21, మే 2020, గురువారం

Sundarakanda సుందరకాండ 3



రామసుందరం
తృతీయస్సర్గః
స లంబశిఖరే లంబే లంబతోయదసన్నిభే |
సత్త్వమాస్థాయ మేధావీ హనుమాన్ మారుతాత్మజ: || 1
ఆ హనుమంతుడు, లంబశిఖరాలతో లంబ (ఎత్తైన / వంగిఉండే) మేఘంలా ఉన్న లంబ పర్వతాన
నిశి లంకాం మహాసత్త్వోవివేశ కపికుంజర: |
రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితామ్ || 2
అందమైన వనాలు, జలాశయాలూ ఉన్నలంకలోకి రాత్రివేళధైర్యంగా ప్రవేశించాడు.
శారదాంబుధరప్రఖ్యై: భవనైరుపశోభితామ్ |
సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితామ్ || 3
ఆ నగరంలో శరత్కాలమేఘాల్లాంటి స్వచ్ఛమైన (తెల్లని) భవనాలున్నాయి. జనుల కలకలం సాగరఘోషను తలపిస్తోంది. సముద్రపుగాలి లంకను సేవిస్తోంది.
సుపుష్టబలసంఘుష్టాం యథైవ విటపావతీమ్ |
చారుతోరణనిర్యూహాం పాండురద్వారతోరణామ్ || 4
అలకాపురిలాంటి ఆ లంకలో బలవంతులైన సైనికులు సింహనాదాలు చేస్తున్నారు. ద్వారాల్లో నాగాలున్నాయి. ద్వారతోరణాలు స్వచ్ఛంగా ఉన్నాయి.
భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ |
తాం స విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్గణనిషేవితామ్ |
మందమారుతసంచారాం యథేంద్రస్యామరావతీమ్ || 5
సర్పసంచారాలతో  భోగవతిలా, సురక్షితమై, సుందరమై ఉంది. అమరావతిలా మెఱుపు మేఘాల వ్యాప్తమై నక్షత్రమండలంతో మెరుస్తోంది. గాలి మెల్లగా వీస్తోంది.
శాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతామ్ |
కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతామ్ || 6
ఆ పురి చుట్టూ ఎత్తైన బంగారు ప్రాకారముంది. పతాకాలు ఎగురుతూంటే, వాటి చిఱుగంటలు సవ్వడి చేస్తున్నాయి.
ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్ |
విస్మయావిష్టహృదయ: పురీమాలోక్య సర్వత: || 7
ఆ నగరాన్ని శీఘ్రంగా చేరి, హనుమంతుడు దాని ప్రాకారంపైకి ఎక్కాడు. ఆ లంకంతా కలయజూసి, మనసులో ఆశ్చర్యపోయాడు.
జాంబూనదమయైర్ద్వారై: | వైడూర్యకృతవేదికై: || 8
స్వర్ణ ద్వారాలు, వైడూర్య వేదికలు,
వజ్రస్ఫటికముక్తాభి: మణికుట్టిమభూషితై: |
తప్తహాటకనిర్యూహై రాజతామలపాండురై: || 9
వజ్ర స్ఫటిక ముక్త కుట్టిమాలు (నేలలు), అపరంజి ఏనుగులు, రజత నిర్మిత ప్రదేశాలు,
వైడూర్యకృతసోపానై: స్ఫాటికాంతరపాంశుభి: |
చారుసంజవనోపేతై: ఖమివోత్పతితైశ్శుభై: || 10
వైడూర్య సోపానాలు, స్ఫటిక మణిమయ ముంగిళ్లు, మనోహర సభాస్థలాలు, వీటితో ఆ గృహాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుండి,  ప్రకాశిస్తున్నాయి.
క్రౌంచబర్హిణసంఘుష్టై రాజహంసనిషేవితై: |
తూర్యాభరణనిర్ఘోషై: సర్వత: ప్రతినాదితామ్ || 11
క్రౌంచపక్షులు, నెమళ్ల మధురమైన కూతలు, రాజహంసలు, అంతటా తూర్యధ్వనులు, ఆభరణాల గలగలలతో,
వస్వౌకసారాప్రతిమాం తాం వీక్ష్య నగరీం తత: |
ఖమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపి: || 12
అలకాపురికి సాటై, ఆకాశానికి ఎగిరిపోతున్నదా అన్నట్లున్న ఆ లంకను చూసి, హనుమంతుడు, సంతోషించాడు.
తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతేశ్శుభామ్ |
అనుత్తమామ్ బుద్ధియుతాం చింతయామాస వీర్యవాన్ || 13
ఆ రావణపురిని బాగా చూసి, ఆ బుద్ధిమంతుడు ఇలా అనుకొన్నాడు.
నేయమన్యేన నగరీ శక్యా ధర్షయితుం బలాత్ |
రక్షితా రావణబలై: ఉద్యతాయుధధారిభి: || 14
" ఆయుధాలను ధరించి, రావణ సైన్యాలు రక్షిస్తున్న ఈ నగరాన్ని, బలంతో ఎవరూ జయించలేరు.
కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపే: |
ప్రసిద్ధేయం భవేద్భూమి: మైందద్వివిదయోరపి || 15
అయితేదుర్భేద్యమైనప్పటికీ ఈ నగరాన్ని కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు జయించగలరు.
వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణ: |
ఋక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ || 16
సుగ్రీవునకుకుశపర్వునకు, ఋక్షునకుకేతుమాలునకు, నాకు ఈ లంక సాధ్యం అవుతుంది."
సమీక్ష్య తు మహాబాహో రాఘవస్య పరాక్రమమ్ |
లక్ష్మణస్య చ విక్రాంత మభవత్ ప్రీతిమాన్ కపి: || 17
రాముని పరాక్రమాన్ని, లక్ష్మణుని విక్రమాన్ని, తలచి,  (లంక ఎలాంటిదైతే ఏంటని) సంతోషించాడు.
తాం రత్నవసనోపేతాం కోష్ఠాగారావతంసకామ్ |
యంత్రాగారస్తనీమ్ ఋద్ధాం ప్రమదామివ భూషితామ్ || 18
రత్నకాంతులే వస్త్రాలుగా, కోష్ఠాగారాలే కర్ణాభరణాలుగా యంత్రాగారాలే ఉరోజాలుగా ఆ లంక  అలంకరించుకొన్న స్త్రీలా ఉంది.
తాం నష్టతిమిరాం దీప్తై: భాస్వరైశ్చ మహాగృహై: |
నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకపి: || 19
చీకట్లను తొలగించి, అక్కడి గృహదీపకాంతులు లంకను వెలిగించగా, హనుమంతుడు  చూశాడు.
అథ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలమ్ |
నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజమ్ || 20
ఆయన  ప్రవేశిస్తూండగా, లంకాధిదేవత నిజరూపంతో చూసింది.
సా తం హరివరం దృష్ట్వాలంకా రావణపాలితా |
స్వయమేవోత్థితా తత్ర వికృతాననదర్శనా || 21
వికృతమైన ముఖంతో, చూపులతో ఆయనను చూచి, లేచింది.
పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్ఠత |
ముంచమానా మహానాద మబ్రవీత్ పవనాత్మజమ్ || 22
హనుమంతుని ఎదురుగా నిలచి, మహానాదాన్ని చేసి, ఇలా అంది.
కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ |
కథయస్వేహ యత్తత్త్వం యావత్ ప్రాణా ధరంతి తే || 23
" ఓ వానరా! నీవెవరు? ఎందుకు వచ్చావు? నీ ప్రాణాలు పోకముందే నిజం చెప్పు.
న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానర త్వయా |
రక్షితా రావణబలై: అభిగుప్తా సమంతత: || 24
రావణబలరక్షితమైన లంకలోకి ప్రవేశించటం నీకు అసాధ్యం సుమా! "
అథ  తామబ్రవీద్వీరో హనుమానగ్రతస్స్థితామ్ |
కథయిష్యామి తే తత్త్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి || 25
అప్పుడు హనుమంతుడు నీవడిగిన నిజం తరువాత చెప్తాను. ముందు నీవెవరో చెప్పు.
కా త్వం విరూపనయనా పురద్వారే౭వతిష్ఠసి |
కిమర్థం చాపి మాం రుద్ధ్వానిర్భర్త్సయసి దారుణా || 26
వికృతాకారనేత్రాలతో, భయంకరంగా ఉన్నావు. ఈ నగరద్వారం వద్ద ఎందుకున్నావు? నన్నెందుకు అడ్డుతున్నావు? ఎందుకు బెదిరిస్తున్నావు? అన్నాడు.
హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ |
ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజమ్ || 27
హనుమంతుని మాటలు విని, ఆ కామరూపిణి కోపించి, పరుషంగా
అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మన: |
ఆజ్ఞాప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీమిమామ్ || 28
" నేను రావణకింకరిని. అతడి ఆజ్ఞతో ఈ నగరాన్ని రక్షిస్తున్నాను. నన్నెవరూ  ఎదిరించలేరు.
న శక్యా మామవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా |
అద్య ప్రాణై: పరిత్యక్త: స్వప్స్యసే నిహతో మయా || 29
నన్ను ధిక్కరించి, నీ వీ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యం. నీ విప్పుడు నాచే ప్రాణాలు విడచి, దీర్ఘనిద్ర పోగలవు.
అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ |
సర్వత: పరిరక్షామి హ్యేతత్తే కథితం మయా || 30
ఓ వానరా! నగరంగా కనిపించే లంకనే నేను. ఈ నగరాన్ని అన్నివిధాల రక్షిస్తూంటాను. ఇదీ నా సంగతి " అంది.
లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ: |
యత్నవాన్ స హరిశ్రేష్ఠ: స్థితశ్శైల ఇవాపర: || 31
హనుమంతుడు, ఆమె మాటలు విని, ఎదిరించడానికి సిద్ధమై, పర్వతంలా స్థిరంగా నిలబడ్డాడు.
స తాం స్త్రీరూపవికృతాం దృష్వ్టా వానరపుంగవ: |
ఆబభాషే౭థ మేధావీ సత్త్వవాన్ ప్లవగర్షభ: || 32
స్త్రీ రూపంలో ఉన్న లంకాధిదేవతతో ఇలా అన్నాడు.
ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకారతోరణామ్ |
ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతుహలం హి మే || 33
" మేడలతో, ప్రాకారాలతో, తోరణాలతో మనోహరంగా ఉన్న లంకానగరాన్ని చూడాలనే  కుతూహలంతో వచ్చాను.
వనాన్యుపవనానీహ లంకాయా: కాననాని చ |
సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే || 34
ఇక్కడి వనాలు, ఉపవనాలు, అడవులు, గృహాలు అన్నీ  చూడడానికి వచ్చాను ".
తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ |
భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుపాక్షరమ్ || 35
ఆ మాటలు విని, లంకాధిదేవత చాల పరుషంగా, మళ్లీ ఇలా అంది.
మామనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వరపాలితామ్ |
న శక్యమద్య తే ద్రష్టుం పురీయం వానరాధమ || 36
" దుర్భుద్ధి గల ఓ వానరాధమా! నన్ను జయించకుండా ఈ నగరంలోకి ప్రవేశించలేవు "
తతస్స కపిశార్దూలః తామువాచ నిశాచరీమ్ |
దృష్ట్వా పురీమిమాం భద్రే  పునర్యాస్యే యథాగతమ్ || 37
అప్పుడు హనుమంతుడు, " ఓ మంగళాంగీ! ఈ నగరాన్నంతా చూసి, మళ్లీ వచ్చినట్లుగానే వెళ్ళిపోతాను " అన్నాడు.
తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహమ్ |
తలేన వానరశ్రేష్ఠం తాడయామాస వేగితా || 38
అంత ఆ లంక, గట్టిగా, భయంకరంగా అఱచి, తన అఱచేతితో  వేగంగా బలంకొద్దీ హనుమంతుని కొట్టింది.
తతస్స కపిశార్దూలో లంకాయా తాడితో భృశమ్ |
ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః || 39
అపుడా కపిశార్దూలుడు, గొప్ప ధ్వని కలిగేటట్లు అఱచాడు.
తతస్సంవర్తయామాస వామహస్తస్య సో౭Oగుళీః |
ముష్టినా౭భిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః || 40
కోపంతో వివశుడై, ఎడమచేతివ్రేళ్లను ముడిచి, ముష్టి చేసి, దానితో ఆమెను పొడిచాడు.
స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్స్వయంకృతః |
సా తు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ || 41
లంక  స్త్రీ కాబట్టి ఆయన అతిగా కోపించలేదు. ఆ రాక్షసి మాత్రం ఆయన దెబ్బకు విహ్వలయై,
పపాత సహసా భూమౌ  వికృతాననదర్శనా |
తతస్తు హనుమాన్ ప్రాజ్ఞః తాం దృష్ట్వా వినిపాతితామ్ || 42
ముఖం, కండ్లు వికారమవ్వగా నేలపై పడిపోయింది. ఆ ప్రాజ్ఞుడు,  ఆమెను చూసి,
కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రియం తు తామ్ |
తతో వై భృశసంవిగ్నా లంకా సా గద్గదాక్షరమ్ || 43
ఆడది కదా! అని దయతలచాడు. అపుడామె భయపడి, గద్గద స్వరంతో,
ఉవాచాగర్వితం వాక్యం హనూమంతం ప్లవంగమమ్ |
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ || 44
గర్వం విడచి, ఆయనతో " ఓ మహాబాహూ! ప్రసన్నుడవు కా. రక్షించు.
సమయే సౌమ్య తిష్ఠంతి సత్త్వవంతో మహాబలాః |
అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ || 45
నీవు సౌమ్యస్వభావుడవు. ధీరులైన మహాబలశాలురు, ఆడవారిని చంపరాదనే నియమాన్ని వదలరు. సాక్షాత్తూ లంకాధిదేవతనే నేను.
నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహబల |
ఇదం తు తథ్యం శృణు వై బ్రువంత్యా మే హరీశ్వర || 46
నీవు,  నన్నునీ పరాక్రమంతో జయించావు. నిజం చెప్తా,  విను.
స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ |
యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ || 47
పూర్వంబ్రహ్మ,  నాకొక వరం ఇచ్చాడు. తన పరాక్రమంతో ఒక వానరుడు నిన్ను వశం చేసుకొన్నప్పుడు
తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతమ్ |
స హి మే సమయస్సౌమ్య ప్రాప్తో౭ద్య తవ దర్శనాత్ || 48
రాక్షసులకు చేటు వచ్చిందని తెలుసుకో. ఓ సౌమ్యా! నీ దర్శనంతో ఆ సమయం ఆసన్నమైంది.
స్వయంభూవిహితస్సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః |
సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః || 49
బ్రహ్మ మాట సత్యం. దానికి తిరుగుండదు. సీతానిమిత్తంగా రావణునికి,
రక్షసాం చైవ సర్వేషాం వినాశస్సముపాగతః |
తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితామ్ |
విధత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి || 50
రాక్షసులందఱికీ చేటు దాపరించింది. ఇక లంకలోకి  ప్రవేశించు. నీవనుకొన్న పనులన్నీ పూర్తి చేసుకో.
ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర
శుభాం పురీం రాక్షసముఖ్యపాలితామ్ |
యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం
విమార్గ సర్వత్ర గతో యథాసుఖమ్ || 51
(నంది) శాపానికి గుఱైన, ఈ రావణపాలిత లంకలోకి, ప్రవేశించు. హాయిగా,  స్వేచ్ఛగా, అన్ని చోట్లకు వెళ్లి, జానకిని వెదకు " అంది.
-----------------------------------------------------------------------------------------------------------------
సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః | ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ||8||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే తృతీయస్సర్గః (3)
మంగళం మహత్




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...