9, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 15 వ శ్లోకం

రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్య మేత త్పురస్తా
ద్వల్మీ కాగ్రా త్ప్రభవతి ధనుఃఖండ మాఖండలస్య
యేన శ్యామం వపు రతితరాం కాంతి మాపత్స్యతే తే
బర్హే ణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః


భావం :


మేఘునితో యక్షుడు, ఇలా అంటున్నాడు.

( పద్మరాగం మొదలైన )
"రత్నాలయొక్క నానావిధాలైన కాంతులు కలసి ఉన్నట్లు,
ఎదుట ఉన్న పుట్టయొక్క కొన ( పైభాగం ) నుండి,
ఇంద్రధనుస్సు పుడుతోంది.
ఆ ఇంద్రచాపంచేత నీ దేహం,
గోపవేషం ధరించి, పింఛంతో ప్రకాశించే,
శ్రీకృష్ణుని శరీరంలా ప్రకాశిస్తుంది."


విశేషాలు :


"ఉత్తరదిక్కుగా ఎగురు" అని,
యక్షుడు, మేఘునితో చెప్తూ,

ఎదురుగా ఉన్న ఒక పుట్టకొన వివరంనుండి ( పుట్ట పైభాగంలో ఉన్న కన్నం నుండి )
ఒక ఇంద్రధనుస్సు పుట్టడం చూశాడు.
వెంటనే అందిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని,
మేఘుని, ఏకంగా శ్రీకృష్ణునితో పోల్చి, పొగుడుతున్నాడు.
తెలివైనవాడు.

పని అప్పజెప్పడానికి ముందు ఒకసారి పొగిడితే చాలదన్నమాట.


యక్షుడు, వర్ణించే సమయానికి
ఇంద్రధనుస్సు ఇంకా పూర్తిగా పుట్టలేదు.
దాన్ని కాళిదాసు " ఆఖండలస్య ధనుఃఖండం " అన్నాడు.
ఆఖండలుని ధనుస్సు యొక్క ముక్క. అని అర్థం.
ఆఖండలుడు అంటే ఇంద్రుడు. శత్రువులను ఖండించువాడు అనే అర్థంలో
ఆయనకు ఆ పేరు వచ్చింది.
అందువల్ల ఇంద్రునికి విశేషణంగా ఆఖండల శబ్దాన్ని వాడి,
ధనుశ్శబ్దంతో కలిపాడు.
ఇలాంటి వాటిని ఇంతకుముందు కూడా పేర్కొన్నాను.
వీటిని సాభిప్రాయవిశేషణాలు అంటారు.


అయినా అది పూర్తి ధనుస్సు కాదు, ఖండమే.
ఇంద్రుని ప్రతాపం సగమే. ఆయనకు పూర్తి బలం ఉపేంద్రుడు. ( శ్రీకృష్ణుడు )
ఇంద్రచాపం కంటే ఉపేంద్రుని పింఛం గొప్పది.
కృష్ణపింఛం అంటే ఒక పాట గుర్తుకొస్తోంది.

ప్రక్కదారి పడుతున్నందుకు, ప్రియమైన
పాఠకులు ఏమనుకోకండి.

1943 లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాలో, బలిజేపల్లి లక్ష్మీకాంతం,

"జేజేలయ్యా జోహారు కృష్ణ జేజేలయ్యా జోహారు,
కొంచెము తలపై పింఛము కదలినా ,
పంచభూతములు ప్రపంచమంతా
సంచలించునని సజ్జను లందురు.
పింఛమునకిదే ఆ పింఛమునకిదే
జే జే జే జే జేజేలయ్యా జోహారు,
కృష్ణ జేజేలయ్యా జోహారు"

అని గాలిపెంచల వారి స్వరసహాయంతో,
టంగుటూరి సూర్యకుమారిగారితో పాడించారు.


అలా సగం పుట్టిన ఆ హరివిల్లు, పింఛంలా ఉంది.
ఈ తమాషా పింఛంతో ( మేఘుని నెత్తిమీద ఉన్నట్లుంది )
నల్లని శరీరం గల మేఘుడు,
అసలు పింఛంతో ప్రకాశించే కృష్ణునిలా ( ఈయనా నలుపే )
( కృష్ణునికి మేఘునికి ఈ రెండే సామ్యాలు )
ఉన్నాడని మేఘుడు ఉబ్బేస్తున్నాడు.


మధ్యలో ఈ పొగడ్త లేంది? అని చిరాకుపడకండి.
మధ్యలో కూడా అలా కీర్తిస్తూండాలి.
ఉల్లాసం ఉత్సాహం కలిగిస్తూండాలి.


కృష్ణుని సూచించడానికి, గోపవేషం ధరించిన విష్ణువు అన్నాడు.
ఇదో చమత్కారం.
విష్ణువు అవతారాలు అన్నీ లీలలు అని సూచించడానికి కావచ్చు.
పరిశీలన జరగాలి.


అలాగే శ్లోకాన్ని పరిశీలిస్తే, కృష్ణుని శరీర వర్ణంలో
అతితరకాంతి అంటే మిక్కిలి కాంతి ఉందట.
దాన్ని మామూలు నలుపనుకోరాదు.


ఇక ఇంద్రధనుస్సు , పద్మరాగాది రత్నకాంతులతో ఉందన్నాడు కదా!

రత్నాలు 9.
మరకతం, పద్మరాగం, ముత్యం,
పగడం, నీలం, పుష్యరాగం,
వజ్రం, గోమేధికం, వైఢూర్యం.
వీటిలోని రంగులతో ఇంద్రధనుస్సును, పింఛాన్ని సరిపోల్చండి.


మంగళం మహత్


మతి అంటే వర్తమానకాలంలో
జరిగే విషయాలను
గ్రహించగల శక్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...