13, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 16 వ శ్లోకం

అక్కిరెడ్డి రాజాచంద్ర గారు ఇచ్చిన ప్రోత్సాహంతో
తిరిగి మేఘసందేశం మొదలుపెట్టాను.

"మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ఉత్తమం అనిపించుకొంటుంది".
అని సూక్తిరత్నాకరం ఘోషిస్తోంది.
కనుక పూర్తిచేస్తాను.

రాజాచంద్ర, ch.వెంకటేశ్వరరావు (విశాఖపట్టణం)
ఇటువంటివారల కోసమైనా.



త్వ య్యాయత్తం కృషిఫల మితి భ్రూవికారా నభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపదవధూలోచనైః పీయమానః
సద్యః సీరోత్కషణసురభి క్షేత్ర మారుహ్య మాలం
కించి త్పశ్చా ద్వ్రజ లఘుగతి ర్భూయ ఏవోత్తరేణ


తాత్పర్యం :


"మేఘుడా!
వ్యవసాయఫలితం నీ అధీనంలో ఉన్న కారణంచేత,
కనుబొమల వికారాలు ( విలాసాలు ) తెలియని,
పల్లెలలోని వధువులు ( స్త్రీలు )
నిన్ను, ప్రీతిచేత చల్లనైన చూపులతో చూస్తారు.
అప్పుడే, నాగళ్లచేత దున్నిన కొండభూములపై
సువాసన కల్గునట్లుగా వర్షించి,
కొంచెం పశ్చిమంగా పోయి, శీఘ్రగమనంతో తిరిగి,
ఉత్తరమార్గంలో వెళ్లు.


భావం:


నీ వల్లే పైర్లు పండుతాయి.
అందువల్ల పల్లెపడుచులు,నిన్ను ప్రేమగా చూస్తారు.
భ్రూవిలాసాలు తెలియని వారి చూపులు నీకు తెలుస్తాయి.
దున్నిన కొండభూములపై నీవు వర్షిస్తే, పరిమళం కల్గుతుంది.
కొంచెం పడమరగా పోయి, తిరిగి ఉత్తరంవైపు వేగంగా వెళ్లు.


విశేషాలు:


ప్రియమిత్రులకు
గమనిక:


ఈ మేఘసందేశం చదివేటప్పుడు,
శ్లోకాన్ని+ భావాన్ని,
మౌనపఠనం కాక
బాహ్యపఠనం చేయండి.
శ్లోకం చదవడానికి భయపడకండి. (అందర్నీ ఉద్దేశించికాదు).
కూడబలుక్కుంటూనైనా పైకి చదవండి.
అపుడే దాని అందం తెలుస్తుంది.
అలాగే భావం కూడా.
విశేషాలు అక్కరలేదు. మనసులో చదువుకోవచ్చు.


---- కృషి అంటే వ్యవసాయం. ఈ రోజుల్లో దీని అర్థం మారింది.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అని వేటూరి గారు వ్రాశారుగా!
"కృషితో నాస్తి దుర్భిక్షం" అని చెప్తూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చంటారు.
అసలు దాని అర్థం = వ్యవసాయం వల్ల కరవు ఉండదు. అని.

ఇది ఒక శ్లోకం మొదటిపాదం.

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రతో భయం. అనేది పూర్తి శ్లోకం.


---- సరే . ఇక్కడ వ్యవసాయఫలం మేఘుని అధీనంలో ఉందంటున్నాడు.
నిజమే కదా! ఎక్కువశాతం భూములకు వర్షపునీరే గతి.
తమ పంటలు పండించే వాడిని మరి ప్రీతితో చూడరా?
ఇక్కడో ఆలోచన స్ఫురిస్తోంది.

తన కడుపు పండించిన భర్తను కూడా స్త్రీ అలాగే ప్రేమతో చల్లగా చూస్తుంది.

ఇక్కడ "వధువులు" అనే పదం వాడాడు. స్త్రీలు అని అర్థం వచ్చేలా.
పెండ్లికూతుళ్లు అనే అర్థం కూడా ఉందిగా!

అలాగే " ప్రీతిస్నిగ్ధైః లోచనైః" అన్నాడు.
అంటే ఏమాత్రం కృత్రిమం లేని ప్రేమతో తడిసిన కళ్లని అర్థం.
ఎంత అందంగా అన్నాడో చూశారా!


---- భ్రూవిలాసాలు అంటే కనుబొమలను రకరకాలుగా త్రిప్పడం.
మన హీరోయిన్స్ , హీరో కనబడగానే కళ్లతో చేసే వెకిలి వేషాలన్నమాట.
ANR ఆరాధనలో ఆరుద్ర " ఆడదాని ఓరచూపుతో జగాన
ఓడిపోని ధీరుడెవ్వడు? అన్నారు.

ఆ ఓరచూపులే భ్రూవిలాసాలు.
కృత్రిమప్రేమతో తడిలేని చూపులు.
పల్లెవనితల్లో అవి ఉండవంటున్నాడు.
అంటే అవి నాగరకస్త్రీలల్లో ఎక్కువన్నమాట.


---- ఇక మాలం అనే పదం ఉపయోగించాడు.
అంటే కొండభూమి. దున్నిన కొండభూములపై,
వర్షిస్తే సువాసన వస్తుందంటున్నాడు.
వానచినుకులు పడ్డాక తడిసిన మట్టివాసన మీరెరుగుదురుగా!
బాగుంటుంది కదా!
అయితే అది మట్టివాసన కాదుట.
భూమిపై ఉన్న అనేక పదార్థాల, బ్యాక్టీరియా, రసాయనాల
కలగలపు కంపుట. కంపు అంటే మళ్లీ చెడ్డవాసన అనుకొనేరు.
మంచి పదాన్ని కంపు కొట్టించారు.
కంపు అంటే పరిమళం/సువాసన అని అర్థం.

---- నాగళ్లచేత దున్నబడిన భూమిలో పండిన ధాన్యం , i mean బియ్యం,
రోట్లో రుబ్బిన పచ్చడిలా కమ్మగా ఉంటుంది.
ట్రాక్టరు = మిక్సీ

---- అందమైన దృశ్యాలుండే దారిని యక్షుడు
సూచిస్తున్నాడు.


---- మేఘుడు, వెళ్లేదారి.
మొదట ఉత్తరదిక్కుగా ప్రయాణం.

---- ఇపుడు కొంచెం పడమరగా తిరిగి,
మరల ఉత్తరంగా తిరగమంటున్నాడు.


గుర్తుపెట్టుకోండి.




మంగళం మహత్


ప్రజ్ఞ అంటే జరుగబోయే సంగతులను
ముందుగానే ఊహించగలిగే శక్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...