8, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 14 వ శ్లోకం


అద్రేః శృంగం హరతి పవనః కిం స్విదిత్యున్ముఖీభి
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధ సిద్ధాంగనాభి:
స్థానాదస్మాత్సరసనిచులా దుత్పతోదఙ్ముఖ: ఖం
దిఙ్నాగానాం పథి పరిహర౯ స్థూలహస్తావలేపాన్


భావం :

మేఘుడా!
నీవు ( ప్రయాణానికి ) లేచినపుడు,
ముగ్ధులైన ( తెలియనివారు, అమాయకులైన )
సిద్ధవనితలు ( సిద్ధ జాతికి చెందిన స్త్రీలు ),
గాలి, కొండ శిఖరాన్ని తీసుకొని పోతున్నాడేమో?
(గాలిలో కొండ కొట్టుకొని వస్తోందేమో)
అని భయపడి చూస్తారు.
అపుడు వారి బెదరు చూపులు నీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
తడిసిన అనగా చల్లని ప్రబ్బలి చెట్లుగల ఇక్కడినుండి లేచి,
దిగ్గజాలు, తొండాలు విసురుతూంటే, త్రోస్తూ,
ఉత్తరదిక్కుగా ఎగురు.


విశేషాలు:

సిద్ధులు అనబడే వారు దేవతల్లో ఒక జాతివారు.

విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు,
కింనరులు (కింపురుషులు), పిశాచాలు, గుహ్యకులు, సిద్ధులు, భూతాలు
వీరు దేవజాతివిశేషాలు. వీరి పేరును బట్టే వీరి విశేషం తెలుస్తుంది.

వీరిలో , అణిమాది సిద్ధిగలవారిని సిద్ధులు అంటారు.

అణిమాదులు మొత్తం 8 రకాల ఐశ్వర్యాలు. అవి, వరుసగా,
అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.

వీటిని సాధిస్తే మనం కూడా సిద్ధులమవుతాం.

మేఘం కొండంత ఉందని ఇంకో చమత్కారం.

అయినా బెదరు చూపులు ఉత్సాహాన్ని ఇవ్వడం ఏమిటి?
ఒకరి బెదరు ఒకరికి వేడుకా? అంతే

మఱి, మర్యాదరామన్నలో సునీల్ ఎంతలా "భయపడితే" ఆడియన్స్ అంతలా
"ఎంజాయ్" చేశారు కదా!

నిచులవృక్షాలనే ప్రబ్బలి అని, వేతసాలని, ఎఱ్ఱగన్నేరని, నీటిగన్నేరని అంటారు.
వీటిలో మిగతా చెట్లకంటే నీటి శాతం బాగా ఎక్కువగా ఉంటుంది.


మేఘుడు దిగ్గజంలా ఉన్నాడని, ( కవి చమత్కారం )
దాన్నిచూసి, మరో ఏనుగేమో అని
దిక్కుల్ని మోసే ఏనుగులు తమ తొండాలను విసిరితే,
వాటిని త్రోస్తూ, పొమ్మంటున్నాడు.

మనకు ప్రధాన దిక్కులు 4.విదిక్కులు 4. వీటి వరుసను , వీటిని మోసే ఏనుగుల వరుసను చెప్తే,
వాటిని ఇలా చెప్పాలి.

తూర్పు        ఐరావతం
ఆగ్నేయం    పుండరీకం
దక్షిణం        వామనం
నిరృతి         కుముదం
పడమర      అంజనం
వాయువ్యం పుష్పదంతం
ఉత్తరం        సార్వభౌమం
ఈశాన్యం     సుప్రతీకం


"దిగ్గజాల (తొండాల)నే త్రోసిరాజనేవాడవు నీవు" అని
నర్మగర్భంగా మేఘుని పొగుడుతున్నాడు.


పండితులు ఈ శ్లోకంలో ఇంకో విశేషం ఉందంటారు.
తగ్గించి చెప్తాను.


కాళిదాసుకు ఒక శత్రువు ఉన్నాడు. అతని పేరు దిఙ్నాగుడు.
అతడు కాళిదాసు రచనల్లో దోషాలు ఎత్తి చూపిస్తూండేవాడు ఆ రోజుల్లో.

అయితే కాళిదాసుకు,
నన్నయకు నారాయణభట్టు లాగ, కె.వి.మహదేవన్ కు పుహళేంది లాగ,
ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిగారికి సహ గాయని రాధ గారిలాగ,
ఒక చక్కని పండిత మిత్రుడూ ఉన్నాడు.

అతడి పేరు నిచుళుడు. ఇద్దరూ కలిసి చదువుకొన్నారు.
కాళిదాసు రచనల్లో ఇతరులు ఆరోపించే దోషాలను ఇతడు త్రిప్పికొడుతూండేవాడు.

ఇది దృష్టిలో పెట్టుకొని, కాళిదాసు తనలో తాను అనుకొన్నట్లుగా,
శ్లోకభావాన్ని చూస్తే,

" నిచుళుడు ఉండగా దోషాలను ఆరోపించేవారెవరు? కాబట్టి ధైర్యంగా నామార్గంలో నేను మేఘసందేశాన్ని రచిస్తా.
లావైన చేతులు త్రిప్పుతూ, దిఙ్నాగుడు చేసే దూషణాలను నివారిస్తూ,
కొండలాంటి అతని ప్రాధాన్యాన్ని పోగొట్టడంతో,
సుందరులైన సాహిత్య సిద్ధులును, స్త్రీలును నీ ఉత్సాహం చూసేటట్లుగా
ప్రసిద్ధి పొంది ఉండు."


మంగళం మహత్


స్మృతి అంటే జరిగిన విషయాలను
గుర్తుకుతెచ్చుకొనగలిగే శక్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...