షసుల కంటబడితే, రావణసంహారాన్ని కోరుతున్న రాముని కార్యం వ్యర్థం.

న హి శక్యం క్వచిత్ స్థాతు మవిజ్ఞాతేన రాక్షసై: |

అపి రాక్షసరూపేణ కిముతాన్యేన కేనచిత్ || 43

రాక్షసరూపాన్ని ధరించినా, లంకలో ఎక్కడుండటానికి సాధ్యం కాదు. రాక్షసులు పసిగట్టగలరు. ఇక ఇతర రూపాల గుఱించి, చెప్పడం ఎందుకు?

వాయురప్యత్ర నాజ్ఞాత: చరేదితి మతిర్మమ |

న హ్యస్త్యవిదితం కించిత్ రాక్షసానాం బలీయసామ్ || 44

రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలి కూడా తిరగదనుకొంటున్నాను. వీరికి తెలియనిది లేదు.

ఇహాహం యది తిష్ఠామి స్వేన రూపేణ సంవృత: |

వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హీయతే || 45

నేనిక్కడ నా నిజరూపంతో ఉంటే నాకు కీడు తప్పదు. ప్రభుకార్యం కూడా చెడిపోతుంది.

తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గత: |

లంకామభిషపతిష్యామి రాఘవస్యార్థసిద్ధయే || 46

అందువల్ల సూక్ష్మరూపాన్ని ధరించి, రాత్రివేళ లంకలోకి ప్రవేశిస్తాను.

రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదామ్ |

విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజామ్ || 47

తేలికగా ప్రవేశించరాని ఈ నగరాన్ని రాత్రివేళ ప్రవేశించి, అన్ని భవనాలను పూర్తిగా వెదకి, సీతను దర్శిస్తాను."

ఇతి నిశ్చిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపి: |

ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుక: || 48

అని హనుమంతుడు నిశ్చయించుకొని, వైదేహీ దర్శనార్థం ఉత్సుకత పడుతూ సూర్యాస్తమయం కోసం ఎదురుచూడసాగాడు.

సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి: |

పృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుతదర్శన: || 49

సూర్యుడస్తమించగానే వాయుపుత్రుడు, మార్జాల*మంత ప్రమాణాన తన రూపాన్ని కుదించుకొని, చూసేవారికి ఆశ్చర్యం కల్గించాడు.

ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్పుత్య వీర్యవాన్ |

ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్తమహాపథామ్ || 50

ప్రదోష*కాలంలో వేగంగా ఎగిరి, చక్కగా విభజింపబడిన రాజమార్గాలు కల లంకలోకి ప్రవేశించాడు.

ప్రాసాదమాలావితతాం స్తంభై: కాంచనరాజతై: |

శాతకుంభమయైర్జాలై: గంధర్వనగరోపమామ్ || 51

ప్రాసాదాల వరుసలతో బంగారు వెండి స్తంభాలతో బంగారు కిటికీలతో గంధర్వనగరంలా,

సప్తభౌమాష్టభౌమైశ్చ స దదర్శ మహాపురీమ్ |

తలై: స్ఫటికసంకీర్ణై: కార్తస్వరవిభూషితై: || 52

తలాలు స్ఫటికమణులతో పొదగబడి, సువర్ణభూషితాలైన ఏడంతస్తుల, ఎనిమిదంతస్తుల భవనాలతో ఒప్పే ఆ నగరాన్ని హనుమంతుడు చూశాడు.

వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాలవిభూషితై: |

తలైశ్శుశుభిరే తాని భవనాన్యత్ర రక్షసామ్ || 53

రాక్షస భవన భూభాగాలు వైడూర్యమణులతో చిత్రింపబడి, ముత్యాలతో అలంకరింపబడి, ప్రకాశిస్తున్నాయి.

కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసామ్ |

లంకాముద్యోతయామాసు: సర్వతస్సమలంకృతామ్ || 54

రాక్షసగృహచిత్రతోరణాలు బంగారంతో నిర్మింపబడినవై సమలంకృతమైన లంకను మఱింత ప్రకాశింపచేస్తున్నాయి.

అచింత్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపి: |

ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః || 55

అచింత్యం, అద్భుతం అయిన ఆ లంకను చూచి, హనుమంతుడు, విషాదానికీ లోనయ్యాడు. వైదేహీదర్శనకుతూహలుడై సంతోషాన్నీ పొందాడు.

స పాండురోద్విద్ధవిమానమాలినీం

మహార్హజాంబూనదజాల తోరణాం |

యశస్వినీం రావణబాహుపాలితాం

క్షపాచరైః భీమబలైః స్సమావృతామ్|| 56

స్వచ్ఛరాజప్రసాదపంక్తులతో, బంగారుకిటికీలతో, తోరణాలతో, భీమబలురైన రాక్షసులతో, ప్రసిద్ధమైన లంకను హనుమంతుడు చూశాడు.

చంద్రో౭పి సాచివ్యమివాస్య కుర్వన్

తారాగణై ర్మధ్యగతో విరాజన్ |

జ్యోత్స్నావితానేన వితత్య లోకమ్

ఉత్తిష్ఠతే నైకసహస్రరశ్మిః || 57

అప్పుడు వేలకిరణాలు గల చంద్రుడు తారగణాలమధ్య విలసిల్లుతూ, వెన్నెలచాందినీతో లోకాన్ని కప్పివేస్తూ, హనుమంతునికి సహాయం చేస్తున్నవానిలా ఉదయించాడు.

శంఖప్రభం క్షీరమృణాళవర్ణమ్

ఉద్గచ్ఛమానం వ్యవభాసమానమ్ |

దదర్శ చంద్రం స హరిప్రవీరః

పోఫ్లూయమానం సరసీవ హంసమ్ || 58

ఉదయించి, పైకి వస్తున్న చంద్రుడు శంఖప్రభలతో పాలలాంటి తెల్లని తామర తూడుల వర్ణాలతో, ప్రకాశిస్తూ, సరస్సున ఈదుతున్న హంసలా మనోహరంగా ఉన్నాడు. అట్టి చంద్రుని హనుమంతుడు చూశాడు.

-------------------------------------------------------------------------------------------------------------

* ఉపాయం  =  సాధనం. ఇవి నాలుగు. 1. సామం, 2. దానం, 3. భేదం, 4. దండం. అనుకూలం కానివారిని అనుకూలం చేసుకోవడానికి / లొంగదీసుకోవడానికి / శత్రువును జయించడానికి ఉపయోగించేవి.

1.సామం అనుకూల ప్రవర్తన రూపమైన ఉపాయం. ఇది 5 రకాలు.1. పరస్పరోపకారం కనిపింపజేయటం - నీవది చేస్తే నేనిది చేస్తా.........మొదలైనవి (quid pro quo) 2. మంచితనం చేయడం.- మంచి చేసుకోవడం. 3.గుణాల్ని కొనియాడటం - పొగడడం. 4. చుట్టఱికాన్ని తెలుపడం. - మనం మనం చుట్టాలం. 5. నేను నీవాడనని మంచి మాటలాడడం. - నీవూ నేనూ ఒకటే......మొదలైనవి.

2. దానం = ఇవ్వడం. ఇదీ 5 రకాలే. 1. తన ధనం (అంతా) ఇవ్వడం. 2. ఎక్కడి ధనమైనా తీసుకొంటే దానికి తాను అనుకూలంగా ఉండటం. 3. అపూర్వవస్తువులను ఇవ్వడం. 4. ఇంకొకఱి ధనం పుచ్చుకొనేలా చేయడం. 5. అప్పు తీర్చడం.

3. భేదం = విడగొట్టడం. ఇది 3 రకాలు. 1. శత్రువుల స్నేహాన్ని పాడుచేయడం2. శత్రువుల మధ్య ఘర్షణ పుట్టించడం3. బెదిరించడం.

4. దండం = దండించడం. ఇది 3 రకాలు. 1. ధనం హరించడం2. పీడించడం. (బాధ పెట్టడం3. వధించడం. (చంపడం)

కొందఱు రాజనీతికోవిదులు  మాయ, ఉపేక్ష, ఇంద్రజాలం ఈ మూడూ కలిపి సప్తోపాయాలు అన్నారు.

మాయ =  మోసం అని చెప్పుకోవచ్చు. ఉపేక్ష   =  పట్టించుకోకపోవడం. ఇంద్రజాలం = కనికట్టు చేయడం.

ఇవి కాక నాయకుడు నాయిక కోపాన్ని పోగొట్టేటప్పుడు ఉపయోగించే ఉపాయాలు ఆఱు. సామం, దానం, భేదం, ఉపేక్ష, నతి ( నమస్కారం ), రసాంతరం 

* అంగదుడు - వాలి పుత్రుడుతల్లి  తార. కిష్కింధకు సుగ్రీవుడు రాజయ్యాక ఇతడు యువరాజయ్యాడు. రాముడు లంక చేరాక, అంగదుడు రావణుని వద్దకు దూతగా వెళ్లాడు.

* నీలుడు -  సుగ్రీవుని సేనాధిపతి. మహాబలవంతుడు.

* సుగ్రీవుడు - స్త్రీ రూపంలో ఉన్న ఋక్షవిరజునియందు సూర్యునివల్ల జన్మించిన వానరుడు. వాలి తమ్ముడు. హనుమంతుడు ఇతని మంత్రి.

* వైదేహి - విదేహ రాజ పుత్రిక = సీత.

* మార్జాలం -  పిల్లి. చడీ చప్పుడు లేకుండా, ఎవరి కంటా పడకుండా సంచరించటం పిల్లి స్వభావం. కాబట్టి హనుమంతుడు పిల్లి ప్రమాణంలోకి తన రూపాన్ని కుదించుకొన్నాడని తలచవచ్చు

* ప్రదోషం -  మునిమాపు. దోషాయాః ప్రారంభః ప్రదోషః. దోష అనగా రాత్రి. దాని యొక్క ప్రారంభం ప్రదోషం. ఇది ఈశ్వరునికి ఇష్టమైన సమయం. ఈ సమయంలో ఈశ్వర ప్రార్థన చాల మంచిది.

--------------------------------------------------------------------------------------

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ | మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జామ్బవదాశ్రయః ||7||



ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ద్వితీయస్సర్గః (2)



మంగళం మహత్
                                         


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...