6, మే 2011, శుక్రవారం

మేఘసందేశం 46 వ శ్లోకం

జ్యోతిర్లేఖావలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళప్రాపి కర్ణే కరోతి,
ధౌతాపాంగం హరశశిరుచా పావకేస్తం మయూరం
పశ్చాదద్రిగ్రహణగురుభి ర్గర్జితై ర్నర్తయేథాః .


భావం:



కాంతిపంక్తులమండలం కలది, ( జ్యోతిర్లేఖలచేత చుట్టుకొనబడినది )

తనంతట తాను జారింది ( బలవంతంగా వేరుచేసినది కాదు )

అయిన ఏ మయూరపింఛాన్ని, ( నెమిలిపింఛాన్ని )

భవాని ( పార్వతి ),

కుమారుని మీది ప్రేమతో,

కలువఱేకుకు బదులుగా చెవికొనయందు ధరిస్తున్నదో,

( అసలే తెల్లనివైన ) ఏ మయూరనేత్రాలు,

శివుడు ధరించిన చంద్రునికాంతితో ( మఱింత ) శుభ్రమైనవో,

ఆ నెమిలిని,

( పుష్పవర్షం కురిసిన ) తర్వాత

అద్రిగ్రహణంతో గొప్పవైన ( కొండల్ని పట్టుకోవడంచేత గొప్పవైన )
అంటే కొండగుహల్లో ప్రతిధ్వనించడంచేత గొప్పవైన )

ఉఱుములతో ఆడించు.



తాత్పర్యం :



కుమారస్వామి మయూరవాహనుడు కదా!

ఆయన నెమెలిని ఆనందింపజేసి, తద్ద్వారా స్వామి అనుగ్రహం పొందమని

మేఘునితో యక్షుడు అంటున్నాడు.

తన కుమారుని వాహనమైన నెమిలిపింఛాన్నే , పార్వతి కర్ణాభరణంగా ధరిస్తుంది.

కుమారసంభవాద్పూర్వం భవాని, కలువదళాన్ని ధరించేది.

ఇప్పుడు తన ప్రియపుత్రునిమీద తనకు గల ప్రేమను సూచించడానికి,

బర్హిపింఛాన్ని ధరిస్తోంది. జగన్మాత అనుగ్రహం ఆ విధంగా పొందిన నెమిలి అది.

ఆ పింఛం కాంతులవరుసలతో చుట్టుకొనబడింది + తనంతట తానే జారినది

( పురి నుండి తనంతట తాను వెలువడిన నెమిలిపింఛాన్ని గ్రహించాలి కాని

మనం నెమిలినుండి బలవంతంగా తీసుకోకూడదు. )

అని పింఛాన్ని, వర్ణించాడు.

తెల్లనైన కేకినేత్రాలు హరుడు ధరించిన శశికాంతితో ఇంకా శుభ్రం అయ్యాయని,

నెమెలికండ్లను వర్ణించాడు.

శివానుగ్రహం కూడా కల నెమిలి.

ఇక మేఘుని ఉఱుములు కొండగుహల్లో ప్రతిధ్వనించాకే వాటి గొప్పతనం తెలుస్తుంది.

ఆ ఉఱుములకు నెమిళ్లు ఆనందించి, నాట్యం మొదలుపెడతాయి.

అదే చేయించమంటున్నాడు. ఉఱుములతో ఆడించమంటున్నాడు.

తన వాహనాన్ని ఆనందింపజేస్తే, కుమారుడు అనుగ్రహిస్తాడు కదా!



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SUNDARAKANDA సుందరకాండ 36

  రామసుందరం - షట్త్రింశస్సర్గః   భూయ ఏవ మహాతేజా హనూమాన్మారుతాత్మజః | అబ్రవీత్ప్రశ్రితం వాక్యం సీతాప్రత్యయకారణాత్ || 1 || సీతక...