3, ఏప్రిల్ 2011, ఆదివారం

మేఘసందేశం 9 వ శ్లోకం

మందం మందం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగంధః
గర్భాధానక్షణపరిచయా న్నూనమాబద్ధమాలాః
సేవిష్యంతే నయనసుభగం ఖే భవంతం బలాకాః

ముందుమాట : శుభశకునాలు కనబడుతున్నాయి.
పని, పూర్తి అవుతుందంటున్నాడు.

భావం : మేఘుడా! నీకు అనుకూలంగా గాలి వీస్తోంది.
అంటే ముందుకు వెళ్ళేలా త్రోస్తోంది.
చాతకపక్షి, మధురంగా కూస్తోంది. ( ఈ రెండు శుభశకునాలు అయ్యాయి.
ఇంకో సుశకునం అవుతుందంటున్నాడు.)
ఆడుకొంగలు, కన్నులకు ఇంపైన నిన్ను, తప్పక సేవిస్తాయి.

విశేషాలు : - ప్రయాణసమయం కాబట్టి, శకునాల గుఱించి, ప్రస్తావిస్తున్నాడు.
శకునశాస్త్రం ప్రకారం
అనుకూలమైన గాలి, చాతకపక్షి కూత, కొంగలు కనబడ్డం, శుభశకునాలు.
( శకునాల గుఱించి తరువాత చర్చిద్దాం )

- శ్లోకం చూడండి.
నుదతి = త్రోస్తోంది
పవనః = గాలి
మందం = మెల్లగా
నదతి = పలుకుతోంది
చాతకః = చాతకపక్షి
మధురం = మధురంగా
" అక్షరరమ్యత " అనవచ్చు.
ఇది సంస్కృతంలో మాత్రమే ఉన్న సౌలభ్యం.

- గాలినిబట్టే కదా! మేఘం నడక.

- చాతకపక్షిని వానకోయిల అంటారు.
ఈ పక్షి, వాన పడుతున్నప్పుడు మాత్రమే నోరు తెరచి, ఆ వాన నీటిని త్రాగుతుంది.
ఈ విధంగా మేఘానికి చాతకానికి సంబంధం ఉంది.
అందువల్ల " సగంధః " ( సంబంధం ) పదం వాడాడు.

- ఇక కొంగలకు మేఘం కన్నులకు ఇంపు (అందం) అన్నాడు
కాని , నల్లని మేఘాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, తెల్లనికొంగలబారు మన కన్నులకు ఇంపు కదా!
" నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు "
అని దేవులపల్లి వారు "మల్లీశ్వరి "చేత అనిపించింది, మేఘసందేశ ప్రభావంతోనే.
గగనసీమల తేలు ఓ మేఘమాలా! అని పంపించుకొన్న
మల్లీశ్వరి నాగరాజుల పరస్పరసందేశాలకు ఆధారం మేఘ(సందేశ ప్రభావ) మే .


మంగళం మహత్


పిండి కొద్దీ రొట్టె - యోచన కొద్దీ భావం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...