మార్గం తావచ్ఛృణు కథయత స్త్వత్ప్రయాణానురూపం
సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం
ఖిన్నఃఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య
భావం :
మేఘుడా ! ఇప్పుడు, నీ ప్రయాణానికి అనుకూలమైన మార్గాన్ని చెప్తాను.
"
ఆ తరువాత వినడానికి ఇంపైన సందేశాన్ని చెప్తాను.
నేను చెప్పబోయే మార్గంలో, నీకు శ్రమ కలిగినప్పుడు,
పర్వతాలమీద నిలిచి, విశ్రాంతి తీసుకొనివెళ్లవచ్చు.
క్షీణించిపోతే ( చిక్కిపోతే ) నదుల్లో మిక్కిలి తేలికైన నీరు త్రాగి, వెళ్లవచ్చు.
కాబట్టి, ఈ మార్గం నీకు హితంగా ఉంటుంది.
విశేషాలు:
ప్రయాణం చేయదలచుకొన్నవారు,
మొదట ఒక ప్రణాళిక ( plan ) వేసుకోవాలి.
ఒక గమ్యానికి ఉన్న అనేకానేక మార్గాల్లో
అనుకూలమైన దాన్ని ఎంచుకోవాలి.లేడికి లేచిందే పరుగన్నట్టు,
గుడ్డెద్దుచేలో పడ్డట్టు పడి పోకూడదు.
అపుడే క్షేమంగా ప్రయాణం జరుగుతుంది.
ఇప్పటి సౌకర్యాలు లేని పుర్వకాలం ప్రయాణాల్లో,
తాగునీరు లభ్యమయ్యే దారిని,
అలాగే ఆశ్రయమిచ్చేవారు,/సత్రాలున్న దారిని
ఎంచుకొనేవారని అర్థమవుతుంది.
చిక్కిపోతే, తేలికైన నీరు తాగమంటున్నాడు.
తేలికైన అనే అర్థంలో "పరిలఘు" అనే పదాన్ని కవి ప్రయోగించాడు.
నీరు తేలిక ఎప్పుడవుతుంది? ఆవిరైనపుడే కదా ?
ఆ ఆవిరే కదా మేఘం.సూక్ష్మవిషయాలను కూడా పరిగణన లోకి తీసుకొని , కాళిదాసు వ్రాస్తున్నాడు.నీరు తగ్గిపోతే మేఘం చిక్కిపోతుంది.
మరల ఆవిరితో రూపు కడుతుంది.
ఇక యక్షుడు, తన సందేశం వింటే,
అమృతం త్రాగినట్లు ఆనందం కలుగుతుందంటున్నాడు.
ఎందుకంటే అంతదూరం కష్టపడి వెళ్ళాక,
"ఆమెకు అందించడానికి తగిన విధంగా సందేశం ఉంటుందా ?"
అని మేఘుడు సందేహ పడకుండా.
ఇప్పటికే పాఠకుల్లో కొంతమందికి,
యక్షుడు ఇంత హడావిడి చేస్తున్నాడు.
అంతా అయ్యాక "నేను కులాసా ,
ఆవిడ కులాసా కనుక్కో" అంటాడేమో అనిపించిఉంటుంది.
అఫ్ కోర్స్ అదీ సందేశమే, కానీ చప్పగా ఉంటుంది కదా!
ఆ భయం అక్కరలేదు.
రెండవ సర్గలో 40 వ శ్లోకం నుంచి 52 వ శ్లొకం వరకు 13 శ్లోకాల్లో
యక్షుని సందేశాన్ని కాళిదాసు పొందుపరిచాడు.
అది బాగుందో బాగులేదో మీరే చెప్దురుగాని.
మఱి, మీరు మరికొంత కాలం ఆగాలి.
మంగళం మహత్
స్మృతి, మతి ప్రజ్ఞ అనే మూడుశక్తుల కలయికే బుద్ధి.
రచనకు ఇవి గొప్పగా ఉపకరిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి