7, మే 2011, శనివారం

మేఘసందేశం 47 వ శ్లోకం

ఆరాధ్యైనం శరవణభవం దేవముల్లంఘితాధ్వా
సిద్ధద్వంద్వై ర్జలకణభయాద్వీణిభిర్ముక్తమార్గః ,
వ్యాలంబేథాః సురభితనయాలంభజాం మానయిష్య౯
స్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం.



భావం :



శరవనం ( ఱెల్లుగంట ) లో పుట్టిన

ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధించి,(న తర్వాత)

వీణల్ని వాయిస్తున్న సిద్ధమిథునాలు ( మిథునం అంటే జంట )

వానచినుకులు తమ మీద పడతాయన్న భయంతో నీకు దారి ఇస్తారు కాబట్టి,

అక్కడినుండి బయలుదేరు. దారిలో ఒక నది కనిపిస్తుంది.

ఆ నది,

గోవులవధవల్ల పుట్టి,

భూమిమీద నదిలా మారిన రంతిదేవుని కీర్తి.

అటువంటి ఆయన కీర్తిని అనగా ఆ నదిని

సత్కరించడంకోసం వంగి, దిగు. ( లేక నిలు.)


విశేషాలు:


- శరం అంటే ఱెల్లు అని కూడా అర్థం. శరం అంటే బాణం అని తెలుసుగా. బాణాల్లా ఉన్న గడ్డే ఱెల్లు.

ఱెల్లుగడ్డి దుబ్బును శరవణం అంటారు. అందులో పుట్టిన వాడు శరవణభవుడు.

ఈయన కథ ముందు చెప్పుకొన్నాం.

శరవనం లో న మీద ణ ప్రత్యయం వస్తుంది.


- భగవంతునికి చేసే పూజలో ఎన్నో ఉపచారాలున్నాయి.

ఆయన సన్నిధిలో సంగీతం , నృత్యం మొదలైన లలితకలల ప్రదర్శన కూడా

ఉపచారమే.

అందుకే నిత్యోత్సవవైభవోపేతుడైన తిరుమల వేంకటపతికి నిత్యనాదనీరాజనం

సమర్పించబడుతోంది.

అలాగే సిద్ధమిథునాలు కుమారస్వామి ఎదుట వీణలు వాయించి,

ఆయనను ఆనందింపచేస్తున్నారు.

సిద్ధులు దేవజాతిలో ఒకరని చెప్పుకొన్నాం.


- "వాళ్లు దారి ఇవ్వరనుకొంటావేమో ?

వారికీ నీ చినుకులంటే భయమే.

శరాల్లాంటి నీ వనం అంటే భయం.

వనం అంటే నీరు అని కూడా అర్థం.

కాబట్టి శరవణభవుని కన్నా నీ శరవనం అంటే భయం." అని యక్షుని చమత్కారంగా భావించవచ్చు.



- ఇక నది కథ.

ఆ నది పేరే చర్మణ్వతీ నది. (ఇది, దశార్ణదేశంలో ఉంది. )

పూర్వం రంతిదేవుడనే మహారాజు యాగం చేయబోతూండగా,

సురభి సంతానమైన గోవులు ఆయన వద్దకు వచ్చి, మనుష్యభాషణాలతో,

తమను యాగంలో వ్రేల్చమని కోరాయి.

వాటిని వధించడానికి రంతిదేవుడు సంకోచిస్తూంటే,

తప్పు కాదని పుణ్యమే వస్తుందని ప్రోత్సహించాయి.

సరే. ఈ పనికి ఏ ఒక్క గోవు ఇష్టపడకపోయినా

యాగం మానేస్తానని రంతిదేవుడు అన్నాడు.

యాగంలో వధింపబడిన గోవులు గోలోకాన్ని చేరాయి.

ఆ గోవుల చర్మాలే ఒడ్లుగా వాటి రక్తం ప్రవహించి, నది అయ్యింది. (నదిగా మారింది.)

దానినే చర్మణ్వతీ నది అంటారు.

అంతటి మహాయాగం చేసినందుకు ఆ రంతిదేవుని కీర్తికి తార్కాణంగా,

ఈ నది ఉద్భవించింది.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...