6, ఏప్రిల్ 2025, ఆదివారం

Sundarakanda సుందరకాండ 37

 రామసుందరం – సప్తత్రింశస్సర్గః

సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచన్ద్రనిభాననా |

 హనూమన్త మువా చేదం ధర్మార్థసహితం వచః || 1||

సీత హనుమంతుని మాటలు విని, ధర్మార్థసహితమైన మాట అతనితో ఇలా అంది.

అమృతం విషసంసృష్టం త్వయా వానరభాషితమ్ |

యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః || 2||

హనుమంతుడా! రాముడు నాయందే మనస్సు కలిగి ఉన్నాడని (సంతోషం), శోకంతో నిండి ఉన్నాడని (బాధ)  చెప్పిన నీ మాటలు విషం, అమృతం కలిసినట్లు ఉన్నాయి.

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే |

రజ్జ్వేవ పురుషం బద్ధ్వా కృతాన్తః పరికర్షతి || 3||

దైవం, పురుషుని, అధికమైన ఐశ్వర్యంలోనికైనా, అతిభయంకరమైన దుఃఖంలోనికైనా, త్రాడు కట్టి ఈడ్చినట్లు ఈడ్చుకొనిపోతుంది.

విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ |

సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్ || 4||

ప్రాణులెవ్వరూ నిశ్చయంగా విధిని అతిక్రమించలేరు. కష్టాలతో బాధపడుతున్న లక్ష్మణునీ, నన్నూ, రామునీ చూడు.

శోకస్యాస్య కదా పారం రాఘవోఽధిగమిష్యతి |

ప్లవమానః పరిశ్రాన్తో హతనౌః సాగరే యథా || 5||

సముద్రంలో ఓడ బ్రద్దలైతే ఈదుతూ అలసిపోయినవానిలా ఉన్న రామునికి ఈ శోకం ఎప్పుడు పోతుందో కదా!

రాక్షసానాం క్షయం కృత్వా సూదయిత్వా చ రావణమ్ |

లఙ్కామున్మూలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః || 6||

నా పెనిమిటి రాక్షసులనందఱ్నీచంపి, రావణుని కూడ కూల్చి, లంకంతా నాశనం చేసి, నన్నెప్పుడు చూస్తాడో?!

స వాచ్యః సన్త్వరస్వేతి యావదేవ న పూర్యతే |

అయం సంవత్సరః కాలస్తావద్ధి మమ జీవితమ్ || 7||

సంవత్సరకాలం నిండేముందే త్వరపడమని రామునితో చెప్పు. ఎందుకంటె నా జీవితం అంతవఱకే.

వర్తతే దశమో మాసో ద్వౌ తు శేషౌ ప్లవఙ్గమ |

రావణేన నృశంసేన సమయో యః కృతో మమ || 8||

రావణుడు నాకిచ్చిన గడువులో ఇప్పుడు పదవనెల జరుగుతోంది. ఇక మిగిలినవి రెండునెలలే.

విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి |

అనునీతః ప్రయత్నేన న చ తత్కురుతే మతిమ్ || 9||

“సీతను రామునకు ఇచ్చివేయిఅని సోదరుడైన విభీషణుడు బ్రతిమాలి చెప్పినా రావణుడు సమ్మతించడంలేదు.

మమ ప్రతిప్రదానం హి రావణస్య న రోచతే |

రావణం మార్గతే సఙ్ఖ్యే మృత్యుః కాలవశం గతమ్ || 10||

నన్ను తిరిగి ఇవ్వడం రావణునకు ఇష్టంలేదు. (పోయే)కాలానికి వశుడైన ఆతనిని యుద్ధంలో మృత్యువు వెదకుతోంది.

జ్యేష్ఠా కన్యానలా నామ విభీషణసుతా కపే |

తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయమ్ || 11||

విభీషణుని పెద్దకూతురైన నల, తల్లి పంపగా వచ్చి, స్వయంగా నాతో ఈ విషయం చెప్పింది.

అవిన్ధ్యో నామ మేధావీ విద్వాన్రాక్షసపుఙ్గవః |

ధృతిమాన్ శీలవాన్వృద్ధో రావణస్య సుసంమతః || 12||

రామాత్క్షయమనుప్రాప్తం రక్షసాం ప్రత్యచోదయత్ |

న చ తస్య చ దుష్టాత్మా శృణోతి వచనం హితమ్ || 13||

మేధావి, విద్వాంసుడు, ధీరుడు, శీలవంతుడు, వృద్ధుడు, రావణునకు మిక్కిలి ఇష్టుడు అయిన అవింధ్యుడనే రాక్షసుడు రామునివలన సంభవించే వినాశనాన్ని గూర్చి చెప్పాడు. కాని ఆ దుష్టాత్ముడైన రావణుడు ఆతని హితవచనాల్ని చెవిని బెట్టలేదు.

అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః |

అన్తరాత్మా హి మే శుద్ధస్తస్మింశ్చ బహవో గుణాః || 14||

నా అంతరాత్మ శుద్ధంగా ఉంది. రామునిలో కూడ అనేక గుణాలున్నాయి. అందువల్ల నిస్సంశయంగా నా పతి నన్ను తొందరగానే పొందగలడు.

ఉత్సాహః పౌరుషం సత్త్వమానృశంస్యం కృతజ్ఞతా |

విక్రమశ్చ ప్రభావశ్చ సన్తి వానర రాఘవే || 15||

ఉత్సాహం, పౌరుషం, బలం, క్రూరం (దయ), కృతజ్ఞత, విక్రమం, ప్రభావం (నిర్వహణశక్తి) రామునిలో ఉన్నాయి.

చతుర్దశసహస్రాణి రాక్షసానాం జఘాన యః |

జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కస్తస్య నోద్విజేత్ || 16||

లక్ష్మణుని సాయం లేకుండానే జనస్థానంలో పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రామునికి భయపడని శత్రువు ఎవడు?

న స శక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః |

అహం తస్య ప్రభావజ్ఞా శక్రస్యేవ పులోమజా || 17||

ఆ పురుషశ్రేష్టుడు ఎన్ని కష్టాలు వచ్చినా చలించడు. శచీదేవికి ఇంద్రునిలా, రాముని ప్రభావం నాకు తెలుసు.

శరజాలాంశుమాన్ శూరః కపే రామదివాకరః |

శత్రురక్షోమయం తోయముపశోషం నయిష్యతి || 18||

బాణసమూహాలనే కిరణాలుగల, రామసూర్యుడు, శత్రువులైన రాక్షసులనే నీటిని ఎండించగలడు.

ఇతి సఞ్జల్పమానాం తాం రామార్థే శోకకర్శితామ్ |

అశ్రుసమ్పూర్ణవదనామువాచ హనుమాన్కపిః || 19||

రామునికై శోకంతో కృశించినది, నీరు నిండిన కళ్లతో ఈవిధంగా మాట్లాడుతున్న సీతతో హనుమ ఇలా అన్నాడు.

శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః |

చమూం ప్రకర్షన్మహతీం హర్యృక్షగణసఙ్కులామ్ || 20||

దేవీ! నా(నీ)మాట విన్న వెంటనే రాముడు వానర భల్లూకగణాలతో నిండిన పెద్ద సైన్యాన్ని తీసుకొని త్వరగా రాగలడు.

అథ వా మోచయిష్యామి తామద్యైవ వరాననే |

అస్మాద్దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిన్దితే || 21||

లేదంటే నిన్ను ఇప్పుడే దుఃఖం నుండి విముక్తురాలిని చేస్తాను. నా వీపుపై ఎక్కు.

త్వాం హి పృష్ఠగతాం కృత్వా సన్తరిష్యామి సాగరమ్ |

శక్తిరస్తి హి మే వోఢుం లఙ్కామపి సరావణామ్ || 22||

నిన్ను నా వీపుపై కూర్చోబెట్టుకొని సముద్రాన్ని లంఘిస్తాను. రావణునితో సహా లంకను కూడా మోసే శక్తి నాకు ఉంది.

అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి |

ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః || 23||

హుతం చేసిన హవిస్సును ఇంద్రునకు అగ్నిలా, ప్రస్రవణ పర్వతం మీద ఉన్న రామునకు నిన్ను ఇప్పుడే సమర్పిస్తాను.

ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహలక్ష్మణమ్ |

వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా || 24||

దైత్యవధకై  యత్నిస్తున్న విష్ణువులా, రాక్షసవధకై ప్రయత్నిస్తున్న లక్ష్మణసహితుడైన రాముని, నీవిప్పుడే చూడగలవు.

త్వద్దర్శనకృతోత్సాహమాశ్రమస్థం మహాబలమ్ |

పురన్దరమివాసీనం నాగరాజస్య మూర్ధని || 25||

నిన్ను చూడాలనే  ఉత్సాహంతో ఐరావతం మీద కూర్చున్న ఇంద్రునిలా ఆశ్రమంలో ఉన్న రాముని ఇప్పుడే చూడగలవు.

పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే |

యోగమన్విచ్ఛ రామేణ శశాఙ్కేనేవ రోహిణీ || 26||

నా వీపుపైన అధిరోహించు. ఆలసించకు. రోహిణి చంద్రుని చేరినట్లు రామునితో చేరు.

కథయన్తీవ చన్ద్రేణ సూర్యేణ చ మహార్చిషా |

మత్పృష్ఠమధిరుహ్య త్వం తరాకాశమహార్ణవౌ || 27||

నా వీపుపై ఎక్కి చంద్రునితోను, సూర్యునితోను మాటలాడుతున్నావా అన్నట్లు ఆకాశమార్గాన మహాసముద్రాన్ని దాటు.

న హి మే సమ్ప్రయాతస్య త్వామితో నయతోఽఙ్గనే |

అనుగన్తుం గతిం శక్తాః సర్వే లఙ్కానివాసినః || 28||

నేను ఇక్కడినుండి నిన్ను తీసికొని వెళ్తున్నప్పుడు లంకానివాసుల్లో నన్ను అనుసరించి వచ్చే సమర్థుడు ఎవడూ లేడు.

యథైవాహమిహ ప్రాప్తస్తథైవాహ మసంశయమ్ |

యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం || 29||

నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే నిన్నెత్తుకొని, ఆకాశమార్గంలో వెళ్తాను. సంశయం లేదు. చూడు.”

మైథిలీ తు హరిశ్రేష్ఠాచ్ఛ్రుత్వా వచనమద్భుతమ్ |

హర్షవిస్మితసర్వాఙ్గీ హనుమన్త మథాబ్రవీత్ || 30||

ఆశ్చర్యం కల్గించే హనుమంతుని మాటలు వినగానే సీత హర్షంతో మేను గగుర్పొడవగా, అతనితో,

హనుమన్దూరమధ్వానం కథం మాం వోఢుమిచ్ఛసి |

తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప || 31||

! హనుమంతుడా! చాల దూరం నన్ను మోయడానికి కోరుతున్నావే?. అదే కదా కపిస్వభావం అని భావిస్తున్నాను.

కథం వాల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్ఛసి |

సకాశం మానవేన్ద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ || 32||

ఇంత చిన్న శరీరం గల నీవు, నన్ను, ఇక్కడినుండి నా భర్త ద్దకు ఎలా తీసికొనిపోగోరుతున్నావు?” అని అంది.

సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్మారుతాత్మజః |

చిన్తయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతమ్ || 33||

హనుమంతుడు సీత మాటలు వినిఆహా! ఈనాడు నాకొక క్రొత్త (ఇంతకుముందు జరగని) అవమానం జరిగింది కదాఅని భావించాడు.

న మే జానాతి సత్త్వం వా ప్రభావం వాసితేక్షణా |

తస్మాత్పశ్యతు వైదేహీ యద్రూపం మమ కామతః || 34||

సీతకు నా బలం, ప్రభావం తెలియదు. అందుచేత నేను ఇచ్చానుసారంగా ఎలాంటి రూపం ధరించగలనో ఈమెకు చూపిస్తాను.” అనుకొన్నాడు.

ఇతి సంచిన్త్య హనుమాం స్తదా ప్లవగసత్తమః |

దర్శయామాస వైదేహ్యాః స్వరూప మరిమర్దనః || 35||

హనుమంతుడు విధంగా భావించి, సీతాదేవికి తన స్వరూపాన్ని చూపించాడు.

స తస్మాత్పాదపాద్ధీమానాప్లుత్య ప్లవగర్షభః |

తతో వర్ధితుమారేభే సీతాప్రత్యయకారణాత్ || 36||

వృక్షం నుండి దూకి, సీతకు నమ్మకం కల్గడానికై దేహాన్ని పెంచడం ప్రారంభించాడు.

మేరుమన్దరసఙ్కాశో బభౌ దీప్తానలప్రభః |

అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః || 37||

మేరు, మందరపర్వతాల్లా ఒప్పుతూ, మండుతున్నఅగ్నివంటి కాంతితో ప్రకాశిస్తూ సీత ఎదుట నిలిచాడు.

హరిః పర్వతసఙ్కాశస్తామ్రవక్త్రో మహాబలః |

వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీ మిద మబ్రవీత్ || 38||

ఎఱ్ఱని ముఖం, వజ్రాల వంటి కోరలు, గోళ్లు కలిగి, పర్వతం వంటి ఆకారంతో భయంకరుడైన, ఆ మహాబలుడు సీతతో, ఇలా అన్నాడు.

సపర్వతవనోద్దేశాం సాట్టప్రాకారతోరణామ్ |

లఙ్కామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే || 39||

కొండలు, వనాలు, కోటబురుజులు, ప్రాకారాలు, ద్వారాలు, వీటితో కూడిన ఈ లంకను రావణునితో సహా తీసికొని వెళ్ళడానికి నాకు శక్తి ఉంది.

తదవస్థాప్య తాం బుద్ధిరలం దేవి వికాంక్షయా |

విశోకం కురు వైదేహి రాఘవం సహలక్ష్మణమ్ || 40||

అందువల్ల, సందేహం ఒద్దు. మనస్సును స్థిరంగా చేసుకో. లక్ష్మణునితో కూడిన రాముని దుఃఖం పొగొట్టుఅన్నాడు.

తం దృష్ట్వా భీమసఙ్కాశ మువాచ జనకాత్మజా |

పద్మపత్రవిశాలాక్షీ మారుతస్యౌరసం సుతమ్ || 41||

భయంకరుడు, వాయుదేవుని రసపుత్రుడైన హనుమంతుని చూచి, సీత ఇలా అంది.

తవ సత్త్వం బలం చైవ విజానామి మహాకపే |

వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతమ్ || 42||

! మహాకపీ! నీ సత్త్వాన్ని, బలాన్ని, వాయువు వంటి (శీఘ్ర) గమనాన్ని, అగ్ని వంటి నీ అద్భుతతేజస్సునూ ఎఱుగుదును.

ప్రాకృతోఽన్యః కథం చేమాం భూమిమాగన్తుమర్హతి |

ఉదధేరప్రమేయస్య పారం వానరపుఙ్గవ || 43||

అప్రమేయమైన ఈ సముద్రాన్ని దాటి, ప్రదేశానికి సామాన్యుడు ఎవడైనా రాగలడా?

జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ |

అవశ్యం సంప్రధార్యాశు కార్యసిద్ధి ర్మహాత్మనః || 44||

నీవు నన్నుతీసికొని వెళ్ళగలవని తెలుసు. అయితే రాముని కార్యం సిద్ధించేలా ఆలోచించవలసి ఉంది.

అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గన్తుం త్వయానఘ |

వాయువేగసవేగస్య వేగో మాం మోహయేత్తవ || 45||

నేను నీతో రావడం యుక్తం కాదు. ఎందుకంటే నీవు వెళ్తున్నప్పుడు నీ వాయుసమాన వేగం నన్ను కంగారు పెట్టవచ్చు.

అహమాకాశమాపన్నా హ్యుపర్యుపరి సాగరమ్ |

ప్రపతేయం హి తే పృష్ఠా ద్భయాద్వేగేన గచ్ఛతః || 46||

సముద్రానికి చాలా ఎత్తుగా ఆకాశంలో నీవు వేగంగా వెళ్తున్నప్పుడు నీ వీపుమీద ఉన్న నేను భయంవల్ల క్రింద పడిపోతాను.

పతితా సాగరే చాహం తిమినక్రఝషాకులే |

భవేయమాశు వివశా యాదసా మన్నముత్తమమ్ || 47||

తిములతోను (పెద్దచేప), మొసళ్ళతోను, సారచేపలతోను నిండిన సముద్రంలో వివశురాలనై, పడిపోయిన నేను, జలజంతువులకు వెంటనే అన్నం అయిపోతాను.

న చ శక్ష్యే త్వయా సార్ధం గన్తుం శత్రువినాశన |

కళత్రవతి సన్దేహస్త్వయ్యపి స్యా దసంశయః || 48||

నీతో వచ్చే శక్తి నాకు లేదు. నీవు నీతో పాటు నన్ను కూడ రక్షించాలి కదా! అప్పుడు నీ ప్రాణాలకు సంశయం కలుగవచ్చు.

హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమవిక్రమాః |

అనుగచ్ఛేయురాదిష్టా రావణేన దురాత్మనా || 49||

నీవు నన్ను తీసికొనిపోతూండగా రాక్షసులు చూచి, రావణుని జ్ఞతో, నిన్ను వెంబడిస్తారు.

తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గర పాణిభిః |

భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కళత్రవాన్ || 50||

చేతుల్లో శూలాలు, ముద్గరాలు, ధరించి శూరులు నిన్ను చుట్టుముడతారు. నన్ను రక్షించవలసిన నీవప్పుడు సంశయంలో పడతావు.

సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః |

కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుమ్ || 51||

ఆకాశంలో ఆయుధాలు ధరించి చాలమంది రాక్షసులుంటారు. ఆయుధం లేని నీవు నన్ను రక్షించుకొంటూ వెళ్లడానికి ఎలా సమర్థుడవవుతావు?

యుధ్యమానస్య రక్షోభిస్తవ తైః క్రూరకర్మభిః |

ప్రపతేయం హి తే పృష్ఠాద్భయార్తా కపిసత్తమ || 52||

నీవు రాక్షసులతో యుద్ధం చేస్తూండగా, నేను భయార్తురాలనై, నీ వీపునుండి పడిపోతాను.

అథ రక్షాంసి భీమాని మహాన్తి బలవన్తి చ |

కథం చిత్సామ్పరాయే త్వాం జయేయుః కపిసత్తమ || 53||

అప్పుడు, రాక్షసులు ఏదో విధంగా నిన్ను జయిస్తారు.

అథ వా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే |

పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః || 54||

లేదా నీవు యుద్ధం చేస్తూ పరవశుడవై ఉన్నప్ప్పుడు నేను పడిపోవచ్చు. అప్పుడు నన్ను రాక్షసులు తీసికొని పోతారు.

మాం వా హరేయు స్త్వద్ధస్తా ద్విశసేయు రథాపి వా |

అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ || 55||

లేదా రాక్షసులు నీదగ్గరనుండి నన్ను లాగుకొనవచ్చు. లేదా చంపి వేయవచ్చు. యుద్ధంలో జయాపజయాలకు నిశ్చయం లేదు కదా!.

అహం వాపి విపద్యేయం రక్షోభి రభితర్జితా |

త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవ తు || 56||

లేదా రాక్షసులు నన్ను భయపెట్టగా నే నాపద చెందవచ్చు. అలా అయితే నీ ప్రయత్నం నిష్ఫలమే అవుతుంది.

కామం త్వమసి పర్యాప్తో నిహన్తుం సర్వరాక్షసాన్ |

రాఘవస్య యశో హీయేత్త్వయా శస్తైస్తు రాక్షసైః || 57||

నీవు రాక్షసులను అందఱనీ చంపగలవు. సమర్థుడవే. కాని వారి నందఱినీ నీవే చంపితే, రాముని కీర్తి నశిస్తుంది.

అథవాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే హి మామ్ |

యత్ర తే నాభిజానీయు ర్హరయో నాపి రాఘవౌ || 58||

లేదా రాక్షసులు నన్ను తీసుకొనిపోయి వానరులకు గాని రామలక్ష్మణులకు గాని తెలియని రహస్యప్రదేశంలో ఎక్కడైనా దాచినా దాస్తారు.

ఆరమ్భస్తు మదర్థోఽయం తతస్తవ నిరర్థకః |

త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః || 59||

అప్పుడు నాకోసం చేసిన నీ ప్రయత్నమంతా వ్యర్థమైపోతుంది. అందుచేత నీతో కలిసి రాముడు రావడంలోనే గుణం (ప్రయోజనం) ఉంది.

మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః |

భ్రాతౄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ || 60||

రాముడూ, అతని సోదరులూ, నీవు, నీరాజు సుగ్రీవుడు మొదలైన మీ అందఱి జీవితం నన్ను ఆశ్రయించుకొని ఉంది కదా!

తౌ నిరాశౌ మదర్థం తు శోకసన్తాపకర్శితౌ |

సహ సర్వర్క్షహరిభిస్త్యక్ష్యతః ప్రాణసఙ్గ్రహమ్ || 61||

నా కోసమై శోకసంతాపాలతో కృశించి ఉన్న రామలక్ష్మణులు, సమస్తమైన ఎలుగుబంట్లు, వానరులు, నిరాశతో ప్రాణాలు విడుస్తారు.

భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర |

స్పృశామి శరీరం తు పుంసో వానరపుంగవ || 62||

వానరోత్తమా! పతియందు భక్తిని అవలంబించి, రాముని తప్ప నా అంతట నేను పరపురుషుని శరీరాన్ని తాకడానికి ఇచ్ఛగించను.

యదహం గాత్రసంస్పర్శం రావణస్య బలాద్గతా |

అనీశా కిం కరిష్యామి వినాథా వివశా సతీ || 63||

బలాత్కారంవల్ల, రావణుని శరీరస్పర్శ కలిగింది కదా అంటే, శక్తి లేక, నాథుడు లేక, వివశురాలనై ఉన్న నేను ఏమి చేయగలను?

యది రామో దశగ్రీవమిహ హత్వా సబాంధవం |

మామితో గృహ్య గచ్ఛేత తత్తస్య సదృశం భవేత్ || 64||

రాముడు, ఇక్కడ సబాంధవంగా రావణుని సంహరించి, నన్ను ఇక్కడినుండి తీసికొని వెళ్లడం అతనికి తగినది.

శ్రుతా హి దృష్టాశ్చ మయా పరాక్రమా మహాత్మనస్తస్య రణావమర్దినః |

న దేవగన్ధర్వభుజఙ్గరాక్షసా భవన్తి రామేణ సమా హి సంయుగే || 65||

యుద్ధంలో రాముని పరాక్రమాలను గూర్చి విన్నాను. చూశాను కూడ. యుద్ధంలో దేవ గంధర్వ నాగ రాక్షసులెవ్వరూ రామునితో సమానులు కారు.

సమీక్ష్య తం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్యవిక్రమమ్ |

సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాశనం దీప్తమివానిలేరితమ్ || 66||

మహాబలుడు, ఇంద్రసమపరాక్రముడు, అయిన రాముడు యుద్ధంలో చిత్రగతుల్లో మెఱసే ధనుస్సు ధరించి, లక్ష్మణునితో కూడి, వాయువుతో కూడిన అగ్నిలా జ్వలిస్తూ ఉంటే,  ఎవ్వడైనా తేఱి చూడగలడా?

సలక్ష్మణం రాఘవమాజిమర్దనం దిశాగజం మత్తమివ వ్యవస్థితమ్ |

సహేత కో వానరముఖ్య సంయుగే యుగాన్తసూర్యప్రతిమం శరార్చిషమ్ || 67||

యుద్ధంలో లక్ష్మణసహితుడైన రాముడు, బాణాలనే కిరణాలతో ప్రళయకాలసూర్యునిలా ప్రకాశిస్తూ, మదించిన దిగ్గజంలా యుద్ధభూమిలో నిలచి ఉండగా అతనిని ఎవడు ఎదిరించగలడు?

స మే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ |

చిరాయ రామం ప్రతి శోకకర్శితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితామ్ || 68||

వానరశ్రేష్టుడా! నా పెనిమిటిని, లక్ష్మణుని, వానరసేనానాయకులను శీఘ్రంగా ఇక్కడకు తోడ్కొని రా. రాముని గూర్చి శోకంతో కృశించి ఉన్న నాకు సంతోషం కలిగించు.”

------------------------------------------------------------------------------------------------------

ఆనందరామాయణాంతర్గత

 

శ్రీరామాష్టకం

 

మందారమాలం వచనేరసాలం, గుణైర్విశాలం హతసప్తతాలమ్,

క్రవ్యాదకాలం సురలోకపాలం, శ్రీరామచంద్రం సతతం నమామి. 4

 

ఇత్యార్షే శ్రీమద్వాల్మీకిరామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తత్రింశస్సర్గః (37)

 

శ్రీరామనవమి శుభాకాంక్షలు

 

 

మంగళం మహత్

 

 

Sundarakanda సుందరకాండ 37

 రామసుందరం – సప్తత్రింశస్సర్గః సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచన్ద్రనిభాననా |   హనూమన్త మువా చేదం ధర్మార్థసహితం వచః || 1|| సీత హనుమంతుని ...