21, మే 2014, బుధవారం

జగన్మాతవైభవం-4

సౌందర్యలహరి

7
 

మ్రోగుతున్న గజ్జెల మొలనూలు,
వక్షోభారంతో ముందుకు వంగిన దేహం,
సన్నని నడుము,
శరత్కాలపూర్ణచంద్రబింబసమవదనం
కలది,
చెఱకువిల్లు, పుష్పబాణాలు, పాశం, అంకుశం
ధరించినది,
త్రిపురాలను మట్టుపెట్టిన హరుని అహంకారస్వరూప
అయిన
భగవతి,
మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!

(అమ్మ భౌతికరూపాన్ని వర్ణించడం జరిగింది.

అంతరార్థం : ధ్వనిస్తున్న మొలనూలు ధ్వనితో కూడిన అక్షరమాలగా చెప్పవచ్చు.

పాలిండ్లను వర్ణించడం ద్వారా మాతృభావనను, పోషణను చెప్పవచ్చు.
అంటే చదువు కావాలి. తద్ద్వారా పోషణ కావాలి.

సన్నని నడుము ఆరోగ్యాన్ని సూచిస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా
[ఆరోగ్యం నడుము కొలతపై ఆధారపడి ఉంటుందని అంటారు]

శరత్కాలపూర్ణచంద్రుడు సంపూర్ణజ్ఞానానికి ప్రతీక.
ఎందుకంటే  శరత్కాలంలో ఆకాశమూ నిర్మలమే. చంద్రుడూ నిర్మలమే.
నిర్మలత్వమే జ్ఞానం.
[పూర్ణచంద్రుని పదహారు కళలూ పదహారు విద్యలకు ప్రతీకలు అనుకోవచ్చు.]

ఇక నాలుగు ఆయుధాలు
చెఱకు ధనుస్సు = మనస్సు
బాణాలు = పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానాలు (వికారాలు)
పాశం = రాగం/రక్తి
అంకుశం = క్రోధం
పై ఆయుధాలతో అమ్మ మనస్సుకు జ్ఞానమూ కల్గించగలదు. వికారమూ కల్గించగలదు.
రాగమూ విరాగమూ కల్గించగలదు.
శిష్టులను రక్షించగలదు.
దుష్టులను కోపించి, శిక్షించగలదు.

ఈ విధంగా చదువు, పోషణ, ఆరోగ్యం, జ్ఞానం, రక్షణ
వీటిద్వారా చివరికి సుఖం అందఱికీ ఇవ్వగల

"ఇటువంటి రూపం నాసొంతం" అని శివుడు గర్విస్తాడని,
అందువల్ల శివుని అహంకారస్వరూప అమ్మ
అని ఆదిశంకరాచార్యులవారి భావన.

అటువంటి స్వరూపం కల అమ్మ దర్శనాన్ని కోరుతున్నారాయన.
అమ్మను ఇలాగే దర్శించాలని భావం.)


8

సుధాసముద్రమధ్యంలో
కల్పవృక్షాలతో చుట్టబడిన మణిద్వీపంలో
కడిమిచెట్లతోపులో
చింతామణిగృహంలో
శివాకారమంచంమీద
శివపర్యంకనిలయవై
చిదానందతరంగరూపంగా ఉన్న
నిన్ను కొందఱు ధన్యులు మాత్రం సేవిస్తున్నారు.
(అందఱికీ నీ సేవ లభించదు)

(మనస్సులో
అమ్మవార్ని
సు=చక్కగా
ధా=ధారణ చేస్తే
ఆమె సంకల్పంవల్ల మన కోరికలు తీరి, (కల్పవృక్షాలు)
మణిలా స్వయంప్రకాశితులమై (మణిద్వీపం)
తపోనిధులమై (కడిమిచెట్టుక్రింద తపస్సు మంచిది)
ఇతరులకు మనమే చింతామణులమై
శివ=శుభనిలయమైన
చిదానందాన్ని పొందుతాం.
ధన్యులమవుతాం.)


మంగళం మహత్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి