23, మే 2026, శనివారం

Sundarakanda సుందరకాండ 39

Sundarakanda సుందరకాండ 39

రామసుందరం ఏకోనచత్వారింశస్సర్గః

 

మణిం దత్త్వా తత స్సీతా హనుమంత మథాఽబ్రవీత్‌ ।

అభిజ్ఞాన మభిజ్ఞాత మేత ద్రామస్య తత్త్వతః ॥ 1

సీత, హనుమంతునకు చూడామణి ఇచ్చి, ఇలా అంది. " అభిజ్ఞానం (ఆనవాలు) రామునకు యథార్థంగా బాగా తెలుసు.

మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి ।

వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ ॥ 2

మణిని చూడగానే రాముడు (వివాహకాలంలో ఇచ్చినది కాన)నా తల్లినీ, నన్నూ, దశరథునీ, మా ముగ్గురినీ స్మరిస్తాడు.

స భూయ స్త్వం సముత్సాహచోదితో హరిసత్తమ ।

అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయ యదుత్తరమ్‌ ॥ 3

నీవు మరల ఉత్సాహంతో ప్రేరేపితుడవై, కార్య ప్రయత్నంలో ఏం చేయాలో ఆలోచించు.

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ ।

హనుమన్‌ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ॥ 4

తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవేత్‌ ।

వానరోత్తమా! కార్యాన్ని సంధించడంలో నీవే ప్రమాణం. సరైన ప్రయత్నం చేసి నాదుఃఖాన్ని పోగొట్టు. నీవు బాగా ఆలోచించి ప్రయత్నిస్తే దుఃఖాలు నశిస్తాయి.”

స తథేతి ప్రతిజ్ఞాయ మారుతి ర్భీమవిక్రమః ॥ 5

శిరసా వంద్య వైదేహీం గమనా యోపచక్రమే

హనుమంతుడు "అలాగే చేస్తాను" అని ప్రతిజ్ఞ చేసి, సీతకు శిరసా నమస్కరించి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.

జ్ఞాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజమ్‌ ॥ 6

బాప్పగద్గదయా వాచా మైథిలీ వాక్య మబ్రవీత్‌ ।

వాయుపుత్త్రుడు ప్రయాణమవడాన్ని గ్రహించి సీత, బాష్పంచేత డగ్గుత్తిక చెందిన వాక్కుతో ఇలా అంది.

కుశలం హనుమన్‌  బ్రూయా స్సహితౌ రామలక్ష్మణౌ ॥ 7

సుగ్రీవం చ సహామాత్యం వృద్ధాన్ సర్వాంశ్చ వానరాన్‌ ।

బ్రూయా స్త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మసంహితమ్‌ ॥ 8

"హనుమా! రామలక్ష్మణు లిద్దఱినీ (నేను అడిగినట్లు) కుశలం డుగు. మంత్రిసమేతుడైన సుగ్రీవునీ పెద్దవాళ్లైన సమస్త వానరులను కూడ, ధర్మసంమతంగా కుశలం డుగు.

యథా చ స మహాబాహు ర్మాం తారయతి రాఘవః ।

అస్మాద్దుఃఖాంబుసంరోధాత్త్వం సమాధాతు మర్హసి ॥ 9

రాముడు ఈ దుఃఖసముద్రంనుండి నన్ను దాటించేలా ఉపాయం చేయి.

జీవంతీం మాం యథా రామ స్సంభావయతి కీర్తిమాన్‌ ।

తత్తథా హనుమ న్వాచ్యం వాచా ధర్మ మవాప్నుహి ॥ 10

నేను ప్రాణాలతో ఉండగానే రాముడు, నన్ను పొంది ఆదరించునట్లు తగిన విధంగా చెప్పు. మాటతో ఉపకారం చేసి పుణ్యం కట్టుకో.

నిత్యముత్సాహయుక్తాశ్చ వాచః శ్రుత్వా త్వయేరితాః,

వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మదవాప్తయే. 11

నీవు ఉత్సాహభరితాలైన మాటలు చెప్పగా నిత్యం వినడంవల్ల, రామునకు పౌరుషం పెరిగి, నన్ను పొందటానికి ప్రయత్నిస్తాడు.

మత్సన్దేశయుతా వాచస్త్వత్తః శ్రుత్వా చ రాఘవః,

పరాక్రమవిధిం వీరో విధివత్సంవిధాస్యతి. 12

రాముడు, నా సందేశంతో కూడిన మాటలు నీవు చెప్పగా విని, తగిన రీతిలో పరాక్రమాన్ని చూపిస్తాడు."

సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్‌ మారుతాత్మజః,

శిరస్యంజలిమాధాయ వాక్యముత్తరమబ్రవీత్‌. 13

హనుమంతుడు సీత మాటలు విని, శిరస్సుపై అంజలి ఘటించి,

క్షిప్రమేష్యతి కాకుత్స్థో హర్యృక్షప్రవరైర్వృతః,

యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. 14

"దేవీ! రాముడు వీరులైన వానరులతోను, భల్లూకాలతోను కలిసి శీఘ్రంగా వచ్చి, యుద్ధంలో శత్రువులను ఓడించి నీ శోకాన్ని పోగొడతాడు.

న హి పశ్యామి మర్త్యేషు నాసురేషు సురేషు వా,

యస్తస్య క్షిపతో బాణాన్‌ స్థాతుముత్సహతే౭గ్రతః. 15

ఆయన బాణాలు ప్రయోగిస్తూండగా, ఎదుట నిలవగలవాడు, నాకు నరులలోగాని, అసురులలో గాని, దేవతలలో గాని ఎవడూ అగపడడు.

అప్యర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమం,

స హి సోఢుం రణే శక్తస్తవ హేతోర్విశేషతః. 16

యుద్ధంలో, సూర్యునైనా, ఇంద్రునైనా, సూర్యకుమారుడైన యమునైనా ఎదిరించ సమర్థుడు. నీ కోసమైతే విశేషించి ఎదిరించడానికి  సమర్థుడు కదా!.

స హి సాగరపర్యన్తాం మహీం శాసితుమీహతే,

త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని. 17

రాముడు సముద్రపర్యంతమైన భూమి నంతా జయించడానికి సమర్థుడు. నీ నిమిత్తమై రామునకు తప్పక జయం కలుగుతుంది” అని అన్నాడు.

తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్సత్యం సుభాషితమ్‌,

జానకీ బహుమేనే౭థ వచనం చేదమబ్రవీత్‌. 18

తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః,

భర్తృస్నేహాన్వితం వాక్యం సౌహార్దాదనుమానయత్‌. 19

హనుమంతుడు చక్కగా, మధురంగా పలికిన మాటలు విని, సీత అతనిని మెచ్చుకొంటూ, పయనమైన హనుమంతుని వైపు మాటిమాటికీ చూస్తూ, రామునిపై అతనికి ఉన్న మైత్రిని సూచిస్తున్న  అతని మాటలను, స్నేహపూర్వకంగా గౌరవించి, ఇలా అంది.

యదివా మన్యసే వీర వసైకాహమరిందమ,

కస్మింశ్చిత్సంవృతో  దేశే విశ్రాన్తః శ్వో గమిష్యసి. 20

మమ చేదల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్తవ వానర,

అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్‌. 21

గతే హి హరిశార్దూల పునరాగమనాయ తు,

ప్రాణానామ పి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. 22

"శత్రుసంహారకుడా!  నీకు అంగీకారమైతే, ఒక్క రోజు ఏదైన రహస్య ప్రదేశంలో ఉండు. విశ్రాంతి తీసికొని రేవు వెళ్ళవచ్చు. నీవు ఇక్కడ కొంచెం సేపు ఉంటే అల్పభాగ్యురాలనైన నా గొప్ప శోకానికి క్షణకాలం శాంతి కలుగుతుంది. నీవు వెళ్ళి, మళ్లీ వచ్చేంతవఱకు నేను బ్రతికి ఉంటానో ఉండనో సందేహమే. ఇందులో సంశయం లేదు.

తవాదర్శనజః శోకో భూయో మాం పరితాపయేత్‌,

దుఃఖాద్దుఃఖపరామృష్టాం దీపయన్నివ వానర. 23

ఒక దుఃఖం తరువాత మరొక దుఃఖంతో బాధపడుతున్న నన్ను నీవు కనబడకపోవడంవలన కలిగే దుఃఖం కాల్చేస్తున్నట్లు ఇంకా తపింపచేస్తుంది.

అయం చ వీర సందేహస్తిష్ఠతీవ మమాగ్రతః,

సుమహాంస్త్వత్సహాయేషు హర్యృక్షేషు హరీశ్వర. 24

కథం ను ఖలు దుష్పారం తరిష్యన్తి మహోదధిమ్‌,

తాని హర్యృక్ష సైన్యాని తౌ వా నరవరాత్మజౌ. 25

నీకు సహాయభూతులైన వానర భల్లూకాదుల విషయంలో ఒక పెద్ద సందేహం నా ఎదుట నిలచి ఉంది. వానర భల్లూక సైన్యాలు గాని, రామలక్ష్మణులు గాని, దాటశక్యం కాని మహాసముద్రాన్ని ఎలా దాటగలరో!?

త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే,

శక్తిః స్యాద్వైనతేయ స్య తవ వా మారుతస్య వా. 26

తదస్మిన్‌ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే,

కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాం వరః. 27

కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే,

పర్యాప్తః పరవీరఘ్న యశస్య స్తే ఫలోదయః. 28

గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ముగ్గురు మాత్రమే సముద్రాన్ని దాట సమర్థులు. విధంగా కార్యాన్ని సాధించడం అనేది చాల కష్టంగా కబడుతోంది. ఇలాంటి స్థితిలో నీవేమి ఉపాయం ఆలోచించావు? కార్యాలు ఎలా సాధించాలో తెలిసిన వారిలో నీవు శ్రేష్ఠుడవు కదా! కార్యాన్ని నీవే ఒంటరిగా సాధించగలవు. నీ కార్యం సఫలమై యశస్సును కలిగిస్తుంది. 

బలైః సమగ్రైర్యది మాం రావణం జిత్య సంయుగే,

విజయీ స్వపురం యాయాత్తత్తస్వ సదృశం భవేత్‌. 29 

శరై స్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః,

మాం నయేద్యది కాకుత్‌స్థ స్తత్తస్య సదృశం భవేత్‌. 30

తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః,

భవేదాహవశూరస్య తథా త్వముపపాదయ. 31

రాముడు యుద్ధంలో రావణుని సకల సేనలతో ఓడించి, నన్ను తీసికొని తన పట్టణానికి వెళ్తే అది ఆయనకు తగినది అవుతుంది. శత్రుసేనలను సంహరించే రాముడు లంకను బాణాలతో నింపి, నన్ను తీసికొనివెళ్తే అది నాకు ఆయనకు తగినదై ఉంటుంది. అందుచేత యుద్ధంలో శూరుడూ, మహాబుద్ధిశాలీ యైన రాముడు తనకు తగిన విధంగా పరాక్రమం చూపించేలా చెయ్యి."

 తదర్థోపహితం వాక్యం సహితం హేతుసంహితం,

నిశమ్య హనుమాన్ శేషం వాక్య ముత్తరమబ్రవీత్‌. 32

దేవి హర్యృక్ష సైన్యానామీశ్వరః ప్లవతాం వరః,

సుగ్రీవః సత్త్వసంపన్నస్తవార్థే కృతనిశ్చయః. 33

స వానరసహస్రాణాం కోటీభిరభిసంవృతః,

క్షిప్రమేష్యతి వైదేహి రాక్షసానాం నిబర్హణః. 34

హనుమంతుడు, అర్థవినయహేతుసంహితమైన సీత వాక్యాన్ని విని ప్రత్యుత్తరంగా తాను చెప్పవలసిన మిగిలిన మాటను ఇలా చెప్పాడు. "దేవీ! వానరభల్లూక సైన్యాల అధిపతీ, వానరశ్రేష్టుడూ, బలశాలీ అయిన సుగ్రీవుడు నిన్ను ఎలాగైనా రక్షించాలనే దృఢనిశ్చయంతో ఉన్నాడు. అతడు వేలకొలది, కోట్లకొలది వానరులు వెంటరాగా, రాక్షసులను చంపడానికై శీఘ్రంగా వస్తాడు.

తస్య విక్రమసంపన్నాః సత్త్వవన్తో మహాబలాః,

మనఃసంకల్పసంపాతా నిదేశే హరయః స్థితాః. 35

యేషాం నోపరి నాధస్తాన్న తిర్యక్సజ్జతే గతిః,

న చ కర్మసు సీదన్తి మహత్స్వమితతేజసః. 36

అసకృత్తైః మహోత్సాహైః ససాగరధరాధరా,

ప్రదక్షిణీకృతా భూమిర్వాయుమార్గానుసారిభిః. 37

పరాక్రమవంతులు, కష్టసహనశక్తి కలవారు, మహాబలశాలులు, అనుకున్న చోటుకు శీఘ్రంగా వెళ్ళగలవారు అయిన ఎందఱో  వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. ఆకాశంపైగాని, క్రిందగాని, అడ్డంగా గాని వారి గమనానికి ఎక్కడా అడ్డు ఉండదు. అమితమైన తేజస్సు గల వానరులు ఎలాంటి పెద్ద పనులు చేయవలసివచ్చినా వెనుదీయరు. మహోత్సాహవంతులైన వానరులు అనేక సార్లు, ఆకాశ మార్గంలో సంచరిస్తూ, సముద్రపర్వతాదులతో కూడిన భూమికి ప్రదక్షిణం చేశారు.

మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సన్తి తత్ర వనౌకసః,

మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవసన్నిధౌ. 38

అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః,

న హి ప్రకృష్టాః ప్రేష్యన్తే ప్రేష్యన్తే హీతరే జనాః. 39

వానరులలో కొందఱు నాకంటే గొప్పవారు. కొందరు నాతో సమానులు. నాకు తీసిపోయేవాడు సుగ్రీవుని దగ్గర ఒక్కడూ లేడు. నేనే ఇక్కడికి వచ్చానంటే, మహాబలవంతులైన వాళ్ళ మాట చెప్పాలా! పనిమీదనైనా సామాన్యులను పంపిస్తారు కానీ అధికులైనవారిని పంపరు కదా?

తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతు తే,

ఏకోత్పాతేన తే లంకామేష్యన్తి హరియూథపాః. 40

                                                                                     మమ పృష్ఠగతౌ తౌ చ చన్ద్రసూర్యావివోదితౌ |

త్వత్సకాశం మహాసత్త్వౌ నృసింహావాగమిష్యతః || 41

తతో వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ |

ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః || 42

సగణం రావణం హత్వా రాఘవో రఘునన్దనః |

త్వామాదాయ వరారోహే స్వపురం ప్రతియాస్యతి || 43

దేవీ! అందుచేత నీవు విచారించకు. నీ దుఃఖం విడచి పెట్టు. వానర సేనానాయకు లందఱు ఒక్క దుముకులో లంక చేరగలరు. గొప్పబలం గల నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు,నా భుజాలపై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రుల్లా నీ దగ్గరకు వస్తారు. రామలక్ష్మణులు కలిసి వచ్చి, బాణాలచేత లంకానగరాన్ని నాశనం చేస్తారు. రఘువంశానికి ఆనందం కలిగించే రాముడు, పరివారంతో కూడి రావణుని సంహరించి, నిన్ను తీసికొని తన పట్టణానికి తిరిగి వెళ్తాడు.

తదాశ్వసిహి భద్రం తే భవ త్వం కాలకాంక్షిణీ |

న చిరాద్ద్రక్ష్యసే రామం ప్రజ్వలన్తమివానలమ్ || 44

నిహతే రాక్షసేంద్రేఽస్మిన్ సపుత్త్రామాత్యబాన్ధవే |

త్వం సమేష్యసి రామేణ శశాఙ్కేనేవ రోహిణీ || 45

క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలి |

రావణం చైవ రామేణ నిహతం ద్రక్ష్యసేఽచిరాత్ || 46

అందువలన నీవు ఊరడిల్లు. నీకు క్షేమమగుగాక! కాలానికై వేచి ఉండు. ప్రజ్వలిస్తున్న అగ్నిలా ఉన్న రాముని కొద్దికాలంలో చూడగలవు. రాక్షసరాజు పుత్రులతోను అమాత్యులతోను, బంధువులతోను సహా చంపబడిన పిమ్మట నీవు, రోహిణి చంద్రునితో కలసినట్లు, రామునితో కలవగలవు. శీఘ్రంగా శోకపు అంతం చూడగలవు. అచిరకాలంలో రామునిచే సంహరించబడిన రావణుని చూడగలవు."

ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్మారుతాత్మజః |

గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరబ్రవీత్ || 47

హనుమంతుడు సీతను విధంగా ఓదార్చి, తిరిగి వెళ్లడానికి నిశ్చయించుకొని సీతతో మళ్లీ ఇలా అన్నాడు.

తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ |

లక్ష్మణం చ ధనుష్పాణిం లఙ్కాద్వారముపస్థితమ్ || 48

నఖదంష్ట్రాయుధాన్వీరాన్ సింహశార్దూలవిక్రమాన్ |

వానరాన్వారణేన్ద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సఙ్గతాన్ || 49

శైలామ్బుదనికాశానాం లఙ్కామలయసానుషు |

నర్దతాం కపిముఖ్యానామార్యే యూథాన్యనేకశః || 50

" పూజ్యురాలా! శత్రువులను సంహరించడానికి దృఢంగా నిశ్చయించుకొన్న రాముడూ, ధనుస్సు చేతిలో ధరించి లక్ష్మణుడూ, లంకాద్వారానికి శీఘ్రంగా రాగలరు. నీవు వారిని చూడగలవు. వానరులు సింహాలూ, పెద్దపులులూ వంటి పరాక్రమంగలవారు, వారి శరీరాలు ఏనుగుల్లా ఉన్నతమైనవి. గోళ్ళూ కోఱలే ఆయుధాలుగా గల వానరులందరూ కలిసి శ్రీఘ్రంగా రాగలరు. వారిని నీవు చూడగలవు. పర్వతాల్లా ఉన్న వానరశ్రేష్ఠుల అనేకమైన గుంపులు లంకలోను, మలయపర్వతప్రాంతాల్లోనూ గర్జిస్తూ సంచరిస్తూండగా నీవు చూడగలవు.

స తు మర్మణి ఘోరేణ తాడితో మన్మథేషుణా |

న శర్మ లభతే రామః సింహార్దిత ఇవ ద్విపః || 51

మా రుదో దేవి శోకేన మా భూత్తే మనసోఽప్రియమ్ |

శచీవ పత్యా శక్రేణ భర్త్రా నాథవతీ హ్యసి || 52

తీక్షణమైన మన్మథబాణంచేత మర్మస్థానమునందు కొట్టబడి రాముడు సింహంచేత పీడింపబడిన ఏనుగులా సుఖాన్ని పొందలేకపోతున్నాడు. దేవీ! శోకంతో ఏడవకు. నీ మనస్సుకు దుఃఖం కలుగుకుండుగాక. శచీదేవికి భర్తయైన దేవేంద్రుడు రక్షకుడుగా ఉన్నట్లు నీకు భర్తయైన రాముడు రక్షకుడుగా ఉన్నాడు కదా! 

రామాద్విశిష్టః కోఽన్యోఽస్తి కశ్చిత్సౌమిత్రిణా సమః |

అగ్నిమారుతకల్పౌ తౌ భ్రాతరౌ తవ సంశ్రయౌ || 53

రామునికంటే గొప్పవాడు, లక్ష్మణునితో సమానుడు మరొకడు ఎవ్వడైనా ఉన్నాడా! అగ్నివాయువులతో సమానులైన సోదరులిద్దఱూ నీకు ఆశ్రయంగా ఉన్నారు కదా!

నాస్మింశ్చిరం వత్స్యసి దేవి దేశే

రక్షోగణైరధ్యుషితేఽతిరౌద్రే |

న తే చిరాదాగమనం ప్రియస్య

క్షమస్వ మత్సంగమకాలమాత్రమ్ || 54

రాక్షసగణాలతో నిండి అతిభయంకరమైన ప్రదేశంలో ఇంక నీవు చాలకాలం ఉండవు. రాము డిక్కడకు రావడంలో ఆలస్యం ఉండదు. నేను వెళ్లి రాముని కలసికొనేంతవఱకు ఓపికపట్టు.”

 

----------------------------------------------------------------------------------------------------

ఆనందరామాయణాంతర్గత

శ్రీరామాష్టకం

 

శ్యామాభిరామం నయనాభిరామం, గుణాభిరామం వచనాభిరామమ్,

విశ్వప్రణామం కృతభక్తకామం, శ్రీరామచంద్రం సతతం నమామి. 6

 

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకోనచత్వారింశస్సర్గః (39)

 

మంగళం మహత్

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 39

Sundarakanda సుందరకాండ 3 9 రామసుందరం – ఏకోనచత్వారింశ స్సర్గః   మణిం దత్త్వా తత స్సీతా హనుమంత మథాఽబ్రవీత్‌ । అభిజ్ఞాన మభిజ్ఞాత మే...